లోతులున్న నవ్వులు:
మార్క్ ట్వెయిన్

మనమందరం చిన్నతనంలో టామ్ సాయర్  కథలు చదివి వారిలో మనలను వూహించుకుని స్వప్న జగత్తులో విహరించిన వారమే.  వాటన్నిటినీ వ్రాసింది మార్కెట్వెయిన్ అని ఎంతమందికి గుర్తుంది?

మార్క్ ట్వెయిన్ గా ప్రసిద్ధి పొందిన శామ్యూల్ లాంగోర్న్ క్లెమెన్స్ 1835 నవంబర్ 30 న జన్మించాడు. ‘అమెరికన్ సాహిత్య పితామహుడి’గా విలియం ఫాక్నర్ ఆయనని ప్రస్తుతించాడు.  ప్రసిద్ధ అమెరికన్ హాస్య రచయితగా, ప్రచురణ కర్తగా, అధ్యాపకుడిగా, ఉపన్యాసకుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. పన్నెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన క్లెమెన్స్ స్కూలు వదిలి ఒక ప్రింటర్ కి సహాయకుడిగా పని చేస్తూ సాయంత్రం పబ్లిక్ లైబ్రరీలో చదువుకుంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. బాల్యంలో మిస్సోరీ అనే పోర్ట్ టౌన్ లోని అనుభవాలను ‘టామ్ సాయర్’,  ‘హకిల్ బరీ ఫిన్’ నవలలలో ప్రతిబింబించాడు. చిన్నతనంలో ఓడల పైలెట్ కావాలని కలలు కనేవాడు. నదిని, దాని మలుపులను, లోతులను, అడ్డంకులను అధ్యయనం చేశాడు. దీనితోనే స్టీమ్ బోటు సురక్షితంగా నడిచే 24 అడుగుల లోతు సూచించే ‘మార్క్ ట్వైన్’ అనే పేరును తన మారుపేరుగా పెట్టుకున్నాడు. విపరీతమైన చతురత, హాస్యం మార్క్ ట్వెయిన్ శైలికి మెరుపులు.

మార్క్ ట్వెయిన్

1861 లో ప్రకటించబడిన సివిల్ వార్ తర్వాత తన సోదరుడు ఒరైయన్ దగ్గరికి చేరుకున్నాడు. మైనర్ గా కొంతకాలం పనిచేశాడు. 1863లో మొట్టమొదటిసారి తనకలం పేరు ‘మార్క్ ట్వెయిన్’ పేరుతో  ఒక హాస్య భరితమైన యాత్రా కథనాన్ని రాశాడు. 1865 లో ప్రచురితమైన ‘జంపింగ్ ఫ్రాగ్’ కథతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించాడు. తరువాత రిపోర్టర్ గా పనిచేస్తూ 1870 లో ఒలీవియాను పెండ్లాడాడు. తర్వాత ‘బఫెలో ఎక్స్ ప్రెస్’ అనే పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. 

మార్కెట్వెయిన్ దంపతులకు సుసీ, క్లారా, జీన్  అనే ముగ్గురు కుమార్తెలు. మార్క్ ట్వెయిన్ కు సైన్స్, టెక్నాలజీ పట్ల ఎక్కువ మక్కువ.  ఎంత ఎక్కువ పేరు గడించాడో అంతకంటే ఎక్కువ ధనాన్ని నష్టపోయాడు. తన రచనలు, ఉపన్యాసాల ద్వారా తన జీవితాన్ని తిరిగి కొనసాగిస్తూ అనేక దేశాల వారిచే ఉపన్యాసాలకు ఆహ్వానించబడ్డాడు.  1896లో కుమార్తె సుసీ మరణం, 1904లో భార్య మరణం, 1909లో మరో కుమార్తె మరణం అతని భాగంగా తీశాయి. 1907లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అతనికి ఆనరరీ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1910 ఏప్రిల్ 2న మార్క్ ట్వెయిన్ గుండెపోటుతో మరణించాడు.  హేలికామెట్ తో వచ్చిన నేను మళ్ళీ హేలీ కామెట్ తోనే పోతాను అన్న అతని మాటలు నిజమయ్యాయి.

