మానసికంగా సంసిద్ధమైతే
విజయం తప్పక నీదే 

“All things are ready, if our mind be so.”
William Shakespeare

మనం మానసికంగా సన్నద్ధమై ఉంటే అన్నీ సిద్ధంగా ఉంటాయి.
విలియం షేక్స్పియర్
“Opportunity does not waste time with those who are unprepared.”
“Wealth for All : Living a Life of Success at the Edge of Your Ability”

సంసిద్ధంగా లేనివాడి దగ్గర అవకాశం తన సమయాన్ని వృధా చేసుకోదు అంటాడు ఇడొవు కొయెనికన్.  
అంటే ఆ అవకాశం మరొకరిని వరించడానికి వేగమే వెళ్ళిపోతుంది. నెపోలియన్ హిల్ తన ప్రసిద్ధ స్ఫూర్తిదాయక గ్రంధం ‘Think and Grow Rich’ లో ‘మనిషి మెదడుతో ఆలోచించేది, విశ్వసించేది ఖచ్చితంగా సాధించగలడు’ అంటాడు. విజయం సాధించడానికి మానసిక సన్నద్ధత ఎంత అవసరమో మనకు ఈ ప్రముఖులు చెప్పిన సూక్తులు చూస్తే తెలుస్తుంది.  విజయం సాధించడానికి సన్నద్ధత ఎంతో అవసరం. మానసికంగా విజయాన్ని ఆహ్వానించడానికి సన్నద్ధం కావాలి. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే గొప్ప విజయాలు సాధించగలవు. నీ మెదడులో ఒక ఆలోచనకు విత్తనం వేసి, పెంచి, పురుడు పోయాలి. అప్పుడే విజయాన్ని సాధించే సామర్ధ్యం పెంపొందుతుంది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన టెన్సింగ్ నార్కే నుంచి నేడు అఖండ విజయాలు సాధిస్తూ గిన్నెస్ రికార్డులకెక్కే ప్రముఖులదాకా అందరూ ఈ విజయ సూత్రాన్ని పాటించినవారే. 

విజయానికి సన్నద్ధత మూడు దశల్లో ఉంటుంది. ఆలోచన, ఆచరణ, విజయానంతర పరిణామాలు దృశ్యమానం చేసుకోవడం. ఈ మూడు దశలు విజయానికి సన్నద్ధతను పరిపూర్ణం చేస్తాయి. మన సంతోషాలను హరించేవి మన మెదుడులోని ఆలోచనలే. సారవంతమైన ఆలోచనల భూమిక మెదడు. ఆలోచనలు లేని మెదడు బలహీనమవుతుంది. ప్రతి రోజు మన మెదడు అరవై వేల ఆలోచనలకు జన్మనిస్తుంది. వీటిలో 95 శాతం నిన్నటి ఆలోచనల అవశేషాలే ఉంటాయి. మన ఆలోచనలకు పరిమితులు విధించుకోవడం వలన కొత్త ఆలోచనలకు తావుండదు. ముందుగా మన ఆలోచనా పరిధిని విస్తరించుకోవాలి. అద్భుత విజయాలు సాధించిన వాళ్ళందరూ ఈ ప్రక్రియనే అనుసరిస్తారు. ప్రతిరోజు పుస్తక పఠనం, కొత్తవాళ్ళను కలవడం వలన మీ ఆలోచనా పరిధి విస్తరించి ప్రతికూల ఆలోచనలకు బలి కాకుండా కాపాడతాయి.  

మామూలు మానవుడికి కూడా మనోబలంతో చారిత్రాత్మక విజయాలు సాధించే శక్తి సమకూరుతుంది.  దీనికి తిరుగులేని ఉదాహరణ అబ్రహాం లింకన్. మనోబలానికి, విజయ సన్నద్ధతకు అబ్రహాం లింకన్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. లింకన్ వైఫల్యాల వరస చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది. మడమ తిప్పని పట్టుదలతో ఆయన అనుకున్నది సాధించేంతవరకు ప్రయత్నాలు ఆపలేదు. Efforts may fail; never fail to put your efforts. అదీ పట్టుదలంటేఅనుక్షణం విజయానికి మరింతగా సన్నద్ధమవుతూ తన ప్రయత్నాలకు మరింత పదునుపెట్టుకుంటూ ముందుకు సాగాడు. 1832లో ఉద్యోగం పోయింది. 1833లో వ్యాపారంలో నష్టపోయాడు.  1835లో భార్య మరణించింది. 1836లో నరాల బలహీనతతో అనారోగ్యం పాలయ్యాడు. 1838లో స్పీకర్ గా ఓడిపోయాడు. 1843లో కాంగ్రెస్ కి నామినేషన్ వేసి ఓడిపోయాడు. 1848లో మరోసారి నామినేషన్ వేసి ఓడిపోయాడు. 1849లో భూమి తనిఖీ అధికారిగా ఉద్యోగం సాధించలేకపోయాడు. 1854లో అమెరికన్ సెనేట్ కి పోటీచేసి ఓడిపోయాడు. 1856లో ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేసి ఓడిపోయాడు. 1858లో మరోసారి అమెరికన్ సెనేట్ కి పోటీ చేసి ఓడిపోయాడు. 1860లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదీ పట్టుదలంటే!  మానసికంగా సన్నద్ధమై జీవితంలో విజయాన్ని సాధించడం ఎలా?    

ఈ క్రింద సూచించిన సూత్రాలు పాటిస్తే నిరంతరం విజయాలు మీ సొంతమవుతాయి

  1. ప్రతి రోజు మీ మెదడుకు ఎంత పదును పెట్టుకుంటున్నారో విశ్లేషించుకోండి. 
  2. మెదడుకు పదును పెట్టుకోవడమంటే ప్రతి రోజు మీ ఆలోచనలకు పదును పెట్టుకోవడమే.
  3. ఒక పని ప్రారంభిస్తే దానిని సన్నద్ధతతో చేయండి. ఫలితాలు ఎంత వేగంగా వస్తున్నాయో నిశితంగా పరిశీలించండి. 
  4. మీ ఆలోచనా ధారకు అవరోధం కలిగించే ప్రతికూల ఆలోచనలను పొరపాటున కూడా మీ మెదడులోకి రానీయకండి. ప్రతికూల ఆలోచనలు మానసిక సన్నద్ధతకు ఎల్లప్పుడూ అవరోధమే. 

అనుకూల ఆలోచనలను అభ్యాసం చేస్తూ, ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచితే మీరు ఎటువంటి పనిలోనైనా అద్భుత విజయాలు సాధించగలరు. మీరు నిరంతరం విజయాలు సాధిస్తున్నారంటేనే, విజయాలు సాధించడానికి మానసికంగా సన్నద్ధమయ్యారని అర్ధం. సర్వకాల సర్వావస్థలయందు సన్నద్ధతే విజయాలకు మూలం. విజయోస్తు! 

* * *

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.