తన పర తేడా తెలియని
విశ్వ(కర్మల) బధిరత్వం

‘వేగుచుక్కలు’ వినోదిని మీద దాడి చేస్తున్న నయా బ్రాహ్మణ్యం

పోతులూరి వీరబ్రహ్మం గారిని అవమానించారంటూ వినోదిని మీద పరమ హేయమైన దాడికి తెగబడుతున్న వాళ్ళు ఆమె రాసిన ‘వేగుచుక్కలు ‘ పుస్తకం చదివారా- అన్నది నాకు అనుమానమే. ‘ఆ దాడిని సమర్థించబోము,’ అంటూనే, ‘వినోదినిది అవగాహనారాహిత్యం’ అని సన్నాయినొక్కులు నొక్కుతున్న కొందరు మేధావి రచయితల ప్రతిస్పందన మరింత హీనం అనిపిస్తుంది. నిజానికి ఈ బడుగు బలహీన బహుజన దళిత సామాజికాంశాల మీద, ముఖ్యంగా ఈ విశ్వబ్రాహ్మణ – ఎగువ- దిగువ హోదాల పట్ల పట్టు, సాధికారత ఉన్న ఎందరో జరుపుతున్న చర్చోపచర్చల మధ్య తలదూర్చడానికి తగిన అర్హత, అవగాహన నాకు లేవు. కానీ, ఎదురైన అనుభవాలు, తారసపడిన పుస్తకాలు, వాటివల్ల నాకు కలిగిన ఇంగితాన్ని బట్టి ఈ రెండు మాటలు పంచుకుంటున్నాను.

**       **       **

“విశ్వకర్మ నేను విప్రులు మీరయా/ రొప్పి యెక్కువనుట రోతగాదె/ ఎక్కు తక్కువలకు నెవరయా కర్తలు….” అన్న పోతులూరి వారి పద్యాన్ని ప్రస్తావిస్తూ,  తన ‘వేగుచుక్కలు’ పుస్తకంలో రచయిత్రి ఎమ్ ఎమ్ వినోదిని ఇలా అన్నారు:

“బ్రహ్మం గారు విశ్వకర్మ కులస్తులు. సామాజికంగా ఇది శూద్రకులం. నిచ్చెనమెట్ల వర్ణ వ్యవస్థలో నాలుగో వర్ణం. అంటే వేదాలు, స్మృతులు చెప్పిన ప్రకారం చదువుకోవడానికి, జ్ఞానం పొందడానికి అర్హత లేని కులం. తక్కువ కులంగా సామాజిక అగౌరవానికి, అణిచివేతకు గురైన కులం. అలాంటి సామాజిక ఆంక్షలను ధిక్కరించి చదువుకున్న బ్రహ్మం గారు ఎక్కువ తక్కువలకు ఎవరయా కర్తలు అని ప్రశ్నిస్తున్నాడు…. “

– ఇదీ ఆయనను వినోదిని అవమానించినట్టు జరుగుతున్న రచ్చకు, ఆమె మీద జరుగుతున్న దాడికీ మూలమైన పేరాగ్రాఫ్. 

మాల, మాదిగ – అని కులాన్ని ఎత్తిచూపితే atrocity, శిక్షార్హమైన నేరం; కానీ, ‘కటికల రాజారావు మాల’, ‘ పొనుగోటి కృపాకర్ మాదిగ’… అని కులాన్ని పేరు చివర ప్రత్యయంగా చేర్చుకోవడం ఆత్మగౌరవ ప్రకటన. ‘మాలడేగ’, ‘మాలతాచు’, ‘మాలకూత’ – వంటి పదాల్లో తక్కువతనానికి, హీనతకీ మారుగా వాడటం వల్ల అక్కడ ‘మాల’ అనే పదానికి ఉన్న నిందార్థం, మాలమహానాడు లో ‘మాల’కి ఉండదు; ఈ మౌలికమైన తేడా తెలియడానికి ఎటువంటి పాండిత్యం అక్కర్లేదు.

