తల్లీ బయలెల్లినాదే!

పందిట్లో కొలువైన దుర్గమ్మకు పూజలు జోరుగా సాగుతున్నాయి. గూడెం అంతా భక్తిశ్రద్ధలతో పూజిస్తోంది. స్కూలు, ఆస్పత్రి, రోడ్డు, బస్సు అన్నీ రావాలని, అందరూ బాగుండాలని సాగిలబడి కోరుకుంటున్నారు. చిన్నదొర పోయినందుకు సంతాపంగా విగ్రహం పెట్టద్దని, పూజలు చేయొద్దని చాటింపు వేసినా, ఏటా జరిగే దసరా పూజ ఆపవద్దని అపశకునమని గూడెం పెద్దలు తీర్మానించారు. పట్టుదలగా గూడెం విగ్రహం పెట్టింది. చిన్నదొర లేకపోడంతో ఎవరూ ఆపలేకపోయారు.

నవరాత్రులు వచ్చాయంటే శివుడు చేసే దుర్గమ్మ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. జీవం ఒలికిపడుతూ దుర్గమ్మ నిజంగా గూడేన్ని రక్షించే శక్తి లాగే ఉంటుంది. ఎన్ని పనులున్నా ఆపుకుని మరీ బొమ్మ చేస్తాడు శివుడు. 

‘భయమేస్తుంది మావా. అమ్మోరికి కోపం వస్తదా?’ అడుగుతూనే ఉంది భార్య దుర్గ. తలారా స్నానం చేసి రూపాయి బిళ్ళంత బొట్టుతో మరో పార్వతి లాగుంది దుర్గ. ‘ఎహే. మనుసులన్నాక అయ్యన్నీ సహజం. ఆ మాత్రం అమ్మోరికి తెలవదా?’ అంటూ చెప్పబోతున్న విషయాన్ని తేలిగ్గా తీసి పారేశాడు శివుడు. పదిహేను రోజుల నుంచి పట్టిన ముసురుకు ఒకటే కుండపోత వానలు. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయిదు రోజులవుతున్నా చిన్నదొర ఎలా పోయాడో, అన్న విషయంలో ఆచూకీ తెలియడం లేదు. వాగు దగ్గర ఆయన జీపు ఆగి ఉంది. వాగు ధాటికి కొట్టుకు పోయాడనే అనుకుంటున్నారు. పోలీసు వాను కూడా  రెండు సార్లు వాగు దాకా వచ్చి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. అదుపు ఆపూ లేకుండా చిన్నదొర చేసిన ధాస్టీకాలు – సాక్ష్యం దొరక్కుండా చేసిన హత్యలు, మానభంగాలు అందరికీ తెలుసు. గూడెం మాత్రం లోలోపల సంతోషంగానే ఉంది. అన్ని మంచి పనులకు అడ్డుపడింది చిన్నదొరే. ఆడ పిల్లలు, తల్లులు, తండ్రులు ఒకరేమిటి అందరూ ఒక పెద్ద గండాన్ని తీసేసి నందుకు సంతోషంగా మొక్కుతూనే ఉన్నారు. 

తొమ్మిది రోజులు కొలువు పూర్తయ్యాక నిమజ్జనం డప్పు ఆకాశాలను అంటుకుంది. అందరి కళ్ళలో తృప్తి , ఆనందం. ‘ఈ ఏటికి పోయిరా దుర్గమ్మా’ అంటూ పాటలు మిన్నుముట్టాయి. శివుడు, దుర్గ హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టారు. బండి బయల్దేరింది. ‘మే మెళ్ళొస్తాం లే. నువ్వు ఆగరా శివుడూ’  అనడంతో ఆగిపోయాడు. ఇల్లు చేరగానే మళ్ళీ అడిగింది దుర్గ –‘బయం లేదా మామా’ అని. ‘ఎందుకే బయం. అయినా తెలియక అడుగుతా. పది రోజుల నుంచి చూస్తున్నా. ఎందుకు బయపడిపోతున్నావ్. మడిసివి మడిసిలా లేవు ఏమైంది?’ అన్నాడు. ‘నీకు చెబుదామనే చూస్తున్నా. నువ్వే ఇనడం లేదు. ఆ రోజు మామూలుగా పనికి వెళ్లాను కదా దేవిడికి.  ‘వానలు పడుతున్నాయి. నీళ్ళు కాగపెట్టను కంప లేదు. కొట్టిపో’ అంది పెద్దమ్మగోరు. కంప నరికి కొట్టంలో పెట్టి అదే కత్తితో ఇంటికి బయలుదేరాను. నల్లగా కారుమబ్బు. గబా గబా అడుగు లేసుకు వత్తా ఉన్నా. ఒకటే వాన మొదలయినాది. నువ్వేమో పట్నం పోయినావు అమ్మోరికి బట్టలు తేను. వాగు వడ్డునే చిన్న దొర జీపు ఆగి ఉంది. నన్ను చూసి ఎకిలిగా నవ్వాడు. ‘ఏడకెల్లత్తన్నావే’ అని అడిగాడు. ‘దేవిడీకి దొరా. ఇంటికి పోతన్న’. అని చెప్పినా. దగ్గర దగ్గరకి వచ్చిండు. ‘టైం పాస్ చేద్దామా’ అన్నాడు. దగ్గర కొచ్చి రెండు చేతులు గట్టిగా వెనక్కి తోసి జీపులోకి నెట్టిండు. రెండుకాళ్ళతో గట్టిగా తన్నినా. ఎగిరిపడిండు. నేను ‘దొరా దాపుకు రామాకు’ అని కత్తి చూపించి చెప్పిన. అయినా వినలేదు. మళ్ళీ ముందుకు వచ్చాడు. నాకు ఏమైందో తెలియదు.  మళ్లీ ఎగిరి తన్నినా. పడినోన్ని పడినట్టు మెడమీద పొట్టలో ఎన్ని పీకినానో తెలియదు. లాగి వాగులో వేసినా. కొట్టుకుపోయిండు. ఒక పెద్ద మెరుపు వచ్చి పిడుగు పడింది. గుండెలు దబా దిబా మంటుంటే ఉరుక్కొచ్చినా. అదే మావా. అమ్మోరి చేతిలో పెట్టిన కత్తి. అందుకే మా బయమేస్తోంది.’ అని పెద్దగా ఏడిచేసింది. ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు శివుడు. ‘అదా సంగతి. అందుకే అంటారే. దేవుళ్ళు దయ్యాలు ఎక్కడో లేరే. మనమే దేవుళ్ళు. మనమే దెయ్యాలు. గూడెం ఎంతో కాలం భరిత్తున్న అన్నాయాన్ని తుడిచేందుకు ఈసారి నీ రూపంలో వచ్చింది దుర్గమ్మ. ఏడవకు. ఎవరికీ చెప్పకు.’ అని అక్కున చేర్చుకున్నాడు. జోరున కురుస్తున్న వర్షంలో దూరంగా నిమజ్జనం పూర్తి అయినట్లుగా ఒక పెద్ద ఉరుము ఉరిమింది. దుర్గమ్మ సంతోషంగా వెళ్ళిపోయిందని ఇంకోసారి పిడుగు పడింది.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.