అమెరికన్ సమాజానికి
అద్దం: జోకర్

.ప్రతీ సమాజంలో కొంత మంది ఉంటారు. వాళ్ళు ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించరు, కానీ అందరూ వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకు వారి సొంత అస్తిత్వం గురించిన అవగాహన కూడా ఉండదు. ఈ ప్రపంచంలో తామూ బతుకుతున్నామనే స్పృహ ఉండదు. వాళ్ళు సమాజం నుంచి ఏదీ కోరుకోరు, ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఇచ్చేది కూడా ఏదీ ఉండదు. తమ కష్టాలను చెప్పుకుందామంటే వింటున్నట్టు అనిపించే వాళ్ళు తప్ప నిజంగా వినే వాళ్ళు ఎవరూ ఉండరు.  కానీ వాళ్ళకు కొంత వెచ్చదనం కావాలి. కొంత ప్రేమ కావాలి. కొంత గుర్తింపు కావాలి. ప్రపంచంలో ఇలాంటి వాళ్లు ఎందరో ఉంటారు. వాళ్ళల్లో ఒక్కడే ఆర్థర్ ఫ్లెక్. అతడు చిన్నతనంలో అబ్యూజ్ కు గురి అయినవాడు. అతడి తల్లి అందరు తల్లులలాగే అతడికి ఓ విషయం చెబుతుంది. అతడి జీవితానికి ఓ పర్పస్ ఉందని. ప్రపంచానికి నవ్వునూ ఆనందాన్నీ పంచి‌ ఇవ్వడమే జీవిత పరమార్థమని చెబుతుంది. ఎప్పుడూ నవ్వుతూ సంతోషకరమైన ముఖాన్ని కలిగి ఉండమని చెబుతుంది. అందుకే అతడు జోకర్ అవుదామని అనుకుంటాడు. కానీ అతడి చుట్టూ పరుచుకుని ఉన్న బోథం నగర జీవితం అతడిని అణచివేస్తుంది. అతడికి తన జీవితం ఎంత మాత్రం భరించలేనిదని తెలుస్తుంది. జీవితం కంటే మరణమే‌ ఎక్కువ విలులవైనదిగా తోస్తుంది.  ఉనికి లేని జీవితాన్ని జీవించడంలోని ట్రాజెడీ అతడికి “ఫక్కింగ్ జోక్” లాగా కనిపిస్తుంది. 

అతడికి ఒక మానసిక జబ్బు ఉంటుంది. Pseudo Bulbar Affect. సంతోషం వచ్చినా ఏడుపు వచ్చినా ఆ ఎమోషన్ ని ప్రాసెస్ చేసి సరైన రీతిలో express చేసే శక్తిని అతడి బ్రెయిన్ కోల్పోతుంది. దానివలన ఎమోషన్ కు తగ్గట్టు కాకుండా inappropriate response to emotion వలన తనను తాను కంట్రోల్ చేసుకోలేనంతగా నవ్వడం మొదలవుతుంది. అతడికి ఈ జబ్బును ప్రసాదించినది మరెవరో కాదు, అతడిని నవ్వనీయని ఈ సమాజమే. Abused child నుంచి marginalised lone adult గా ఎదిగిన క్రమం అతడిని  ఈ సమాజానికి దూరంగా తనదైన ప్రత్యేక లోకంలోకి నెట్టివేస్తుంది. సమాజంలోనే ఉంటూ సమాజంలో లేనట్టే బతికేవారు, తమ ఉనికి ఆనవాలు లేనివారు, ఈ సమాజంలో తమ ఉనికి ని నిలుపుకోవాలని తపించేవారూ అచ్చం ఆర్థర్ లాగే ఉంటారు అనిపిస్తుంది. సంతోషమే లేని జీవితం, సమాజపు వికృత వాస్తవికతను అర్థం చేసుకోలేనితనం, తనను ఒక mediocre joker గా మారుస్తుంది. అందుకే రోజూ ఏదో ఒకచోట అపహాస్యానికి గురిచేస్తూ అతడిని ఒక మానసిక రోగిగా మార్చేస్తుంది ఈ సమాజం. జీవితంలో నవ్వే లేనివాడు అందరినీ నవ్వించగలిగే జోకర్ గా మారాలనుకోవడమే నిజమైన ట్రాజెడీ. అతడి నవ్వు ఈ సమాజాన్ని ఆ రోతనీ చూసి నవ్వినట్టు ఉంటుంది. అతడి మానసిక జబ్బు ఈ సమాజం కలిగించిన ఒత్తిడిలాగా ఉంటుంది. కానీ, అతడికి స్పష్టంగా తెలిసిన విషయమేమంటే – ఈ సమాజం ఏ మానసిక రోగినీ, మానసిక రోగిలా ప్రవర్తించకూడదని సమాజం ఒప్పుకున్న పద్దతిలో డీసెంట్ గా ప్రవర్తించాలనీ కోరుకుంటుంది అని. అందుకే అది నిర్దేశిస్తుంది. శాసిస్తుంది. ఏది మంచో ఏది చెడో..ఎలా ప్రవర్తించాలో ఎలా కూడదో, చివరికి ఏది జోకో ఏది కాదో కూడా సమాజమే నిర్దేశిస్తుంది. అందుకే అది మానసిక రోగులను కౌన్సిలింగ్ తీసుకోమంటుంది. మందులు వేసుకోమంటుంది. 