పోతులూరి వారిని శూద్రుడని వినోదిని ఏ గొంతుకతో అన్నదో చూడకుండా వివాదం చేయడం- అయితే మూర్ఖత్వం, లేదా కుట్ర. ‘ఎక్కు తక్కువలకు నెవరయా కర్తలు….’ అని 400 ఏళ్ళ క్రితం ప్రశ్నించిన ఆ దార్శనికుడి వారసులు అని చెప్పుకునే వారు ‘శూద్రులంటే తక్కువ’ని, ‘బ్రాహ్మలంటే ఎక్కువ’ని అనుకోవడం కంటే సిగ్గుమాలినతనం,  భావదారిద్య్రం మరొకటి లేదు.

‘వెనకబడిన వర్ణాలు…’ అని మనువాది, కులదురహంకారి కించబరుస్తాడు. ఆ కులాల వారిని సామాజికంగా ‘వెనకకు నెట్టబడ్డ’ వారిగా గుర్తిస్తుంది అంబేద్కరిస్టు చైతన్యం. వినోదిని చైతన్యం కూడా అదే. ఆమె చైతన్య స్థాయిని అర్థం చేసుకోవడానికి ఆమె వెనకటి రచనలు, పోరాటాలూ తెలుసుకోనక్కర్లేదు; ఏది వివాద కేంద్రమయ్యిందో ఆ పుస్తకం- ‘వేగుచుక్కలు’ ఒక్కటే  చాలు. వేర్వేరు కాలాలకి చెందిన రాయలసీమ (ముఖ్యంగా కడప) వైతాళికులు- అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం- ముగ్గురిని ‘వేగుచుక్కలు’గా గుర్తిస్తూ వారి సామాజిక దృక్పథాన్ని వివరంగా విశ్లేషించారు వినోదిని.

“తక్కువ కులంగా సామాజిక అగౌరవానికి, అణిచివేతకు గురైన కులం”- అని పోతులూరి వారి గురించి అన్నారు వినోదిని. కమ్మవారు శూద్రులని, నాలుగవ అధమ వర్ణం కాబట్టి సంస్కృతం చదవడానికి అనర్హులని 20వ శతాబ్దపు ఆరంభంలో (1920 ప్రాంతాల్లో) కూనపులి పూర్ణయ్య శాస్త్రి అనే వేదపండితుడు కృష్ణాజిల్లా కమ్మవారికి లాయర్ నోటీసు ఇచ్చి, కేసు వేశాడు. అది అవమానించడం అంటే. అదే ఆధిపత్య స్వరంతో ‘సామాజిక అగౌరవానికి, అణిచివేతకు అర్హమైన కులం – పోతులూరి వీరబ్రహ్మంది’- అని వినోదిని రాసినట్లయితే, ‘అవమానించారు’ అనొచ్చు. ఆమెది సంఘీభావ ప్రకటన; అందులో ఆ అగౌరవాన్ని సహించకపోవడం ఉంది, ఆ కులంపై అణచివేతని నిరసించడం ఉంది.

శూద్రుడుకి వ్యుత్పత్తి అర్థం- (శుచ్+రక్, శోచతి)-  శోకించేవాడు, అంటే ఏడుపుగొట్టోడని! ‘బ్రాహ్మణ క్షత్రియావపి యది శుచా ద్రవతః తావపి శూద్రావేవ- బ్రాహ్మణ క్షత్రియులు కూడా ఏడుస్తుంటే, వాళ్ళు శూద్రులే’ అని అర్థం. ఏడుపే కాదు, కాపట్యం, అబద్ధం, విషయలంపటం, సోంబేరితనం, ఉన్మాదం, భయం, దౌర్జన్యం వంటి తామస గుణాలు ఉన్నవాళ్ళు శూద్రులని స్మృతులు ఖాయం చేశాయి. శూద్రగ్రంథం… శూద్రకూత… శూద్రదేవత – అన్ని పదాలూ ‘శూద్ర’ అంటే ‘హీన’ అనే మూలార్థంలోంచి పుట్టినవే. ఇక కింది కులాల్ని హీనపరుస్తూ పుట్టిన సామెతలకి అంతేలేదు. ‘విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు’గా సంస్కృతీకరణ చెందిన కంసాలిని హేళన చేసేవి కూడా ఎన్నో ఉన్నాయి వాడుకలో- ‘కంసాలికూడు కాకులు కూడా ముట్టవు..’, ‘కంసాలి బర్రెనమ్ముతున్నాడు, లోపల లక్కవుందేమో చూడరా…’ వంటివి. పొడలబల్లిని కంసాలిబల్లి అంటారు. మరో వైపు దోపిడికి గురయ్యే కంసాలి జీవితం పట్ల సానుభూతి కూడా కనబడుతుంది- వెట్టిచాకిరి అనే ఉద్దేశంతో వాడే ‘కంసాలికొలువు’ అనే పదంలో.

