మరీ మంచితనం మంచిది కాదేమో!

మంచివాడు అనిపించుకోవాలనుకోవడం చాల ప్రమాదకారమయిన జబ్బు. మామూలు వ్యక్తులకు అలాంటి జబ్బు ఉంటే మహా అయితే వారి ఆస్తులు పోగొట్టుకుంటారు; కానీ అదే రాష్ట్రాన్నో లేక దేశాన్నో పాలించే పాలకులకు అలాంటి జబ్బు ఉంటే – దేశ/రాష్ట్ర ఆర్థికవ్యవస్థ, భవిష్యత్తు నాశనమ్వుతాయి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోందో చూడండి – మీరు ఏదైనా కావాలని అడిగారా, పర్లేదు అడిగినదానికంటే ఎక్కువే ఇస్తాడు. మీరు ఏమీ అడగలేదా లేదా ఏమి అడగాలో అర్థం కావటం లేదా? ఏం పర్లేదు – ఆయనే ఏదో ఒకటి, మీరు ఆశించని, ఊహించనిది ఇస్తాడు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి. విడిపోయాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కష్టాల్లో ఉండటమే కాక – చంద్రబాబు ఆడంబరాలకు, ప్రారంభోత్సవాలకు, చార్టర్డ్ ఫ్లైట్లకు విచ్చలవిడిగా ఖర్చు చేయడంతో రాష్ట్రం దివాళా స్థాయికి చేరింది అని అందరం బాధపడ్డాం. ఇలాంటి పరిస్థితిని నూతన ముఖ్యమంత్రి, అనుభవం లేని వ్యక్తి అయినా జగన్ ఎలా సంభాలిస్తాడో అని భయపడ్డాం. ఇపుడు చూస్తుంటే అడగడమే ఆలస్యం అన్నట్టు అడిగినవారందరికి అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చేస్తున్నాడు; అడగనివారికి కూడా ఏదో ఒకటి ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు ముగిసేనాటికి ఖజానా ఖాళీ అని, ఉద్యోగులకు జూన్ నెలనుండి జీతాలు ఎలా ఇస్తారో చూడాలని అన్నారు. జీతాల గురించి ఇప్పటివరకూ సమస్య తలెత్తినట్టు లేదు. వరాల జల్లు ఆగలేదు. మరి, ఖజానా ఖాళీ అనేది అవాస్తవమా లేక జగన్ వద్ద ఏమైనా డబ్బులు సృష్టించే మంత్రదండం ఏమైనా ఉందా? 

కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాక జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులగురించి ఇవాళ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అవినీతి ఆరోపణలపై పలు కేసులు, నిర్బంధం, సాక్ష్యులను ప్రభావితం చేయగలరనే ఆరోపణలపై దాదాపు సంవత్సరంన్నర కాలం నిర్బంధించటం… అందరికీ తెలిసినవే. అప్పట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన ధీరుడుగా పేరు వచ్చినప్పటికీ – ఇవి జగన్ కు నెగటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన అంశాలు కూడా. హైదరాబాద్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచపటంపై పెట్టిన మహా దార్శనికుడని చంద్రబాబు గురించి పెద్ద పాజిటివ్ ఇంప్రెషన్ ను ఎలా సృష్టించారో అలాగే జగన్ లక్ష కోట్ల అవినీతి చేశాడు అన్న ఒక నెగటివ్ ఇంప్రెషన్ సక్సెఫుల్ గా ప్రచారం చేశారు. ఆ విపరీత ప్రచారం వల్లనే 2014 లో తృటిలో తాను అధికారం కోల్పోయానని జగన్ లో ఒక దృఢమైన అభిప్రాయం ఏర్పడినట్టుంది. ఇపుడు ఆయన ప్రకటిస్తున్న వరాలు గమనిస్తే తనమీదున్న నెగటివ్ ఇమేజ్ ని తొలగించుకోవటంతో పాటు; క్షేత్రస్థాయినుండి పార్టీకి నాయకులతో సంబంధం లేకుండా బలమైన, స్థిరమైన క్యాడర్ ను నిర్మించాలనే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికి కూడా పార్టీకి జగన్ అనే బలం తప్ప – చాలా చోట్ల బలమైన క్యాడర్ లేదు. నాయకులతో నిమిత్తం లేకుండా, పార్టీకి అండగా ఉండగలిగే క్యాడర్ ని నిర్మించాల్సిన అవసరం ఉన్న మాట నిజం.

