రంగుల తోరణాల్నీ
వెలుగు రవ్వల్నీ
పులుముకుంటున్న
ఈ రాత్రి అసలు రంగేది
ఎగసి పడే చిచ్చుబుడ్డిని
మండి రాలిపడుతున్న తారాజువ్వల్నీ
దూరంగా నిలుచుని సంభ్రమంతో చూస్తున్న
ఆ పేద బాలిక కళ్ళలో
మెరుస్తున్న అసలు రంగేది
మెరిసి మాయమయే సంతోషానికీ
మెరవకకురుస్తుండే దుఃఖానికీ
బతకలేకపోతున్న ఆశకు
ఓదార్పు కాలేని ప్రేమకు
పలచబడుతున్న బంధాల పెనవేతకు
అసలు రంగేది
నడిపిస్తున్న వాడిమాటలకీ
నడిపించబడుతున్నవాడి వూహలకీ
అంతుచిక్కని ప్రశ్నల నదిలా
పారుతున్న జీవితానికీ
యాంత్రికంగా వచ్చిపోతున్న
వుదయాస్తమయాలకూ
అసలు రంగేది
వర్ణాలుగా వర్గాలుగా
గాజుగోడలమధ్యన చీలిపోతున్న
నీ నా మనిషితనపు అసలురంగేది
తెలియకనే వచ్చిపోయే
మన అస్తిత్త్వాల వెనుక దాగిన
రహస్యాలకు అసలురంగేది
పశువులలోనూ పక్షులలోనూ
మనుషులమనే మనలోనూ మానుల్లోనూ
ప్రవహిస్తున్న ప్రాణానికీ అసలురంగేది
ఏది అసలు రంగు?
రంగు లేని జీవితాల వెలితిని
ఎప్పటిలా విజయ్ ముద్రతో చెప్పారు. చాలా నిజం
విజయ్ మంచి కవి.