ఒక పక్క ఇంత వివక్షకి లోనవుతూ, అణీచివేతకి గురవుతూ, వెనకటి సామాజిక తప్పిదాల పరిహారం కోసం అందుతున్న రిజర్వేషన్లతో సామాజిక ఊర్థ్వ చలనం కోసం విశ్వప్రయత్నం చేస్తున్న విశ్వకర్మలు – తమని సామాజిక శూద్రత్వానికి పరిమితం చేసిన చాతుర్వర్ణ్య వ్యవస్థతో గొడవపడాలి, వివక్ష మీద తిరగబడాలి. అంతేగానీ, ఆ పదాల పుట్టుక, సామెతల కల్పనలో వాడే భాష, దాని వెనక రాజకీయాల్లో కూడా సామాజిక కోణాన్ని తరచి చూసి, వెల్లడి చేసి, సమాజాన్ని చైతన్య పరుస్తున్న ఉద్యమకారిణి, కవి, రచయిత  వినోదిని మీద దాడికి దిగడం పరమ దుర్మార్గం.

బ్రాహ్మణులకి సాత్విక ధర్మాలు అధిక స్థాయిలో, క్షత్రియులకి మధ్యమ స్థాయిలో, వైశ్యులకి అధమ స్థాయిలో, శూద్రులకి శూన్యస్థాయిలో ఉంటాయి అని ఉచ్ఛనీచాల విభజన ఒక హఠన్యాయంగా కొనసాగుతున్నప్పుడు ఆ so-called ‘సాత్విక ధర్మాలు’ మీకంటే మాకే ఎక్కువ అని శూద్రులుగా అణచబడ్డ వర్ణాల నుంచి ధిక్కార స్వరం వినిపించడం కచ్చితంగా విప్లవమే. ఆ మాటకొస్తే,  వైదిక బ్రాహ్మణుల ఆధిపత్యం పెచ్చరిల్లుతుందని వారికి వ్యతిరేకంగా పరమహంస జి.ఎస్.బి సరస్వతి అనే నియోగ శాఖకి చెందిన బ్రాహ్మణుడు తిరగబడటం కూడా విప్లవమే (ఒక కాలవ్యవధికి పరిమితమైనప్పటికీ). ‘జయార్థ ప్రకాశిక’ అనే గ్రంథకర్త అయిన సరస్వతి, వైదిక బ్రాహ్మల మీద కోపంతోనే కమ్మవారికి జంధ్యాలు వేయించాడు. శూద్రులకి వేదాధ్యయనం నిషిద్ధం కాదని అన్నందుకు పరమహంస సరస్వతికి భిక్ష దొరక్కుండా పస్తులు ఉండేలా చేయడము కూడా మనువాదపు దాడే.

