వీరభోజ్యం!

ఇప్పుడు కాసేపు గత జల సేతు బంధనం.

ఇవాల్టి నీళ్లు నిన్నటి నీళ్ల ఇవాల్టి రూపమే. కొత్తవి కావు. తేడా వుండదని కాదు. ఉంటుంది. తేడా గత కాలం నుంచి చేరిన అనారోగ్య కాలుష్యాలు కావొచ్చు. కొండా కోనల్లోంచి చేరిన బలవర్ధక తాజా ఖనిజాలు కావొచ్చు. నిన్నటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవాళ బతుకు సరిగ్గా అర్థమవుతుంది. బాగా అర్థమైనదే అనుభవానికి అనువుగా వుంటుంది. నిన్నటి సంగతి మనకెందుకని అత్యాధునిక స్వరంతో చెప్పే మాటలు గాలి మూటలు. నిన్న కూడా వుండిన నీళ్లివి, నేను అత్యాధునికుడను, తాగను పొమ్మంటే గొంతెండుక చావడమే అవుతుంది. అలాగని, సనాతన జలాలివి పరమ పవిత్రాలని వాటిని శుభ్రం చేసుకోకుండా తాగితే అకాల మరణమే.

కొంత మంది అతి మోడర్నిజానికి లోనయ్‍ గతం నుంచి నేర్చుకోడానికి నిరాకరిస్తారు. మరి కొంత మంది గతానికి అతి పవిత్రత, పూజనీయత (ఫెటిష్) ఆపాదించి, పౌరాణిక బోధనలతో చంపుతారు. గత చరిత్ర నుంచి తమకు అనుకూలమైన అబద్ధాల్ని తీసి చెలామణి చేస్తారు. వాటిని మాత్రమే చెలామణి కానిస్తారు. ఇది… నిన్నటి గురించి వాస్తవికంగా మాట్లాడనివ్వని కుట్ర. పాత అబద్ధాలను ‘కొత్త పరిశోధనల’తో న్యాయబద్ధం చేసే కుట్ర. గంభీర సత్యాన్వేషణ వేషం వేసుకున్న డొల్ల ప్రచారం. సత్యం వధలో ప్రచారం కీలకం. అబద్దం ఏలుబడికి సత్యవధ అవసరం.

అబద్ధాల పీడితుడా! జాగ్రత.

నాటికీ నేటికీ మనిషి ‘కథ’ ఏమైనా మారిందా? మారితే ఏం మారింది? పూర్వులు తమ జీవితాలతో ఎలా వ్యవహరించారు? ఇప్పటి మనం ఏం చేద్దాం? ఏం చేస్తున్నాం? కాస్త ఆలోచిద్దాం. ఆలోచించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది రాజకీయం. మంచి రాజులు చెడ్డ రాజులు అనే మాటలు వున్నాయి. మంచి, చెడ్డ అనేవి నిరపేక్షికం (అబ్జల్యూట్) కాదు. సాపేక్షికం (రిలేటివ్). మౌలికంగా రాజులందరూ చెడ్డవారే. ‘సాహితీ సమరాంగణ సార్వభౌములు’, స్వర్ణయుగాల ‘విక్రమాదిత్యులు’, అంధకారయుగాల ‘విజయరాఘవ నాయకులు’, మతం హద్దులు దాటి ‘మన ధర్మా’న్ని గౌరవించిన ‘మల్కిభరాములు’ ఇంకా బాబరులు, ఔరంగజేబులు… ఎవరైనా రాజులందరూ చెడ్డ వారే. ఎందుకంటే, కత్తి పట్టి నాలుగు కుత్తుకలు నరక్కుండా ఎవడూ వీరుడు కాలేదు. కత్తులు మరింత గట్టిగా పట్టుకుని, గొంతులు కోసే పనిలో ‘వృత్తి నిపుణుల’ని నిరూపించుకోకుండా ఎవరూ రాజులు కాలేదు. కత్తి పట్టడం, మనుషుల గొంతులు కోయడం చెడ్డ పని అయితే రాజులందరూ చెడ్డ వారే. దోచుకోడం చెడ్డ పని అయితే రాజులందరూ ప్రజలను దోచిన చెడుగులే.

ప్రజలనే కాదు, ప్రజల విశ్వాసాల్ని… ‘హృదయ రహిత సమాజంలో ప్రజల హృదయం’ అయిన మత విశ్వాసాల్ని సైతం…. దోచుకున్న వారే. సోమనాథ దేవాలయంలో ఘజినీ చేసిన దోపిడి సంగతి చెబుతారు. అత్యాధునిక రథ (కారు) యాత్రలు చేస్తారు. మరి, (హిందూ) దేవాలయాల్లో దేవతా విగ్రహాలను పెకలించి వాటి కింది సంపదలు దోచుకోడానికి ‘దేవోత్పతనపాదుడు’ అంటూ ప్రత్యేకం ఒక మంత్రిని మేంటేన్ చేసిన హిందూ రాజు శ్రీహర్షుని సంగతి దాటవేస్తారేం?

