వెండితెరను వెలిగించిన
జనకవి జాలాది


దళిత లేక క్రైస్తవ నేపథ్యం నుండి వచ్చి తెలుగు సినీకవులుగా లబ్దప్రతిష్టులైన అతితక్కువమందిలో ప్రథమంగా జ్ఞాపకానికి వచ్చే కవి జాలాది రాజారావు. సినీ సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన గొప్పకవుల్లో జాలాది పేరు ప్రథమ శ్రేణికే చెందుతుంది.

కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా దొండపాడు గ్రామంలో 1932లో జన్మించిన జాలాది వారిది వస్తుతః ఉన్న కుటుంబం. తండ్రి జాలాది ఇమ్మానుయేలు స్వాతంత్రపోరాటంలో ఉన్న ఆస్తిని కాస్తా ధారాదత్తం చేసి, జైలుశిక్ష అనుభవించినవారు. 

అతి చిన్నవయసు నుండే స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొనడం, ఉద్యమ నేపథ్యం, ఎనిమిదవ తరగతి నుండే గేయాలు వ్రాసి పాడటం, భాషమీద భారతీయ పురాణేతిహాసాలమీద పట్టు సంపాదించడం, చిరుతప్రాయం లోనే ఆయనను కవిగా చేశాయి. 

ఉత్తమ సాహిత్యం వైపు జాలాది దృష్టిని మరల్చిన మిత్రుడు త్రిపురనేని మధుసూదనరావు. తర్వాత కొంతకాలం తమ ఇద్దరి పేర్లు కలిసివచ్చే విధంగా మధురాజా అనే కలంపేరుతో రచనలు చేశారు జాలాది. విద్యార్థిదశలోనే నాటికలు నాటకాలు వ్రాయటం తర్వాతరోజుల్లో ఒకపక్క రాజకీయాలతో పాటు మరోపక్క రంగస్థలంలో కూడా నటుడిగా, గాయకుడిగా అనుభవం గడించేలా చేసింది.

వృత్తికోసం చిత్రకళ నేర్చుకుని డ్రాయింగ్ మాస్టారుగా కొంతకాలం కృష్ణాజిల్లా, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాల్లోని వివిధప్రదేశాల్లో, ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేయటం ఆయనకు వివిధ మాండలికాలు, పల్లె పదాలు, జానపదాల మీద పట్టు సంపాదించిపెట్టింది. ‘నేను చదివి రాసింది తక్కువ … విని రాసింది ఎక్కువ’ అని చెప్తుండేవారు. ఉత్తరోత్తరా ఆయనకు జానపదాల జాలాది అని పేరు రావటం యాదృచ్ఛికం కాదు.

రాజకీయాలతో రాజీపడలేక ఉద్యోగానికి రాజీనామా చేసి, కొంతకాలం ఖాళీగా ఉన్న సమయంలో కూడా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఒక నాటకం కోసం

‘దినదినముంది సృష్టికి ఉదయం
సంధ్యకు వుంది ఆశాకిరణం
రేపుకు ఉంది ఏదో రూపు
లేనిది నాకే లేమికి అంతం’  అని ఆయన రాసిన పాట విపరీతంగా రక్తి కట్టింది.

అంత మంచి కవి తమ మధ్య మగ్గి పోకూడదని గుడివాడ వాసులు, తోటి కళాకారులు ఆయనను మద్రాస్ పంపించడానికి చందాలు పోగేసి సన్మానం చేసి అందజేశారు. వారి ప్రోద్బలంతో మద్రాసు వెళ్లిన జాలాది అవకాశాల కోసం కొంతకాలం కష్టపడ్డారు. మొదటి అవకాశం చిన్ననాటి స్నేహితుడు నటుడు కైకాల సత్యనారాయణ, అప్పటికే ఫీల్డ్ లో ఉన్న మోదుకూరి జాన్సన్ ల సహాయంతో దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి ద్వారా పల్లెసీమ (1976) చిత్రంలోని ‘సూరట్టుకు జారతాది సితుక్కు సితుక్కు వానచుక్క’ గీతంతో అందిపుచ్చుకున్నారు జాలాది. 

క్రమక్రమంగా వచ్చిన అవకాశాలతో అనేక కీర్తి సోపానాలు అధిరోహించి వందలాది సినీగీతాలు వ్రాసిన జాలాది జీవితం మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని ‘పుణ్యభూమి నాదేశం నమోనమామి’ పాటతో శిఖరాగ్రానికి చేరుకుంది. ఈ పాటను అప్పట్లో జాతీయపురస్కారానికి పరిశీలించారట.

