‘అపరిచితుడు’

 

మనల్ని మనం బహిష్కరించుకోడం కాదు. అధర్మాన్ని బహిష్కరించాలి. ఇన్నాళ్లుగా మనం చేస్తున్నది స్వయం బహిష్కరణోద్యమమేమో … ఆగి, ఒక క్షణం ఆలోచించాలి.

పెట్టుబడిదారీ విధానానికి తాత్విక రూపం మోడర్నిజం (ఆధునికతా వాదం). ఇది వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యం అపరిమితం. మోడర్నిజానికి మనిషి అంటే సమూహం కాదు, వ్యక్తి. ‘నా ఇష్టం’ అనడం అత్యాధునికత. అతి ఆధునికత  🙂 . బయటికి చెప్పినా చెప్పకపోయినా మనలో చాల మందికి మోడర్నిజం సమ్మగా వుంటుంది. దాన్నుంచి ఏమాత్రం వైదొలగినా పోస్ట్ మోడర్నిజం (ఆధునికోత్తరవాదం) అని గోల చేస్తాం. మోడర్నిజం విధించే పరిమితులను వొదిలించుకోడానికి ‘ప్రీ మోడర్నిజం’ కన్న ‘పోస్ట్ మోడర్నిజం’ మంచిది. పాత ఫ్యూడలిజం కన్న ‘పరిపక్వ క్యాపిటలిజం’ మంచిది. పోస్ట్ మోడర్నిజంలో ‘వెర్రితలలు’ లేవని కాదు. అవెప్పుడూ వుంటాయి. మోడర్నిజంలో కూడా  వున్నాయి. ‘వ్యక్తివాదం’ కన్న పెద్ద వెర్రితల మరొకటి వుండదు. అమెరికాలో డొనాల్ద్ ట్రంప్ ఆ సంగతి ‘అత్యున్నత’ రీతిలో నిరూపిస్తున్నాడు.   

ప్రపంచంలో గొప్ప మోడర్నిస్టు భావుకులలో ఫ్రెంచి రచయిత ఆల్బర్ట్ కామూ ఒకరు. ఆయన సుప్రసిద్ధ నవల పేరు ‘ఔట్ సైడర్’ (‘స్ట్రేంజర్’). సత్యం కన్న ఎక్కువ చెప్పడం లేదా తక్కువ చెప్పడం రెండూ అసత్యమే అంటాడు నవల చివర తనే రాసిన ‘తరువాత మాట’ (ఆఫ్టర్ వర్డ్) లో కామూ. ఆ ‘తరువాతి మాట’లోని థీరీకి మానవ రూపం… నవలా నాయకుడు మ్యూర్ సాల్ట్ అనే యువకుడు.  

తనవల్ల తప్పు జరిగిందని ‘పశ్చాత్తాపపడితే’ మ్యూర్ సాల్ట్ క్రూరమైన (గొంతు చుట్టు కత్తుల చక్రం బిగించి చంపే) మరణ శిక్షకు గురయ్యే వాడు కాదు. అతడికి పశ్చాత్తాపం లేదు. ఆ ఘటన గురించి తనకు ఏమనిపిస్తోందని అడిగితే, ‘అన్నాయింగ్’ గా వుందంటాడతడు. సగటు తెలుగులో చెప్పాలంటే ‘చిరాగ్గా’ వుందన్న మాట. వుట్టి పుణ్యానికి ఒకడు తనవల్ల చస్తే ‘చిరాగ్గా’నా వుండేది? నిజంగా చాల మందికి కేవలం ‘చిరాగ్గా’ మాత్రమే వుంటుంది గాని అలా చెప్పరు. మ్యూర్ సాల్ట్ ఏది సత్యమో అది మాత్రమే చెబుతాడు. తనకు చిరాగ్గా వుంది, పశ్చాత్తాపంగా లేదు. అంతే. తనకు పశ్చాత్తాపంగా లేకపోయినా, వుందని అబద్ధం చెప్పి మ్యూర్ సాల్ట్ కోర్టులో శిక్ష తప్పించుకోడు, తగ్గించుకోడు. ఫాదరీ వద్ద ఆ మాట చెప్పి పరలోకంలో సీటు పదిలం చేసుకోడు. 

