ఒక యమ్మీ యమ్మీ…

ఉష్…

ఇష్…

ష్…

నా బాధ అర్థం కాదు?!

అందుకే- ఎందుకలా నొప్పులు పడుతున్నావ్రా- అని మా టీచర్ అడిగిందా!

అడ్డంగా తలూపానా?

బుగ్గలు బంతుల్లా ఊగుతున్నాయి, అందులో ఏమి దాచావ్‌రా?- అని మళ్ళీ మా టీచర్ అనుమానం!

నోరు తెరుస్తాను!

ఆ…

నోట్లోని నీళ్ళు… రెండు పెదవి చివరల నుండి  రెండు పక్కల నుండి… ఇంకేముంది? చొక్కా తడిచిపోతుంది!

నోట్లో అన్ని నీళ్ళేమిట్రా?- అన్నీ అనుమానాలే మా టీచర్‌కి!

ఏం చెప్పను?

నిన్నే?- అంటుంది చెప్పమన్నట్టు!

తెలీదు టీచ!

అంత చొంగ… అంత తేగుడు ఏమిట్రా- టీచర్ ఎదురుగా కూర్చుని అర్థమయేలా అడిగింది! ఒరే అయోమయంగా-  అని కూడా ముద్దుగా తిట్టింది!

ఔను కదా- తలాడించా!

మూసినా సరే నోట్లోంచి నీళ్ళు ధారలుగా బయటికి వచ్చేస్తున్నాయి!

నోట్లో నీళ్ళెందుకు ఊరుతున్నాయి?- నాకేదో వినపడనట్టు పెద్దగా అరిచింది!

ఔను మా పెరట్లో నుయ్యి తవ్వినప్పుడు అచ్చం ఇలానే నీళ్ళూరాయి టీచ- అన్నాడు నా పక్కన కూర్చున్న సాయిగాడు!

అలా ఊరడం నేనూ చూశా, అందుకే నిజమేనన్నట్టు తలాడించా, వాడ్నీ టీచర్నీ చూసి! 

అక్షరాలు దిద్దడంలేదేం అని కళ్ళెర్రజేస్తే కళ్ళలో ఊటలు చూశాను… రెండు దెబ్బలు వేస్తే కింద తడుపుకోవడం చూశాను… నిన్ను నేనింకా తిట్టలేదు కదరా- టీచర్ గిజుకుంది!

నేను నోరు కుట్టుకున్నట్టు పెదాలు బిగించి నవ్వాను! 

అదికాదురా… జలుబయితే ముక్కు జలకాలాటలు ఆడుతోందని అనుకుందును… గిలుబయితే ముక్కులోంచి వాటర్ ఫాల్స్ వచ్చాయని అర్థం చేసుకొందును… అసలు నీ ప్రాబ్లం ఏమిట్రా- మా టీచర్ ప్రాబ్లం మా టీచర్‌ది!

ఏమి చెప్పాలో తెలీక దిక్కులు చూశా!

నీ ప్రాబ్లం గోడల మీద రాసుందా? చదివి చెప్తావా? చెప్పు చెప్పు… చెప్రా- టీచర్ పెద్దగా అరచింది!

చదివి చెప్పడానికి నాకు అక్షరాలే పూర్తిగా రావు!

చెప్తావా? రెండు వెయ్యాలా- టీచర్ బెత్తం తీసింది!

నేను నవ్వాను, నవ్వితే కొట్టదని- ఆ ధైర్యంతోనే నవ్వాను!

కాని టీచర్ నా వీపు మీద బెత్తంతో వేసి ఆ… అన్రా- అరిచింది!

ఆ…

ఏడ్చాను!

నీ నోట్లో ఆ నీళ్ళు ఎందుకు ఊరుతున్నాయిరా- తన నుదురు మీద తన అరచేత్తో టీచర్ మొత్తుకుంది!

అప్పుడు నేను ఏడుస్తూ నవ్వాను!

టీచర్ ఏమిటా అన్నట్టు ఆసక్తిగా చూసింది!

నవ్వా!

టీచర్ తలూపింది!

అప్పుడు బాక్స్ తెరిచా!

కళ్ళు పెద్దగా చేసి చూసింది టీచర్!

