వెన్నెల రాత్రి

మనిషి సృష్టించిన అతి చెత్తలో గోడ కూడా ఒకటి. వెన్నెల వెండిరజనులా సముద్రం మీద రాలుతూవుంటే నేను నా గోడల మధ్యకి చేరుకున్నాను!

(రుషికొండ కథలు- 6)

కార్తీక పౌర్ణమి. వెన్నెల తాగడానికి సముద్రం దోసిలితో ఎదురుచూస్తూ వుంది. బీచ్ పక్కనే వున్న గుడిలో గంటలు మోగుతున్నాయి. దీపాలు వెలుగుతున్నాయి. పున్నమి రోజు సముద్రం ఎందుకో అలుగుతుంది. తనలోకి తాను, వెనక్కి వెళ్ళిపోతుంది. 

వెలుతురు మసకమసకగా మాయమవుతూ వుంది. చంద్రున్ని మేఘాలు మింగేశాయి. బీచులో జనం తగ్గిపోయారు. సముద్రంలోకి ఎవరూ వెళ్ళకుండా పోలీస్ విజిల్స్ వినిపిస్తున్నాయి. ఆలయంలో దీపాలన్నీ దేవుడి ఆత్మలా వెలుగుతున్నాయి.

ఇసుకలో కూచున్నాను. ఒంటరితనం అనేది అనవసర పదం. మనిషెప్పుడూ ఒంటరే. లోపలికి వెళ్ళేకొద్దీ తన గుహలో తాను ఒక్కడే. అతని ఆలోచనలు ఇంకెవరికీ అర్థం కావు. ఒక్కోసారి అతనికి కూడా…

రాగిరంగు కుక్క వచ్చి పక్కన కూచుంది. దిగులుగా వుంది. బహుశా జ్ఞానభారం కావచ్చు. జ్ఞానం వల్ల మనిషికైనా, కుక్కకైనా దుఃఖమే.

“లోపల చీకటితో జీవిస్తూ, బయటికి దీపాలు వెలిగిస్తారు. మీరు దుర్మార్గులు.” అంది, ముందరి కాలితో చెవిని గోక్కుంటూ.

“మనిషి ఏకైక గుణం దుర్మార్గం” అన్నాను.

“ఇలాంటి వెన్నెల రాత్రిలోనే నేను పుట్టాను. నాతోపాటు ముగ్గురు. ఒక అన్న, చెల్లి. పాలు తాగుతూ, అమ్మ రెక్కల కింద నిద్రపోయేదాన్ని. కానీ ఆ వెచ్చదనం నాలుగు రోజులు దక్కలేదు. పెంచుకోడానికి ఒక గారడీవాడు తీసుకెళ్ళాడు.

తీగ మీద నడిచినా బతుకు నడవదు వాడికి. ఒకరోజు కాలు జారి పడిపోయాడు. ఏడ్చేవాళ్ళు కూడా లేరు. నేనొక్కదాన్నే ఏడ్చాను.

అక్కడ్నుంచి ఒక దొంగ చేతిలో పడ్డాను. దొంగల్ని పట్టాల్సిన కుక్కే దొంగ దగ్గర పెరిగింది. డబ్బులుంటే మందు తాగి, నాకు మాంసం పెట్టేవాడు. లేనపుడు చావబాదేవాడు. మంచివాడు. అందుకే పోలీసులు లాకప్పులో కొట్టి చంపేశారు. ఈతచాపలో చుట్టిన శవాన్ని బయటకు తెస్తున్నపుడు, నేను కోపంతో పోలీసుని కరవడానికి ప్రయత్నించా. లాఠీతో వాడు ఎంత గట్టిగా కొట్టాడంటే, ఆదెబ్బకి మనిషయితే చచ్చేవాడు.”

మాట్లాడడం ఆపింది. గర్జనతో బయలుదేరి, తీరాన్ని తాకి కరిగి నీరైపోయిన ఒక కెరటం మౌనంగా వెళ్ళిపోయింది. బాధకంటే, బాధని పంచుకునేవాళ్ళు లేకపోవడమే విషాదం.

“కాసింత తిండి కోసం నా జాతి మొత్తం బానిసత్వం లోకి వెళ్ళిపోయింది” అంది కుక్క.

“ఇపుడు బానిసలు కాకుండా బతుకుతున్నవాళ్ళెవరూలేరు. కాకపోతే ఎవడికి వాడు యజమానిననే భ్రమలో వుంటాడు” అన్నాను.

చంద్రుడు ముసుగులోంచి బయటకొచ్చాడు. ఇక వెన్నెల చినుకులై కురుస్తుంది. 