ఐతే, రోజు రోజుకీ పెరుగుతున్న ఖర్చులు, తరుగుతున్న జీవన ప్రమాణాలు, నిరుద్యోగం, ఆకలి బాధ అంతా కలిసి, మందులు కొనుక్కుని ఆరోగ్యంగా ఉండగలిగే హక్కును, జీవన మాధుర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. అదే సమయంలో ఆర్థర్ ఉద్యోగం పోతుంది. అమెరికా లో మారిన ప్రభుత్వాలు మెడికైడ్ పై ఆంక్షలు విధించాక ఆ రూల్స్ ప్రకారం నిరుద్యోగులకు ఇన్స్యూరెన్స్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. అమెరికాలో జాబ్ కోల్పోవడం అంటే కేవలం జీవనభృతి కోల్పోవడం మాత్రమే కాదు, తన మానసిక జబ్బును మరింత తీవ్రతరం చేసుకోవడం కూడా. ఇటువంటి సమాజంలో అతడికి ఉన్న ఏకైక ఊరట అతడి మెదడులో అతడి ఊహల్లో మాత్రమే నివసించే అతడి ప్రియురాలు. ఒక వ్యక్తి ఒక హాల్యూసినేషన్లో తప్ప మరెక్కడా సంతోషంగా లేనితనం నిజంగా భయంకరమైనది. ఐతే, ఒక సందర్భంలో ఒక స్త్రీ ని లోకల్ ట్రైన్ లో ముగ్గురు కుర్రాళ్ళు బుల్లీ చేయడం చూస్తాడు ఆర్థర్. ఆ బాధను తట్టుకోలేక బిగ్గరగా నవ్వుతాడు. ఆ కుర్రాళ్ళు ఆర్థర్ నవ్వుకు కారణం కనుక్కోలేక అతడిని హింసిస్తారు. అప్పుడు సడెన్ గా ఆర్థర్ తన దగ్గరున్న పిస్టల్ తో ఆ ముగ్గురినీ కాల్చి చంపేస్తాడు. అతడు మరింత లోతుగా కష్టాల్లోకి కూరుకుపోవడం మొదలౌతుంది. కానీ ఆ తుపాకీ ఓ ధైర్యాన్ని ఇస్తుంది. అతడు ఇక ఏమాత్రం బాధ పడేది లేదని తెలుసుకుంటాడు. ఇంతకాలం ఎంత నవ్వించినా తనను గుర్తించని సమాజం హత్యలు చేయడం వలన గుర్తించిందని తెలుసుకుంటాడు. కానీ అప్పుడే అతడి పర్సనల్ లైఫ్ లో తాను ఎవరికీ ఏమి కానని తనకు ఉనికే లేదని తెలుసుకుంటాడు. ‘”తనవాళ్ళు”‘ అని తాను భ్రమిస్తున్న ముసలి తల్లిని, మెదడులో నివసించే ప్రియురాలిని చంపేస్తాడు.