అప్పుడే కాదు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా మ్యూర్ సాల్ట్ తను చేయాల్సిన పనులేవో చేసేసి ఏమీ జరగనట్లు మామూలుగా వుంటాడు. నిజానికి చాలమంది మామూలుగానే వుంటారు. బయటికి అలా చెప్పరు, కనపడరు. తన ప్రియురాలిని సైతం ఆశ్చర్యపరిచిన మ్యూర్ సాల్ట్ ‘మామూలు తనం’ కోర్టులో క్రూర మరణ దండనకు మరో కారణం అవుతుంది. 

అదీ సంగతి. సత్యం కన్న… అంటే అచ్చంగా ఏమి వున్నదో దాని కన్న… రవ్వంత ఎక్కువ చెప్పొద్దు, రవ్వంత తక్కువ చెప్పొద్దు. చెబితే సత్యం నుంచి వైదొలగడమే అవుతుంది. మ్యూర్ సాల్ట్ సత్యం నుంచి వైదొలగడు. అందుకని, జీవితం నుంచి వైదొలగాడు, అదీ అతి క్రూరమైన రీతిలో, పరలోకం ఆశలు కూడా లేకుండా. తను ప్రత్యేకించి ‘వైదొలగా’లా ఏం?ఎప్పుడూ వైదొలగే వున్నాడు కదూ?! అతడు ఈ లోకానికి ‘అపరిచితుడు’ (స్ట్రేంజర్). లేదా, లోకం నుంచి  ‘స్వయం-బహిష్కృతుడు’ (ఔట్ సైడర్). నవల ఫ్రెంచి టైటిల్ ఏమిటో నాకు తెలీదు. ఇంగ్లీషులో ఆ రెండు పేర్లతోనూ అనువాదమయ్యింది. నాకైతే రెండో పేరే తెగ నచ్చేసింది. మ్యూర్ సాల్ట్ మంచోడా చెడ్డోడా, మానసికంగా జాత్యహంకారవాదియా కాదా అనే చర్చ అవసరమే గాని అది మరో చోట చేద్దాం. అతడొక ‘ఔట్ సైడర్’ అనే వాస్తవం ఇక్కడ ముఖ్యం. 

మ్యూర్ సాల్ట్ ఎందుకని ఔట్ సైడర్? ఎందుకని స్ట్రేంజర్? ఎవరి నుంచి స్వయం బహిష్కృతుడు? ఎవరికి అపరిచితుడు? రెండు ప్రశ్నలకు ఒకటే జవాబు. ‘లోకానికి’!

ఎందుకలా అనుకోవాలి? ఎందుకంటే, లోకం అతడిలా ప్రవర్తించదు. ‘మామూలు’ లోకం అలా ప్రవర్తించదు. కేవలం ‘సత్యవాదా’న్ని ఆదర్శంగా తీసుకుని దానికోసం పడిచచ్చే కొద్ది మందే అలా ప్రవర్తిస్తారు. జెనెరల్ గా లోకం ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించే వాళ్ళే ఇన్ సైడర్లు, వాళ్లే లోకానికి దైనందిన సుపరిచితులు. మనలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది లోకానికి ఇన్ సైడర్లే, పరిచితులే. 

ఈ ఇన్సైడర్లకు లోకం బయటి వాళ్లంటే (ఉదాహరణకు ప్రేమ కోసం చచ్చే అనార్కలీలు, రోమియోలంటే) చాల చాల ఇష్టం. మోహం కూడా. ఇతర్ల కోసం సొంత బతుకులు కాల్చుకునే పరోపకారి పాపన్నలు, సొంతూరు వొదిలేసి బొలీవియా అటవీ జనాల మధ్య ప్రాణాలకు తెగించే చే గువేరాలు… మనకు… అంటే, ఇన్ సైడర్ లోకానికి ఆరాధనీయులు. పూజనీయులు.  

కామూ, మ్యూర్ సాల్ట్ రూపంలో అద్భుతంగా చిత్రించి, తన ‘తరువాతి మాట’లో వాచ్యం చేసిన ఫక్తు సత్యం (రవ్వంత ఎక్కువ గాని, రవ్వంత తక్కువ గాని  కాని సత్యం) ఏదుందో అది లోక రీతి కాదు. లోకం అలా వుండదు. పశ్చాత్తాపం ప్రకటిస్తే (నటిస్తే) ఒక క్రూర మరణం తప్పుతుందంటే మామూలు మనుషులెవరూ అలా నటించకుండా వుండరు. వీలైతే గప్ చుప్ గా, లేకుంటే  బహిరంగంగా పశ్చాత్తాపం ప్రకటిస్తారు; అది ఆత్మ చెప్పే మాట కాదు, నటన అని తెలిసీ.

