Sunday Beach

ఆదివారం

రుషికొండ బీచ్ ఒక దృశ్యం

(వైజాగ్ రుషికొండలో ఒక సినిమా పనిమీద గత ఏడాది రెండు నెలలు వున్నాను. ఆ జ్ఞాపకాలే ఇవి. ఇది ఐదో కథ. మిగిలిన నాలుగు నా ఫేస్బుక్ గోడపై చదవొచ్చు. “రస్తా”లో ప్రచురిస్తున్న హెచ్చార్కె గారికి కృతజ్ఞతలు. నిజానికివి కథలు కాదు, స్కెచ్ లు అనాలేమో.)

(ఇది 5 వ కథ)

ఆదివారం. సముద్రం కూడా కొత్తచొక్కా తొడుక్కుని ముస్తాబైనట్టుంది. నురగలై వురుకుతోంది. ఇంకాసేపట్లో వందల మంది పసిబిడ్డలొచ్చి సముద్రపు చెక్కిలిని ముద్దాడుతారు. వాళ్ళ కేరింతల్లో అది గర్జించడం కూడా మరిచిపోతుంది. చిన్నిచిన్ని పాదాలు తగిలితే ఎండిపోయిన ఇసుక కూడా పూలపుప్పొడిగా మారిపోతుంది.

ఆదివారం ఉదయం ఎనిమిది కల్లా బీచిలో అరుపులు, కేకలు మొదలవుతాయి. ఆటోల్లో వేలాడుతూ వస్తారు. బిలబిలమని దిగగానే ఒక అల ఒడ్డుని చేరుకుని పాదాలకు నీళ్ళిస్తుంది. బైక్ నుంచి దిగిన పిల్లలు అమ్మానాన్నల చేతులు విడిపించుకుని పరిగెత్తాలని చూస్తారు. నాన్న వదిలినా అమ్మ వొదలదు కదా! కార్లూ, బస్సులూ ఒకటొకటే వస్తూవుంటే పార్కింగ్ వాళ్ళు బిజీ.

ఆదివారం వస్తే సముద్రం కూడా గంభీరత్వాన్ని వదిలి, కాస్త నవ్వడం నేర్చుకుంటుంది. బీచిని నమ్ముకుని బతికే బక్కప్రాణులు గట్టిగా వూపిరి పీల్చుకుంటాయి. మొహం మీద ముడుతలు తప్ప మరేమీ కనపడని ఒక అవ్వ, పొయ్యి వెలిగించి మొక్కజొన్న కండెల్ని వుడికిస్తుంది. కాల్చడానికి కుంపటి సిద్ధం చేస్తుంది. అక్కడ చిటపటమనే నిప్పురవ్వలు జీవితంలాగే మెరిసి మాయమవుతుంటాయి.

ఆదివారం పూట గుర్రం కూడా నరాల్ని శ్రుతి చేసుకుంటుంది. పిల్లలు తన మెడ మీది జుత్తును పట్టుకుంటే ఒక నాట్యగత్తెలా అడుగులేస్తుంది. సముద్రానికి మనుషులకి మల్లే అనేక ముఖాలుంటాయి. అది మనల్ని ప్రేమిస్తుంది, జోకొడుతుంది. అరచేతి మీద మనల్ని నిలబెట్టి నాట్యం చేయిస్తుంది. కానీ ఒకే ముఖం అన్ని వేళల్లో వుండదు. అద్దంలో కనిపించే మన ముఖం కూడా అనేక రకాలుగా మారుతూ వుంటుంది. నిజానికి మన కథలో మనం హీరోలం కాదు. సాలెగూడు లాంటి జీవితం లోకి వెళ్ళి వెతికే ఓపికుంటే తెలుస్తుంది, మనమే విలన్లమని. లోపలున్న విలన్ని గుర్తు పట్టకుండా వుండడమే విలన్ లక్షణం.

గ్రీక్ కథల్లోని మోసకారి మాంత్రికురాలు సముద్రం. అది వెయ్యి చేతులతో కౌగిలించుకోడానికి వస్తుంది. పెనవేసుకుని లోపలికి వెళితే తిరిగి రాలేం. ఎవరూ రాలేదు కూడా.

ఆదివారం నాడు బీచిలో తిరిగే ముసలి ఎద్దుకి కూడా పండగే. అది ఇసుకలోకి రాకుండా దుకాణాల దగ్గర తచ్చాడుతూ వుంటుంది. ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటూ వుంటుంది. ఒకప్పుడు దానికి భూమండలమంతా దున్నేసే శక్తి వుండేదేమో. ఇపుడు తనని తానే కష్టం మీద లాగుతూ వుంది. దాని యజమానికి పంటలు పండక, తినడానికి అన్నం దొరక్క, పురుగుల మందు తిన్నాడేమో.