బ్రహ్మ తన ముఖం నుంచి బ్రాహ్మణులని, భుజాల నుంచి క్షత్రియులని, తొడల నుండి వైశ్యులని, పాదాల నుండి శూద్రులను సృష్టించాడు (‘బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః/ ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత’ – పురుషసూక్తం; ‘బ్రహ్మవాదిన ఏవైతే మరీచ్యాద్యా స్తు సాధకాః/ ససర్జ బ్రాహ్మణా న్వక్త్రాత్‌ క్షత్రియాంశ్చ భుజా ద్విభుః// వైశ్యా నూరుద్వయా ద్వేవః పద్భ్యాం శూద్రా న్పితామహః/ యజ్ఞనిష్పత్తయే బ్రహ్మా శూద్రవర్జం ససర్జహ’ -కూర్మ మహాపురాణం) అని నియతివాదాన్ని రుద్దితే, దాని మీద తిరుగుబాటుగా జంధ్యాలు వేసుకోవడం, ‘ఆది దేవుడు విశ్వకర్మ’ అని, ‘అతని నుంచే మను, మయ, తృష్ణ, దైవజ్ఞులు పుట్టారు, అన్నింటికీ మూలం విశ్వకర్మే’ అని వాదించడం, ఆ వాదానికి దన్నుగా తమ సాంస్కృతిక మూలాలను తవ్వి తీయడం గొప్ప సామాజిక పోరాటమే, సాంస్కృతిక తిరుగుబాటే. కానీ, ఆ ఆత్మగౌరవ ప్రకటనకి ఇప్పుడు ప్రాసంగికత (రెలవెన్స్) లేదు, ఉండకూడదు. ‘మీకే కాదు, మాకూ జంధ్యం ఉంది, మేమూ ద్విజులమే అనడం…’ ఒకప్పటి ధిక్కారం; ఆ దారప్పోగులు వేసుకోవడం, ఆ ద్విజత్వ ప్రగల్భతని మోసుకోవడం లోంచి ఏ గొప్పతనమూ రాదని ఎదిరించడం తర్వాత కాలాల చైతన్యం. ‘అందరికంటే అధికులం అనుకునే బ్రాహ్మల కంటే మేము మరింత అధికులం, మమ్మల్ని శూద్రులు అంటూ అవమానిస్తారా’- అని వినోదిని మీద దాడి చేయమంటే- పుట్టుకవల్ల ఎక్కువ తక్కువలు నిర్ణయించబడతాయనే నీచమైన నియతివాద బ్రాహ్మణ్యంతో అంటకాగడమే. 

‘మేము మీకు తీసిపోము’ అనో, లేదా ‘మీ కంటే కూడా గొప్ప’ అని ఎదిరించడానికి, ‘మీరు, మేము, వారు- ఎవ్వరూ గొప్ప కాదు, తక్కువా కాదు, అందరూ సమానులే’ అని ఎలుగెత్తి చాటి, చలామణిలో ఉన్న అసమానతల్ని రూపుమాపడానికి, ఎగుడుదిగుడు వ్యవస్థని చదును చేయడానికి చేసే పోరాటానికీ ఎంతో తేడా ఉంది. ఆధిపత్య స్థానం కోసం పోటీపడి, ఆనక ‘యథాతథ స్థితిలో భాగమైపోవడం మొదటి రకం ప్రతిఘటనైతే, ఆ స్టేటస్ కోని బదాబదులు చేయడం రెండో తరహా ప్రతిఘటన; అదే అసలైన పోరాటం, అంబేద్కరైట్ విప్లవం.

