కవిసేన మేనిఫెస్టో
ఒక విద్యాత్మక పత్రం

ఇవ్వాళ మేనిఫెస్టో అనగానే రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలే గుర్తుకువస్తాయి. మాకు ఓట్లు వేయండి, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చేసే వాగ్దానాల పట్టికలు ఈ ఎన్నికల మేనిఫెస్టోలు.

మేనిఫెస్టో అంటే ఏమిటి? అదొక ప్రకటన. ఒక వ్యక్తికాని, సమూహంకాని, సంస్థ కానీ ఒక అంశంపై తన ఉద్దేశాలను, విధానాలను, దృక్పథాలను ప్రకటించే పత్రం. ఈ పత్రం గతంలోని ప్రజల ఏకాభిప్రాయాన్ని ప్రకటించేది కావచ్చు లేదా ఒక నూతనాభిప్రాయాన్ని, దృక్పథాన్ని వ్యక్తం చేసేది కావచ్చు.

అందువల్ల ఒక వ్యక్తి తన సొంత మేనిఫెస్టోను ప్రకటించుకోవచ్చు. కొందరు వ్యక్తులు కలిసి ఉమ్మడిగా తమ మేనిఫెస్టోను ప్రకటించవచ్చు. ఇది రాజకీయం కావచ్చు, ఏ కళారూపమైనా కావచ్చు.  విద్యాసంస్థలతో మొదలుపెట్టి, వ్యాపారసంస్థల దాకా ఎవరి విధాన, లక్ష్య ప్రకటనలైనా కావచ్చు. కాకపోతే ఎక్కువగా రాజకీయ పార్టీలు, కళారంగసంస్థలు వివిధ అంశాలపై తమ నిశ్చితాభిప్రాయ ప్రకటనకు మేనిఫెస్టోలను ఉపయోగిస్తారు. 

ఇది కవిసేన మేనిఫెస్టో. 1970ల తొలిదశలో కవిసేన ఏర్పడిందని చెప్తున్నారు. 1977 లో ఈ కవిసేన మేనిఫెస్టో వెలువడింది. కర్త గుంటూరు శేషేంద్ర శర్మ. మేనిఫెస్టో రచన ఒక వ్యక్తీ చేయవచ్చు, ఉమ్మడిగా కొందరు వ్యక్తులూ చేయవచ్చు. సాధారణంగా రచయిత ఒకడే అయినప్పటికీ అది ఆ సమూహపు ఏకాభిప్రాయం అయి ఉంటుంది. 

కవిసేన అన్నది ఒక సమూహం, ఒక ఉద్యమం అని స్ఫురింపజేస్తున్నప్పటికీ ఈ సంస్థ పుట్టు పూర్వోత్తరాలు, కార్యనిర్వాహక విధానాలు, ఎప్పుడు పుట్టి ఏ విధంగా నడిచి, ఎలా అంతరించిందీ లేదా ఇంకా కొనసాగుతున్నదీ వంటి వివరాలేవీ ఈ మేనిఫెస్టో పునర్ముద్రణలో అనుబంధంగానైనా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వాళ దీన్ని గురించి తెలిసిన వాళ్ల సంఖ్య అల్పం.

కవిసేన మేనిఫెస్టోని శేషేంద్రశర్మ ‘ఆధునిక కావ్యశాస్త్రమ్’ అనీ వైజ్ఞానిక ఉద్యమం అనీ కూడా అన్నాడు. అందువల్లే ఈ మేనిఫెస్టో రెండువందల యాభై పేజీలకు విస్తరించింది. వాస్తవానికి కవిసేన నియమాలు-ఆశయాలు రెండు పేజీలకే పరిమితం. తక్కినదంతా ఆధునిక కావ్యశాస్త్రమే.

అసలు కవిత్వమంటే ఏమిటి? కవిత్వ ప్రయోజనమేమిటి? అన్నవి ప్రధాన ప్రశ్నలీ మేనిఫెస్టోలో. ఈ నిర్వచనాల కోసం ప్రాచ్యపాశ్చాత్య కవిత్వ సిద్ధాంతాలన్నింటినీ ఆయన అవలోడనం చేశాడు. ప్లేటో మొదలుకొని మావో దాకా వేదాలు మొదలుకొని పురాణేతిహాస కావ్యాల దాకా ఆయన ఉటంకించాడు. ఆయా సిద్ధాంతాల కనుగుణంగా పూర్వకవులనుండీ తన కవితలనుండీ ఉదాహరణలిచ్చాడు.

