బ్రాహ్మణ్యం మీద
కలమెత్తిన యోధులు

“భక్తి మీది వలపు బ్రాహ్మణ్యంబుతో బొత్తు బాయలేను నేను బసవలింగ” అని చెప్పిన పండితయ్య తర్వాత క్రమంలో బసవన్న ను పూర్తిగా అనుసరించి, రెవల్యూషనరీ గా వ్యవహరించారు.

(పైన బొమ్మ: బసవన్న)

ఆంధ్ర ప్రాంతానికి చెందిన వీరశైవ కవీ, విమర్శకుడు మల్లికార్జున పండితారాధ్యుడు. పండితయ్యతో పాటు కర్నాటక కు చెందిన బండారు బసవన్న గురించి మాట్లాడుకోవాలి. బసవన్న చేత బాగా ప్రభావితమైన వాడు పండితయ్య. 12 వ శతాబ్దానికి చెందినవాడు. 

జంధ్యము తీసి, బ్రాహ్మణ జాతిని విడిచి, తనతో కలువవలసిందని బసవయ్య పండితయ్య ను కోరాడు. దానికి సమాధానంగా “భక్తి మీది వలపు బ్రాహ్మణ్యంబుతో బొత్తు బాయలేను నేను బసవలింగ” అని చెప్పిన పండితయ్య తర్వాత క్రమంలో బసవన్న ను పూర్తిగా అనుసరించి, రెవల్యూషనరీ గా వ్యవహరించారు.

వర్ణబేధాలను, వర్గ బేధాలను నేలమట్టం చేసి, అందరూ సమానమన్న ధర్మాన్ని తన కవిత్వం ద్వారా విస్తరింప చేస్తూ, నూతన వ్యవస్థను నిర్మించాలన్న ఉద్యమం ఏ కాలంలోనయినా, గొప్పదే. 800 ఏళ్ల క్రితం కర్ణాటక లో బసవన్న ఇలాంటి ఉద్యమాన్ని నడిపి, ఆంధ్ర దేశం లో ఎందరినో ప్రభావితం చేసారు. ఇతనిది ‘వచన’ సాహిత్యం. తాను వీర శైవాన్ని పాటించాడు. బసవన్నది ‘అనుభవ’ సాహిత్యం. లోకానికి దూరం కాని ప్రజోపయోగ కవిత్వం. వర్ణాశ్రమ ధర్మాలను పాటించమని చెప్పే వైదిక మతాన్ని బసవన్న నిరసించారు. బ్రాహ్మణులు చెప్పేదొకటి చేసేదొకటి అని తేల్చి చెప్పాడు. కుల, వర్గ, మత పట్టింపులు లేని ఎక్కువ తక్కువలు లేని, ఆడ మగ తేడా లేని  సమాజం కోసం ఉద్యమించాడు. 

బసవన్న జంగమ దేవర ఆచారాలను పాటిస్తూ యజ్ఞ యాగాదులు, పశు హింస, వర్ణాశ్రమాలను  కడిగి పారేశారు. మఠాలు, ఆలయాల నిర్మాణాలను వ్యతిరేకించారు. ఆర్ధిక అసమానతలకు వడ్డీయే కారణమని, వడ్డీ ని నిషేధించారు. ఈ సమానత్వం కారణంగా,  వేల మంది ఈయన మార్గం అనుసరించారు. 

1196 ఫిబ్రవరి 12 వ తేదీన  అతి గొప్ప సాంఘిక విప్లవ చర్య, వర్ణాంతర వివాహం జరిపించారు. అప్పట్లో అది పెద్ద కల్లోలం రేపింది. బ్రాహ్మణ కన్యను మాదిగ కులానికి చెందిన అబ్బాయి వివాహమాడుతాడా అని ఆగ్రహించి ఆ ప్రాంత రాజు ను నిలదీశారు. విషయం తెలుసుకోకుండా ఆ ప్రాంత రాజు హరళయ్య వారిని శిక్షించాడు. నూతన దంపదుతులు హత్యకు గురయ్యారు. దీనిపై బసవన్న అనుచరులు తిరగబడ్డారు. ఆగ్రహోదగ్రులైన బసవన్న మత శివ చరణులు ఎదురు తిరిగి, 1196 ఏప్రిల్ మూడవ తేదీన ఆ రాజు హరళయ్య ను చంపేశారు. ఆదే ఏడాది జూలై నెలలో బసవన్న సంగమేశ్వరుడి సన్నిధికి చేరి ఆయన లో ఐక్యమయ్యాడు. 

బసవన్న  చేత ప్రభావితమైన పండితయ్య ఆంధ్ర దేశంలో అమలు చేసిన శివతత్వ సారం అప్పటి శివభక్తుల  ‘మాన్యువల్. అంటే, అతివాద వర్గపు “క్రమశిక్షణ స్మృతి” లాంటిది. 