ఆదివారం షాపుల్లోని టోపీలు, టీషర్టులు మనుషులుగా మారిపోతాయి. కొబ్బరికాయల కత్తి కూడా పదునెక్కుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ కుక్ పెనం లోని ఫ్రైడ్ రైసుని గాల్లోకి ఎగరేస్తూ వుంటాడు. అమాయక జనం కూడా ప్రపంచపు గొప్ప విక్రయదారుల్లా మారిపోతారు.

కయాకింగ్ పడవ కుర్రాడి చేతులు పొడుగాటి తెడ్లుగా మారిపోతాయి. జరాసంధున్ని భీముడు రెండుగా చీల్చినట్టు స్పీడ్ బోట్ సముద్రాన్ని చీలుస్తుంది. ఆకాశంలో ఒకడు పక్షిలా ఎగురుతూ(పారా గ్లైడింగ్) డేగల్ని, కాకుల్ని తికమక పెడుతుంటాడు.

పెళ్ళి ఒక సముద్రమని తెలియక ప్రేమికులు ఒకర్నొకరు తోసుకుంటూ వుంటారు. ఒక చిట్టితల్లి బుడిబుడి అడుగులతో తడుస్తూ, ఉప్పునీళ్ళు నోటికి తగిలి అమ్మవైపు మొహం చిట్లించి చూస్తుంది. ప్రయాణం ముగిసిపోయిందనే మూడ్ లో ముసలివాళ్ళు ఒడ్డున చెప్పులకీ, బట్టలకీ కాపలాగా వుంటారు.

సముద్రం ఒక అల్లరి, తుంటరి, శబ్దం, సంగీతం, మృత్యువు కూడా!

ఒక ఆదివారం జోరువాన. సముద్రం దృశ్యంగా, అదృశ్యంగా వుంది. బీచంతా నిశ్శభ్దం. అలలు ఎవరినో వెతుక్కుంటూ వచ్చి బాధగా మూలుగుతూ వెళుతున్నాయి.

ఆ రాత్రి కప్పల కచ్చేరి. ఎదురుగా సముద్రముందని తెలియక, తాము నివసించే మురికిగుంతలోకి నీళ్ళోచ్చాయని సంబరం. కప్పలే అరుస్తాయి. చేపలు నిశ్శబ్దంగా వుంటాయి.

మనుషులంతా కూడా కప్పలే. కానీ కొందరికి సముద్రం వుంటుందని తెలుసు.

 

జి ఆర్ మహర్షి

జగమెరిగిన మహర్షికి పరిచయం అక్కర్లేదు. తన వచనం లోని అందాలకు ఫిదా కాని వారుండరు. మహర్షి పాతికేళ్ళ పాటు జర్నలిజంలో తలమునకలయ్యారు. అది బోర్ కొట్టి ఇప్పుడు సినిమా కోసం పని చేస్తున్నారు. అయిదు పుస్తకాలు ప్రచురించారు. హాస్యం అంటే ఇష్టం. ఫిలాసఫీ అంటే ఇష్టం.

7 comments

  • ఎంత అద్భుతంగా రాసినావున్నా. కళ్లార్పకుండా చదవాలనిపించేట్లుంది.

  • సముద్రానికి, మనుషుల వలెఅనేక ముఖాలు ఉంటాయి!👌కొందరికి, సముద్రం ఉంటుందిఅనితెలుసు. సర్,మీమల్ని, ఇంతకాలం ఎలా మిస్.. అయిము?ఇంతవరకు, మీ రచనలు చదవలేదు. ఇప్పటికే చదువుతాం.. ధన్యవాదాలు, రస్తా..💐.గొప్ప రచయిత నుపరిచయంచేసినందుకు

  • 7-8 ఏళ్ళక్రితం సాక్షి ప్రతి ఆదివారం, మహర్షి గారు వ్రాసే సినిమాలజ్ఞాపకాలు చదవటానికి ఎదురు చూసేవాణ్ణి. అప్పటికీ ఇప్పటికీ వాక్యాలు పదునెక్కాయి

  • Skech, బాగుంది, సర్,👌అసలు, మీరచనలు, ఎలా miss అయిముమేము?సముద్రానికి కూడాఅనేక ముఖాలు ఉంటాయి..!మనుష్యులు అంతా కప్పలే..!ధన్యవాదాలు, రస్తా, మంచి రచయిత ని,పరిచయం చేసినందుకు.. మిగతా కథలు కూడా చదువుతాము!💐💐👍రస్తా కి,రచయిత కి.అభివందనలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.