కమ్మ వారు తాము శూద్రులం కామని, క్షత్రియులమని ఒక దశలో, అసలు బ్రాహ్మలకీ తమకీ తేడా లేదని మరోదశలో ఉద్యమించారు. శతాబ్దం క్రితం పలుదశల్లో జరిగిన చర్చోపచర్చల్లో, వాదోపవాదాల్లో కమ్మ కుల నాయకులు తమ వాదనలు వినిపించారు. చిలుకూరు వీరభద్రరావు గారి ద్వారా బైటబడిన అమ్మరాజ విజయాదిత్యత కురవాడ శాసనం (క్రీ.శ. 1000)- ‘ఆసీచ్చీమురు వాస్తవ్యో దేవర్యో దేవసన్నిభం భరద్వాజాన్వయం కమ్మ కులజః కులవర్ధనః….’ ని ఉటంకిస్తూ,   ‘భరద్వాజాన్వయం’ అని, ‘కమ్మ కులజః’ అని, ‘ద్విజోత్తమః’ అని కూడా ఉంది కాబట్టి పూర్వకాలంలో కమ్మ వారు బ్రాహ్మణులై ఉండేవారని వాదన లేవదీశారు కమ్మ కుల ప్రతినిధులు. అలానే, ఐదవ పశ్చిమ చాళుక్యవిజయాదిత్యుని ఆలూరు శాసనం (క్రీశ 1011)లో ‘విప్రకుల కమలభాస్కరం, పార్వరోల్లండం సప్త గ్రామాగ్రగ్ణ్యం కమ్మకులోద్భవం..’ అని కూడా ఉంది కాబట్టి కమ్మ వారు బ్రాహ్మణులేనని బల్లగుద్ది వాదించారు. మరొక దశలో తాము క్షత్రియులమని వాదన చేశారు. వేదంలో ‘కూర్మ’ శబ్దం వాడబడిందని, ‘కూర్మ’ శబ్దం మరాఠీ భాషలో ‘కుంభీ’ అని మారిందని, తెలుగులో ‘కమ్మ’గా రూపాంతరించిందని, కాబట్టి తాము కూర్ముడనే రాజు వారసులమని, క్షత్రియులమని, శూద్రులం కాదని వాదించారు. శూద్రుల్లో మూడు రకాలు- సచ్ఛూద్రులు (గొల్లలు, మంగలులు), అసచ్ఛూద్రులు (చాకలి), శూద్రులు (మిగతా అణగారిన సేవక కులాలన్నీ)- అందరూ బ్రాహ్మణులకి చేసినట్టే కమ్మ వారికి కూడా సేవలు చేస్తున్నారు కాబట్టి, తాము శూద్రులం కాదని, క్షత్రియులమని వితర్కించారు. 

“క్షత్రియులమని భుజంబు దట్టిన లేదు
సమయ మేతెంచెను క్షాత్రమునకు
కమ్మ వీరులమంచు గాలుద్రవ్విన లేదు
సమయ మేతెంచెను క్షాత్రమునకు
పౌరుషజ్ఞులమంచు బలుక లాభము లేదు
సమయ మేతెంచెను క్షాత్రమునకు
ధనికులమటంచు మదిలోన దలచవలదు
పలుకుబడి గలదంచెదన్ గులకవలదు
క్షాత్రధర్మంబు జూపెడి సమయమిదియె
సరసమతులైన చౌదరి సభ్యులార…

… అని (అప్పటి బాలకవి) కొసరాజు రాఘవయ్య చౌదరి పిలుపునిచ్చారు కూడా, ఆ రణ సందర్భంగా.

కమ్మ వారు శూద్రుల్లా ‘హీన ‘ వర్ణం కాదని, ఉన్నత శ్రేణులకి చెందిన క్షత్రియులని నిరూపించే విషయం మీద  1924 ఆగస్టు 16- 19 మధ్య నాలుగు రోజులు కొల్లూరు (తెనాలి తాలూకా) లో తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. బ్రాహ్మణుల తరఫున పుష్పగిరి పీఠం వారు, కమ్మ వారి తరఫున త్రిపురనేని రామస్వామి చౌదరి, సూర్యదేవర రాఘవయ్య చౌదరి, దుగ్గిరాల రాఘవయ్య చౌదరి  గార్లు పాల్గొన్నారు. ‘కూర్మ’ శబ్దంతో ‘కురుమ’, ‘కమ్మ’ శబ్దంతో ‘కమ్మరి’ సామ్యాలని తెచ్చి కమ్మ వారిని ఎద్దేవా చేద్దామని మల్లాది రామకృష్ణ చయనులు గారి వంటి ‘అగ్రకుల అహంకారులు’ పూనుకుంటే, ‘విప్ర’ శబ్దానికి ‘ఉప్పర’ కులాన్ని లంకె కలుపుతూ బదులు తీర్చుకున్నారు ‘ప్రత్యామ్నాయ పోరాట సారథులు’ (ఇవన్నీ, 1925లో ప్రచురించబడ్డ ‘బ్రాహ్మణేతర విజయం’లో గ్రంథస్థమై ఉన్నాయి).

