ఈ అమృతం కురిసిందెక్కడ?

తిలక్  గురించి రాసుకోవల్సింది ఇంకా ఏమన్నా మిగిలి ఉందా ? తెలుగు వచన కవిత్వ ప్రపంచాకాశంలో దివారాత్రములుగా  వెలుగొందినవారెవరో ఇంకా స్థిరపరుచుకోవల్సిన అవసరముందా ? రూప సారాలే పరికరాలుగా, అవి తిలక్ కవిత్వంలో చేసిన ఛూం మంతర్కాళీ మాయా ప్రభావాన్ని ఏమని వర్ణించుకోవాలి ? పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వమన్న ఒక వ్యాసం లో కృష్ణ శాస్త్రి గారు “బాలగంగాధర్ తిలక్ రచనల్లో కొత్తదనమూ సోయగమూ కూడా ఉన్నాయం” టాడు. రారా మేష్టారైతే 1969 లోనే “ప్రజా శక్తుల పట్ల భావకవి హృదయంలో స్వచ్చందమైన సానుభూతి ఉన్నది కానీ, ప్రజాశక్తులతో తాదాత్మ్యం చెందే అభ్యుదయకవి హృదయం కాదది” అని కూడా అనేశాడు. అంతే కాదు, ఇంకా చాలా చాలా అనేశాడు. తిలక్ ని మాబోటివాళ్ళం ఉదయాస్తమయాల్లో ఒకసారన్నా తలచుకోందే కాలం వెళ్ళదీయలేని అశక్త మానవులం, ఆయన అన్నేసి మాటలంటోంటే హృదయం ఎంత విలవిల్లాడిపోయిందని ? మాటల్లో చెప్పలేనా బాధ ? యాభయేళ్ళైనా సరే రారా గారి మాటల్నే మరొక్కమారు తలచి తలచి తిలక్ కవిత్వాన్ని అనుభవించాలని ఉంటుంది నాకు. కారణం ? రారా తిలక్ ని లేశమాత్రం కూడా అభ్యుదయ కవి కాదన్నాడు. పైపెచ్చు “భావకవితా భూమండలం మీద కూడా నిలువలేక ప్రబంధ కవితా పాతాళం లోకి పడిపోయిన ఘట్టాలు కూడా” కొన్ని ఉన్నాయంటాడు. అసలు అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని అరాధించని కుర్ర, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ నరనారీ జన సమూహం తెలుగు సాహిత్యాన ఉంటుందా ? 