ముందుగా కవిసేన ఆశయాలు – నియమాలు తెలుసుకుందాం.

మనిషిని గురించిన ప్రసిద్ధమైన నిర్వచనాలకు ప్రత్యామ్నాయ నిర్వచనాలిచ్చింది ఈ మేనిఫెస్టో.

మనిషి ఆలోచించే జంతువు – మనిషి కన్నీరు కార్చే జంతువు.

మనిషి పనిముట్లు చేసే జంతువు – మనిషి ఆయుధాలు చేసే జంతువు

పనిముట్లు చేసే మనిషిని ఆయుధాలు చేసే మనిషిగా మార్చాలి, అంటే జీవితం చేతిలో ఓడిపోకుండా జీవితంకంటే బలవంతుడు కావాలి మనిషి.

కేవల మానసిక యుగానికి స్వస్తి చెప్పి మనిషి క్రియాయుగానికి స్వాగతం చెప్పాలి.

ప్రజాకోటికోసం కవిప్రయోగిస్తాడు తన ఆయుధం, ప్రజాగాథ కోసం ప్రవహిస్తుంది కవిసిరా.

కవే దేశానికి అసలు నాయకుడు. రాజకీయవాది కాడు. రాజకీయవాది నాయకత్వాన్ని కవిసేన తిరస్కరించింది. రాజకీయ భవనాల్లో పెంపుడు కుక్కల్లా బ్రతికే కవి నామకుల్ని గర్హిస్తుంది.

కవి తన ఆయుధాన్ని గురించి తెలుసుకోవాలి. తన ఆయుధాల్ని ఎలా ప్రయోగించాలో తెలుసుకోవాలి.

కవితాయుధ ప్రయోగవిద్యా రహస్యాలు తెలుసుకోడానికీ కవితా చైతన్యం ఆవహింపజేసుకోవడానికీ ఆధునికయుగంలో ప్రారంభమైన శ్రామికలోక మహోత్సవంలో మొదటి జెండా ఎగరెయ్యడానికీ దిక్కుదిక్కులా కవిసేన ఉదయించాలి.

ఈ కవిసేనకు ఉండవలసిన ఆశయాలు:

 1. ఇది కవుల పార్టీ (ఎ) కవి-కవితా శిల్పం (బి) కవికీ – సమాజానికీ ఉండే సంబంధాలు – ఈ రెంటిపై ఈ సంస్థ రూపొందించబడింది.
 2. కవిత్వానికి ఒక ప్రమాణం నిర్ణయించాలి. ఈ ప్రమాణం ప్రపంచంలో కవిత్వ తత్త్వవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు పరిశీలించి, ఏదో ఒక సార్వత్రికమైన సూత్రాన్ని స్వీకరించటం. దీనితోటి అన్నిదేశాల్లో, అన్నికాలాల్లో అగ్రగణ్యమైన కవుల కృతులను జోడించి వర్తమాన కవితని కొలిచి తీరాలి – కవిత కానిదాన్ని నిర్దాక్షిణ్యంగా బహిష్కరించాలి. కవితకు కొలబద్దలేదనే unscientific దృక్పథాన్ని ఖండించాలి. 
 3. ఆర్థిక సామాజిక సమస్యల వరకు ఈ శతాబ్దం అంగీకరించిన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని కనీస పరిష్కారంగా స్వీకరించాలి.
 4. సమగ్ర మానవజీవితంలో రాజకీయం ఒక భాగం మాత్రమే. కానీ కవి సంపూర్ణ మానవ జీవితంతో సంబంధం ఉన్నవాడు. కనుక కవిబాధ్యత రాజకీయ భాగానికే పరిమితం కాదు. ప్రస్తుత సామాజిక సందర్భాన్ని అనుసరించి కవి దృష్టిలో రాజకీయం హెచ్చు భాగం తీసుకోవచ్చు కానీ, కవి సంపూర్ణమానవుని మీద తనకున్న బాధ్యతల్ని విస్మరించి ఒక పరిమిత ప్రయోజనాలకు మాత్రమే బద్ధుడై పోకూడదు. కవి సరాసరి మానవజాతికి బాధ్యుడు. ఒక రాజకీయ పార్టీకి కాదు.
 5. పై కారణాల చేత అంటే మొత్తం మానవజీవితం పట్ల కవికి బాధ్యత ఉండడం చేత కవి బాధ్యత రాజకీయ పరమైన బాధ్యతకంటే గురుతరమైనది. కనుకనే మానవ సమాజక్షేమం కోసం కవి నాయకత్వం అన్నింటికంటే అగ్రగణ్యం కావాలి. ఈ వైజ్ఞానిక నాయకత్వాన్ని నెలకొల్పడానికి కవిసేన ముఖ్యంగా ఉద్యమిస్తుంది.
 6. కవి కులమతకాల భాషా దేశాలనే పంచవిధ బంధాలను అధిగమించి తెంచుకొని బయటపడాలి.
 7. కవిత్వం, కవిపాత్ర – భాషాపరంగానే ముగిసిపోకుండా క్రియాపరంగా అన్వయం అయితేనే దానికి అర్థం ఉంటుంది. 
 8. కథకుడు, నవలాకారుడు, విమర్శకుడు, నాటక రచయిత కూడా కవిగా పరిగణించబడతాడు ఈ కవిసేనలో. దీనికొక షరా కూడా ఉంది.

ఇది రాజకీయ ఉద్యమం కాదు. ఇది ప్రధానంగా వైజ్ఞానిక ఉద్యమం. కవికి రాజకీయాలతో సంబంధం ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలతో ఉండదు. రాజకీయ పార్టీల వాళ్లు సభ్యులుగా ఉండవచ్చు కానీ మూలభూతమైన కవిసేన ఆశయాలకు లోబడి మాత్రమే ఉండగలరు.

ఇదొక అష్టసూత్ర ప్రణాళిక.

వీటిలో మొదటిది కవిసేన ఒక కవుల పార్టీ అని చెప్తుంది. ఈ సంస్థ రూపొందించబడడంలో రెండు ప్రధానాంశాలున్నాయి. ఒకటి – కవి – కవితాశిల్పం, రెండు – కవికీ – సమాజానికీ ఉండే సంబంధం.

ఈ రెండు అంశాలూ తరువాతి పేజీలన్నిటా విస్తారంగా పరుచుకొని ఉన్నాయి. కవిత్వమంటే ఏమిటి, కవిత్వ ప్రయోజనమేమిటి? అన్నవే ఈ ఆధునిక కావ్యశాస్త్రంలో ప్రధాన చర్చనీయాంశాలు.

రెండో అంశం కవిత్వానికి ఒక ప్రమాణం నిర్ణయించడం. దీనికొక సార్వత్రిక సూత్రాన్ని స్వీకరించాలని, వర్తమాన కవితలను అన్నిదేశాల్లో, అన్ని కాలాల్లో అగ్రగణ్యులయిన కవుల కృతులతో పోల్చి కొలవాలంటాడాయన. అలా కొలిచి ఆ కొలతకు నిలబడని అకవిత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాలంటాడు. రచయితను కూడా తన రచనను పూర్వమహాకవుల రచనలతో పోల్చుకొని వాటిని పోలగలిగితేనే లోకం మీదికి వదలమంటాడు. కవిత్వస్థాయిని నిర్ణయించేది సహృదయహృదయం కాక నిర్దిష్టంగా 1, 2, 3 అనిమార్కులు వేయదగిందిగా ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. వాల్మీకినో, కాళిదాసునో ప్రమాణంగా తీసికొంటే అసలు సంస్కృతంలో కవిత్వముంటుందా? అన్నది కూడా ప్రశ్నే.

కవితకు కొలబద్దలేదనేది అశాస్త్రీయమా? కొలబద్ద ఎప్పుడూ సాపేక్షికమే కదా!