‘సంస్కృతి వికృతించింది .. నా కలం తెలుగుతల్లి మెడలో వేసే పూలమాల .. జాతికున్న సాంప్రదాయం ఆంగ్లభాషతో అరకొర సాగుతుంటే …  అర్థంపర్ఠం లేని పాటలు వ్రాయలేనని’ స్వచ్ఛందంగా తర్వాత రోజుల్లో సినీ రచన విరమించిన జాలాది వ్యక్తిత్వం కూడా అతివిశిష్టమైనది.

రచయితగా ‘యాతమేసి తోడినా ఏరు ఎండదు’ వంటి అచ్చ తెలుగు మాటల జానపద సాహిత్యం, ‘నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో, నవ యువ కవిరాజువో, అభినవ శశిరేఖవో’ వంటి అతిమధుర భావగీతాలు, ‘మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం’ వంటి ఒళ్లు గగుర్పొడిచే దేశభక్తి గీతాలు ఆయన వైవిధ్య వ్యవసాయానికి ఉదాహరణలు. 

రెండే పాదాలలో కంటికి తడి అద్ది, సూటిగా గుండెల్లోకి దూసుకుపోయి ఆలోచనామృతమథనం కావించే కవితాశక్తి ఆయనకు వాగ్దేవి వరప్రసాదం. కొన్ని ఉదాహరణలు చూడండి.

‘కళ్ళు తెరుసుకుంటే ఉయ్యాల 
కళ్ళు మూసుకుంటే మొయ్యాల’  ఎర్రమందారం చిత్రంలో

‘సుఖీభవ సుమంగళి సుఖీభవ 
సుశీలవై చిరాయువై సుఖీభవ’ మేజర్ చంద్రకాంత్ చిత్రంలొ

‘చేసేదీ పట్టణ వాసం 
మేసేదీ పల్లెల గ్రాసం’ పట్నవాసం చిత్రంలో

‘చేతి చిటికెన వేళ్ళు కలిస్తే కళ్యాణం 
కాలి బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణం’

‘జేబు కొట్టి కడుపు నింపుకున్నోడు దొంగై పోతాడు 
కడుపు కొట్టి జేబు నింపుకున్నోడు దొరలా ఉంటాడు’ దర్శకుడికి నచ్చక పక్కన పడేసిన ఒక పల్లవి

‘సిగ్నలిచ్చే వోడు దేవుడు 
బండి దిగెళ్ళి పొయ్యోడు జీవుడు’ ఇదా ప్రపంచం సినిమాలో.

ఇలా అనేకంగా ఉన్న జాలాది పాటల్లో నాకు ప్రథమంగా గుర్తొచ్చేది తూర్పు వెళ్లే రైలు సినిమా కోసం రాయబడ్డ ‘సందెపొద్దు అందాలున్న చిన్నది’ అన్న పాట.

సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
బొమ్మలా ముద్దుగుమ్మలా
పువ్వులా పాల నవ్వులా
మెరుపుతీగమల్లే తళుకుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా
సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితే
రాలుగాయి రాగాలన్ని రచ్చబెడితే
ఎవ్వరైన చూశారంటే అల్లరైపోతానయ్యో
ఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యో
దీపమల్లే నేనుంటాను తీపిరేపు తెస్తుంటాను
కలువపువ్వు నీవై వెలుగు నేనై ఎలదేటి పాటల్లె చెలరేగిపోనా

ముత్తెమంటి ఒళ్ళు తడిసి ముద్దు పుడితే
గుండెలోన ఎండకాసి ఆరబెడితే
ఆశలారిపోకుండా ఊసులాడుకోవాలి
ఊసులెండిపోకుండా ఊటకోర్కెలుండాలి
గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి
నిన్ను నన్ను చూసి దిష్టి తీసి ఆ లోకాల దేవుళ్ళే దీవించి పోవాలి

సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
బొమ్మలా ముద్దుగుమ్మలా
పువ్వులా పాలనవ్వులా
మెరుపుతీగమల్లే తళుకుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా
సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

పల్లవిలో  పాలనవ్వు అన్నమాట చూడండి. పాలనవ్వు ఇక్కడ నవ్వు కాదు. ఆ సందెపొద్దు అందాలున్న చిన్నదే పాలనవ్వులా ఉందట. నీళ్లలో సందకాడ సూర్యకాంతి ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ కాంతి ఆ ఏటి నీట తానా లాడుతున్న చిన్నదాని మీద పడితే ఆ మెరుపు తీగ తళుకు మనటం, కాంతి అద్దాల లాగా ఆమె ఒంటి మీద పడటం అతనికి ముద్దాడబుద్ధి వేయటం ఎంత అందమైన దృశ్యం – కానీ ఎక్కడా అతిశయోక్తి లేకుండా స్వభావోక్తి తోనే అంత సౌందర్యాన్ని సాధించారు జాలాది.

మొదటి చరణంలో ఆమె బెదురుపాటు, అతను చెప్పే ధైర్యం రెండూ చక్కని మాటలతో అందంగానే కాక అర్థవంతంగా రాశారు రచయిత.