అయితే, “శూద్రతనము పోయె శూద్రుఁడగానని, ద్విజుఁడనుకొనుటెల్ల దెలివిలేమి…” అని వేమన 400 ఏళ్ళ క్రితమే చెవిటివాళ్ల ముందు శంఖమూదాడు.

బ్రాహ్మణులకి ఎంతమాత్రం తీసిపోమని ధిక్కరించి, ఆత్మగౌరవ ప్రకటన చేసిన కులాలన్నీ ఊర్థ్వచలనానికి పాకులాడటంలోనే కాదు, నిమ్న కులాల్ని హీనపర్చడంలో కూడా బ్రాహ్మణులతో పోటీపడ్డారు. ఇప్పుడు విశ్వకర్మలు కూడా అదే బాటలో ఉన్నారు. నిజానికి, విశ్వకర్మల (విశ్వబ్రాహ్మణుల) పోరాటానికి మరో వందేళ్ళ వయసుంది. తమకు పౌరోహిత్యం చేసే హక్కు ఉందని వారు 1817లోనే న్యాయస్థానంలో పోరాడి, గెలిచి తమకి అనుకూలంగా తీర్పు తెచ్చుకోగలిగారు.

కానీ, ఇవన్నీ కాగితాలకే పరిమితమని, లౌకికప్రపంచంలో అంతరాలు చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయని గ్రహించలేకపోతున్నారు. భారతీయ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించిన AR Radcliffe-Brown Louis Dumont వంటి విదేశీ సోషియాలజిస్టులే కాదు, doyen of Indian sociology గా పేరొందిన యోగీంద్ర సింగ్ వంటి స్వదేశీ సామాజిక శాస్త్రవేత్తలు కూడా  – ఎన్ని దృష్టికోణాల్లోంచి చూసినా, ‘Functionalism’ ద్వారా మాత్రమే భారతీయ సమాజాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి వీలౌతుందన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. మన సమాజం చాలా సంక్లిష్టం: కులాధిపత్యం- అంతరాలు- అణిచివేత, సంప్రదాయపరంగా శ్రేష్ఠులమనే ఆభిజాత్యం, కనిపించే దాని కంటే భిన్నమైన సత్యం ఉందనే మిథ్యావాదం- వీటన్నింటి సమాహారమైన ఈ చిక్కుల సమాజాన్ని functionalism అంటే, ‘వ్యవహరణ వాదం’, సిద్ధాంతం, లేదా మెథడాలజీ ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలమంటారు ఆ సోషియాలజిస్టులు. అంటే, సామాజిక చలనసూత్రాలకి వ్యవహారమే ప్రామాణికం అన్నమాట.

‘చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః (గుణాన్ని బట్టి, వారు చేసే పనులబట్టి చాతుర్వణాలు- నాలుగు కులాలు సృష్టించాను),’ అని భగవధ్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా,’జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః/ వేదజ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణః (పుట్టుకతో అందరూ శూద్రులే, చేసే పనులు అనుష్టానాల వల్ల బ్రాహ్మణులవుతారని, ఎవరైతే బ్రహ్మ జ్ఞానాన్వేషణ చేస్తారో, ఎవరైతే బ్రహ్మ జ్ఞానం కలిగి వుంటారో వారే బ్రాహ్మణులు),’ అని ఆ గీతాకారుడే ప్రవచించినా, వ్యవహారంలో ఏది అమలవుతుందో అదే సత్యం, పుట్టుకతో నిర్ణయించబడుతున్న హెచ్చుతగ్గులే అసలైన నిజం.  