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు (నా కవిత్వం); సాహసి కానివాడు జీవన సమరానికీ స్వర్గానికీ పనికిరాడు (శిఖరారోహణ); నా కవిత్వం లో నేను దొరుకుతాను; నువ్వు లేవు నీ పాట ఉంది; అన్నా కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి (నవత కవిత) లాంటి శతకోటానుకోట్ల కోటబుల్ కోట్స్ ఆహా ఓహో యని చెప్పుకుని చెప్పుకునీ నాలుకేనాడైనా చప్పబడిపోయిందా ? ఊహూ ! లేదు. తిలక్ ఇప్పటికీ ఆరాధ్యుడు. అంత చీల్చి చండాడిన రారా సైతం ఒప్పుకున్న మాట. ” ఏ సూత్రాలకూ కట్టుబడని అతని మానసిక అరాజకత్వం కూడా అతనికొక అలంకారం కావడం అతనికే చెల్లింది. అతని కవిత్వం అన్ని రకాల వాళ్ళ మనస్తత్వాల వాళ్ళనూ ఆహ్లాదం ఇచ్చి, అందరి మన్ననలూ పొందింది” అని అన్నాడు కూడా. అది కాదు, ఇది కాదూ, అదే ఉంది, ఇది లేదూ అన్నమనిషే, పైమాటా అన్నాడు కదా ? రారా ది ఒక్క పదం కూడా తీసిపక్కనవేసేదే లేదు. అంతటి “సారస్వత వివేచన” బహూకరించిన వాడాయన. అయితే తిలక్ ని ఈరోజుకీ ఆరాధ్యం చేయడంలో అతని విపరీత బుద్దీ, మానసిక అరాజకత్వమే తప్ప ఇంకేం లేదా ? సమ్మోహన భావుకత లేదా ? రమణీయమైన భాషా ప్రయోగం లేదా ? ఎంత కాల్పనిక వాదాన్ని భుజానేసుకున్నాడన్న పేరుపొందినా, అతని కవిత్వంలో జీవన వాస్తవికత అస్సల్లేదా ? అవేమీ లేకపోతే ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ కవిత్వాన్ని గుండెలకి హత్తుకుని మరీ తరం తర్వాతి తరం ఎందుకు చదువుతున్నట్టు ? కాలం కదా నిర్ణయిస్తుంది, ఏ కవిత్వం ఎన్నాళ్ళుండాలో ? ఎందుకుంటుందో నన్న విషయం. తిలక్ కవిత్వం ఇంకా నవ నవ లాడ్డం వెనుక అతని ఏ వాదం ఎలా ఉన్నా, చదువరులతని భావుకతలో ఆయా కాలానుగుణంగా తమ తమ అనుభూతులను దర్శించారు. ” స్వర్గ నరకాల సరిహద్దుల మధ్య నిలిచి నీవు సమ్మోహ మంత్రం జపించే శృంగారావధీ విధీ, నాకు తల్లివి, నెచ్చెలివి, చెలివి, నన్ను కౌగిలించుకున్న పెద్ద పులివి” (ప్రవహ్లిక) లాంటి కవితల్ని మళ్ళీ మళ్ళీ చదుకుంటూ, చాలామంది ప్రేయసికి ప్రేమ లేఖల్లో రాసుకుంటున్నారు. తిలక్ కాలాతీతంగా కవిత్వ హృదయసీమల మీద ఆకర్షక మేఘం లా కమ్ముకుని అలానే ఉండిపోయాడు. దానికతని అసామాన్యమైన భావ రచన, ప్రకటన మాత్రమే కాక అప్పటికతను తీసుకొచ్చిన శైలీ మార్పు కూడా ముఖ్య కారణం. తిలక్ అమృతం కురిసిన రాత్రి శిల్పానికి పాఠ్యపుస్తకం. వచన కవిత తన సత్తాని ఇన్నేళ్ళ తరువాత కూడా శిఖరాయమానంగా నిలబెట్టుకోగలిగిందీ అంటే ఈ శిల్ప సౌందర్యం వల్లనే. లేకపోతే వచనమైపోవడానికెంత దూరం నడవాలి చెప్పండి ? తిలక్ అలాంటి టానిక్ తయారుచేసి, దాని ఫార్ములా ఎవ్వరికీ చెప్పకుండా ఈ కవిత్వ పుస్తకాన్ని మన గుండెల మీద పడేసి వెళ్ళిపోయాడంటే అసత్యమని ఎవ్వరన్నా అనగలరా ? ఆఖరుకి రారా మేష్టారితో సహా ! 