నటన సంస్కారానికి పర్యాయపదం. సంస్కారం అంటే ప్రోటకాల్. ఈ సంస్కారం కొన్ని  పరిసరాలలో పుట్టి పెరగడం వల్ల శిష్టవర్గీయులకు ‘సహజంగా’ రావొచ్చు. పుట్టి పెరిగాక దొరికే విద్యా శిక్షణల వల్ల రావొచ్చు. పుటకతోనో, పుట్టిన తరువాతనో అబ్బే ‘సంస్కారా’న్ని కాదని బతికే ధిక్కార జీవులు కొందరుంటారు. అలాంటి ‘దురదృష్టవంతుల’లో ఒకడు మ్యూర్ సాల్ట్. మన వాడు ఆదర్శవాదాన్ని వంట పట్టించుకున్న ‘పిచ్చోడు”. అంతే గాని, మ్యూర్ సాల్ట్ అనుకున్నట్లు, ‘తరువాతి మాట’లో కామూ సూచించినట్లు ఫక్తు సత్యమనేది ఏదీ లేదు. సత్యం అనుక్షణం ఒక రవ్వ ఎక్కువగానో ఒక రవ్వ తక్కువగానో ఉంటుంది. 

అదేం కాదు అసత్యం అస్సలు చెప్పను అనే ఆయన అన్నిటి కన్న పెద్ద అసత్యాన్ని వినముచ్చటగా చెబుతున్నాడంతే. లోకంలో “సత్య హరిశ్చంద్ర” నాటకం కన్న పెద్ద అబద్ధం వుండదు. అంత పెద్ద అబద్ధం వినముచ్చటగా చెప్పడం వల్ల మనకు ఆ నాటకం చూడముచ్చటగా వుంది. ఆ ‘ముచ్చట’కు బలయ్యే పిచ్చోళ్లూ వుంటారు.

వొద్దు, బలి కావొద్దని నా సహ పిచ్చోళ్లకు మనవి.

***

చివరాఖర్న వేరే మాట అనిపించే ఒక చిన్నమాట:

పెద్దలెవరో అన్న మాటే. 

‘మనకు పరిచయమైనదే మనకు అర్థమవుతుంద’ని ఆ మాట సారం. 

మనం పూజించే దేవతలు, దేవతల్లాగే  మనం అమరుల్ని చేసే మనుషులు మనకు ఆ విధంగా పరిచితులు/అర్థమయిన వారు. వారిలోని,  మరి దేనిలోని ‘అపరిచితాల్ని’ మాట్లాడినా మనం ఒక పట్టాన ఒప్పుకోం.

పరిచయం లేనిది అర్థం కావాలంటే వక్త, శ్రోత ఇద్దరూ పని చేయాల్సి వుంటుంది. శ్రమించాల్సి వుంటుంది. ‘క్యాపిటల్’ రాయడానికి మార్క్సు, చదవడానికి మార్స్కిస్టులు ‘శ్రమించక’పోతే ఆ పుస్తకంతో ‘లాభం’ లేదు. మనకు గట్టిగా ‘పరిచయమైన’ ఆలోచనల గుప్పిట్లోంచి (ఆ మైండ్ సెట్ లోంచి) బయట పడకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఆలోచనల్లో ముందడుగు ఉండదు. ఆచరణలో ముందడుగు ఉండదు. 

ఆలోచనలు పెంచుకోడానికి వక్తలుగా, శ్రోతలుగా శ్రమిద్దాం. కాదని అనాల్సి వొస్తే దేన్నైనా కాదందాం. ఎస్ (మనకు చాల ఇష్టమైన) మార్క్సు మాటను కూడా కాదందాం. మనకు అర్థం కాకపోతే వక్తను వివరణ అడుగుదాం. మనకు నచ్చనిదైతే పేచీ పడదాం. ఆలోచనల్ని పెంచడానికి పనికొచ్చే పేచీ ఏదో, తుంచడానికి పనికొచ్చే పేచీ ఏదో…  దాని ముఖం మీదే రాసి వుంటుంది.