కాబట్టి, మనువాదం లేదని పులికొండ సుబ్బాచారి గారు వంటి స్కాలర్స్ వాదించడం వింతగా ఉంది.
“అధ్యాపనం చాధ్యయనం షట్కర్మాణి ద్విజోత్తమాః
దాన మధ్యయనం యజ్ఞో ధర్మః క్షత్రియ వైశ్యయోః

దణ్డో యుద్ధం క్షత్రియస్య కృషి ర్వైశ్యస్య శస్యతే
శుశ్రూషైవ ద్విజాతీనాం శూద్రాణాం ధర్మసాధనమ్‌”- అని పొల్లుబోకుండా అమలయితేనే మనువాదం కొనసాగుతోందని, లేకపోతే కాలం చెల్లిపోయినట్టేనని పులికొండ వారు అనుకోవడం పొరబాటు.

వర్ణ వ్యవస్థ ప్రకారం ‘పరి చర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్..’ అన్నారు కాబట్టి, పై వర్ణాలకి పరిచర్యలు చేయడం లేదు కాబట్టి అసలు శూద్ర వర్ణమే లేదని ఆయన అనడం ఎలా ఉందంటే –  ‘మంగలి, చాకలి మాకు కూడా సేవలు చేస్తున్నారు కాబట్టి మేము అగ్రవర్ణాల వాళ్ల’మని పైన చెప్పిన కమ్మ కుల నాయకుల కుతర్కం లానే ఉంది. విశ్వకర్మ కులానికి బ్రాహ్మణాధిపత్య కిరీటాలు ఏమీ పెట్టనక్కర్లేదని ఆయన ఒక ‘above board’ పరిపక్వ తలం నుంచి మాట్లాడుతుంటే, మరోపక్క, నేలబారు ఆలోచనలున్న వారి కుల ప్రతినిధులు ‘తమది బ్రాహ్మల హోదా’ అని, ఇంకా చెప్పాలంటే మరో రెండాకులు ఎక్కువేనని గొప్పలు పోతున్నారు. కానీ, వంద, రెండొందల ఏళ్ళ క్రితమే కాదు, ఇప్పుడు వర్తమానంలో కూడా వ్యవస్థలు కరుడుగట్టే ఉంటాయి. ఉదాహరణకి శంకర మఠాల్లో వ్యవస్థీకృత సంప్రదాయంలో, కరుడుగట్టిన ఆచరణలో బ్రాహ్మణులకే తప్ప అన్యులకి స్థానం లేదు. రెండొందల ఏళ్ళ క్రితమే పౌరహిత్య హక్కులు సాధించుకున్న విశ్వబ్రాహ్మణులుగానీ, వైదిక హక్కులు కోసం పోరాడిన మామిడి వెంకయ్యలు…  యర్రంశెట్టి వీరయ్యనాయుళ్ళు… చెర్వుగట్టు రామాచార్యులు… ఎవరిదిదైనా సహాయక, సేవక పాత్రే.

ఈ వాస్తవానికి కళ్ళు మూసుకొని, తమ పక్షాన నిలిచిన ఒక దళిత ఉద్యమకారిణి వినోదిని మీద ఇలా కువిమర్శలతో తెగబడటం, దాడులకి ఎగబడటం హేయం, అమానవీయం.

నరేష్ నున్నా

సుప్రసిద్ధ కవి, విమర్శకులు, పాత్రికేయులు

17 comments

 • మంచి వ్యాసం. వ్యక్తి , స్వేచ్ఛగా కులాన్ని ఒదులుకొన్నంత సులభంగా సామాజికంగా చేయగలిగితే, బావుణ్ణు. కులనిర్ములన జరిగేదెలా? అర్ధపెట్టుబడిదారి వ్యవస్థలో వ్యవహారం వల్లనే కులం irrelevant అవుతుందా?

  • జపాన్ లో కూడా మనల్ని బోలిన నాలుగు వర్ణాల వ్యవస్థ ఉండేదట. సమూరాయిలు ఆధిక్య కులమట, ఇక్కడ భ్రాహ్మల్లాగా. 19వ శతాబ్దంలో (బహుశా 1830లు, లేదా 1850ల ప్రాంతాల్లో) ఒక సామాజిక విప్లవం చోటు చేసుకుందట. ఇలా అంతరాలతో, ఎగుడుదిగుడు వ్యవస్థతో ఉంటే అభివృద్ధి సాధ్యం కాదని అందరూ తీర్మానించుకొని, సమూరాయిలు అనూచానంగా వస్తున్న తమ privileges ఐచ్ఛికంగా వదులుకున్నారని, త్రిపురనేని రామస్వామి గారు రాసినది చదివానొక చోట. అటువంటిది, ఇంత పెద్ద భారతదేశంలో అది సాధ్యమౌతుందా, ఇంద్రప్రసాద్ గారూ…

 • అద్భుతమైన వ్యాసం
  ౧౦౦% ఏకీభవిస్తున్నాను.

