షార్ట్ సర్క్యూటవుతున్న
ప్రతిపక్ష వాదం?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్ష చేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఆలోచనేమిటంటే… గత తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదక కంపెనీలకు అధిక మొత్తంలో యూనిట్ ధర చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంది. అందుకే వాటిపై సమీక్ష జరపాల్సి వొచ్చిందని, సౌర, పవన విద్యుత్తుకు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడం వల్ల గత మూడేళ్లలో వార్షిక రెవెన్యూ లోటు కూడా పెరిగి, రూ.3 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లకు చేరిందని ప్రభుత్వం పేర్కొంది. కనీసం 5 నుంచి 11 శాతం పునరుత్పాదక ఇంధనం తప్పనిసరిగా వినియోగించాలన్న నిబంధనను సాకుగా చూపి గత ప్రభుత్వం 23 శాతం మేరకు ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి, ఖజానాపై మోయలేని భారం మోపిందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్దించడం లేదు. కేవలం అవినీతి జరిగిందన్న అనుమానాలతో విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. పీపీఏలను ఎందుకు సమీక్షించాలో ఏపీ ప్రభుత్వం వివరించింది. జూలైలో గత ప్రభుత్వం అత్యధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు మూడేళ్లలో రూ.5,500 కోట్ల నష్టం వాటిల్లిందని వివరణలో పేర్కొన్నారు. దాన్ని సరిదిద్దడానికి తక్షణం పరిష్కార చర్యలు తీసుకోవాల్సి వస్తోందంటూ కేంద్రానికి లేఖ రాశారు. తక్కువ ధరలోనే విద్యుత్తు అందుబాటులో ఉండగా, అవసరం లేకపోయినా, ఎక్కువ ధర చెల్లించి పునరుత్పాదక ఇంధనం కొనడంతో డిస్కంలు (విధ్యుత్తు పంపిణీ సంస్థలు) దివాళా తీసే పరిస్థితి వచ్చిందని అందులో పేర్కొన్నారు. ఈ లేఖకు కేంద్ర విద్యుత్ శాఖ సెప్టంబర్ లో సమాధానం ఇచ్చింది. 

“మొత్తం పవన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 3,494 మెగావాట్లు కాగా, వీటిలో 63 శాతం ఒప్పందాలను అత్యధిక ధరకు గ్రీన్‌కో, రెన్యూ, మైత్రా కంపెనీలతో చేసుకుని వాటికి భారీగా లబ్ధి కలిగించాల”ని అన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పులతో ఇంధన సామర్థ్యం బాగా పెరిగి టారిఫ్‌ తగ్గుతుంది. అయితే రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజి ఆబ్లిగేషన్స్‌ (ఆర్‌పీపీవో)లో పేర్కొన్నవాటికి విరుద్దంగా ఇంధన సరఫరా, డిమాండ్‌తో సంబంధం లేకుండా ఎక్కువ మొత్తానికి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకోవడం తీవ్రమైన నేరం. దీర్ఘకాల ఒప్పందం ప్రకారం థర్మల్‌ విద్యుత్తు కిలోవాట్‌ పర్‌ అవర్‌ (యూనిట్‌)కు రూ.4.2 కు అందుబాటులో ఉంటే పవన విద్యుత్తును యూనిట్‌కు అత్యధికంగా రూ.4.84 చెల్లించారు. దీనికి ఐటీ, ఎలక్ట్రిసిటీ సెస్ అదనంగా కలిపితే రూ.5.94కి చేరుతుంది, దీని వల్ల ప్రైవేటు సంస్థలకు యూనిట్‌కు రూ.1.74 అధికంగా లబ్ధి చేకూరింది. పవన విద్యుత్తు ప్రస్తుతం యూనిట్‌ రూ.2 నుంచి రూ.3కే లభిస్తోంది. సోలార్ విద్యుత్తు యూనిట్‌ రూ.2 నుంచి రూ.3 మధ్యలో లభిస్తోంది. రాజస్థాన్‌లో ఎస్‌ఈసీఐ ( సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) రూ.2.44కి బిడ్డింగ్‌ వేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం  ఆర్‌పీపీవోలకు మించి రూ.6.99కి కొనుగోలు చేశారు. అన్ని పన్నులూ కలిపితే రూ.8.09కి చేరుతుంది కాబట్టి  థర్మల్‌ విద్యుత్తుతో పోల్చితే ఈ సంస్థలకు అదనంగా యూనిట్‌కు రూ.3.89 కట్టబెట్టినట్టవుతుంది .అందుకే గత ప్రభుత్వం ఎక్కువ ధరలకు విద్యుత్తు కొనుగోలు చేయడంతో ఏటా రూ.3 వేల కోట్ల నష్టం వస్తోంది. ప్రస్తుతం తగ్గిన ధరలతో పోల్చితే రూ.4వేల కోట్లకు చేరుతుంది. తక్కువలో తక్కువగా గత ప్రభుత్వ నిర్ణయాలతో మూడేళ్లలో ఖజానాకు రూ.5,500 కోట్ల నష్టం జరుగనుంది, ఈ ఒప్పందాలు 22 ఏళ్లపాటు కొనసాగనున్నాయి కాబట్టి ప్రతి యేటా ఆ నష్టాన్ని బరించాల్సి వుంటుంది.”