“మాట్లాడు” అన్నాను. నేనెప్పుడు మాట్లాడాను అన్నట్టు చూసింది. నిజంగా అది నాతో మాట్లాడలేదా?!

మనం మౌనాన్ని అలవాటు చేసుకుని, మనలోని ఏకాంతంలోకి ప్రయాణించేకొద్దీ ఆ నిశ్శబ్దంలోంచి ప్రతిదీ మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ప్రతి సూక్ష్మ శబ్దాన్ని కూడా చెవి వింటుంది. ఎంత సూక్ష్మత అంటే కాలికింద నలుగుతున్న చీమ వెక్కిళ్ళు కూడా వినిపిస్తాయి. 

అంధులకి అన్నీ స్పష్టంగా కనబడినట్టు, మన ప్రపంచం విశాలమవుతుంది. వెన్నెల చిక్కనవుతుంది. నురుగులై వస్తుంది. రెక్కల పురుగులు దీపాల్లో మాడిపోయినట్టు, కెరటాలు కూడా వెన్నెలని తాగి, తీరంలో ముక్కలైపోతాయి.

“మా పూర్వీకులు, మాలా బానిసలు కాకుండా వేటగాళ్ళై వుంటారు” అంది కుక్క.

“మీ సంగతి తెలీదు కానీ, మనిషి మాత్రం ఎప్పుడూ వేటగాడే; కాకపోతే వేట రూపం మారింది, అంతే” అన్నాను.

ఏం మాట్లాడకుండా చెవులు విదిలించుకుని, ఇసుకలో రెండు బస్కీలు తీసి, సముద్రం వైపు నడిచింది. నేనూ వెళ్ళాను. చల్లగా నీళ్ళు తగిలాయి. కుక్క ఆగింది. నేను వెళుతూనే వున్నా. ఆకాశంలోంచి సముద్రంలోకి దూకుతాడా అన్నంత నిండుగా వున్నాడు చంద్రుడు. మోకాళ్ళు మునిగాయి. మెరిసిపోతున్న సముద్రం అలలతో తడుపుతూ పిలుస్తూవుంది.

సముద్ర కన్యలుంటారా? లేక సముద్రమే ఒక కన్యా? శతాబ్దాలుగా మనిషికి అర్థం కాని సముద్రం. ప్రతి మనిషీ ఒక సముద్రమే. లోపల ముత్యపు చిప్పలతో పాటు అగ్నిజ్వాలలు కూడా వుంటాయి. 

సత్యం, స్వప్నం రెండూ ఒకటే; విడదీసి చూడలేం.

విజిల్ వినిపించింది. “ఈ టైంలో ఇక్కడేం పని సార్” అని కేక. వెనక్కి వచ్చాను. నన్నో సూసైడ్ కేసుని చూసినట్టు చూశాడు గార్డ్.

“జీన్ వాల్జీన్ అంత సులభంగా చావడు” అన్నాను. అతనికి అర్థం కాలేదు. మనకు లేని వ్యక్తిత్వాన్ని ఆపాదించుకోవడం ఒక ఆర్ట్. జీన్ వాల్జీన్ కీ నాకూ పోలికే లేదు.

నేనూ కుక్కా బీచులో నడుస్తున్నాం. మహాప్రస్థానంలో ధర్మరాజు వెంట నడిచినట్టు నడుస్తోంది. ఒకచోట ఆగి ఇసుకను వాసన చూసింది. 

“మనుషులెంత గబ్బు వాసనొస్తారొ, మా కుక్కలకి మాత్రమే తెలుసు” అని ఒక గొయ్యి తీసి వెచ్చగా కూచుంది.

“మీలాగా గోడల మధ్య నాలుగు రోజులున్నా నేను అనారోగ్యంతో చచ్చిపోతా, తెలుసా” అని ముడుచుకుంది. 

నిజమే, మనిషి సృష్టించిన అతి చెత్తలో గోడ కూడా ఒకటి. వెన్నెల వెండిరజనులా సముద్రం మీద రాలుతూవుంటే నేను నా గోడల మధ్యకి చేరుకున్నాను!

జి ఆర్ మహర్షి

జగమెరిగిన మహర్షికి పరిచయం అక్కర్లేదు. తన వచనం లోని అందాలకు ఫిదా కాని వారుండరు. మహర్షి పాతికేళ్ళ పాటు జర్నలిజంలో తలమునకలయ్యారు. అది బోర్ కొట్టి ఇప్పుడు సినిమా కోసం పని చేస్తున్నారు. అయిదు పుస్తకాలు ప్రచురించారు. హాస్యం అంటే ఇష్టం. ఫిలాసఫీ అంటే ఇష్టం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.