రాలుగాయి రాగాలు తీసి ‘రచ్చబెట్టడం’ అల్లరెట్టటం ఆ ఆకతాయి బుల్లోడు చేసే పని. ఎవరైనా చూస్తే వెన్నెలంటి బతుకంతా చీకటి అయిపోతుందని ఆమె భయపడితే అతని సమాధానం చూడండి. ఆ చీకటిని పోగొట్టడానికి తనే దీపం అవుతాడట, తీపిరేపు తెస్తాడట. తీపిరేపు అన్నమాట ఎంత బాగుందో చూడండి. 

అంతేకాక ఆ చీకట్లో ఆమె కలువ అయితే, తను వెలుగై ఎలదేటిపాటలాగా చెలరేగిపోతాడట. 

ఇంతవరకూ ఉత్తమస్థాయిలో సాగిన గీతాన్ని రెండో చరణంలో మరింత ఎత్తుకు తీసుకు వెళ్లారు జాలాది.

ఆమె ముత్యమంత ఒళ్ళు తడిసి ముద్దుపుడితే  తన గుండెలోని వేడి ఆరబెడుతుంది అంటాడు అతను. ఇక్కడ ఆమె చెప్పిన మాటలు చూడండి.

ఒంటితడి ఆరినా పరవాలేదుగాని మదిలోని ఆశలు ఆరిపోకూడదు. అలా జరగాలంటే ఇలా ఊసులాడుకుంటూనే ఉండాలి. ఆ ఊసులు ఎండిపోకుండా మనసులోని కోరికలే నీరుపోస్తూ ఉండాలిట. (ఇక్కడ జాలాది వాడిన ఊటకోర్కె అన్నమాటను ముందు చూసిన పాలనవ్వు, తీపిరేపు, మొదలైన మాటలతో కలిపి చూస్తే పదబంధాలు కల్పించడంలో ఆయన స్వతంత్రమైన ప్రతిభ అర్థమవుతుంది.)

గుండెలోని ఎండవల్ల ఒంటితడి ఆరిపోయినా, ఊరించే కోర్కెల వల్ల ఆశలు ఊసులు ఎప్పటికీ నవనవలాడుతూనే ఉండాలి అని చెప్పటంలోని కొత్తదనం, తర్కం, సౌందర్యం, అనుభవైకవేద్యం. ఇవన్నీ జరిగితే గువ్వలాంటి తోడు యవ్వనాలగూడు కలిగి ఉండొచ్చని ముక్తాయింపు.

అర్థపరంగా ఊహించని లోతులకు దారితీస్తూనే తెలుగుభాషలోని స్వాభావికమైన అందానికి నగిషీలు పెట్టిన ఈ పాట చూస్తే ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న మాట గుర్తుకొస్తుంది.

చిత్రీకరణపరంగా దర్శకుడు బాపు జాలాది సాహిత్యానికి పూర్తిన్యాయం చేయలేదనే చెప్పాలి. కానీ సంగీత దర్శకుడిగా గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీలతో కలిసి ఈ పాటకు ప్రాణం పోశారు.

తన పాటకు మెరుగుపెట్టడం కోసం కొసరాజు, శ్రీ శ్రీ, ఆత్రేయల పాటలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించేవారట జాలాది.

సినీ నిర్మాణ కేంద్రాలైన మద్రాసు హైదరాబాదులలో స్థిరనివాసం ఏర్పరచుకోక పోయినప్పటికీ సహజకవితాధీశక్తితో వేటూరి ధాటికి తట్టుకొని తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న జాలాది, ‘తెలుగు సినీ జానపద సాహిత్యంలో కొసరాజు చక్రవర్తి. నేను సామంతరాజును. కొసరాజు తర్వాత జాలాది అన్నప్పుడు పొంగిపోయాను పొంగిపోతాను’ అని చెప్పారు.

దేశికవితారీతిని సినీసాహిత్యంలో శక్తివంతంగా ప్రవేశపెట్టి దశాబ్దాలపాటు ఒంటరి వ్యవసాయం చేసిన కొసరాజు కలం బలహీనపడుతున్న సమయంలో జానపదానికి సరికొత్త జవసత్వాలు అద్దిన జాలాది గురించి ‘కొసరాజు కు అభిమానులు వేలాది అయితే ఈ జాలాది కి అభిమాని కొసరాజు’ అని కొసరాజు చెప్పారట. 

కొసరాజు పాటలో సమాజం మీద విసురు, సునిశిత విమర్శ, హాస్యం, ఉంటే జాలాది జానపదంలో వేదన, తాత్వికత సందర్భం వచ్చినప్పుడు శృతి తప్పని చిక్కని శృంగారం, కానవస్తాయి. జానపదుల ప్రేమగీతాలలో గాఢ శృంగార స్పర్శ మిళితమై ఉండాలని జాలాది నమ్మేవారట.