ఇక అతడికి మిగిలి ఉన్నది ఒక్కటే…తాను జోకర్ ని అనిపించుకోవడం. తను ఇష్టంగా చూసే ఒక కామెడీషోలో తాను “జోకర్’ అని ఆ షో ప్రెజెంటర్ ముర్రే చేత బుల్లీ చేయబడ్డాడు కాబట్టి అదే కామెడీ షోలో తన ఉనికిని తెలియజేయడం. ఏ సమాజంలో కామెడీ ఆబ్జెక్టిఫై అయి ఒక group of people ని తక్కువ చేసి మాట్లాడుతుందో, బుల్లీ చేస్తుందో, సమాజంలో జరిగే ఏ హింసనైనా వీళ్ళనే బాధ్యులను చేస్తుందో, ఏలికలు ఎవరిగానైతే పుట్టకూడదని చెబుతుంటారో, ఎవరి గురించైతే నిర్భయంగా, ఆలోచనా రహితంగా కార్నర్ చేస్తూ మాట్లాడగలరో వాళ్ళందరూ ఒక్క ఆర్థర్ గొంతుకతో మాట్లాడటం మొదలు పెడతారు. మానసికంగా జబ్బుపడిన ఆర్థర్ లాంటి వాళ్ళను ఒక చెత్తలా భావించి డస్ట్ బిన్ లో వేయాలనుకునే సమాజం, వాళ్ళని రోజు రోజుకీ క్షీణింపజేస్తూ, అణగదొక్కుతూ మరింత మానసిక ఒత్తిడికి లోను చేస్తూ వాళ్ళనుంచి decent behaviour ని మర్యాద పూర్వకమైన కామెడీని కోరుకునే సమాజం అంటే ఆర్థర్ కి కోపం. కసి. ఏ క్షణంలోనైతే ఆర్థర్ సమాజం తన వంటి మనుషులను పట్టించుకోకుండా ధనవంతులు కోరుకునే ఈ ముసుగు గౌరవప్రద కామెడీని అందించే ముర్రేని అదే షోలో కాల్చి చంపేస్తాడో..ఆర్థర్ వంటి అశేష ప్రజానీకానికి ఒక ధైర్యం వస్తుంది. గోథం నగరం అతలాకుతలం ఔతుంది. నగర మేయర్ సతీ సమేతంగా కాల్చబడతాడు. అతడి ఆరేళ్ళ కొడుకు ఆ శవాల నడుమ ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఆ chaos మధ్యన ఆర్థర్ ఒక “జోకర్” లాగా కనిపించే necessary evil లాగా లేచి నిలబడతాడు.

నా దృష్టిలో జోకర్ సినిమా ఒక పొలిటికల్ సినిమా. కోర్ట్ జెస్టర్ వంటి కామెడీ పాత్రల ద్వారానే రాజ్యంలో అధికారులకు చెప్పగలిగింది చెప్పే విధానం షేక్స్పియర్ కాలం నుండీ ఉంది. ఐతే ఇది కామెడీగా కనిపించే ట్రాజెడీ సినిమా. ఇది సమాజపు ట్రాజెడీ. అమెరికాలో అధికారంలో ఉండే అధ్యక్షుడి చర్యల వలన సమాజం రోజు రోజుకీ ఏమైపోతుందో ఎలా పతనం చెందుతుందో మార్జినలైజ్డ్ పీపుల్ ఎలా టార్గెట్ చేయబడుతూ, బుల్లీ చేయబడుతున్నారో..వాళ్ళు ఎలా మానసిక రోగులుగా మారుతున్నారో అదంతా ఒక అంతర్లీన అంశంగా చూపబడింది. నిర్లక్ష్యం చేయబడ్డవారిని ఇంకా నిర్లక్ష్యం చేస్తే అది ఎట్లా rise of evil గా మారుతుందో ఒక హెచ్చరికగా చూపబడింది. చాలా మంది ఆక్షేపిస్తున్నట్టు ఇందులో హింసను గ్లోరిఫై చేయడం ఏమీలేదు. చివరిలో ఆర్థర్ ఒక ఐకాన్ గా లేచి నిలబడటం ఒక సింబాలిక్ హెచ్చరిక. ఒక సమాజానికి పట్టిన జాత్యాహంకార క్యాపిటలిస్ట్ జాడ్యాన్ని మొత్తాన్నీ ఒక కథలో ఇమిడ్చి ఒక దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు. ఆర్థర్ ఫ్లెక్ గా వాక్విన్ ఫీనిక్స్ నటనగానీ, సినిమాటోగ్రఫీ గానీ, బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ గానీ ఈ సినిమాను ఉత్తమమైన సినిమాల స్థాయిలో నిలబెట్టాయి. ఫీనిక్స్ నటన మనల్ని వెంటాడుతుంది.  Todd Philips దర్శకత్వ ప్రతిభ ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. నవరసాలను ముఖంలో పలికించి ప్రేక్షకుల మనసులను దోచుకున్న వాక్విన్ ఫీనిక్స్ కి ఆస్కార్ అవార్డు వస్తే ఆ అవార్డుకు కూడా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. రావాలని కోరుకుంటూ..