తన రచనా వ్యాసంగం ప్రారంభించిన తొలి రోజులలో చతురత, హాస్యం ఉన్న కథలు రాసినా మనుషుల డాంబికాలు, ఆడంబరాలు, హంతక సదృశమైన బుద్ధులు తన నవలలలో ప్రతిబింబించాడు. సామాన్య మానవుల వ్యావహారిక భాషా శైలిని ప్రాచుర్యం పరచి అమెరికన్ సాహిత్యానికి ఒక కొత్త మలుపు ఇచ్చాడు. అతని కాలంలో బానిసత్వం చట్టపరంగా అనుమతింప బడ్డప్పటికీ తర్వాత కాలంలో అతను వాడిన ‘నిగ్గర్’ అనే మాట అభ్యంతరకరమై ఆయన వ్రాసిన ‘హకిల్ బరీ ఫిన్’ బహిష్కరణకు గురైంది. కానీ ఆయన బానిసత్వాన్ని వ్యతిరేకించాడు.

అనేక  మారు పేర్లతో వ్రాయబడిన ఆయన రచనలు ఒక చోటకు తెచ్చి  ప్రచురించడం చాలా కష్టమైన పని. అతను చేసిన ప్రసంగాలు చాలావరకూ రికార్డు కాకుండా పోయాయి. పరిశోధకులు అనేక మంది శ్రమించి 1995లో,  2015 లో అన్నిటినీ ఒకటిగా తెచ్చే ప్రయత్నం చేశారు.

మార్క్ ట్వైన్ సామ్రాజ్యవాద వ్యతిరేకి.  బానిసత్వ విమోచనకు, వారి విడుదలకు చాలా కృషి చేశాడు.  తన కాలంలో నల్లవారు చదువుకునేందుకు సహాయం చేసేవాడు. అలాగే స్త్రీల హక్కులను గౌరవించేందుకు పాటు పడేవాడు. ‘వోట్స్ ఫర్ విమెన్’ అనే తన పుస్తకంలో స్త్రీల పట్ల తనకు గల గౌరవం, వారి హక్కులను కాపాడాల్సిన అవసరం గురించి తెలియజేస్తాడు.  ప్రముఖ రచయిత్రి హెలెన్ కెల్లర్ , మార్క్ ట్వెయిన్ ద్వారా లబ్ధి పొందింది. వారిద్దరి స్నేహం దాదాపు 16 సంవత్సరాల పాటు నడిచింది. శ్రామిక విప్లవాన్ని మార్క్ ట్వెయిన్ సమర్ధించాడు. తాను ఆధ్యాత్మిక వాదిననీ, మతవాదిని కాననీ చెప్తూ బైబిల్ కథలు, మాయలు, తర్వాతి జన్మలు  ఇలాంటి వాటిలో తనకు నమ్మకం లేదని చెప్పాడు. ‘ఒకవేళ క్రీస్తు ఇప్పుడు మళ్ళీ పుడితే ఆయన కూడా క్రైస్తవునిగా ఉండడానికి నిరాకరించే వాడు’ అని అభిప్రాయపడ్డాడు. మత విశ్వాసాలను ఖండించే ‘ద మిస్టీరియస్ స్ట్రేంజర్’ ‘లిటిల్ బెస్సీ’ అనే పుస్తకాలు వీటిని వివరిస్తాయి. మార్క్ ట్వెయిన్ ప్రెస్బిటేరియన్ చర్చ్ ను సమర్ధించాడు.

1869లో  ‘ది ఇనోసెంట్స్ అబ్రాడ్’ అనే పుస్తకంలో తన ప్రయాణాలు, న్యూస్ పేపర్ కథనాలు కలిపి జెరుసలెం, ఈజిప్టులను దర్శించే ప్రజల మనోభావాలను దొంగ భక్తి భావనలను వ్యంగ్యంగా విమర్శిస్తాడు. 1872 లో వ్రాసిన ‘రఫింగ్ ఇట్’ కొంత ఆత్మ కథ, యాత్రా కథనాల సమ్మేళనం. 1873లో ని ‘ద గిల్డెడ్ ఏజ్’,  1869 లో అమెరికా లో జరిగిన రాజకీయ అవినీతిని బయట పెడుతుంది. అమెరికాలోని ధనికుల అలవాట్లను, పై పూత విధానాలను చూపుతుంది. 

మార్క్ ట్వెయిన్ ను ఒకసారి ఆయన భార్య యాత్రా కధనాలకు  స్వస్తి చెప్పి ఏదైనా నవల వ్రాయమని అడిగింది. 1876లో వ్రాయబడ్డ ‘అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’ తన బాల్యంలోని నిజ జీవిత ఘటనల చూపుతుంది. అది కేవలం తన బాల్యమే కాదు అతని తోటి స్నేహితుల అనుభవాలు కూడా. వీటన్నిటినీ కలిపి టామ్ సాయర్ పాత్రగా రూపొందించాడు. ‘ఈనాటి పెద్దలు కూడా వారి బాల్యాన్ని గుర్తు చేసుకోసం కోవడం కోసమే దీన్ని వ్రాసాను’ అని కూడా చెప్పుకున్నాడు.