ఈ సెలెక్టివ్ ధర్మాపన్నాల్ని వొదిలేస్తే, మినహాయింపు లేకుండా రాజులందరూ హంతకులే, దోపిడిదారులే. చెడ్డ వారే. కాకపోతే గెలిచిన రాజు… మొదట వీరుడుగా తరువాత విష్ణువుగా (దైవాంశ సంభూతుడుగా) మన్నన పొందడం… సో కాల్డ్ బుద్దీజీవుల సుందర షడ్యంత్రం. దీని కోసమే పెద్ద పెద్ద పురాణాలు. వాటికి లేనిపోని పవిత్రాలు. దేవతలూ రాక్షసులంటూ మనుషుల మధ్య వేరుబంధాలు. ఎవడి పక్షానికి వాడి భట్రాజ కీర్తనలు.

సందేహం లేదు. రాజ్యం వీరభోజ్యం. రోడ్డు కిరు పక్కలా చెట్లు నాటిస్తానన్నందుకు ఎవరూ అశోకుడిని రాజ్యాభిషక్తుడిని చేయలేదు. అతడూ, వాళ్ల నాన్నా, తాతా కత్తులెత్తి కుత్తుకలు నరుక్కుంటూ పోతేనే చక్రవర్తులయ్యారు.

అంతటి ధర్మాశోకుడైనా చేతిలో కత్తి (సైన్యం) వున్నంత కాలమే చక్రవర్తి. కేవలం ధర్మచక్రం తిప్పుతూ పరిపాలన చేయడం వీలు కాని పని. రాజకీయంలో అహింస అనేది మరొక పురాణం. రాజకీయం అంటేనే హింస.  అప్పుడే కాదు, ఇప్పుడైనా అంతే. రాజు చేసే పనులను నాడు రాజకీయం ‍అన్నారు. రాజు చేసిన పనులు (రెవిన్యూ వసూలు, అణిచివేత…) చేసే వాళ్ల పనులనే ఈనాడు రాజకీయం అంటారు. ఇప్పుడు ఒక తేడా వుంది. రాజకీయం ‘ఒక’ రాజు చుట్టూ కాకుండా ‘కొందరు’ రాజుల చుట్టూ తిరుగుతుంది. ‘ఒకరి’కి బదులు ‘కొందరు’ ఏలడం ప్రజాస్వామ్యం. (స్వామ్యం అంటే స్వామి-తనం లేక (రాజు తనం). ఇది కూడా గతించి, ప్రజలందరు రాజులయ్యే వరకు… పాలితులు పాలకులయ్యే వరకు… కార్మికులు యజమానులయ్యే వరకు… ఏదో ఒక రూపంలో రాజఖడ్గం (రాజ్యం) వుంటుంది. ప్రజలు రాజులయ్యాక ఇక పాలించడానికి ఎవరూ ఉండరు. ‘రాజఖడ్గం’ తుప్పు పట్టి, ఆ తుప్పు కొద్దికొద్దిగా రాలిపోతుంది. రాజ్యం అనే పదార్థం అదృశ్యమవుతుంది. కత్తి లేకుండా రాజ్యం వుండదు. రాజ్యం వున్నంత కాలం కత్తి వుంటుంది. రాజ్యం వీరభోజ్యం. మిగిలిన శాంతి మాటలన్నీ… పాత, కొత్త ‘రాజు’ల పక్షాన బుద్ధిజీవుల మైండ్ గేములే.   

మంచి రాజకీయం. చెడ్డ రాజకీయం అనేవి సాపేక్షికం. మౌలికంగా రాజకీయమే చెడ్డది. ‘రాజకీయం లేని జీవిత’మే మంచిది. అదేంటి? అలాగయితే, ఎలాగ? రాజు లేకుంటే ఎలా? రాజ్యం లేకుంటే ఎలా? రాజకీయం లేకుంటే ఎలా? ఉన్న దాన్ని రాజ్యం (కింగ్డమ్) అనండి, రాజ్యవ్యవస్థ (స్టేట్) అనండి,… ఇది లేకపోతే ఎలా? వామ్మో, మనం బతకడం ఎలా సారు? పక్క వాడు నన్ను కొడితే ఏం చేయడం? నా పెళ్లాం ఎవడితోనో లేచిపోతే ఏం చేయడం? నా మొగుడు నన్ను, పిల్లల్నీ వొదిలేసి పొతే. పోకుండా తంతే ఏం చేయడం? ఇవీ మన భయాలు.

నిజమా? నిన్నటి రాజ్యమైనా నేటి రాజ్యమైనా పక్క వాడు నిన్ను కొట్టకుండా అడ్డుకున్నాయా? పక్కవాడితో నిన్ను కొట్టించడం కూడా చేస్తున్నాయిగా?! జై శ్రీరాం అనలేదనే సాకుతో కొందరు ఒక మనిషిని నడి బజారులో పడేసి కొట్టి కొట్టి, కొస ప్రాణంతో వున్న వాడి గుండెల మీద ఎగిరి ఎగిరి దూకి చంపి జై శ్రీరాం అని అరిచి అప్పటి వరకు అక్కడే వున్న రక్షక భటులతో శవాన్ని పోలీసు వాహనం లోనికి మోయించిన వీడియోను నెట్ లో వైరల్ చేస్తే చూసి, రాత్రులు పీడకలల పక్కల మీద పొర్లడం వినా ఇవాళ మనం పీకుతున్నదేమిటి? ఇంతటి ఘోరాలు చూస్తూ, వింటూ, అనుభవిస్తూ…. ఇప్పుడున్న రాజ్యాన్నే ‘ఆశ్రయించి’ బతుకుతున్నామెందుకు? మన నిస్సహాయతకు కారణం: ‘రాజ్యం’లో ఇమిడి వున్న ‘వీరత్వం’. వీరత్వం లేకుండా రాజ్యం లేదు.  మోసం, అబద్ధం, ప్రచారం… అన్నీ వీరత్వంలో (యుద్ధతంత్రంలో) భాగమే, 