బాక్సులోని రసగుల్లాని చూశా! చూపించా! మురిపంగా తాకా! తీసి రసగుల్లాని ముద్దు పెట్టుకున్నా! నాలుకతో నాకా!

మ్చ్- నేను!

ప్చ్- టీచర్!

ఇంటర్వెల్లో తిని చావొచ్చు కదరా- టీచర్!

నవ్వా!

ఆకలేసిందా- అంది టీచర్!

తినాలనిపించింది- అన్నా నేను!

స్నాక్స్ టైంలో తిను- అంది టీచర్!

ఇప్పుడే తినాలనిపించింది- చెప్పా!

అప్పటికే మా క్లాసు పిల్లలంతా స్నాక్ బాక్సులు ఓపెన్ చేసేశారు! తింటున్నారు!

నీ నుండి క్లాసు మొత్తం డిస్టబ్ అయింది చూడు- కోప్పడింది టీచర్!

వాళ్ళందరి కంటే నేనే ముందు డిస్టబ్ అయ్యా టీచ- అన్నాను!

ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు- బుద్దిగా నా తల నిమిరి చెప్పింది టీచర్!

తలాడిస్తూ- ఎలా- అడిగాను!

యోగా ఊపిరి తీసింది టీచర్!

నేను నా వేళ్ళు నాకుతున్నా!

చూడు!

చూశా!

ఎప్పుడు పడితే- టీచర్ చెప్పకముందే-

అప్పుడు తినకూడదు- చెప్పాన్నేను, టీచరుకు ప్రతీది రెండుసార్లు చెప్పడం అలవాటు కదా?

తినాలనిపిస్తే ఇంటర్వెల్లో తిను… స్నాక్స్ టైంలో తిను- టీచర్!

ఊ!

క్లాసు మధ్యలో గుర్తొచ్చినప్పుడల్లా తినాలని అనిపించినప్పుడల్లా తినకూడదు- టీచర్!

ఊ!

అర్థమయ్యిందా?

అయ్యింది!

ఏమర్థంయ్యింది చెప్పు!?

ఇప్పుడు మనకి పాస్‌కి వస్తుంది…

మనకా?

ఔను, మనకే!

చెప్పు!

ఇప్పుడు మనకి పాస్‌కి వస్తుంది… వచ్చింది కదా అని వెళ్ళకూడదు… క్లాస్ అవుతోంది కదా? ఆ?

……………………………..

మనికి టు వస్తే కూడా వెళ్ళకూడదు… ఇంటర్వెల్లో వెళ్ళాలి!

……………………………..

ఇప్పుడు మనకి ఆకలి వేస్తుంది… వేసింది కదా అని తినకూడదు… క్లాస్ అవుతోంది కదా? ఆ?

ఆగాగు!

ఆగా!

పాస్‌కి వస్తే ఆపలేవు కదా?

లేను!

టూకి వస్తే?

ఆగను! ఆపను! ఆపలేను!

అందుకే వెళ్ళాలి… వచ్చిన వెంటనే వెళ్ళాలి… అర్థం అయ్యిందా?

ఊ!

ఏమర్థంయ్యింది?

ఆకలేస్తే కూడా ఆగలేను!

……………………………..

అర్థం అవుతోందా టీచ?

……………………………..

స్కూలు బెల్లు కొట్టంగానే క్లాసులోకి వచ్చి కూర్చోవాలి… మానాయనమ్మ చెప్పినట్టు పొట్టలో ఆకలి గంట కొట్టగానే తినెయ్యాలి…

టీచర్ ముఖం అట్టులా మాడింది!

లేదు టీచ… పాస్‌కి వస్తే వెంటనే వెళ్ళాలి… టూకి వస్తే వెంటనే వెళ్ళాలి… కాని నోరూరితే వెంటనే తినకూడదు…

……………………………..

కదా టీచ?

యస్!

బస్.. మనం శభాష్… బాస్!

-బుజ్జిగాడు,

(నన్నింట్లో అలానే పిలుస్తారు, స్కూల్లో పేరు నాకు రాదు, నోరు తిరగదు)

ఎల్కేజీ తరగతి,

 పేద్ద స్కూలు!

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.