ఒక తమిళ ‘జోకర్’ కథ

కొన్నిరోజుల క్రితం ఒక మిట్ట మధ్యాహ్నం కోల్ కతా బ్యారక్ పూర్ స్టేషన్ బయట ఒక ముసలాయన తనొక్కడే ఒక చేత కొన్ని కరపత్రాలు, మరో చేత హ్యాండ్ మైక్ పట్టుకుని కాశ్మీర్ సమస్య గురించి ఎదో వివరిస్తున్నాడు. జనాలెవరూ పట్టించుకోవడం లేదు. ఉండుండి ఇద్దరో ముగ్గురో రెండు నిముషాలు ఆగి, వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద పార్టీలకే పట్టింపు లేకపోతే, ఈ తాతకెందుకు తాపత్రయమో? బహుశా అతని అవగాహన అతడ్ని ఇంట్లో కూర్చోనీకుండా చేస్తోందేమో! ముసిముసిగా నవ్వుకుని వెళ్ళిపోతున్న జనాలు కొందరు అతడ్ని ‘జోకర్’ అనుకోవడం లేదుకదా?! 

2016 లో విడుదలైన రాజు మురుగన్ తమిళ సినిమా ‘జోకర్’లో అచ్చం అలాంటి ముసలాయనే కన్పించాడు. ‘ఈ కార్పొరేటు మొసళ్ళు మన నదుల్ని, సరస్సుల్ని, చెరువుల్ని బలవంతంగా ఆక్రమిస్తున్నాయి. మన నగరాలు కాంక్రీటు అడవులవుతున్నాయి. ప్రభుత్వం వీరికి ఊడిగం చేస్తోంది. మన నీటిని మనమే కొనుక్కునేలా చేస్తోంది’ – అంటూ ఆయన ఒక్కడే పెప్సీ వారి వాటర్ బాటిల్ కంపెనీ బయట కార్మికులకు కరపత్రాలు పంచుతూ, హ్యాండ్ మైక్ తో మాట్లాడుతుంటాడు. క్షణాల్లో పోలీసు వ్యాను వచ్చి అతణ్ణి ఎత్తుకుపోతుంది. అయితే ఈ సినిమాలో అసలు ‘జోకర్’ వేరే వున్నాడు.

ఆదిలో హాస్య పర్వం:

ధర్మపురి అనే వూరిలో వున్న ఆయన పేరు మన్నార్ మన్నన్ (గురు సోమసుందరం). గ్లామర్ లేని పాత్ర అది. ఆరంభ దృశ్యమే చాలా డీ-గ్లామరైజ్డ్ గా వుంటుంది. ఆచ్చాదన లేని కూలిన  గోడల టాయిలెట్లో కూర్చుని పేపర్ చదువుతూ ప్రేక్షకులకు ‘ఇంట్రడ్యూస్’ అవుతాడు మన్నన్. అతడి ఇంట్లో సరైన టాయిలెట్ లేదన్న సంగతి మనకర్ధమవుతుంది. ఆ టాయిలెట్తో అతడి జీవితం ఎలా ముడిపడి వుందో  మున్ముందు తెలుస్తుంది మనకు. వార్తాపత్రిక ఎందుకంటే, దేశసమస్యలు ఏమిటో తెలుసుకోవడం అతడికి చాలా అవసరం కనుక! దేశంలో పరిస్థితులు సరిగా లేవని అతడు అనుకుంటూ ఉంటాడు. ఊరిలోని దుకాణంలో హానికరమైన కార్బోనేటేడ్ పానీయాలు, ప్రజల కోసం మాత్రం ఫ్లోరైడ్‌తో కలుషిత జలాలు! టీవీని వార్తల కోసం చూడాలి. దుకాణం వాడు క్రికెట్ కోసం చూస్తున్నాడే! ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. పురుషులు వైన్ షాపులకు తమ జీవితాలనూ, జీతాలనూ ధారపోస్తున్నారు. విజయ్, అజిత్ సినిమా తారల పెద్ద పెద్ద కటౌట్లు ఎందుకనీ? పనికిమాలిన రాజకీయ నాయకుడొకడు ఒకరోజు తను బాహుబలి అట! మరోసారి రోబో అట! లేటెస్టు సినిమాల ప్రకారం బ్యానర్లా? ఆసుపత్రుల్లో కనీస వసతులు లేవు. మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వానికి పిటిషన్ ఇవ్వకుండా బెడ్డు ప్రక్కనే యెహోవా ప్రార్థనలూ, ఆసుపత్రి వసారాలోనే అమ్మోరుకి మొక్కడాలూ చేస్తున్న జనాల్ని ఏమనాలి? 