చిన్న ఉదాహరణ, బ్రిటీషోడి కాలంలో స్వాభిమానంతో తిరుగబడిన పాలెగాడు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి గురించి ఒక సినిమా కారణంగా ఒక చర్చ జరిగింది. ఆయన  పోరాటం ఓడిపోయింది. ఆయన తల కొట్టి మొలేయబడ్డాడు., నిజమే, ఆయన నాయకత్వంలో పేదలు వూళ్లలో ధనికుల ఇళ్ల మీద దాడులు చేశారు. డబ్బులూ నగలు దోచారు. అలా ధనికులను దోచకుండా. సైన్యాల్ని నిర్మించకుండా ఎవడైనా.. ఏ ఒక్కడైనా… రాజు ఎలా అయి వుంటాడు? ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తిరుగుబాటు పరాయి సామ్రాజ్యవాదం మీద, దాని స్థానిక సేవకుల మీద. ఆయన పోరాటం స్థానిక పేదల మీద అనడానికి ఆధారాలు లేవు. వినికిడి మాటలు తప్ప. అదే జరిగి వుంటే, ఆయన అతి త్వరగా స్థాన బలం కోల్పోయే వాడు. ఆయన మెడ మీద తల రెండేండ్ల కాలం నిలబడేది కాదు. అంతటి బ్రిటీషోడు చివరికి ఒక నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆయనను ఓడించాల్సి వొచ్చేది కాదు. ఆనాడు కాదు, ఈనాడైనా… ఒక నరసింహా రెడ్డి ఒక దౌష్ట్యాన్నెదిరించి కత్తి పట్టి పోరాడి, ఓడిపోయి వుంటే, ఆయనను బందిపొటుగానే ప్రచారం చేసే వారు. గెలిచి వుంటే… ‘మహరాజా రవితేజా’ అంటో మహా కావ్యాలు అల్లేవారు?  గెలిచేదైనా ఓడేదైనా పోరాడే వాడే. పక్కన మైండ్‍ గేములాడే మేధావులు కాదు. వీళ్లు ఎవరు గెలిస్తే వాళ్లను కీర్తించే ‘బుద్ధి’మంతులే. 

రాజ్యం వీరభోజ్యమనే మాటకు మరో అర్థమూ వుంది. మంచికైనా చెడుకైనా,… పోరాడే వాడిదే రాజ్యం. అబద్ధాలు, మోసాలు, తెరవెనుక గూండాలు, జీతం డబ్బుల కోసం తమ మాట వినే పోలీసు కత్తులు… ఇవి చెడ్డవాడి ఆయుధాలు కావొచ్చు. ప్రజలకు అవే ఆయుధాలు ఉండక్కర్లేదు. వాళ్లు ప్రజలు అయ్యుండడమే వాళ్ల మొదటి మహా ఆయుధం. సొంత చేతులు, ఎత్తిన పిడికిళ్లే వాళ్ల కత్తులూ తుపాకులూ. గెలిచాక గెలుపుని నిలబెట్టుకోడానికీ కత్తులు అవసరమే. రాజ్యం వున్నంత కాలం అది వీరభోజ్యంగానే వుంటుంది. ప్రజలు వీరులుగానే తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తాము సంపాదించుకుంటారు, కాపాడుకుంటారు. విస్తరించుకుంటారు. చివరికి రాజ్యం అవ‍స‍రాన్నే తొలగిస్తారు. 

14-10-2019

హెచ్చార్కె

16 comments

 • చరిత్ర పట్ల ఎవరి కోణం వారిది. ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి తిరుగుబాటును బందిపోటు దాడిగా అన్వయిస్తున్న వాదన డొల్ల. మీ సంపాదకీయంలో కూడా ధనికులను కొట్టి పేదలకు పంచాడని రాశారు.అది కూడా నిజం కాదు. నర్సింహారెడ్డి కుంఫిణీ సొమ్మును కొల్లగొట్టాడు ,కుంఫిణీ మద్దతుతో బలసిన ఇద్దరు ముగ్గురు వ్యాపారుల మీదనే దాడిచేసాడు .

  • శివ రాచ‍ర్ల, చాల చాల థాంక్స్‍. ఔను. న‍ర‍సింహా రెడ్డి పోరాట‍ం సామ్రాజ్యవాద‍ం మీద మాత్రమే. పేద‍ల‍ మీద కానే కాదు. ఆయ‍న కొల్లగొట్టింది ధ‍నికుల‍ను మాత్ర‍మే. మీరన్నట్లు ఆ ధనికులు సామ్రాజ్యవాద అనుకూలురు కుంఫిణి ప్రభుత్వ మ‍ద్దతుదారులు కూడా.