తిలక్ కవిత్వం లో భావుకత్వం తారాస్థాయిలో ఉంటుంది. అతని వస్తువులకి ఎంచుకున్న ఊహా ప్రపంచాలు, వాటిని మన కళ్ళ ముందుకు తీసుకురావడానికి వాడిన పదబంధాలు, అర్ధ శబ్ద సౌందర్యాలు ఒక్కొక్కటీ ఒక్కో మరపురాని చరిత్రగానే మిగిలిపోయాయి. అతిశయమేమీ లేదు. అబద్దమనీ అనను. విమర్శకులన్నట్టు, తిలక్ భాషలో సమాసబాహుళ్యాన్ని, గ్రాంధిక ఛాయని ఒప్పుకుని తీరవలసిందే గానీ, అది ఈ కవిత్వ ప్రాచుర్యానికి ఈరోజుకీ అవరోధం కాలేదు. ఎందుకని ? తిలక్ ని అభ్యుదయం + భావ కవిత్వం కలగలసిన కవిత్వం గా ఇంకా అనేసి, సానుభూతిగా లోకం చూస్తుందనుకోవడం అమాయకత్వమే అవుతుంది. తిలక్ కవిత్వంలో ఒక ఆకర్షణ ఉంది. అది అందరి భావ కవుల వలే, వారి వారి రస పోషణ, శిల్ప విన్యాసాది ప్రమాణాల వల్ల మాత్రమే కాకుండా సహజ సిద్దముగా అబ్బినటువంటిది. ఆ మిశ్రమం తిలక్ పదాల ఎంపిక లో, వాటిని సమ్యోజనీకరించడంలో, ఆ వాక్య లయాత్మకతలో అతను నిర్మించిన రూపమే ఆకర్షణ కి మూల కారణంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎన్ని వస్త్వాశ్రయ, శిల్పాశ్రయ విమర్శల్నెన్నో మనం చదివి ఉండవచ్చు గాక, అయిననూ, తిలక్ సాధించిన ఆకర్షణ : వైవిధ్యమైన అభివ్యక్తి మాత్రమే. అదీ అప్పటికిలేని ప్రక్రియా రూపం వల్లే సాధ్యమైనదని కూడా చెప్పుకోవాలి. అంటే వచనకవిత్వం ఎప్పుడో ముద్దు కృష్ణ రాసిన తురాయి కవితతో మొదలయిందని ఆరుద్ర చెప్పినా, వచన కవిత్వం ఆ తర్వాత ఎందరు మహానుభావుల శ్రమ వలన పేరుగాంచినా, తిలక్ శిల్పాన్ని సాధించలేకపోయారంటే తప్పు కాబోదు. అదే ఆ పుస్తకం ఈనాటికీ చిరస్మరణీయం కావడానికి కారణం. “నాకు తెలుగు కవిత్వమంటే చాలా ఇష్టమండీ, శ్రీ శ్రీ మహాప్రస్థానమూ, తిలక్ అమృతం కురిసిన రాత్రి చదివానండీ, ఎంత గొప్ప పుస్తకాలండీ” అని ఏ కుర్ర కవిని కదిపినా ముందు చెప్పేమాటలివే. కాలంతో పోటీ పడి నిలబడ్డ పుస్తకాల్లో అతీత శక్తులేం ఉండవు కానీ, ప్రజల్ని కట్టిపడేస్తున్న మూలకమొకటుంటుంది. కుందుర్తి ప్రవేశ పెట్టిన విసురు, భావ లయలన్న కొన్ని లక్షణాలు తిలక్కి ఆపాదించవచ్చును. ఇంకాచెప్పాలంటే కేవీఆర్ అన్నట్టు “ఇంతకూ వచన కవిత్వం ఏ కవికి అ కవి రూపొందించుకోవాల్సిన వైయక్తిక వ్యవహారమేనని సారాంశం. అతని మనస్సే దాని స్వరూపాన్ని నిర్ణయించుకుంటుంది. కృతకమైన ఇతర సాధనోపకరణాల సహాయాన్ని కాలదన్ని వేసి, కవిత్వాన్ని డికాక్షనుగా కాచి, పంచదార గానీ పాలు గానీ లేకుండా తాగేటట్లు ఐచ్చిక కవిత్వ పదార్ధాన్ని అందిస్తే, అందుకునేందుకు పాఠకులు సంసిద్దంగా ఉండాలి” (చూడుము: కేవీఆర్ సాహిత్య వ్యాసాలు మరియూ సాహిత్యవిమర్శ దర్శనం) లాంటివి సరిపోతాయి. తిలక్ తన వైయక్తిక వ్యవహారంగానే కవిత్వాన్ని రాశాడు కనుక వాటి సౌకుమార్యాన్నవి నిలబెట్టుకున్నాయనుకోవచ్చును. మరి ప్రయోజన కోణం సంగతినెలా విశ్లేషించుకోవాలి ? రారా సరే