మాజీ ముఖ్యమంత్రి వాదన ఇలా వుంది “క‌ర్ణాట‌క‌లో జగన్ సొంత కంపెనీ సండూర్ పవర్ అధిక ధరలకు విద్యుత్ అమ్మ‌కాలు సాగిస్తుండగా, ఏపీలో పీపీఏలను ఆయన ఎలా తప్పుబడతారు. సౌర విద్యుత్ రేడియేష‌న్ పైనా, పవన విద్యుత్ విండ్ స్పీడ్ పైనా ధరలు ఆధార‌ప‌డి ఉంటాయి, వాటిని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోకుండా త‌మిళ‌నాడు, గుజ‌రాత్ లెక్క‌లు చెప్ప‌డం స‌మంజ‌సం కాదు. తమ హయాంలో పీపీఏల‌ను త‌క్కువ ధ‌ర‌కు చేసుకునేలానే ప్ర‌య‌త్నించాం, రెగ్యులేట‌రీ క‌మిష‌న్ ఆదేశాల‌తోనే ఒప్పందాలు జ‌రిగాయి.”

విద్యుత్ కంపెనీల వాద‌న ఇది..

“పీపీఏల పునఃస‌మీక్ష దిశగా ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోను మేము హైకోర్ట్ లో స‌వాల్ చేస్తున్నాం. పెద్ద మొత్తాలు వెచ్చించి విద్యుత్ ఉత్పాద‌న యూనిట్లు ఏర్పాటు చేశాం. చ‌ట్ట‌బ‌ద్ధంగా పీపీఏలు చేసుకున్నాం. మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే ఏపీలోనే టారిఫ్ త‌క్కువ‌గా ఉంది. అయినా, ఇంకా త‌గ్గించ‌క‌పోతే ఒప్పందాలు ర‌ద్దు చేసుకుంటామ‌ని ఏపీఎస్పీడీసీఎల్ బెదిరిస్తోంది.” అంటూ విద్యుత్ ఉత్పాదక కంపెనీలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి.

ఇది స్థూలంగా విషయం. ఇప్పుడు హైకోర్టు ఈ వ్యవహారం మొత్తం చక్కబడే వరుకు యూనిట్ ధర 2.44 రూపాయలు మాత్రమే చెల్లించాలనీ, కంపెనీలు వారి వాదనలను ఏపిఈఆర్సీ ఎదుటే చెప్పుకోవాలని తీర్పు ఇచ్చి వారి దూకుడుకు కళ్లెం వేసింది. యీ విషయంలో రివ్యూ వద్దనీ, ఒప్పందాలు బాగానే ఉన్నాయనీ; అలా చేస్తే కొత్త పారిశ్రామిక కంపెనీలు ఏవీ రాష్ట్రానికి రావని పలికిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ అంశాన్ని ఇక రాజకీయం చేయకుండా తమ ప్రభుత్వం ఆనాడు ఎక్కువ ధరలకు కరెంటును ఎందుకు కొనవలిసి వచ్చిందో వివరిస్తే బావుంటుంది. పైగా దాని వల్ల ప్రభుత్వం అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి మాటలకు జవాబు చెప్పినట్లవుతుంది. కానీ అలా ఎన్నటికీ చేయరాయన. నిజంగా జగన్మోహన్ రెడ్డి తిరగతోడుతున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో స్వలాభం ఉందేమో అనుకునే వారి ఆలోచనలు ప్రస్తుతానికి అనుమానాలు, ఆరోపణలు మాత్రమే. నిజానిజాలు ముందే నిర్ణయిస్తే ఎలా? వేచి చూడాలి.  కాసేపు అలా అనుకునే వారిలాగానే ఆలోచిద్దాం. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పూర్తిగా నిర్మాణ దశలో ఉంది. అన్ని రకాల కార్యాలయాలు , పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు , ఇంకా ఇతర కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నిర్మాణ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలకు ఇది మహర్దశలో మొదటి పాదం. గత ప్రభుత్వం పోలవరంలోనూ, రాజధాని నిర్మాణం లోనూ ఎన్ని దేశాల నుంచి ఎన్ని కంపెనీలను తీసుకొచ్చిందీ, వారి పనితనం కూడా చూశాం. ఏ మేరకు పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంచనాలు దాటిందో కూడా చూశాం. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వంద కోట్లు దాటిన ప్రతి పనికి జ్యూడిషియల్ రివ్యూ నిర్వహిస్తామని అంటున్నాడు. అందునా, ప్రజలు కూడా తమ తమ వాదాలు చెప్పుకోవచ్చంట. ఇదేదో కొత్తగా, వింతగా లేదూ. ఐనా చిన్న అనుమానం. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ గెజిటీయర్ కు సంబంధించిన వెబ్సైట్ లో ప్రచురితం కాని 800 చీకటి జీవోల వుదంతానికీ, యీ జ్యూడిషియల్ రివ్యూకూ తేడా కొంచెం కూడా కనిపించడం లేదా? దొంగతనం చేయాలనుకునేవాడు పారదర్శక వాతావరణం కోరుకుంటాడా? 

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.