 • సమకాలీన పరిస్థితులపై సింహనాదం. ఎంత అద్భుతంగా రాశారు సర్… ఆ శ్రీహర్షుడి రాజ్యంలోని ఆ వ్యక్తి గురించి సరికొత్త విషయం నేను తెలుసుకొన్నాను.. అలా దోపిడీ చేసేందుకే ఒక మంత్రి పోస్ట్ create చేసి మైంటైన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.. జరుగుతున్న దారుణాలపై ఏదో ఒకటి చేసేలా ప్రజలను కార్యోన్ముఖులను చేసే దిశగా సాగిన ఈ ఎడిటోరియల్ ప్రతి వ్యక్తి చదవాలి..అవసరమైనది..అలాగే సైరా లో ని నరసింహారెడ్డి పాత్ర పై..వాస్తవం పై..ఒక చిన్న ఝలక్ ఇచ్చారు.. మీ వాక్యాలకు ఊతమిస్తూ మీరు చెప్పే సందర్భాలు ..ఆ వచనం..అద్భుతం..కుడోస్ సర్..!!

  • ‘రాజ్యం వీరభోజ్యం’ అనే ఫాక్ట్‍ ను ఒక సైంటిఫిక్‍ ఫ్యాక్ట్‍ గా కాకుండా, కేవలం నెగటివ్‍ ప్రచార నినాదంగా తీసుకునే మన సాంప్రదాయిక మైండ్సె‍ట్‍ కారణంగా ఈసారి సంపాదకీయం కొందరు మితృలను కన్ప్యూ‍జ్‍ చేస్తుందేమోనన్న నా భయాన్ని మీ మెచ్చికోలు తొలగించింది. ఇందుకు చాల‍ కృతజ్ఞతలు. రాజులే కాదు, ప్రజలైనా సరే ‘వీరులు’గానే … అంటే పోరాడడం ద్వారానే ప్రజారాజ్యం ఏర్పాటు చేయగలరని, ప్యాసివ్‍ గా పడి వుండడం ద్వారా కాదని చెప్పడానికి నేనుపయోగించిన‍ కొద్దిపాటి ‘వైచిత్రి’ మరీ అంత గహనమేమీ కాదని మీ వ్యాఖ్య నాకు ఊరటనిచ్చింది. థాంక్యూ సో మచ్‍.

 • యుద్ధం గురించి, రాజ్యం గురించి సమాలోచన ఆవిష్కారించిన ఈ ఎడిటర్ దృష్టికి ఒక విషయం…. అక్టోబర్ 5 న బి.జె.పి. జనరల్ సెక్రటరీ మన తెలుగు నాయకుడు రామ్ మాధవ్ ఢిల్లీలో ఒక పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ ” ప్రపంచ రాజకీయాలు భారీ మార్పుకు గురి అవుతున్నాయి, ‘ఆధారిటేనిజం’ క్రమంగా ఇక్కడ స్థిరపడుతున్నది” అన్నారు. ఆ వార్తకు శీర్షిక – ‘బి.జె.పి. ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదు’
  ఇప్పటి కాలం యుద్ధం ఇలా ఉంటుంది! కనుక ‘రాజ్యం వీర భోజ్యం’ ఏ కాలంలో చేసిన పద ప్రయోగమో కానీ సత్యమది.
  తమ సుదీర్ఘ అనుభవంలో నుంచి సంపాదకులు రాసి చెబుతున్న వాటి కంటే, రాయకుండా చెబుతున్నవి ఎక్కువ ఉంటున్నాయి. పైకి శబ్దం చేయకపోవచ్చు గాని, ‘వాటిని’ చదివేవాళ్ళ సంఖ్య కూడా మరీ అంట తక్కువ అని నేను అనుకోను.
  ఇది, ఈ ఎడిటర్ మన ‘లిటరసీ’ కి ఇస్తున్న గౌరవం.
  నిజానికి ఈ సంపాదకీయం ‘అందరికీ అన్నీ…’ అన్న చందంగా ఉంది.
  వీరి సంపాదకీయాలు ‘రెగ్యులర్’ గా చదవాల్సి ఉంది.

  • జాన్సన్‍‍‍ గారు, చాల చాల థాంక్స్‍. మీరుటంకించిన‍ వార్తా శీర్షిక నిజమే. ‘బి.జె.పి. ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదు’… అలాంటి పరిస్థితి నిజంగానే ఏర్పడుతోంది. సౌదీ, పాకిస్థాన్‍ లు ఎలా అక్కడి మెజారిటీ మత రాజ్యాలో ఇంఢియా అలాగే ఇక్కడి మత రాజ్యం ఎందుకు కాగూడదు అనుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మన మన‍ అవకాశవాద, పాక్షిక దృక్కుల వల్ల రానురాను బలపడుతోంది. ప్రగతిశీలురు దీన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేదని నాకు గట్టి గా అనిపిస్తున్నది. ఈ సంగతిె చెబుదామనే ఉద్దేశంతోనే సంపాదకీయం…లో కొందరు యువకులు ఒక యువకుడిని నట్టనడిబజార్లో పోలీసులు చూస్తుండగా కొట్టికొట్టి చంపి జైశ్రీరాం అంటో వెళిపోయిన వీడియోను ప్రస్తావించాను. ఈ వీడియో చూసిన వాళ్లు చాలానే వుంటారు. ఎవరికి ఏమనిపించిందో తెలియదు. ఎన్నికలు తప్పక మంచివి. అవి మన ప్రజాస్వామ్యానికి అత్యవరం. కాని అవి చాలు అనుకోలేం. ఎన్నికలకు ఎన్నికలకు మధ్య ప్యాసివ్‍ గా వుండిపోలేం. అన్యాయాల‍ మీద పిడికిళ్లెత్తిన వీధి పోరాటాలు అత్యవసరం . అడుగడుగున అన్యాయాలకు వ్యతిరేకంగా జనం సంఘటితం కావడం అత్యవసరం. వ్యాసాలు, సైద్ధాంతిక చర్చల్లాగే, జనం వూరేగింపులు, ప్రదర్శనలు కూడా ఒక అత్యవసర‍ సంభాషణే (డిస్కొర్స్‍).