మూడవ అంశం ఆర్థిక సామాజిక సమస్యలు. వీటికి పరిష్కారం ఈ శతాబ్దం వరకు మార్క్సిస్టు సిద్ధాంతం అని నమ్ముతున్నాడాయన. కవిసేన కవుల విశ్వాసం ఇది. కాని ఇదే విశ్వాసాన్ని ప్రకటించే ఎందరో కవుల కవితల్ని ఆయన అకవిత్వమని తిరస్కరిస్తాడు.

నాలుగవ అంశంలో మానవజీవితంలో రాజకీయం ఒక భాగమేనననీ, అది ఒకప్పుడు ప్రాధాన్యం వహించవచ్చు గాని; అదే సర్వస్వం కాదనీ, కవి మొత్తం మానవజీవితానికి బాధ్యుడనీ అంటాడాయన. కవి రాజకీయ పార్టీకి బాధ్యుడు కాదంటాడు.

ఐదవ అంశం కవి వైజ్ఞానిక నాయకత్వాన్ని నెలకొల్పాలనడం.

కవి కులమతకాల భాషా  దేశ భేదాలకు అతీతుడుగా ఉండాలనడం కవికే కాదు ప్రతి మనిషికీ వర్తిస్తుంది. అది ఆదర్శం.

ఏడవ లక్షణం కవిత్వం, కవిపాత్ర. ఇది భాషాపరంగా మాత్రమే ముగిసిపోకూడదనీ క్రియాపరంగా అన్వయమైనప్పుడే దానికి అర్థం ఉంటుందంటాడు. ఇది మరింత వివరింపవలసిన అంశం. కవే దేశానికి నాయకత్వం వహించాలన్నదీ దీనితో సంబంధించిందే. రాజకీయం లేకుండా ఇది సాధ్యం కాదు. కవి లక్ష్యం ఇదేనా? అన్నది చర్చనీయాంశం.

ఎనిమిదవ అంశం సాధారణమైందే. భారతీయ ఆలంకారికులు కావ్యనిర్వచనం చేసినప్పుడు అది పద్యమా, గద్యమా, చంపువా, నాటకమా అన్న వివక్ష చూపలేదు. కవి, రచయిత అక్కడ సమానార్థకాలే.

ఆనందవర్ధన, అభినవగుప్తాదుల కవితా సిద్ధాంతాలను శేషేంద్ర శర్మ అంగీకరించాడు. వాచ్య, లక్ష్య, వ్యంగ్యాలలో కావ్యం వ్యంగ్య ప్రధానమైనది.  ఈ మూడూ ఉత్తరోత్తరం శ్రేష్ఠమైనవి.

నన్నయతో మొదలుకొని చిన్నయ దాకా తెలుగు సాహిత్యమంతా వాచ్యార్థ ప్రధానమనీ, భావకవిత్వం మాత్రం కొంచెం లక్ష్యార్థ ప్రధానంగా సాగిందనీ వారి అభిప్రాయం. ఆ విధంగా తెలుగుసాహిత్యాన్నంతా ఆయన మూడోతరగతిలో చేర్చివేశాడు.

ఇక సమకాలీన సాహిత్యం గురించి గుంటూరు శేషేంద్ర శర్మ అభిప్రాయాలు చూడాలి. కవులు, విమర్శకులు, పాఠకులు అందరి గురించీ ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు.

సరే, ఒక సంస్థ ఏర్పడడానికి అవసరమైన పరిస్థితులుండాలి. కవిసేన ఆవిర్భావం ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది.