లాభం లేదు. రాష్ట్రపతి ఒక్కడే చట్టాలు చేసి పరిస్థితి మార్చగలడు. అందుకే …. వన్ ఫైన్ డే మన్నన్ తనని తాను దేశాధ్యక్షుడినని ప్రకటించుకుంటాడు. అతడి పెంకుటింటి లోపలి గోడపైన వరుసగా దేశాధ్యక్షుల ఫోటోలు వుంటాయి. అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ చిత్రాల తర్వాత అతని ఫోటో ఉంటుంది. తను తప్పు అని భావించే ప్రతిదానికీ వ్యతిరేకంగా నిరసన చేస్తుంటాడు. గ్రామస్తుల తరపున సమస్యలను స్వీకరించి ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా తను చేయాల్సినది చేస్తుంటాడు. పేదలకు న్యాయం నిరాకరించే అవినీతికర బ్యూరోక్రాటిక్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటంలో, సోషల్ మీడియా కోసం తన ప్రచారాలను రికార్డ్ చేసే ఇసై (గాయత్రి కృష్ణ) అనే అమ్మాయి, హ్యాండ్ మైక్ ప్రసంగాలు చేసే ముసలాయన పొనూంజల్ (రామసామి) అతడికి సహాయంగా వుంటారు. కొందరు ఇతడ్ని పిచ్చిమాలోకం అనుకున్నా, పేదవారిలో అతడికి బాగానే ఫాలోయింగ్ ఉంది. అతడు చేసే నిరసనలు చాలా ప్రత్యేకమైనవిగా వుంటాయి. కార్పొరేషన్ నెమ్మదిగా పనిచేస్తుందని చెప్పడానికి కార్పొరేషన్ భవనంలో తాబేళ్లను వదుల్తాడు. వడ్డీలు కట్టలేని రైతుల సమస్యను చూపేలా గోచీలతో ఊరేగుతారు. (ఈ దృశ్యం జంతర్ మంతర్ దగ్గర తమిళనాడు రైతులు చేసిన ప్రదర్శనను తలపిస్తుంది.) గాంధీ నిరసన, భగత్ సింగ్ నిరసన అని అతడి దగ్గర రెండు పద్ధతులున్నాయి. మేకపిల్లను గాయపరిచిన అక్రమ ఇసుక లారీ యజమానుల నుండి రెండు లక్షల జరీమానాను పొనూంజల్ సాయంతో కోర్టు నుండి సంపాదిస్తాడు. కానీ అఖిల అనే పాప ప్రమాదానికి కోర్టు న్యాయం చేయకపోతుంది. దాంతో పాపిరెడ్డి భవన్ (తన ఇల్లే!) అనే ప్రెసిడెంటు భవనం నుండి దేశాధ్యక్షుడి హోదాలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, ఆ  తదుపరి దినం ఆ పాప ప్రమాదానికి కారణమైన కార్పొరేటర్ పై దాడిచేసి పోలీసు లాకప్పుకు వస్తాడు. కోర్టుకు పోలీసులు ఇవ్వాల్సిన నివేదికలో భాగంగా కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది.

మధ్యలో అందమైన ప్రేమ పర్వం:

తాగునీటి బాటిళ్ళు తయారుచేసే బహుళజాతి కంపెనీ ఉద్యోగి మన్నన్. పూల తోటలో పనిచేసే అమ్మాయి మల్లిక (రమ్య పాండియన్). బిర్యానీ, నాటుసారాల వాగ్దానంతో రోజు కూలీలను  రాజకీయ పార్టీ సమావేశానికి తీసుకెళ్ళే లారీలో మన్నన్ – మల్లికల ప్రణయగాధ మొదలవుతుంది. తన జీవితాన్ని తనే నిర్ణయించు కోవాలనుకున్న మల్లిక ఒక రోజు ఆకస్మిక తనిఖీ మీద స్నేహితురాలితో మన్నన్ ఇంటికి వస్తుంది. నన్ను పెళ్లి చేసుకోడానికి నీ దగ్గర ఏముంది అని అడుగుతుంది. 50 ఛానల్ల కేబుల్ కనెక్షన్తో కలర్ టీవీ, మిక్సర్-గ్రైండర్ ఉన్నాయని ప్రగల్భాలు పలుకుతాడు.  ‘టాయిలెట్ ఉందా?’ అని అడుగుతుంది. స్టంప్ అవుతాడు హిరో. ఎందుకంటే ఆ వూరిలో 4జి ఆండ్రాయిడ్ వున్నోళ్ళు కూడా పొలాలకు పోతుంటారు. ‘మీ ఇంటికి టాయిలెట్ వచ్చాకనే పెళ్లి’ అని షరతు విధిస్తుంది పెళ్ళికూతురు. ప్రభుత్వ టాయిలెట్ పథకం కోసం డబ్బు కడతాడు. అందమైన స్నానపు తొట్టెలు, సిరామిక్ కమోడ్లు మాత్రమే వినియోగించే మధ్యవర్తులు పేదల టాయిలెట్ పథకాల సొమ్ము కాజేయగా చివరికి పేదల చేతికి టాయిలెట్ బేసిన్లు మాత్రమే దక్కుతాయి. మిగతా టాయిలెట్ నిర్మాణం మిగులు సంపాదనతో చూడొచ్చుననుకుని మల్లిక పెళ్ళికి ఒప్పుకుంటుంది. ధర్మపురిని ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ఎంచుకుందనీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ వూరిలో పేదల టాయిలెట్లు ప్రారంభోత్సవం చేస్తారనీ వార్త వస్తుంది. మన్నన్ ఇంటిని ఎంచుకుని, ఆఘమేఘాల మీద వారి యింటి టాయిలెట్ నిర్మాణం మొదలుపెడతారు అధికారులు. కానీ ….

నేపథ్యంలోనే ప్రారంభమైన విషాద పర్వం:

ఆఖరు రోజు మరో ఇంటిని ఎంచుకోగా, మన్నన్ టాయిలెట్ పనిని సగంలో వదిలేసి వెళిపోతారు పనివాళ్ళు. రాష్ట్రపతి రావడానికి ముందురోజు రాత్రి గాలివాన సమయంలో నిండు గర్భిణీ మల్లిక నిర్మాణాధీనంలోని    టాయిలెట్లోకి వెళ్లి ప్రమాదానికి గురౌతుంది. తెల్లారే సరికి గానీ, మన్నన్ కు ఈ సంగతి తెలీదు. రాష్ట్రపతి ఎదుట గలాభా ఉండకూడదని గోల చేస్తున్న మన్నన్ ను ఇంట్లో బంధించేసి, మల్లికను ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం చేస్తారు పోలీసులు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. కడుపులోని బిడ్డ చనిపోతుంది. మల్లిక శాశ్వతంగా కోమాలోకి జారుకుంటుంది. వ్యవస్థ తయారుచేసిన పిచ్చివాళ్ళలో ఒకడిగా, వ్యవస్థను మార్చే అధికారాలున్న ప్రెసిడెంట్ గా మారిపోతాడు మన్నన్. ఫ్యాక్టరీ సీనియర్ ఫ్రెండ్ ఇచ్చిన డ్రెస్సుతో రాష్ట్రపతిగా ముసాబై, గ్రామసమస్యలను తీర్చడానికి రోజూ మోపెడ్ పై బయలుదేరుతుంటాడు. కల్తీ సారా వలన తన తండ్రిని పోగొట్టుకున్న ఇసై, సచేతన పౌరుడైన పొనూంజల్ అతనికి నేస్తాలవుతారు. ‘ప్రెసిడెంట్’ మాట కాదనకుండా అతడి వెన్నంటి వుంటారు. అచేతనంగా ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా పడివున్న మల్లిక కోసం యూతనేసియా (దయా మృత్వువు) కావాలని కోర్టులకు వేడుకుంటాడు. కథ ప్రస్తుతంలోకి వస్తుంది. సుప్రీమ్ కోర్ట్ కూడా మన్నన్ యూతనేసియా ఆర్జీని కొట్టివేస్తుంది. ఇక దేశాధ్యక్షుడిగా తనే తన భార్య దయా మృత్వువు ఫైలుపై సంతకం చేసి, అమలుపరుస్తానని ప్రకటించి, ప్రభుత్వ పిచ్చాసుపత్రి నుండి తప్పిచుకుని వస్తాడు మన్నన్. కానీ …