మహాకవి శ్రీశ్రీ ఒకసారి జాలాది బుగ్గలు నిమిరి ‘జాలాదీ నీ పాటలో సహజత్వం ఉంది. నా పాండిత్యం నువ్వు తీసుకుని నీ జానపదాన్ని నాకు ఇవ్వు అన్నారట.

తాను చవిచూసిన వివక్ష, పడిన వేదన, తనకు సహజంగా ఉన్న ఆత్మస్థైర్యాన్ని, ప్రేమించే గుణాన్ని, దేశభక్తిని మరుగుపరచనివ్వకుండా అరుదైన వ్యక్తిత్వంతో అత్యుత్తమసాహిత్యాన్ని సృష్టించి, ఆబాలగోపాలాన్ని అలరించి, మహామహుల ప్రశంసలందుకున్న సత్యకాముడు జాలాది.

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

8 comments

 • At about 1979/80, there was a massive felicitation of music director Chakravarti in Guntur attended by many singers, lyricists and music directors. On that day, Jakadi read a poem about the lives of stars. I regret that I don’t remember the whole poem but the imagery from the last line from that poem is unforgettable: గోడకు అంటించిన పరువులం.

  • జాలాది కలంలో ఏదో మాయ ఉంది చౌదరిగారూ! వింటే అలా పట్టుకుంటుంది. ధన్యవాదాలు.

 • వ్యసకర్త చక్కగా వివరించారు వ్యాసము బాగుంది

 • చాలా మంచి వ్యాసం.
  జాలాది గారి సాహిత్య వ్యక్తిత్వానికి అద్దం పట్టిన వ్యాసం.
  రచయిత కు, ప్రచురించిన రస్తాకు కృతజ్ఞతలు.

 • జాలాది కలం మాయాజాలం ప్రశ్మించేది లేదు కానీ, వేటూరి పాట మాట వచ్చింది. కాబట్టి ఆపుకోలేక అంటున్న మాట ! వేటూరిది బహుముఖ ప్రజ్ఞ . మీకు కావాలంటే ఒక వ్యాసం రాసి నిరూపిస్తాను! జాలాది వారి మీద గేరవంతో అంటున్న మాటే ఇది 1

 • చక్కని వ్యాసం. అభినందనలు.

  జాలాది పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట- ఏతమేసి తోడినా ఏరు ఎండదు. ఎప్పుడు విన్నా అప్పటికప్పుడు దుఃఖం కలిగించగల పాట.

  వారిదే ‘ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ…
  కలహంస నడకల కలికి..’

  కథానాయిక,నాయకుల మధ్య పాటే అయినా చాలా ఆశ్చర్యంగా ఒక రకమైన పవిత్ర భావన కలుగుతుంది.

  అలివేణీ అలకల్లే.. నెలరాణి కులుకల్లే..
  తరలెల్లి పోకమ్మా కలికీ
  ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది
  కోపమెందుకే కోమలాంగీ… రాణీ

  పొగరంతా ఎగరేసి.. వగలన్నీ ఒలకేసి..
  కవ్వించబోకమ్మా కలికీ

  అంటూ ఏడు మల్లెలెత్తు ఆరాధనగా సాగుతుంది జాలాది పాట.

  రచయితకు, ప్రచురించిన రస్తా వారికీ అభినందనలు.

 • నేను ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో కాలేజి లో జాలాది గారి “యాతమేసి తోడినా యేరు ఎండదు..” పాట పాడి ప్రైజ్ కొట్టేశాను. పాడే ముందు ఒక చిన్న పేచీ పెట్టాడు మా తెలుగు పంతులు- “చీము నెత్తురు పారే తూము ఒక్కటే..” అనేది మార్చి వేరేది పాడమన్నాడు, “సరే” అన్నాను కాని అసలుదే పాడేశాను కాకపొతే థర్డ్ ప్రైజ్ ఇచ్చారు.జాలాది పాటలో ఆ కూర్పు మార్చడమంటే చెక్కిన అందమైన శిల్పాన్ని చేతులారా పగలగొట్టడమే. ఆయన కలం జాలువార్చిన ‘సూరట్టుకు జారతాది సితుక్కు సితుక్కు వానచుక్క’ తో అప్పట్లో ఒక కొత్త జానపద పరిమళం తెలుగు సినిమాకు అబ్బిందంటే అతిశయోక్తి కాదు.

 • జాలాది గారి గురించిరాసిన, వివరాలు బాగున్నాయి,సర్..వారిపాటలు, ఏతమేసి దోడినా ఏరు ఎండదు.. ఇపాట, ఒకటే ఎక్కువ గా,విన్నా, ధన్యవాదాలు.. 💐సర్.వారిగురించి, తెలియచేసినందుకు..!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.