ఇవన్నీ పార్టీ పరంగా వైఎస్సార్సీపీకి, వ్యక్తిగతంగా జగన్ కు అద్భుతమైన ప్రయోజనకారి అంశాలు అనడంలో సందేహం లేదు. కానీ, అదే సమయంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై ఇవి చూపే ప్రభావం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. సంక్షేమ పథకాలను ఒకసారి ప్రకటించాక, వెనక్కు తీసుకునే వీలుండదు. రేప్పొద్దున ప్రభుత్వం మారినా ఇటువంటి పథకాల్ని తీసేస్తే, ఇంతకంటే పెద్ద పథకాలు ప్రకటించాలి లేదా వీటిని కొనసాగించాలి. దాంతో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం ప్రతి ప్రభుత్వ హయాంలో ఆనవాయితీగా అవుతుంది. ఇపుడు జరుగుతున్నది అదే. 2004 లో ప్రజల అవసరమూ, తన రాజకీయ అవసరార్థమూ వైఎస్ ప్రకటించిన సంక్షేమపథకాలను చూసి; తన మీద వ్యతిరేకతతో కాక సంక్షేమపథకాల మీద ఆశతో జనాలు వైఎస్ ను గెలిపించారన్న భావనతో చంద్రబాబు తనవీ కొన్ని  సంక్షేమపథకాలు ప్రకటిం చారు. ప్రకటించడంలో చూపిన శ్రద్ధ అమలులో చూపకపోవడంతో జనాలు ఆయన్ను సాగనంపారు. చంద్రబాబు వంటి ‘అనుభవశాలి’ వైఫల్యం చెందినచోట, తనను నమ్మి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొవాలన్న తపన జగన్ లో కనబడుతోంది. ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్ధికవ్యవస్థకు ఇవన్నీ మరింత దెబ్బతీసే అంశాలే. ముందుగా ఆర్థికవ్యవస్థను కాస్త దారిలోకి తెచ్చాక, ఈ వరాలప్రకటన వంటి అదనపు ఆర్భాటాలకు పోయున్నా ‘అర్థ’ముండేది. ఈ నాలుగునెలల పాలనాకాలంలో ప్రకటించిన వరాలను చూస్తే, ఇక ఎన్నికల సంవత్సరంలో ఎన్ని ప్రకటించాల్సి వస్తుందో, వాటి వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎంత భారం పడుతుందో చెప్పలేం. వైఎస్సార్ ను ఉద్దేశించి ఆర్థిక మంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య ఒకమాట అనేవారు ‘ఆయన చేతికి ఎముక లేకుండా  దానం చేసే రీతిలో, వాటికి నిధులు సమకూర్చటానికి ఆర్థికమంత్రిగా నానా అగచాట్లు పడాల్సి వచ్చేది’ అని. ఇపుడు బుగ్గన సమర్థవంతమైన ఆర్థికమంత్రిగానే కనబడుతున్నప్పటికీ, రోశయ్య గారి స్థాయి అవునో కాదో ఇంకా చూడాల్సి వుంది. పరిస్థితులు రోశయ్య ఎదుర్కొన్న వాటికంటే క్లిష్టమైనవి. రాష్ట్రం స్వావలంబన సాధించటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉండగా ముఖ్యమంత్రిగారు వరాల జల్లులు కురిపించే మూడ్ లోనే ఉన్నారు. ఆర్థికవ్యవస్థ స్వావలంబన దిశగా చర్యలు చేపట్టాలి. ప్రత్యేకించి వ్యవసాయ, పారిశ్రామిక (ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు) రంగాలకు ఊపునిచ్చే చర్యలు చేపదితే ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే అవకాశం ఉంది. ఇపుడు జగన్ గారు ప్రకటిస్తున్న పథకాలు, వివిధ విభాగాల ఉద్యోగులకు జీతాలు పెంచుతున్న తీరు, ఇస్తున్న ఉద్యోగాల సంఖ్యా – ఇలాంటివన్నీ ఆర్థికవ్యవస్థకు మరింత భారంగా పరిణమించేవే.  