దేశమంతా తప్పించుకుని వచ్చినా, చివరికి సొంత వూరిలో పగబట్టిన అక్రమ ఇసుక లారీ చక్రాల కింద శవంగా మారతాడు. “అయ్యో! పోరాటం చేయమని నూరిపోసి ఇతడ్ని పిచ్చివాడిగా చేసింది నేనేకదా! అడవుల్ని సర్వనాశనం చేసి, చెట్లు నాటమని బోధించే వారిని ప్రజలు నమ్ముతున్నారు. విలన్లకు వోట్లు వేసి ఎన్నుకుంటున్నారు. ప్రజల కోసమే పోరాడే వారిని జోకర్లుగా జమకడుతున్నారు” అని విలపిస్తాడు పొనూంజల్. ఇసై మాత్రం “ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఇసుక మాఫియా చేసిన హత్య! రేపు సాయంత్రమే గాంధీ విగ్రహం దగ్గర ప్రదర్శన అని ఫేస్బుక్, వాట్సప్ లో ప్రకటన వేయండి” అని చెబుతుండగా కొనవూపిరితో వున్న మల్లిక సాక్షిగా సినిమా ముగుస్తుంది.

సినిమాలో విశేషాలు:

ఈ సినిమా దర్శకుడు రాజు మురుగన్ పాత్రికేయుడు కావడం వల్ల దేశ రుగ్మతలపై చాలా చక్కని సెటైర్లు వేశాడు. రెండో సినిమాలోనే ఎంతో పరిపక్వతను చూపాడు. మూడు రంగుల టాయిలెట్ తలుపులతో భారత జెండా తయారుచేసిన బిట్టు బాగుంది. రాష్ట్రపతి మహిళా సాధికారత గురించి చెబుతున్నపుడే మల్లిక అశ్రద్ధకు గురౌతున్న దృశ్యాన్ని జుక్స్ట్పోజ్ చేస్తాడు. ‘మనకు పుట్టే బిడ్డ సూపర్ సింగర్ కార్యక్రమంలో నెగ్గాలి’ అన్న డైలాగు తల్లిదండ్రులపై బుల్లితెర ప్రభావానికి అద్దం పడుతుంది. ‘శివుడి తలపై వున్న నెలవంక హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నం కాదా’ అంటూ మతరాజకీయాలు వద్దని చెబుతాడు. ఇసై చేతిలో మలాలా పుసకాన్ని చూపెడతాడు. ఆగ్రా గోడపై రోహిత్ వేముల కోసం న్యాయం కోరుతున్న పోస్టర్ను కెమేరాలో బంధిస్తాడు. ప్రణబ్ ముఖర్జీగా వేసిన పాత్రధారి చక్కగా సరిపోయాడు. కాకపొతే అతని భాషలో తమిళ యాస వినిపించింది. సినిమా ఆఖర్లో శీర్షిక ప్రాముఖ్యతను చెప్పే డైలాగులు నాటకఫక్కీలో వున్నాయి. ఇదే ఈ సినిమాలో చిన్న లోపమనిపించింది. చెలియన్ కెమేరా పనితనం, సీన్ రోల్డాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలైట్. ఇళయరాజా పాటల్ని సందర్భోచితంగా వినియోగించడం బావుంది.

ఈ సినిమా ఉత్తమ తమిళ చిత్రంగా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డులతో పాటు ఇంకెన్నో అవార్డులు సాధించింది. కమర్షియల్ కీ, ఆర్టుకీ మధ్యస్తంగా వుండే తమిళ, మళయాళ సినిమాలు తయారుకావడం, వాటిని ప్రేక్షకులు ఆదరించడం లాంటి పరిస్థితి తెలుగులో ఇంకెంత కాలానికి వస్తుందో! అన్నట్టు ఈ సినిమా నుండి సెంట్రల్ ఐడియాను నకలు చేసి హిందీలో ‘టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథా’ సినిమాను కేంద్ర ప్రభుత్వ టాయిలెట్ స్కీముకి ప్రచార సినిమాగా తయారుచేశారు. ఆ సినీ నిర్మాతల అవసరాలు అలా వున్నాయి మరి!

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

2 comments

  • సంగీతం సీన్ రొనాల్డ్ సమకూర్చాడు. ఇళయరాజా పాత పాటల్ని బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్నట్టు వేశారు. అదే రాశాను. అన్నట్టు మీ రివ్యూ చదివాక జోకర్ చూశాను. మీ రివ్యూ లానే బావుంది. హాలీవుడ్ సినిమాల్ని కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తుంటాను.

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.