ఇంతకు మించి చెప్పాలా, అన్నీ తెలిసిన మీకు?! 🙂

31-10-2019 

హెచ్చార్కె

10 comments

 • బాగా చర్చించారు.వివరించారు.అయితే,గాంధీ,బుద్ద,అంబెడకర్ , వచించిన సత్యాలను శాశ్వత మందామా, లేదా

  • థాంక్స్ రామారావు గారు. శాశ్వత సత్యాలేవీ వుండవు. ఉప్పు ఉప్పగా వుండడం వంటి శాశ్వత ‘వాస్తవాలు’ ఉంటాయది వేరు. ఇక మీరుదాహరించిన మనుషులు పరస్పర విరుద్ధులు. ఒకరికి సత్యమైనది మరొకరికి కాదు, ఇక శాశ్వతమెక్కడ> 🙂

 • “ఈ ఇన్సైడర్లకు లోకం బయటి వాళ్లంటే (ఉదాహరణకు ప్రేమ కోసం చచ్చే అనార్కలీలు, రోమియోలంటే) చాల చాల ఇష్టం. మోహం కూడా. ఇతర్ల కోసం సొంత బతుకులు కాల్చుకునే పరోపకారి పాపన్నలు, సొంతూరు వొదిలేసి బొలీవియా అటవీ జనాల మధ్య ప్రాణాలకు తెగించే చే గువేరాలు… మనకు… అంటే, ఇన్ సైడర్ లోకానికి ఆరాధనీయులు. పూజనీయులు” &
  ” లోకంలో “సత్య హరిశ్చంద్ర” నాటకం కన్న పెద్ద అబద్ధం వుండదు. అంత పెద్ద అబద్ధం వినముచ్చటగా చెప్పడం వల్ల మనకు ఆ నాటకం చూడముచ్చటగా వుంది. ఆ ‘ముచ్చట’కు బలయ్యే పిచ్చోళ్లూ వుంటారు ” ………… యీ రెండు వాక్యాలూ బలే నచ్చాయి..
  రవ్వంత ఎక్కువ కాని తక్కువా కాని సత్యం అనే దాన్నుంచి యెంతో నేర్చుకోవాలిసి వుంది. ఇవాళ మెజారిటీ నోర్ల నుంచి ఇదే వాక్యం పేరు మార్చుకుని సమన్యాయం అనే పేరుతో వినబడుతోంది. వాస్తవానికి వున్నది సత్యం , అసత్యం రెండే కదా. మరి యీ పావు సత్యం , అర్ధ అబద్దం , ముప్పావు నిజం అనేవి యేమిటి. పరస్పర విరుద్దాలే కదా.

  • థాంక్యూ వంశీ. సమన్యాయం పేరిట జరిగే అన్యాయాలు నిజమే. రాజీ బేరాల వల్ల ప్రజలకు హాని. తప్పొప్పుల సంగతి నిర్మొహమాటంగా మాట్లాడాల్సిందే. ఉన్న తప్పులను వొదిలెయ్యక్కర్లేదు. లేని తప్పుల వెనుక దాక్కోవద్దు.

 • మనకు అర్థం కాకపోతే వక్తను వివరణ అడుగుదాం.
  *
  మనకు పరిచయమైనదే మనకు అర్థమవుతుంద’ని మీ మాట సారం.
  * మేడ్ ఇట్ టూ టెక్నీకల్. మీరు ఇన్సైడర్లని ఆక్షేపించారా ? కామూని చదవనివాళ్ళకి ఇదెలా అర్ధమవుతుంది..? చాలా పై స్థాయిలో మాటాడుతున్నారు ? కొద్దిగా సాధారణంగా చెప్పచ్చేమో ?

  కానీ మీ వర్స్ లో బ్యూటీ ఉంటుంది. భాష వల్ల ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్యూ

  • థాంక్స్ శ్రీరామ్, స్థాయి అని కాదు గాని సర్దుకుంటాను. అయినా ఇన్సైడర్ కథ చెప్పాను కదూ, అది తెలియని వాళ్ళ కోసం. అజ్ఞాతం (తెలియకపోవడం) నుంచి జ్ఞాతానికి (తెలియడం కి) ప్రయాణమే ఏ మంచి సాహిత్యమైనా అనుకుంటాను. ప్రయాణం స్మూద్ గా వుండాలని ఒప్పుకుంటాను.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.