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

13 comments

 • అన్నయ్య చాలా అద్బుతంగా విశ్లేచించారు ఆర్థర్ తనకు ఉన్న మానసిక జబ్బు నుండి బయటపడి తను కూడా ఒక సామాన్యుడి లా తన జీవితాన్ని గడపాలని చాలా ఆశ పడుతాడు కానీ అతనికి తన చుట్టూ ఉన్న సమాజం నుండి ఒక రవ్వంత ఆయన సపోర్ట్ దొకరకపోగా అతని సమస్యని చూసి అవహేళన చేస్తుంది సమాజం కొందరు అయితే తన సమస్య ని డబ్బు చేసుకోవాలి అని కూడా చూస్తారు.
  తను ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి పడే తపన తాపత్రయం మన మనుసుని కలిచి వేస్తుంది పిల్లిని కూడా ఒక గది లో తాళం వేసి హింసిస్తే అది మన పి ఎదురుదాడి చేస్తుంది. ఆర్థర్ ని కూడా అలాగే చేస్తుంది అక్కడి రాజకీయం తన చుట్టూ ఉండే సమాజం.
  వన్ ఆఫ్ the బెస్ట్ మూవీ ఇన్ హాలీవుడ్…
  ఫోనిస్ నటన అయితే చాలా అద్బుతం .
  చాలా చాలా గొప్పగా రాసారు అన్నయ్య ధన్యవాదాలు

 • మీరు ఈ సినిమా గురుంచి ఎక్కువగా సమాజం దృష్టి కోణం లో రాశారు అనిపిస్తుంది. ” జోకర్” సినిమా అమెరికన్ సమాజానికి అయితే. ఇండియన్ సమాజానికి సంభందించి ఏ సినిమా అయినా ఉందా?.. ” జోకర్ ” లాంటి క్యారెక్టర్ తో…

  • ఇందులో సమాజ దృష్టి కోణమే ఉంది. వేరే కోణం లేదు. అమెరికాలో మానసిక జబ్బులతో బాధపడేవారు ఉన్నారు. మార్గజినలైజ్న్డ్ ప్రజలు ఉన్నారు. కల్చర్ ఉంది. మెడికైడ్ ఇపుడు నిరుద్యోగులకు ఇన్సూరెన్స్ కల్పించటం లేదు. మందులు కొనుక్కునే పరిస్థితి లేదు. గన్ కల్చర్ హత్యలు పెరగడానికి అదొక కారణం. కాబట్టి జోకర్ ఒక సోషియో పొలిటికల్ సినిమా. అంతకుమించి వేరే కోణం లేదు. మనదేశంలో హీరో వర్షిప్ తో తప్ప అటువంటి సినిమాలు వచ్చే అవకాశం లేదు.

  • ఆ మధ్యలో మన దగ్గర వచ్చిన ఎర్ర సినిమాలు అన్నీ ..

   • అన్నీ…?.
    మీరు ఇలా సగంలో వదిలేస్తే ఏమి అర్థం చేసుకోవాలి అధ్యక్షా!?

 • మీ విశ్లేషణ నచ్చింది సార్. ఈ సినిమాపై ఆశక్తిని పెంచింది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.