“తెలుగు దేశ వాతావరణం ఎలాంటిదంటే 30, 40 ఏళ్లనాడు ప్రవేశించిన సాహిత్యముఖ రాజకీయవాదులు, వాళ్ల బానిసలు, భజనపరులు మనసాహిత్యరంగంలో నిర్వీర్యవైజ్ఞానిక వర్గ ఉపేక్షచేత, అపేక్ష చేత ఈనాడు శిఖరస్థానాలెక్కి కూర్చున్నారు. ఇప్పుడు స్వేచ్ఛావాద కవి కేవలం వ్యక్తిగతంగా నిల్చుని ఈ ముఠాల్ని ఎదుర్కొని నిలవడం కష్టం. ఈ ముఠాలు పత్రికల్ని, రేడియోల్ని, వేదికల్ని, సమస్త ప్రచార సాధనాల్నీ రాజకీయ పలుకుబడి అందజేసుకుని హస్తగతం చేసుకున్నాయి. ఒంటరిగా ఉన్న స్వేచ్ఛావాది కవులు అసహాయులై పోయారు. ఈనాటి ఆంధ్రదేశంలో  ఈ ముఠాకవుల ధాటికి తట్టుకోలేక అందరూ ఏదో ఒక వర్గంలో చేరిపోయి ఆ రాజకీయపార్టీ భజన చేస్తున్నారు. కనుక స్వేచ్ఛావాదులైన కవులు రక్షణ సాధించాలంటే అది ఉద్యమరూపంలోనే ఉండవలసిన అవసరం అనివార్యం అవుతోంది. కనుకనే కవిసేన అనే పార్టీ ఈనాడు ఒక చారిత్రక అవసరం.” ఇదీ పరిస్థితి. అందువల్ల స్వేచ్ఛావాదులైన కవులు, విమర్శకులు ఒక పార్టీ కావాలి. వివేకవంతులైన కవులూ, విమర్శకులు సర్వులూ కవిసేనని బలపరచాలి. ఈ నేపథ్యంలో, ఈ ఆవశ్యకతతో కవిసేన ఏర్పడింది.

కవిసేనకు సమాజం కావాలి. కాని సామాజిక చైతన్యం, స్పృహ అని నినాదాలు చేసేవారి సామాజిక చైతన్యం కాదు.

“మనకళ్లు సూర్యోదయం కోసం తహతహలాడే తరుణంలో తెల్లవారు జామున్నే కనిపించే రెండుముఖాల్లో ఒకటి వచన కవితా వీరకుంకుమ ధరించిన బుడబుక్కలవాడు. మరొకటి వాడి కొడుకు, సామాజిక చైతన్యగానం చేసేపాములవాడు… కనబడగానే వాళ్లమీద పేడనీళ్లు చల్లండి.” అంటాడు.

“కవికి సామాజిక స్పృహ కావాలి. కాని వర్తమాన ఆంధ్రకవితా రంగంలో ఈ సామాజిక స్పృహ ఒక నీచస్థాయి నినాదరూపం ధరించి భయంకర సుడిగుండంలా ఏర్పడింది. ఈ నినాదం నుంచి యువకుల్ని రక్షించుకోవలసిన సాహిత్య అవసరం బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ ఉన్నవాళ్లందరి  మీదా ఉంది.”

ఈ సామాజిక చైతన్యం, కవితా వస్తువు అన్న రెండు అంశాలను సమకాలిక కవి, విమర్శకులు ఉపయోగించుకుంటున్న తీరును శేషేంద్రశర్మ తప్పుపట్టాడు.

“ఎలా చెప్పాడో ముఖ్యంకాదు, ఏది చెప్పాడన్నది ముఖ్యం” అనేవాళ్లు ఎవరన్నా ఇంకా ఉంటే వాళ్లని ఏం చేయాలో తెలుగుదేశం తేల్చుకోవలసిన చారిత్రిక సన్నివేశం ఈనాడు ఏర్పడింది అంటాడాయన.

వస్తువుదేముంది. కోట్ల వస్తువులీ లోకంలో అంటాడు.

“…కేవల సామాజికచైతన్యం కూపస్థమండూకంగా మరణించకూడదు.” అంటాడు

గుంటూరు శేషేంద్ర శర్మ క్రోధమంతా సమకాలిక కవులు, కవిత్వం, విమర్శకుల మీద.

“ఈరోజు తెలుగుకు పట్టిన గ్రహణం ఏమిటి? అన్యవృత్తులనాశ్రయించి బ్రతకవలసిన యోగ్యత ఉన్నవాళ్లందరికీ కవిత్వమొక్కటే లోకువ అవుతోంది.” అంటాడు.  