  నరేష్ గారు మీ కలంనుండి ఇలాంటి వ్యాసం ఇంతవరకూ చదవలేదు నేను. గొప్ప అనాలిసిస్.
  మీరు ఇంకా రాయాలి.

  • బొల్లోజు బాబా గారూ…
   మీకు నచ్చినందుకు ఆనందంగా ఉందండి. అయితే, నేను అరుదుగా రాసే ఇటువంటి వ్యాసాలని UnNunna articles అంటాను. అంటే, నా ధోరణికి భిన్నంగా, నేను సాధారణంగా టచ్ చేయని topics అన్నమాట. మీకు తెలియందేముంది, John Donne ఆధిభౌతిక కవి, పదారేళ్ల Anne ని గాఢంగా ప్రేమించి, రహస్యంగా పెళ్లి చేసుకొని ఫలితంగా జైలు, బైటకి వచ్చాక నానా కష్టాలు పడుతూ ‘తనవి కాని’ కవితలు రాసిన స్థితిని ‘John Donne, Anne Donne, Undone’ గా అభివర్ణించుకున్నాడు కదా. అలా సాంఘికమైన అంశాలు, రాజకీయ వ్యవహారాలు కూడా UnNunna కేటగిరి. 🙂

 • వావ్….సమగ్ర వ్యాసం…. scientific గ రిసర్చ్ article
  చాలా బాగుంది, వినోదిని విమర్శకుల ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు..

 • కవిత్వమే అనుకున్నా వ్యాసాలు కూడా ఇంత బాగారాస్తారని తెలియదు. వివాదం ఎందుకు అనే దానిపై తర్కబద్దంగా విశ్లేషించారు. జయహో..

 • రచయిత గారు కలియుగ ప్రత్యక్ష దైవం అయినా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి నీ వీరబ్రహ్మం అని రాయుట భావ్యమా శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ దైవ బ్రాహ్మణ అయినటువంటి వారిని శూద్రులు అని వ్రాయుట ధర్మమా రచయితలు ఎవరైనను వాస్తవాలను క్షుణ్నంగా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని రాయవలెను అని నా మనవి

  • రాచర్ల శ్రీనివాసాచార్యులు గారూ…

   మీరు చెప్పాలనుకున్నది చెప్పడం మీద మాత్రమే శ్రద్ధ పెట్టకుండా, ఎదుటవారు చెప్పిందేమిటో (రాసిందేమిటో) వినే ఓపిక చేసుకోవల్సిందిగా మనవి.

 • “పోతులూరి వీరబ్రహ్మం గారిని అవమానించారంటూ వినోదిని మీద పరమ హేయమైన దాడికి తెగబడుతున్న వాళ్ళు”

  వినోదిని రాసే అమాయకపు (?) లేదా అజ్ఞానపు అభిప్రాయాల తో విభేదించే వాళ్ళ మీద అంతకంటే హేయమైన దాడికి తెగబడుతున్న వినోదిని కులస్థుల దాడు ల మీద ఇంతకాలం మీరు బధిరత్వం ఎందుకు నటించారో ఇప్పుడు బాగా అర్ధం అయింది. మీ ‘లింగ వివక్ష ‘ సర్వదా అభినందనీయం.

  ఒక పదం (సూధ్ర ) అవమానం గా వాడుతున్న కాలంలో అది ఇష్టపడని ఓ సమూహం తమ నిరసన వ్యక్తం చెయ్యటం ఎందుకు బధిరత్వం అవుతుందో ?

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.