 • ఇది ఎడిటోరియ‌లు కాదు..
  గుండెకాయ‌లోంచి మొల్చిన ఎర్రెర్ర‌గా మండే విప్ల‌వ దివిటీలు. చ‌దువుతాంటే.. ఓ కొత్త ఎన‌ర్జీ, ఓ ఎడ‌తెరిపి లేని బాధ రైలు ప‌ట్టాల్ల‌గా ఉండాయి.
  1. **గత చరిత్ర నుంచి తమకు అనుకూలమైన అబద్ధాల్ని తీసి చెలామణి చేస్తారు. వాటిని మాత్రమే చెలామణి కానిస్తారు. ఇది… నిన్నటి గురించి వాస్తవికంగా మాట్లాడనివ్వని కుట్ర. పాత అబద్ధాలను ‘కొత్త పరిశోధనల’తో న్యాయబద్ధం చేసే కుట్ర. గంభీర సత్యాన్వేషణ వేషం వేసుకున్న డొల్ల ప్రచారం. సత్యం వధలో ప్రచారం కీలకం. అబద్దం ఏలుబడికి సత్యవధ అవసరం.**
  —– ఈ మాట‌లు ఏ స‌మాజాకైనా వ‌ర్తిచ్చాయి. రాజ‌ల కాలంనుండి ఇప్ప‌టి రాజ‌కీయ‌నాయ‌కుల వ‌ర‌కూ వ‌ర్తిచ్చాయి. మ‌నం డొల్ల‌లే డోలు కొట్టుకుని వాయిచ్చాం. స‌త్వం వ‌ధ‌ను పూసుకుని, అబద్ధాల ఏలుబ‌డితో బ‌తికిన ఓ దొంగ‌చాటు దోర‌కుట్ర‌లు ఇట్లాంటివెన్నో

  2. ** మంచి రాజులు చెడ్డ రాజులు అనే మాటలు వున్నాయి. మంచి, చెడ్డ అనేవి నిరపేక్షికం (అబ్జల్యూట్) కాదు. సాపేక్షికం (రిలేటివ్). మౌలికంగా రాజులందరూ చెడ్డవారే. ‘సాహితీ సమరాంగణ సార్వభౌములు’, స్వర్ణయుగాల ‘విక్రమాదిత్యులు’, అంధకారయుగాల ‘విజయరాఘవ నాయకులు’, మతం హద్దులు దాటి ‘మన ధర్మా’న్ని గౌరవించిన ‘మల్కిభరాములు’ ఇంకా బాబరులు, ఔరంగజేబులు… ఎవరైనా రాజులందరూ చెడ్డ వారే. ఎందుకంటే, కత్తి పట్టి నాలుగు కుత్తుకలు నరక్కుండా ఎవడూ వీరుడు కాలేదు. కత్తులు మరింత గట్టిగా పట్టుకుని, గొంతులు కోసే పనిలో ‘వృత్తి నిపుణుల’ని నిరూపించుకోకుండా ఎవరూ రాజులు కాలేదు. కత్తి పట్టడం, మనుషుల గొంతులు కోయడం చెడ్డ పని అయితే రాజులందరూ చెడ్డ వారే. దోచుకోడం చెడ్డ పని అయితే రాజులందరూ ప్రజలను దోచిన చెడుగులే.**
  -.—- స‌రిగ్గా ఇట్లాంటి నిజ‌మైన మాట‌ల్ని సోకాల్డు మేధావులు దాచిపెడుతున్నారు. ఎందుకో రాజు అనే ప‌దం కోట్ల మందిబానిస‌ల్ని త‌యారు చేసుకుంటుంది. మ‌న‌దంతా బానిసత్వం. రాజులంద‌రూ చెడ్డ‌వారేన‌ని ఎవ్వ‌రూ చెప్ప‌రు. ఇట్లాంటి ఆలోచింప‌చేసే వాక్యాలు పత్రికాధిప‌తులు కూడా రాయ‌రు. రాస్తే.. రాజు గుట్టు పోదూ!