పరిపాలనలో నిర్లక్ష్య ధోరణి కనబడుతోంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకురావడంలో జాప్యం జరిగింది, కానీ జగన్ నుండి ఎటువంటి ప్రకటన లేదు. పలు విషయాలలో. జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ ఇంకా వివిధ విభాగాలపై అవసరమైన పట్టు సాధించినట్టు కనబడదు; ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉండాల్సిన్న సమన్వయం ఏర్పరచాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు అనిపించదు; ప్రభుత్వం తరఫున బలంగా మాట్లాడవలసిన వ్యక్తులు కొందరు ఉండాలి. చేసేపనికి తగిన ప్రచారం, ప్రాముఖ్యత కల్పించినట్టు లేదు (మరీ చంద్రబాబు లా విపరీతమైన ప్రచార యావ లేకపోయినా, కనీస ప్రచారం అవసరమే). పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సరియైన సమన్వయకర్త లేకవడం పెద్దలోటు. విజయసాయి రెడ్డి జగన్ తర్వాత అన్నీ తానేగా అగుపిస్తున్నారు. ప్రత్యేకించి మొదటి నుండి జగన్ తో పాటు అనేక కష్టనష్టాలకోర్చి పయనించిన అంబటి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వంటివారిని ప్రభుత్వ పదవులకంటే – పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలుగా ఉపయోగించుకుంటే మేలేమో

మరో విషయం: అధికారుల పట్ల, అధికారులతో జగన్ వ్యవహారశైలి కూడా రోజురోజుకు ప్రశ్నర్థకంగా తయారవుతోంది. అధికారులకు స్వేచ్ఛనివ్వడం మంచిదే, కానీ అధికారులు కొన్ని దశాబ్దాలుగా తమపై రాజకీయ పెత్తనానికి అలవాటు పడిపోయారు. ఉన్నట్టుండి అంత ఉదారంగా స్వేచ్ఛనిస్తే భరించలేరు, ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోగల అవకాశం ఉంది – అలాగే తప్పులు జరిగే అవకాశం అధికం. సరిగా అలాంటి అవకాశం కోసమే ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నారు. అన్ని తలుపులు మూసుక్కూచున్నా లోపలకు దూరాలని ప్రయత్నించే అతితెలివి ప్రత్యర్థులతో పోరాడుతూ – తలుపులన్నీ తెరిచి కూచుంటే ఎలా? ప్రత్యేకించి అధికారులను అదుపు చేస్తూ, అజమాయిషీ చెయ్యడం ఖచ్చితంగా అవసరం. కనీసం స్వేచ్ఛనివ్వడంలో జగన్ గారి ఉద్దేశం అర్థమయ్యేంత వరకైనా. 

జగన్ అనేకమార్లు చెప్పారు – దేవుడి గదిలో, వైఎస్ ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకునేలా పాలించాలనుకుంటున్నా అని. ఇపుడు చేస్తున్న పనులన్నీ ఆ ఉద్దేశంతో చేస్తున్నవిగానే కనబడుతున్నాయి. మంచివాడు అనిపించుకోవాలనుకోవడం, ప్రజలకు మంచి చేయాలనుకోవడం మంచిదే – అదే సమయంలో ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టి, భవిష్యత్తు పట్ల భరోసాను కల్పించాల్సిన బృహత్తర బాధ్యత కూడా ఆయనపై ఉంది. ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పితే – హామీల అమలు అనేది కాగితాలమీద రాతగానే మిగిలి, ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. గాంధీగారిని సింపుల్ గా ఉంచటానికి చాలా ఖర్చయ్యేదని… సరోజినీ నాయుడు ఒక సందర్భంలో చమత్కరించారు. ఇపుడు జగన్ మంచివాడు అనిపించుకోవడం కూడా అలాంటి వ్యవహారం కాగూడదు. 

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

2 comments

  • ఎన్నికల నాటికి ఇంకెన్ని వరాలు ఇస్తారో…

    అనే మాట అవసరం లేదు… 2009 ఎన్నికలకు YSR కొత్తగా ఇచ్చిన హామీలు ఏమి లేవు… ఉన్న పధకాలు సక్రమంగా అమలు చేస్తాం అన్నారు… మళ్ళీ ప్రజలు గెలిపించారు…

    జగన్ కూడా అంతే

  • Kalugotla గారు, entha aapukundamanna aapukolekapoyaru adhenandi mee abhimanam ఆన్ వైస్సార్/జగన్…జస్ట్ కిద్దింగ్

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.