1880లో మార్క్ ట్వెయిన్ రాసిన ఐదు యాత్రా కధనాలలో నెలలో మూడవది ‘ద ట్రాంప్ అబ్రాడ్’.  1881 లో ముద్రింపబడిన ‘ద ప్రిన్స్ అండ్ ద పాపర్’ నవల రాజరిక వ్యవస్థను పేదల దుర్భర జీవితాలను చూపుతుంది. రాజరిక వ్యవస్థలో అవినీతి పేద జీవితాలలోని మోసాలను బయట పెడుతుంది. 1883లోని ‘ద లైఫ్ ఆన్ ద మిసిసిపి’  అనే పుస్తకం మిసిసిపి నది చరిత్రను పైలట్ గా తన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. 1884లో ‘అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్ బరీఫిన్’ అనే నవలలో సివిల్ వార్ ముందున్న బానిస జీవితాన్ని ఫిన్, జిమ్ పాత్రల ద్వారా అద్భుతమైన హాస్యాన్ని జోడించి వ్రాస్తాడు. 1889లో ‘ఎ కనెక్టికట్ యాంకీ ఇన్ కింగ్ ఆర్థర్స్ కోర్ట్’ ఇంకా 1893లో ని ’ద డైరీస్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్’ కూడా  వ్యంగ్య రచనలే. మార్క్ ట్వెయిన్ తన రచనలలో అత్యుత్తమమైనదిగా భావించింది 1896లో వ్రాసిన పర్సనల్ రికలెక్షన్స్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్. దీనిలో జోన్ను చాలా ఆదర్శవంతమైన నిస్వార్ధమైన ధైర్యవంతురాలుగా చిత్రీకరిస్తాడు.

ఇక ప్రసిద్ధి చెందిన రెండు నవలల విషయానికొస్తే ‘టామ్ సాయర్ అనే ఒక పిల్లవాడి శారీరక మానసిక నైతిక ప్రవర్తనను వాటి పరివర్తనను తెలియజేసిన నవల. ఆంట్ పోలీ దగ్గర పెరుగుతూ అల్లరి చిల్లరిగా తిరిగే టామ్ హక్ ఫిన్ తో ఎలాంటి స్నేహం చేస్తాడు, ఇంజన్ జో  అనే హంతకుడ్ని చూసి భయపడి ఎలా పారిపోయి తప్పించుకుంటాడు, అతను ప్రేమలో విఫలం కావడం, ఒక నిధిని కనుగొనడం, చివరకు పరివర్తన చెంది మంచివాడిగా మారడం చూపుతాడు. కధనం ఆద్యంతం మనలను కట్టి పడేస్తుంది. ఈ కథ కూడా పీటర్స్ బర్గ్ లోని మిసోరీలోనే జరుగుతుంది. ఈ కథలో సమాజంలో పెద్దలు ఎలా మోసపూరితంగా ప్రవర్తిస్తుంటారో చూపే నవల.

‘హకిల్ బెరీ ఫిన్’ ‘టామ్ సాయర్’ కు అనుబంధ నవల. పాప్ ఫిన్ అనే ఒక తాగుబోతు కొడుకు హకిల్ బెరీ ఫిన్. టామ్ బ్లాంకెన్ స్టెప్ అనే తన బాల్య స్నేహితుని చూసి ఈ నవలను రచించాడు. 1876లో నాలుగు వందల పేజీలు రాసిన తర్వాత విసుగుచెంది పక్కన పెట్టేశాడు. ‘ద ప్రిన్స్ అండ్ ద పాపర్’  ‘లైఫ్ ఆన్ ద మిసిసిపీ’ ఈ రెండు నవలలు పూర్తి చేసిన తర్వాత 1882లో ఒక స్టీమ్ బోట్ పర్యటన పూర్తయిన తర్వాత ఈ నవల మళ్ళీ రాయాలనిపించింది. 1976లో మొదలైన ఆ నవల 1884లో పూర్తయింది. బానిసత్వం పట్ల మార్క్ ట్వెయిన్ ఉద్దేశాలను పూర్తిగా మార్చి వేసింది. ఒకరకంగా సాహసానుభవాల గురించి వ్రాయబడ్డా రాజకీయాల్ని మతవిశ్వాసాలను ఎగతాళి చేస్తుందని విమర్శకులు భావిస్తారు. చనిపోయిన వారి గురించి విషాదకవితలు రాసి పాడే వారి గురించి ఎమెలీన్ పాత్ర ద్వారా వెక్కిరిస్తాడు. అప్పటికే మాబీడిక్, గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా వంటి నవలలు ఉన్నప్పటికీ విమర్శకులు దీన్ని మొదటి అమెరికన్ నవలగా గుర్తిస్తారు. ఇది అమెరికా జీవనాన్ని ప్రతి కోణం నుంచి ప్రతిబింబిస్తుంది.  స్పష్టంగా అమెరికన్ జీవన విధానాన్ని సూటిగా వివరిస్తుంది.