రాను రాను ఈ మత ఛాందసం ఎక్కువై,  పండితయ్య తెలుగు దేశం లోని ఇతర మతస్తుల పుస్తకాలను తగుల బెట్టాడు. ఈ విషయం పై పండితయ్య చాలా విమర్శలకు గురయ్యారు. కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ.

బసవన్న మార్క్సిజం లేని కాలంలో సమానత్వం, సోషలిజం కోసం పోరాటం చేసాడు. రాజ్యాంగం రాసే సమయంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప బసవన్న గురించి అంబేద్కర్ కి చెప్పినప్పుడు. అంబేద్కర్ ఆశ్చర్య పోయాడట, ఇంత గొప్ప ఆలోచనలు వున్న వ్యక్తి కర్ణాటకకే ఎందుకు పరిమితం అయిపోయారా అని. ఆయన వచనాలను ప్రపంచానికి పరిచయం చేయకుండా కన్నడిగులు దేశానికి అన్యాయం చేసారని బాధ పడ్డాడట.

కవిత్వం లో తిరుగుబాటు ధోరణులు 12 వ శతాబ్దానికి ముందునుంచే కనిపించినా, 14 వ శతాబ్దం నుండి క్రమేపి ఫ్యూడల్ వ్యవస్థను సంస్కృత భాషను వ్యతిరేకిస్తూ, ధిక్కార స్వరాలు వినిపించారు, అంటరానితనం, దోపిడీ, అణిచివేతల పై కవులు స్పందించారు. సాహిత్యానికి ప్రజా ప్రయోజనం లక్ష్యం ఏర్పడింది, 19 వ శతాబ్దం నాటికి సాహిత్యం పాత వాసనలను వొదిలేసి, కొత్త నడకలు మొదలు పెట్టింది. రాజకీయ, సాంఘీక స్వరూపాలు మారాయి. తీవ్రవాద భావాలు వినిపించడం మొదలయ్యింది. 14 వ శతాబ్ది కవయిత్రి గంగాంబిక (గంగాదేవి) రచనల్లో అలాంటి తిరుగుబాటు సంస్కృతిని చూడొచ్చు. విజయనగర సామ్రాజ్యం లోని బుక్కరాయుడి కుమారుడు కుమార కంపన భార్య గంగాదేవి. ఈమె వీరకంపరాయ చరిత లేదా మదుర విజయం అనే ఒక కావ్యాన్ని రాశారు. ముస్లింల పాలనలో హిందువులు ఎలా వేదనలకు గురి అయ్యారో, ఎలా ఎదిరించగలిగారో… చెప్పారు. ఈ చైతన్యంతో విజయనగర సామ్రాజ్యం విస్తరించింది. ఇదే శతాబ్దానికి చెందిన, “సింధుమతి విలాసము” కావ్యాన్ని రాసిన “కవి గోపన” ను కూడా ఈ కోవలో చేర్చవచ్చు. సమాజాన్ని ప్రేమ మయం చేసి, కక్షలు కార్పణ్యాల నుండి దూరం చేసేందుకు ప్రేమను పంచాలని ఆయన రాశారు. ఆ కాలంలోనే భారత దేశం లోని ఇతర ప్రాంతాల రచయితలు, రచయిత్రులు తమ కవిత్వం లో సామాజిక చైతన్య ధోరణులను ప్రవేశపెట్టారు. కాశ్మీరీ ప్రాంతానికి చెందిన ‘లల్లేశ్వరి’ సామాజిక చైతన్య ధోరణుల్లో సూఫీ కవిత్వం రాశారు. అప్పట్లో ఆడవాళ్ళను చదువుకు దూరం పెట్టడం తెలిసిందే.  అలాంటి కాలంలో 24 ఏళ్లకే సన్యాసం తీసుకొని ఆమె అనేక కావ్యాలు రాసారు. ఈమె రాసిన కవిత్వాన్ని, తర్వాత రిచర్డ్ టెంపుల్, జయ్లాల్ కౌల్, కలేమన్ బార్క్స్, జైశ్రీ ఓఎన్, రంజిత్ హోస్కోట్ లు ఆంగ్లం లోకి అనువదించారు. దాదాపు 7 శతాబ్దాలుగా లల్లేశ్వరి కవిత్వాన్ని అటు హిందువులు, మహమ్మదీయులు గొప్ప ఆదరించారు. “Remembering Lal Ded in Modern Times” అనే పుస్తకాన్ని ఆమె జ్ఞాపకంగా 2000లో నేషనల్ సెమినార్ లో విడుదల చేశారు. మత పరమైన నిరంకుశత్వాన్ని హెచ్చరిస్తూ ఆమె రాసిన కవిత్వం తర్వాత రాజకీయ ఎజెండాగా ఉపయోగపడింది. హిందువులు లల్లాదేవి అని, మహమ్మదీయులు ‘లాల్ అరిఫా’ అని ఆమెని పిలిచేవారు. ఆ శతాబ్దంలోనే మల్లినాధ సూరి గొప్ప విమర్శకుడుగా పేరు గాంచారు. అదే శతాబ్దం లో “సంత్ బంక” అనే మరాఠీ రచయిత ఒక అంటరాని కులమైన మహార్ కులం లో పుట్టి, వివక్ష ను వ్యతిరేకిస్తూ ‘అభంగాస్’ అని రాసారు. భక్తి కవి అయినప్పటికీ అంటరాని తనం మీద ధిక్కార స్వరమది. ప్రస్తుత దళిత సాహిత్యానికి ఆయన కావ్యాలు ప్రామాణికంగా చెపుతుంటారు. ఆయన భార్య సంత్ నిర్మల కూడా కుల వ్యవస్థ మీద అసమానతలమీద ధిక్కార స్వరం వినిపించారు. సంత్ బంక ను వివాహం చేసుకోవడం విషయంలో పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు. ఆమె రచనల్లో భర్త పేరు ఎక్కడా రానివ్వకుండా రచనలు సాగించారు. ఇదే శతాబ్దానికి చెందిన ‘విద్యావతి’ అనే రచయిత్రి, నిర్మొహమాటమైన ప్రేమ కవిత్వాన్ని ఒక వైపు రాస్తూ, సమాజాన్ని చైతన్య పరిచే దిశగా నైతికత మీద అనేక గ్రంధాలు రాసారు. ఇటీవలే భారత ప్రభుత్వ పబ్లికేషన్స్ డివిజన్ వారు ఆ గ్రంథాలకు హిందీ అనువాదం ను ప్రచురించారు. ఆ సందర్భంగా ఎయిర్ పోర్ట్ కు “కవి కోకిల విద్యావతి ఎయిర్ పోర్ట్” అనే పేరు పెట్టారు.