లేదన్నాడు, కానీ తదనంతర సాహియ్య ప్రపంచానికి ప్రార్ధన, నెహ్రూ, చావులేని పాట, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, తపాలా బంట్రోతు, గొంగళీ పురుగులు, ఆర్త గీతం లాంటి కవితలు శిరోధార్యమయ్యయి కదా ? సరే భావన అభ్యుదయంగా మెరిసి, శైలి భావకవిత్వంగా నిలిచిదన్న కుందుర్తే కరెక్టనుకున్నా గానీ, లేక రారా అన్నట్టు దుక్ఖితుల పట్ల తిలక్ కరుణ, ఈ వేదనా ప్రియత్వానికి దగ్గరి చుట్టంలా కనబడుతుందే గానీ శ్రీ శ్రీ బాధతో దానికే బాంధవ్యమూ ఉన్నట్లు కనబడదు అన్నదే సత్యమనుకున్నా గానీ, ఏదీ తప్పు కాదు. తిలక్ సామాన్యుడి కష్టాన్ని కూడా కొంత రొమాంటిసైజ్ చేశాడు. అది అతని శైలీ ప్రభావ చర్య. అది లేందే అతను లేడు గనుక అలానే చెప్పగలిగాడు. అలా రొమాంటిసైజ్ చేయడం వచన కవితలో ఒదగలేని లక్షణంగా చూడనవసరం ఏర్పడుతుందా ? లిరికల్ లక్షణంతో వచన కవిత కన్న ముందే పాట రూపంలో అభ్యుదయ సాహిత్య సృష్టి జరిగింది కదా ?కనుక తిలక్ కవిత్వానికి అతని భావవాద శైలి నప్పకపోవడమేం జరగలేదు. ఆ శైలిలోని వచనాన్ని పాఠకులు ఆస్వాదించారు. కానీ ఆ శైలిలోని వస్తువుల ఎంపికకన్నా నిర్వహణలో అతని నిజాయితీ కొంత సమస్య తెచ్చిపెట్టినట్టుగా అనిపిస్తుంది. కవి నిజాయితీ అన్న మాట వాడినపుడు అతని నమ్మకాలు ఆతని వాక్యాల్లో ప్రతిఫలించే సందర్భాన్ని చర్చకు తేవచ్చు. ఎంతటి ఊహాశాలిత్వమున్న కవిగారైనా, అతని నమ్మకము వాస్తవాధార మైన ఆలోచనలతోనే ఏర్పడిఉంటుంది. ప్రసిద్ద విమర్శకులు పాపినేని శివశంకర్ అన్నట్టు “కవిత్వంలో వర్ణనాత్మకంగా, అలంకారికంగా చోటు చేసుకునే ప్రతి కల్పనా ఒకే సమయాన అవాస్తవమూ వాస్తవమూ. అంతే కాదు. అలంకారాలు, వర్ణనలు, భావ పద చిత్రాలు మొదలైన సామాగ్రితో, ఊహలతో నిండి ఉండటం చేత కవిత్వం ముందుగా ఆనందం కలిగిస్తుంది (బహుళ – కాల్పనికత, వాస్తవికత) అంటాడు. ఇంకో మెట్టు ముందుకెళ్ళి, “కల్పన మనకు వాస్తవికత గురించే ఏదో ఒకటి చెబుతుంది. కల్పనకి పునాది వాస్తవమే” నని కూడా సూత్రీకరిస్తాడు. కనుక తిలక్ కవిత్వంలోని వస్తు నిజాయితీ అతని కాల్పనికత ముందు ఓడిపోతుంది. ఎందుకలా అనిపిస్తుందంటే, అతను చిత్రించిన వాస్తవంలో తన నమ్మకమూ, దృక్పధమూ స్పష్టాస్పష్టంగా మసక మసగ్గా కనిపిస్తాయి. పేదవాడి గురించో, వాణ్ణి పీడిస్తున్న వర్తకుడి, ప్రభుత్వాధ్యక్షుడి గురించో,బెంగాల్ కరువూ, బంట్రోతు బతుకూ,  వృద్దుడూ, సైనికుడూ, లాంటి వారిపై తిలక్ కవితలు రాశాడు. ఆ కవితల్లో అతని కాల్పనికత వాస్తవికత పునాదిమీద నిలబడ్డట్టు కనిపిస్తుంది కానీ, సజీవతని బేరీజు వేసుకోవాల్సివస్తే మన ఇన్ష్టంటు ఇష్టం కాస్త ఇరకాటంలో పడుతుంది. సజీవత్వాన్ని పాపినేని వాక్య సారాంశమంటాడు. దాన్నే కవి నమ్మకమనీ అనుకోవాలి. తిలక్ నమ్మకుండా రాశాడనటానికీ కొన్ని కవితలు, అదే పుస్తకంలో ఇంకొన్ని కవితల్తో విభేదిస్తాయి.

