మ్మా…
అమ్మా….
అని అమ్మని పిలుస్తాను!
ఆ…
ఇంగా…
ఇంగా… ఇంగా…
అని ఏడుస్తాను!
ఎందుకేడుస్తానో? ఎందుకేడ్చినా ఆకలికే ఏడ్చానని అమ్మ అనుకుంటుంది! వెంటనే నన్ను ఎత్తుకుంటుంది! గుండెల్లో పెట్టుకుంటుంది! పమిట కప్పి దుద్దు పెడుతుంది!
దుద్దు తాగేస్తాను! అమ్మ నా పాల బుగ్గలు తుడచి ముద్దుపెడుతుంది! ముద్దు చేస్తుంది! నేను నవ్వితే నవ్వుతుంది!
కడుపునిండా పాలు తాగిన నన్ను భుజమ్మీద వేసుకుంటుంది! వెన్ను నిమురుతుంది! జీర్ణం అంటుంది! నానమ్మ అయితే ‘ఏనుక్కి ఎలంకాయలు జీర్ణం’ అంటుంది!
జోకోడితే చాలు… జోలపాట పాడితే చాలు… నేను బజ్జుంటాను! బుద్దిగా!
ఇదంతా మొన్నటి వరకు! ఇప్పుడు నాకు అన్న ముహూర్తం చేశారు! పరమాన్నం పెట్టారు! ప్చ్… అమ్మ ఇచ్చిన దుద్దంత బాలేవు! ఉమ్మేశాను! మళ్ళీ మళ్ళీ తినిపించారు! తిన్నాను!
అమ్మకి సెలవులు అయిపోయాయి! ఆఫీసుకు వెళుతుంది! నాకు డబ్బా పాలే!
ఏడుస్తాను! ఎప్పటిలా అమ్మ రాదు!
నాన్నారే ఎత్తుకుంటారు! పాలు పడతారు! లేదంటే పెరుగు బువ్వో పాల బువ్వో తినిపిస్తారు! తినకపోతే అరుస్తారు! కోప్పడతారు! కొడతారు!
నాన్నని చూస్తే భయం వేస్తుంది! ఏడుస్తాను!
అమ్మ పగలే చందమామను పిలిచేది!
‘చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కిరావే కోటి పూలు తేవే’ అని!
ఇప్పుడు అమ్మ లేదు! అమ్మ పాడిన పాట లేదు!
అమ్మ సాయంత్రం వస్తుంది! పాపం అలసిపోయి వస్తుందేమో-
‘బండి మీద రావే బంతి పూలు తేవే
పల్లకిలో రావే పాలు పెరుగు తేవే’ అని పాడదు!
ముద్ద మీద ముద్ద నోట్లో పెడుతుంది! మింగక ముందే! మళ్ళీ మళ్ళీ కుక్కుతుంది! కక్కుకుంటానని ముద్ద ముద్దకీ నీళ్ళు తాగబెడుతుంది! ‘ముద్దముద్దకీ నారాయణ’ అని పక్కింటి అత్త నవ్వుతుంది!
నీళ్ళూ బువ్వా రెండూ కదా… బుజ్జిపొట్ట నిండిపోతుంది! కాని అమ్మ రెండు ముద్దలు తినడం లేదని బాధపడుతుంది!
‘తింటే కదా, ఏడవడానికైనా శక్తి వుంటుంది?’ పక్కింటి అత్త వత్తాసు పలుకుతుంది!
‘అదిగో చందమామ’ అనే అమ్మ కూడా ‘అదిగో బూచి’ అంటుంది!
బూచిని పిలుస్తుంది! బువ్వ తినకపోతే బూచి ఎత్తుకు పోతుందంటుంది! మా పాప బువ్వ తినేస్తుంది, రాకులే అని అంటుంది!
చందమామ తేరు మీద రాదు! తేనె పట్టు తేదు! పరిగెత్తుకు రాదు! పనసపండు తేదు!
అన్నీ తెచ్చి మా అమ్మాయికి ఈయవే అని అమ్మ కూడా అనదు!
అమ్మ గోరు ముద్దలు తినిపించందు! అమ్మ వంట పనిలో ఇంటి పనిలో వుంటుంది! నాన్నకు అప్పజెపుతుంది!
అన్నయ్య గంతులేసి ఆటలాడితే నవ్వుతాను! కాని నోట్లో అన్నం పెట్టబోతే మాత్రం తల తిప్పుకుంటాను!
ఇదంతా నిన్నటి వరకు! ఇప్పుడు దండం దశగుణ భవేత్ అంటున్నారు! కర్ర పట్టుకుంటున్నారు! ప్చ్… వాట్సప్‌లో చూసినట్టే అచ్చం చేస్తున్నారు!
అన్నం నోట్లో పెట్టగానే మింగేస్తున్నాను! వాంతి వచ్చినా మింగేస్తున్నాను! ‘చందమామ రావే’ పాట పాడకపోయినా సరే?!
ఔను, ఏమన్నా అంటే ‘పోలీస్ ఫీడింగ్’ అంటున్నారు?!
నాకెంత భయం అవుతుందో తెలుసా? నాలాంటి పాప బొమ్మకి అన్నం ముద్ద పెడతారు! బొమ్మ పాప అన్నం తినకపోతే స్కేలుతో ఠపీ ఠపీ మని కొడుతున్నారు!
అలా కొడుతున్న ఒక్కోదెబ్బ నా వంటి మీద పడుతున్నట్టే ఉలిక్కి పడతాను! ‘ఆ’ అని గక్కురుమని నోరు తెరుస్తాను! అదనుగా పెద్దవాళ్ళు తిన్నంత పేద్ద ముద్ద పెడతారు! నిజం… పిచ్చుక గుడ్డు కాదు, బాతు గుడ్డే! నాకు భయం రుచి తప్పితే మరొక రుచి తెలీదు!
బొమ్మ పాప వీపు వంచి దభీ దభీ మని గుద్దుతుంటే నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి! భయంతో ఎంత బువ్వ తినిపిస్తే అంతా తినేస్తాను!
నాన్నా అమ్మా అత్తా అందరూ నవ్వుతారు! నేను ఏడుస్తుంటే! అన్నయ్య మాత్రం మొదట్లో నవ్వినా చెల్లి ముఖం చూసి- కళ్ళలో నీళ్ళు చూసి- ఆ నీళ్ళలో భయం చూసి తను అలాగే ఉంటాడు! వద్దంటాడు! ఎవరు వింటారు?!
వాట్సప్‌లో అలాంటి వీడియోలు అందరూ షేర్ చేసుకుంటారు!
నాలాగే ఎంతమంది పిల్లలు పాపం భయంతో జడుసుకు చస్తున్నారో? పిల్లలం ఏడుస్తుంటే ఎంతమంది ఈ పెద్దాళ్ళు విరగబడి నవ్వుతున్నారో?
-చిన్నారి (బుజ్జి పాపాయి),
ఇంకా బడిలో వెయ్య లేదు.
(మా చిన్నారి తరుపున వాళ్ళ అన్నయ్యను రాశాను)
Very ట్రూ అండ్ emotionally ఇంట్రికెటింగ్ … nice వే అఫ్ ఎక్స్ప్రెషన్ !
Very nice. Every line true and Heart touching.
👌👌👌👏👏👏👏