సి వి సురేష్

సి.వి. సురేష్: కడప జిల్లా ప్రొద్దుటూరు స్వగ్రామం. పూర్తి పేరు చెన్నూరు వంకదార సురేష్, వృత్తి రీత్యా న్యాయవాది, కవిత్వం, అనువాదాలు, విశ్లేషణలు రాస్తున్నారు. సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఈయన తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువాదం చేస్తున్నారు సురేష్ ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్ పత్రిక కు స్టాఫ్ రిపోర్టర్ గా కూడా పని చేసారు.

6 comments

 • బండారు బసవయ్య, లల్లా దేవి,గురించిబాగా రాసారు.!👌👍సర్,ప్రత్యేక అభివందనలు.. మీకుCV sir!

 • ఎక్కడి సమాచారాన్ని సేకరించారు..మీ అన్వేషణ దుగ్ధ అపారం..10 -12శతాబ్దాల సాహిత్య, చారిత్రక గ్రంధాల నుండి సామాజిక చైతన్య కోణంలో ఉన్న అంశాల్ని క్రోడీకరించడం చిన్న విషయం కాదు..నాలాంటివాళ్లకు అంతగా పరిచయం లేని పండితయ్య ,యదావాక్కుల అన్నమయ్య ,కుప్పాంబిక గురించి వివరణ ఆసక్తికరం..
  విద్యావతి ,లల్లేశ్వరి ,గంగాంబిక ,సంత్ నిర్మల…మహిళా రచయిత్రులు ఎప్పుడూ వినని సమాచారం..
  లల్లేశ్వరిని రెండు భిన్న సమాజాలు ఆదరించడం ఆశ్చర్యమే.వాటి పునర్ముద్రణ సమాచారం .. తొలి వర్ణాంతర వివాహ వివరాలు..👌👌
  సామాజిక చైతన్య కోణంలో పూలు మొగ్గలు శీర్షిక ఇంటరెస్టింగ్ గా ఉంది.. ఈ సమాచారం అంతా ఒక చోట క్రోడీకరించవలసిన అవసరం ఉంది..మీ కృషి కి అభినందనలు మరియు ధన్యవాదాలు సర్..

 • కులమతవర్గభేదాల్లేని అన్నారు, ఆదే మతం కదా. వీరశైవులు చేసిన మతహింసగురించి బసవ పురాణం, పండితారాధ్యచరిత్ర సవివరంగా వర్ణించాయి. గర్వంగా కూడా. పండితయ్య బసవన నెన్నడూ చూడలేదు. ఆయన అన్యమతస్థుల పుస్తకాలు తగలబెట్టినట్లూ లేదు. హఠాత్తుగా పండితయ్య నుండి బసవనకు మారడం కొందరికి గందరగోళం కలిగించవచ్చు
  గంగాదేవి ఈవర్గంలో చేరదు. మల్లినాథసూరితో ఇక్కడ ఏం పని.
  అభంగాలు అంటే సరిపోతుంది.
  వీరశైవుల విప్లవం చాలా గొప్పది. దాన్ని చక్కగా వివరిస్తే ఈతరానికి చాలా ఉపయోగపడుతుంది

 • ఈ తిరుగు బాట్లన్నీ అనంతరకాలంలో హిందూ అనే మతంలో కలిసిపోవడం, కులం మరింత క్రిస్టలైజ్ కావడం అనే అంశాలపై ఆలోచనలు చేయాలి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.