>అతని కవి వాక్కు లో అతనేమిటో చాలా తెలుస్తుంది చూడండి.

భారత్ దేశాన్ని కాదనలేను; రష్యా దేశాన్ని కొలువలేను
నిజం ఎక్కడో, అక్కడ నా ప్రాణం ఉంది.
హృదయం ఎక్కడో అక్కడ ఉదయం ఉంది

…… 
తత్వాల పేర విప్లవాల పేర ఒకరినొకరం హతమార్చుకోలేము

….. 
ఇంకా కరిగి నీరైపోలేదు, హిమాలయ శిఖరాలు
ఇంకా మరచిపోలేదు తధాగతుని మహాత్ముని ప్రవచనాలు ……..
కరుణలేని కవి వాక్కు సంకుచితమవుతుంది — అంటాడు.

ఈ కవితలో సామ్యవాద స్థాపనలో రష్యా అనుసరించిన వామపక్ష విప్లవ భావజాలాన్ని, దాన్ననుసరిస్తున్న అప్పటి కవుల్నీ వ్యతిరేకిస్తాడు. కవిగా నాకు కరుణ ముఖ్యం అంటాడు. గాంధీ, నెహ్రూ వారసత్వాలవసరమన్న ఎరుక కలిగిస్తాడు. సంస్కరణాభిలాష, దయా కరుణాంతరంగిక కవిత్వాన్ని ఎక్కువ ఇష్టపడతానని చెబుతాడు. శాంతిని పరారీ అయిపోయిన వ్యక్తని, వెతకాలనీ ఆకాంక్షిస్తాడు. ఈరకం భావనల్లో ఒక సౌకర్యవంతమైన సరిపుచ్చుడు, సర్దుబాటూ కనిపిస్తుంది. తనకొచ్చిన సౌందర్యవంతమైన భాషలో సమాజం గురించి రాసినపుడు కలిగే స్పందనకన్నా, సామాజికేతర కవిత్వం వల్ల కలిగే ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఆనందం కావ్య పరమార్ధమయ్యిందన్న సంగతిని తిలక్ మళ్ళీ మళ్ళీ నిరూపిస్తాడు. ఆనందం లోనో, ఆనందంతోనో ఏ రచనా, ఏ సృజనా జరగదన్నది జగమెరిగిన సత్యమే కదా. కవి వ్యాకుల పడాలి, అంతర్మధనానికి గురికావాలి, అదంతా చదువుతున్నంత సేపూ పాఠకుడికి అర్ధం కావాలి. ఆర్త గీతమూ, ప్రార్ధన, నిన్న రాత్రి అన్న కవితలు ఎంత దుక్ఖితుడైన కవిని పట్టించినా, అతని ఆత్మాశ్రయ భావజాలంలో సామాజికత డొల్లగా ఉంటుంది.