“దాదాపు నలభయ్యేళ్లు తెలుగుకవులూ విమర్శకాగ్రేసరులూ అదేపనిగా ‘వస్తువు’ నే చర్చించారు; మరి దేన్ని గురించీ చర్చించలేదు. సామాజిక చైతన్యం, ఆత్మాశ్రయ కవిత్వం రొమాంటిసిజం మార్‌క్సిజం అస్తిత్వవాదం, ఇలాగా, ఈ వెధవ చెత్తలో నుంచే పీకిపీకి తాళ్లు పేనుతూ సాహిత్యవిమర్శ అనే లేబిల్ తగిలించి వాణిజ్యం చెలాయిస్తున్నారు” అంటాడు.

“కవిత్వ విమర్శకుడు తన విమర్శనా వస్తువైన కవితలో వ్యుత్పన్నత ఎన్నిపాళ్లు ఉంది అని ముందు పరీక్షించాలి అనీ వ్యుత్పన్నత తక్కువ వున్న వాడికి నేల టికెట్టు ఇవ్వాలేగానీ రిజర్వుడు సీటు ఎక్కించి కూర్చోపెట్టకూడదు అనీ ఉద్ఘోషిస్తుంది కవిసేన” అంటాడు.

“….దొంగ కవిత్వాలు రాసీ చచ్చు కథలు పేనీ రాజకీయ జెండాల నీడల్లో మేడలు కట్టుకొనీ నలభై ఏళ్ల నుంచీ కాలక్షేపం చేస్తున్నారు.” అని విమర్శిస్తాడు.

“ఈ సాహిత్యద్రోహుల్ని వాళ్ల కోటలతో సహా విధ్వంసం చేసే చారిత్రిక కార్యం కోసమే ఈనాడు కవిసేన పుట్టింది” అంటాడు.

ఇలా కవిసేన మానిఫెస్టో నుంచి వాక్యాలు ఉద్ధరించుకుంటూ పోతే సమకాలీన కవి విమర్శకుల గురించి శేషేంద్రశర్మ క్రూరవ్యాఖ్యలెన్నో ఉటంకించవలసి ఉంటుంది. సమకాలిక కవిత్వమంతా అకవిత్వమనీ, కవులూ విమర్శకులూ మూర్ఖులనీ, వాళ్లు కవిత్వమంటున్న అకవిత్వాన్ని అంతకంటే మూర్ఖులైన పాఠకులు కవిత్వమని నెత్తిన పెట్టుకుంటున్నారనీ, నిజమైన కవిత్వాన్నీ, కవుల్నీ, విమర్శకుల్నీ గుర్తించడం లేదనీ, అకవులే రాజ్యమేలుతున్నారనీ సింహాసనాలెక్కి ఊరేగుతున్నారనీ, రాజకీయ పార్టీల మద్దతులో, వారి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనీ ఆయన విమర్శ.

వచన కవితా పితామహులూ, గడ్డాలగాళ్లూ, వస్తువే సాహిత్యమని నినాదప్రాయమయిన కవిత్వం రాస్తూ శేషేంద్రశర్మ వంటివారు రాస్తున్న కవిత్వంలో అర్థమేమిటని ప్రశ్నించేవాళ్లూ మూర్ఖగార్దభాలని ఆయన విమర్శ.

విప్లవ కవిత్వంలో నినాదాలెక్కువనీ కవిత్వం తక్కువనీ చాలామంది విమర్శించారు. అయితే 1970 ల ప్రారంభంలో రాజ్యమేలిన విప్లవకవిత్వంలో వస్తువు ప్రధానం కావడమూ, నినాద ప్రధానం కావడమూ అర్థం చేసుకోదగిందే. ఉద్యమసమయంలో కవిత్వం చాలావరకు ఇలాగే ఉంటుంది. మార్క్సిజాన్ని విశ్వసించే వాళ్లకు ఇటువంటి కవులమీద కొంత సానుభూతి ఉండాలికదా!