  3.**గెలిచిన రాజు… మొదట వీరుడుగా తరువాత విష్ణువుగా (దైవాంశ సంభూతుడుగా) మన్నన పొందడం… సో కాల్డ్ బుద్దీజీవుల సుందర షడ్యంత్రం. దీని కోసమే పెద్ద పెద్ద పురాణాలు. వాటికి లేనిపోని పవిత్రాలు. దేవతలూ రాక్షసులంటూ మనుషుల మధ్య వేరుబంధాలు. ఎవడి పక్షానికి వాడి భట్రాజ కీర్తనలు.**
  ———- రాజు దైవాంశ సంభూతిడిగా చిత్రిస్తే.. అదే నిజ‌మ‌ని పాలోకావ‌టం జ‌న‌గొర్రెల ప‌నే. మీర‌న్న‌ట్లు ఎవ‌రికి తోచింది… అచ్చ‌రాలు వ‌చ్చినోడు.. ఏదేదో రాసుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఎట్లు తిరిగీ ఆయా కాలాల్లో మ‌నుషుల‌కు మాయ‌మాట‌లు చెప్పి.. బుద్ధి వికాసం క‌ల‌క్కుండా చేయ‌టమే వీళ్ల‌ప‌ని.
  4. స్వామ్యం అంటే స్వామి-తనం
  ——– అవును మ‌న‌ది జ‌న‌ఘ‌న ప్ర‌జాస్వామిత‌నం స‌ర్‌!

  ఏ స్థ‌ల‌, కాలాదుల‌కైనా వ‌ర్తించే వాక్యాల‌వి. కొన్ని మాట‌లు పిడిబాకులా గుండెల్లో దిగుతాయి. అట్ల‌నే ఇయ్యి కూడా. మొద్దు బారిన ఆలోచ‌న‌ల్ని సాన‌బ‌ట్టే ర‌చ‌న ఇది.
  ధ‌న్య‌వాదాలు స‌ర్‌
  రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి
  21.10.2019

  • డియర్‍ రాజావలి, మీ వ్యాఖ్య నాకు ‘దప్పిచే నటమట జెందు వానికి దివ్యాపగలో జల మబ్బినట్లు (దప్పికతో బాధ పడే వాడికి దేవగంగలో నీళ్లు దొరికినట్లు)” అనిపించింది, ‘ఏదో కనిపిట్టిన ఆనందం’తో ఉద్వేగపడి చెప్పినది చాల మందికి చేరలేదేమో, చేరింది నచ్చలేదేమో అని బాధేసింది. మీ వాక్యాలు ఆ బాధను తొలగించాయి. కొండంత బలమిచ్చాయి. మీ మాటల్లో సిమ పౌరుషం, సీమ ప్రేమ రెండూ వున్నాయి. చాల చాల కృతజ్ఞతలు

 • రాజ్యపు అవసరాన్ని తొలగించే మీ స్వప్నం సాకారం కావాలని కోరుకుంటున్నాను. స్వప్నాలకేం అడ్డుతెరల్లేవు కదా ? ఇక వీరుల సంగతి బాగానే చెప్పారు. ఆ వీరుని తయారుచేసిన ప్రజల్లోని దౌర్భల్యాల సంగతి చెప్పండి. డబ్బుకీ, వ్యసనాలకీ దేన్ని దేనికోసం తాకట్టు పెట్టేస్తున్నారు ? అందుక్కాదూ వీరత్వాలూ, వీరగంధాలు గుభాళిస్తోంది. హర్యానా, మహారాష్ట్ర, హుజూర్నగర్ లో కూడా వీరులే గెలుస్తారు. వీరత్వం రాజ్యాంగ హక్కండి ఎడిటర్ గారూ. మీ వీరభోజ్యార్ధం ఒక రకంగానే వినబడింది మీ సంపాదకీయంలో. మరో అర్ధం గురించి మీరు తక్కువ రాశారు. ఆ వీరులు దాడుల్లో, ఎన్కౌంటర్లలో, సమ్మెల్లో, సమస్యల్లో ఆవిరైపోతారు. వాళ్లకి గోడలమీద పాఠాలు రెడీగా ఉంటాయి. స్తూపాలు, స్మృతి చిహ్నాలు లేస్తాయి. పూలదండలు, దొంగ కన్నీళ్లు కురుస్తాయి. వాళ్ళు రొమాంటిక్ గా ఉంటే సైరాలు, జార్జిరెడ్డి సినిమాలూ అవుతారు. వీరత్వం వ్యాపారానికి పనికిరావాలి కదా ? ఈ రకం వీరులకి ప్రచారం, అబద్దం ఏ హానీ చేయలేవు. వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు. వాళ్ళ వీరత్వం రాజకీయం కానీ జీవిత విలువని తెలియజేస్తుంది. రాజకీయం జీవితాల్లోకి ప్రవేశించాకే కదా, వీరుల తలకాయలు కోట గుమ్మాలకి వేలాడాయి. ప్రజలు వాళ్ళలాగా వాళ్ళు ఉండగలగడం ఆయుధ ధారణ అని కూడా అని మీరే చెప్పారు కనుక, రాజుతనం పోయాక కూడా రాజ ఖడ్గం ఎక్కడికీ పోదు. రాజూతనానికి ప్రజలు కావలి కాస్తున్నంత వరకూ అదెక్కడికీ పోదు. నేను ప్రజల్ని ఏమీ అనలేను. వాళ్ళ జీవితాలలాంటివి. ముందు వాడి ఆకలికి అన్నం ముద్ద దొరికనంతకాలమూ వాడు బుద్ధిజీవుల ఆహారమే.