ఇపుడు అతని కధల గురించి, హాస్యాన్ని గురించి కొన్ని విషయాలు తెలిసికుందాం. మార్క్ ట్వెయిన్ దాదాపు నూట ఇరవై ఎనిమిది కధలు వ్రాశాడు. ఆహ్లాదకరమైన అనూహ్యమైన అంతాలు, హాస్యం, వ్యావహారిక భాష, కధలో పటుత్వం, కథనం లో నైపుణ్యం అతని కథల ముఖ్య లక్షణాలు. దీర్ఘమైన నవలల కన్నా చిన్నవైన కథలే అతన్ని గొప్పవాణ్ని చేశాయి. ‘అ డాగ్స్ టేల్, అ గోస్ట్స్ స్టోరీ, అ మాన్యుమెంట్ టు ఆడమ్, ఏన్ ఎన్కౌంటర్ విత్ ద ఇంటర్వ్యూయర్, అ టెలిఫోన్ కాన్వర్జేషన్, కానిబలిజం ఇన్ ద కార్స్, ఈవ్స్ డైరీ, హంటింగ్ ద డిసీట్ఫుల్ టర్కీ, పంచ్ బ్రదర్ పంచ్, జంపింగ్ ఫ్రాగ్, స్టోలన్ వైట్ ఎలిఫెంట్, స్టోరీ ఆఫ్ ద గుడ్ / బాడ్ లిటిల్ బాయ్స్, వార్ ప్రేయర్, లక్, హండ్రెడ్ మిలియన్ పౌండ్ నోట్, అ ట్రూ స్టోరీ రిపీటెడ్ వర్డ్ బై వర్డ్’ వంటి అరవై కథలు అత్యంత ప్రముఖమయ్యాయి. 

ఇక హాస్యం విషయానికొస్తే అతని చతురత అంతా తల్లి నుంచీ పుణికి పుచ్చుకున్నదే. చిన్నప్పుడు అతనికి అనేక వ్యాధులు సోకాయి. మొండి ఆరోగ్యంతో బతికి బయట పడ్డాడు. ఓసారి వాళ్ళమ్మ దగ్గర కెళ్ళి ‘ అమ్మా నా చిన్నప్పుడు నేను చనిపోతానని భయపడ్డావా’ అని అడిగితే ‘ కాదురా బతుకుతావని’ అని నవ్వుతూ చెప్పిందట. అలాగే అతను మనుషుల గురించి చెప్తూ ‘ సిగ్గు పడగల లేదా అవసరం కల జంతువు మనిషే’ అని అంటాడు. మంచితనం గురించి మాట్లాడుతూ ‘ మంచి చేయి, ఒంటరివాడి వవుతావు’ అంటాడు. చాలా పదునుగా, సూటిగా వుంటుంది మార్క్ ట్వెయిన్ హాస్యం. ‘ముందు నిజాల్ని సేకరించు – తర్వాత వాటిని వీలున్నంత విధ్వంసం చేయచ్చు’ అంటాడు. విజయ రహస్యం గురించి చెప్తూ ‘ జీవితంలో విజయం సాధించేందుకు నీకు కావలసింది అజ్ఞానం ఇంకా  ఆత్మ స్థైర్యం’ అంటాడు. ఇంత హాస్యపు గని కాబట్టే జీవితంలోని ఆటుపోటుల్ని ఎదుర్కొని నిరాటంకంగా సాహిత్య సృజన చేసి అమెరికన్ సాహిత్యానికొక మేలిమి గుర్తింపు తెచ్చాడు మార్క్ ట్వెయిన్.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

1 comment

  • మార్క్ ట్వెయిన్ చిన్నప్పటి పెద్ద స్నేహితుడు.పెద్దప్పటి చిన్న స్నేహితుడు.
    అతన్ని తెలుగు లోకి తెచ్చిన నండూరిని మీరు ప్రస్తావించలేదు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.