మొత్తంమీద చూసినప్పుడు కవిత్వసిద్ధాంతాల గురించి కవిసేన చేసిన చర్చలో లోపమేమీ లేదు. కాని కవిసేన లక్ష్యాల గురించీ, ఆ లక్ష్యాల సాధనలో కవిసేన నిజాయితీ గురించీ కొంత ఆలోచించవలసి ఉంది. ఏ సంస్థ ఆశయాలు ప్రకటించుకుంటుందో ఆ ఆశయాల సాధనలో దాని కృషి ఎలా సాగింది, ఎంత దూరం ప్రయాణించింది, ఏం సాధించింది అన్నది చివరిగా లెక్కలోకి రావలసింది.

కవి బాధ్యత భాషతో ముగిసిపోకూడదనీ, క్రియాపరం కావాలనీ చెప్పుకున్న కవిసేన తన ఆశయాన్ని ఎన్నడూ పాటించినట్లు కనిపించదు.

కవిసేన ఒక క్రియాశీలమైన సంస్థగా ఎప్పుడూ కనిపించలేదు. ఏదో ఒకానొక ఆవేశపూరితక్షణంలో పుట్టి ఎటువంటి క్రియాత్మక ఉద్యమరూపమూ సంతరించుకోక ఎప్పుడు ముగిసిందో కూడా తెలియక మరుగున పడిపోయింది. తెలుగుసాహిత్య రంగంలో ఒక గణనీయమైన ఉద్యమంగా అది నిలవనే లేదు. కాబట్టి తెలుగు సాహిత్యచరిత్రలో అది ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది.

గుంటూరు శేషేంద్ర శర్మ ఒక విశిష్టకవి. తెలుగు సాహిత్యోద్యమాలనబడే వాటిలో వేటిలోనూ ఇమిడేవాడు కాదు. అందువల్ల గొప్పకవే అయినా ఒక నాయకత్వ స్థానం లభించలేదు. వచనకవితకు కుందుర్తి ఎలానో విప్లవకవితకు శ్రీశ్రీలాగానో, భావకవిత్వానికి కృష్ణశాస్త్రిలాగానో, ఆధునిక యుగంలో సంప్రదాయానికి విశ్వనాథలాగానో శేషేంద్ర నాయకుడు కాలేకపోయాడు. బహుశా ఇదే ఆయన కవిసేన స్థాపనకు దారితీసి ఉంటుంది. అది ఒక ఉద్యమరూపాన్ని ధరించకపోవడం వల్ల ఆయన మళ్లీ ఏకాకిగానే ఉండిపోయాడు. ఒక ఉద్యమ నాయకుడు కాకపోయినా మంచికవిగా శేషేంద్ర గుర్తింపు పొందనే పొందాడు.

కవిసేన అనామకంగా మిగిలిపోయింది కాని శేషేంద్ర శర్మ ‘కవిసేన మేనిఫెస్టో’ మాత్రం ఒక విద్యాత్మక పత్రంగా నిలిచింది.

డి చంద్ర శేఖర రెడ్డి

ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో చదువుకున్నారు. అదే కళాశాలలో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసారు. తెలుగు కావ్య పీఠికలపై పరిశోధన చేసారు. ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి పలు గ్రంథాల అనువాదాలలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఎమెస్కో ప్రచురణ సంస్థ సంపాదకులుగా ఉన్నారు.