కాంగోలో, క్యూబాలో, సైప్రస్లో, లావోస్లో కాలి కమురు కంపు కొట్టే కాలం కధ, మానవ వ్యధ (నిన్న రాత్రి) శ్రీరాముడి శ్రీకృష్ణుడి జన్మభూమి మరి కంసునికీ దశకంఠునికీ కాదా ? (నా భరత ధాత్రి) అని ఎలా ఆర్ధ్రంగా రాసినా ఎందుకో అతని లలిత పద ప్రయోగాల్లో కవి అత్తరు పూసుకుని, పూలు పరుచుకుని, వెన్నెల ఆకాశము వంక మోహన రాజ్ఞి నా కవితా సుందరి యని పలవరించిన సుఖవాది గా తిలక్ కనిపిస్తాడు. నేను టైముకి తిని, కలల్లో అలసి సొలసి, ఆదమరచి పడుకుని, మళ్ళీ లేచి ఫిల్టర్ కాఫీ పెట్టుకుని తాగుతూ ఆడదానిలా ఉందేవిటటీ ప్రకృతని, సుందరోదయాల్ని కవిత్వం చేసే పనిలో ఉంటే, ఆ కవిత్వం లో ఉన్నది నేను కాని నేనే కదా అన్న నిజం నాకెవరు చెప్తారు ? ఏ అసత్యాన్ని ప్రేమిస్తూ నేనిన్నాళ్ళూ ఊపిరి పీలుస్తున్నాను ? 

ఈ సందేహం నా జీవితానికే మచ్చ కదూ ?

(ముగింపు వచ్చే సంచికలో)

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

6 comments

  • తిలక్ ఎప్పటికీ ఆధునిక తెలుగుకవితా తిలకమే. శ్రీశ్రీ నీ , కృష్ణశాస్త్రినీ మరపిస్తూ భావుకతతో మరోమార్గంలో కవిత్వాన్ని నడిపించాడు.
    నిజంగా అమృతం కురిపించాడు.
    మంచి వ్యాసాన్ని అందించిన మీకు అభినందనలు.

  • బాగుంది, సర్ ,మీరు రాసింది..!తిలక్ గురించి రాసినది, వారిరచనలు,ఎన్ని సార్లు అయిన చదవాలనే, అనిపిస్తుంది. ధన్యవాదాలు,💐సర్!

  • గుండె పోతగా కురుస్తున్న అమృతధారలను ఉన్నపళంగా ఆపేసి వచ్చేసంచికదాకా ఆగండి అంటే ఎలా సార్?

  • చాలా గొప్పగా రాశారు తిలక్ గారి గురించి. మీకు అభినందనలు.. సాహిత్యం ఉన్నంత వరకు తిలక్ చిరంజీవి. కాలం కూడా కనుమరుగు చేయలేని భావకవి తిలక్.

  • ఓ గొప్ప కవి ….. ఆయనకి ఉన్న భిన్న ధృవాలు… ఆ భిన్న ధృవాలపై విభిన్నులుల ఆలోచనలు… కొత్తగా ఉంది సర్…. ప్రతీ వ్యక్తి జీవితంలోనూ కొన్ని ప్లస్ లూ, కొన్ని మైనస్ లూ ఉంటాయి…. ప్రశంసలు పొందిన, ప్రసిద్ధి చెందిన వారికీ ఇవేమీ అతీతం కాదు అన్న విషయం బోధపడింది… కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు… కాదేదీ కవికి అర్హం అనుకోవాలి… ప్రశంసలో, విమర్శలో… మొత్తానికైతే నమ్ముకున్న వస్తువుపట్ల నిజాయితీ చూపితే కాలం ఏదైనా , విమర్శకులు ఎవరైనా అభిమానిస్తారని, ఆదరిస్తారని అద్భుతంగా చెప్పారు… మీ సవివర సమీక్షకు హృదయపూర్వక ధన్యవాదాలు…. తిలక్ గారిని సరికొత్తగా చదివేలా చేశారు….

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.