  ఎడిట్ బాగుంది. కవిత్వం పాళ్ళు ఎక్కువగా ఉంది. ఇంకాస్త స్ట్రైట్ గా చెప్పేయొచ్ఛేమో సార్. మీ భాష చాలా బాగుంది. ఎప్పుడూ బాగుంటుంది. మీ ఈ ఎడిట్ చదివితే నాకు చిరాకేసింది. కోపమొచ్చింది. అసహనం గా అనిపించింది. వీళ్ళొక వీరులూ, వీళ్ళదోక వీరత్వమూ. ఎం దౌర్భాగ్యం సార్ ?

  • థాంక్ఫ్సెలాట్ శ్రీరామ్! మన (మీ, నా) వచనంలో వున్న లిరిసిజం పొయెట్రీ కాదు. మీరు గమనించి వుంటారు, నా కవిత్వంలో సాధారణంగా లిరిసిజమ్ వుండదు. (‘అసాధారణం’ అయినప్పుడు లిరిసిజం (కూడా) వుంటుంది. ప్రాధమికంగా అసాధారణత్వమే కవిత్వం గనుక.) లిరిసిజమ్ పొయిట్రీ అనుకోడం ఫ్యూడల్ కాలాల మాట. నేను వచనంలోనే లిరికల్ గా వుండే మాటల్ని ఇష్టపడతాను. ఎప్పటి నుంచో నా శ్రీరామ్ కు నేను చెప్పాలకుంటున్న మాట ఇలా చెప్పేశానన్నమాట. 🙂 మీరన్నది నిజమే అబద్ధాలు, మోసాల (నెగటివ్) మాత్రమే కాదు, పాట, కవిత్వం, రెటరిక్ (పాజిటివ్) కూడా కత్తుల వంటివే, ‘రాజ్య’ సాధన సాధనాలే. రెండూ రాజకీయమే. మనం దేని కోసం పని చేస్తామనేది మన స్వేచ్ఛ (స్వ ఇచ్ఛ) థాంక్స్ వొన్స్ అగేన్.

   • థ్యాంక్యూ సర్. ఇంతకీ సాధారణసాధారణల్ని పక్కనబెడితే వచనం లో లిరిసిజం తప్పేం కాదు కదా ?

    • వచనంలో లిరిసిజం భలే బాగుంటుంది, శ్రీకాకుళ‍ం ప్రజ‍లు మాట్లాడుకున్నట్టు అందంగా. రావిశాస్రిలో, కారాలో, అప్పల్నాయుడిలో వ‍చన‍ లిరిసిజం భలే వుంటుంది కదూ.

 • న్నా న‌మ‌స్తే. మీ సంపాద‌కీయాన్ని రెండోసారి చ‌దివాను. సంపాద‌కీయం చ‌దివిన త‌ర్వాత నాలో క‌లిగిన అభిప్రాయాల‌ను నువ్వేమ‌నుకుంటావ‌నే అంశంతో సంబంధం లేకుండా, నేను ఏమ‌నుకుంటున్నానో నిజాయితీగా, నిర్భ‌యంగా రెండు మాట‌లు రాయాల‌నుకుంటున్నాను. రాజ్యం వీర‌భోజ్యం…అవును రాజ్యం వీర‌భోజ్య‌మే క‌దా. రాజ్యం, అధికారం చేస్తున్న అరాచ‌కాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేందుకు మీరు ఎంచుకున్న ర‌చ‌నా విధానం నాలాంటి పామ‌రుల‌కు అంత సులభంగా ఎక్కేదికాదు.

  నేను ముందే చెప్పిన‌ట్టు నిజాయితీగా, నిర్భ‌యంగా అని ఎందుక‌న్నానంటే…మీ సంపాద‌కీయం పండితుల‌కు మాత్ర‌మే సుల‌భంగా అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌డం అంటే నా అజ్ఞానాన్ని మీ ముందు ప్ర‌ద‌ర్శించ‌డ‌మే. ఏంన్నా రోంత నా లాంటి వాళ్ల‌ను కూడా దృష్టిలో ఉంచుకుని స‌ర‌ళంగా రాసి ఉంటే ఏమైతాది? ర‌స్తా అభిమానిగా ఈ మాత్రం నిష్టూర‌మాడే హ‌క్కు నాకు ఉంద‌నుకుంటున్నాను. మీరు సంపాద‌కీయాల‌ను కూడా ఫ‌జిల్‌గా మార్చ‌డం వ‌ల్ల మీరు ఏం రాశారో అర్థం చేసుకోలేక మేము ఏదో అభిప్రాయాన్ని రాసి ప‌డేసి న‌వ్వుల‌పాలు చేయాల‌నుకుంటున్నారా?