1 comment

 • రెడ్డికి గారి వ్యాసంఎంతో హుందాగా ఉంది . సంయమనం , సానుకూలత , సారళ్యం మేళవించి రాశారని చెప్పవచ్చుఁ.
  ఒక సగటు పాఠకుడిగా , నా అవగాహన మేరకు కవిసెన మేనిఫెస్టో కవిత్వానికి నిర్వచనం చెప్పే లేక నిర్వచనం చెప్పడానికి పూనుకున్న రచన . దీని ప్రధాన లక్ష్యం ఇదే . రెడ్డిగారే వ్యాసం మొదట్లో సెలవిఛ్చినట్లు , మేనిఫెస్టో అనదగ్గ భాగం కొన్ని పుటలే . మొత్తం పుస్తకం , ఏ అధ్యాయం , ఎక్కడినించి చదివినా చివరికి కవిత్వానికి నిర్వచనం తోనే ముగుస్తుoది . కవిత్వానికి బహుముఖంగా అనేకకోణాల నుంచి నిర్వచనం చెప్పాలనే తహ తహ ఆక్రోశం శేషేంద్ర లో అంతకు ముందునుంచే ఎన్నో ఏళ్లుగా ఉన్నట్లు ఆయన కొందరి కవితా సంకలనాలకు రాసిన ముందుమాటల్లో వెల్లడవుతుంది . ఉదాహరణకు గా ఒక ముందు మాట ఈ ప్రచురణలో అచ్ఛువేసాం . అదే రెడ్డి గారు అంటున్న ఉద్యమమం నేపథ్యం లేక వివరణ పూర్తిగా ఇస్తుంది . 1970లో వఛ్చిన ప్రధాన స్రవంతి కవిత్వం పై పైన తిరగేసినా , ఈ నిర్వచనం చెప్పే అవసరామ్ సులువుగా బోధపడుతుంది .
  ఇందులో ప్రత్యేకించి విరసం గానీ విరసం కవుల పయిన గానీ ఎలాటి ప్రతికూల లేక సానుభూతిరహిత వ్యాఖ్యలు విమర్శ లేవు .
  ఈ సందర్భంలోనే , విజ్ఞులయిన విమర్శకులు , విప్లవ కవులు గమనించవలసిన ప్రధాన అంశం – విరసం , విరసం మేధావులు మార్క్సిస్టు సాహిత్య సిద్ద్ధాంతం , ఆ సిదాంతం ప్రకారం కవిత్వం నిర్వచనం తదితర కీలకాంశాలు జోలికి పోకుండా , ఈ మేనిఫెస్టో మీద తీవ్ర విమర్శలు చేశారు . మరీ ఘోరం , శివసాగర్ , వార్ వార్ రావు , చెరబండ రాజు వంటి తమ ప్రామాణిక కవులను ప్రస్తావించనైనా లేదు . తమ సభ్యులకు వివరించిన దాఖలాలు లేవు .
  విరసం ఒక సంఘటిత రచయితల సంఘం గా ఆవిర్భవించి కొనసాగిందా అనే అంశాన్ని పరిశీలించాలి . 1975. నాటికే నిఖిలేశ్వర్ జ్వాలాముఖి విడిపోయి మరో ప్రముఖ మేధావి నాయకత్వాన్ని స్వీకరించారు . అదీ తాత్కాలికమే . వారినుంచీ వేరుపడ్డారు . ఇలా ఎందరో . …
  kavisena. maanifesto. మీద వఛ్చిన విమర్శల్లో దృష్టిలోకి తీసుకోదగ్గవి బహుశా మూడే . అవి తిరుపతి మావో , kvr. బాలగోపాల్ వి – కవిత్వం పైన తిరుపతి మావో రచనా సామగ్రి ౨౦౦ పేజీలు పైచిలుకు ఉంటుంది . జాగ్రత్తగా గమనిస్తే , మార్కిస్టు సాహిత్య సిద్ధాంతం కవిత్వానికి నిర్వచనం గానీ , పైన ప్రస్తావించిన విప్లకవుల కవితల ప్రస్తావన గానీ నీడగా నైనా కనిపించదు. .
  ఈ మధ్య కొందరు కవులు kavisena. Manifesto. ను ప్రమాణంగా ప్రస్తావిస్తున్న సందర్భాలున్నాయి .
  ఒక వితంతువయితే ఆంద్ర భూమి సాహిత్యం పేజీ లో ఈ manifesto. లోంచి పేజీలు పేజీలు తనపేరుతో అచ్చూ వేయించుకుంటున్నాడు .
  ఇంకా ….. ఎన్నో … విషయాలున్నాయి .
  1970. నుంచి వర్తమాన తెలుగు కవిత రంగంలో కవిత్వానికి నిర్వచనం చెప్పే ప్రయత్నం ఎవరయినా చేశారా? చెప్పిన రచనలు ఏవయినా ఉన్నాయా ? అన్న అంశం మీద పరిశోద్ధనా కు అవకాశం ఉంది .
  ఇలా ఆలోచనల్ని రేకెత్తించిన ప్రియమిత్రులు చంద్రశేఖర రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను .

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.