  అస‌లు న‌న్ను అడిగితే సందేహం లేదు రాజ్యం వీర‌భోజ్యం అనే పాయింట్ ద‌గ్గ‌రి నుంచి మొద‌లు పెట్టినా ఎలాంటి న‌ష్టం లేద‌నేది నా అభిప్రాయం. నువ్వు క‌త్తులు, తుపాకుల‌ను రాజుల దృష్టిలో నెగ‌టీవ్ కోణంలో చూపించావు. బాగానే ఉంది. చివ‌ర్లో ప్ర‌జ‌ల‌కు సొంత చేతులు, ఎత్తిన పిడికిళ్లే వాళ్ల క‌త్తులు, తుపాకులూ అని అన్నావు. గెలిచాక గెలుపుని నిల‌బెట్టుకోడానికి క‌త్తులు అవ‌స‌ర‌మే అని తేల్చేశావు. అంటే నాడు రాచ‌రిక వ్య‌వ‌స్థ‌లోనైనా, నేడు ప్ర‌జాస్వామ్య రాచ‌రిక స‌మాజంలోనైనా పాల‌కుల‌కు క‌త్తులు, తుపాకులు ఎంత అవ‌స‌ర‌మో, ప్ర‌జ‌లు తాము సాధించుకున్న స్వేచ్చాయుత స‌మాజాన్ని కాపాడుకోవాలంటే అవే అవ‌స‌ర‌మ‌ని తేల్చ‌డం న‌న్నెక్క‌డో గంద‌ర‌గోళ ప‌రుస్తోంది. ఏం క‌త్తులూ, తుపాకులూ లేకుండా మ‌న వ్య‌వ‌స్థ‌ను ప‌రిర‌క్షించుకునే వాతావ‌ర‌ణాన్ని సృష్టించుకోలేమా? ఎందుకు ఈ ప్ర‌శ్న అంటే క‌త్తులూ, తుపాకులూ చేతికొచ్చిన త‌ర్వాత మ‌నుషుల ఆలోచ‌నా విధానాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. ఆ ఆలోచ‌న ధోర‌ణులు వినాశ‌నానికి దారి తీస్తాయ‌నేది నా భ‌యం.

  ఈ రాజ్యాన్ని వీర‌భోజ్యంగా అనుభ‌విస్తున్న పాల‌న‌లో అడ‌గడుగునా ద‌గా, వంచ‌న‌, అణ‌చివేత‌కు గుర‌వుతున్న సామాన్యులు తాము అస‌లు ప్రజాస్వామ్యంలో ఉన్నామ‌నిగాని, త‌మ కోసం పాల‌న సాగిస్తున్నార‌నే విష‌యాన్ని ఎన్న‌డో మ‌ర‌చిపోయారు. త‌మ జీవితాలపై స్వారీ చేసే రౌతుల‌ను తామే ప్ర‌జాస్వామ్య‌మ‌నే ముసుగులో ఎన్నుకోవ‌డానికి మించిన విషాదం మ‌రొక‌టి ఉంటుందా?

  • రమణా! థాంక్యూ సో మచ్.
   రాజ్యం వున్నంత కాలం అది ప్రజా (సోషలిస్టు) రాజ్యమైనా, కేపిటలిస్టు రాజ్యమైనా అణిచివేత యంత్రాంగం (కత్తులు కటార్లు) లేకుండా వుండదు. రాజ్యమే లేని కాలం ఒకటి వొస్తుంది. దాని పేరు కమ్యూనిజం. అది మన కల. దానికి చాన్నాళ్ళు గడవాలి. వుద్యమాల రూపంలో, సాయుధపోరాటాల రూపంలో, రకరకాలుగా ప్రజలు తమ రాజ్యం కోసం తాము ప్రయత్నించకతప్పదు. ప్రయత్నిస్తారు. వితిన్ ది సిస్టమ్ క్రమ క్రమ మార్పులు కూడా పోరాటాలు లేకుండా జరగవు. ఎన్నికలు కూడా పోరాటమే. పోరాట రూపం ఏదైనా రాజ్యం వీర భోజ్యమే. దాన్ని సాదించాల్సింది పోరాటం ద్వారానే, దాన్ని నిలబెట్టుకోవాల్సింది కూడా పోరాటాల ద్వారానే.

   రాజ్యం వీరభోజ్యం అనేదాన్ని ఒక వాస్తవ విషయంగా.. సైంటిఫిక్ వాస్తవంగా కాకుండా… కేవలం నెగటివ్ గా తీసుకునే మన మైండ్ సెట్ వల్ల ప్రజాకీయంలో కూడా రాజ్యం వీరభోజ్యమే అని నేను చెప్పిన మాట పాఠకులకు చేరలేదేమో. అందుకే… ఇది పండిత చర్చ అనిపించి వుంటుంది. నువ్వన్నది నిజం, ఇలాంటి సమయాల్లో చమత్కారాల కన్న వివరణ ఎక్కువ అవసరం. ఈ విషయంలో నీ సలహాను మనస్సుకు పట్టించుకుంటాను.
   మరే, నువ్వు మొదట్లో అక్కరలేదని అనుకున్న మేటర్ అక్కర్లేదని నాకూ అనిపించి రచనను అప్లోడ్ చేసిన రెండో రోజు తీసేశాను. బిగిన్ంగ్ అబ్రప్ట్ అయ్యిందేమో అనిపించి రెండు రోజుల తరువాత మల్లి చేర్చాను. ఈ విషయంలో కూడా నీ సలహా సరైనది.
   ఇక ముందు కూడా సంపాదకీయాలు చదివి నిర్మొహమాటంగా వ్యాఖ్యానిస్తావు కదూ. ముందస్తు కృతజ్ఞతలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.