జాలాది గురించి మరి కొంచెం!

జాలాది గారి గురించి పోయినసారి వ్రాసిన వ్యాసం చదివిన మిత్రులు ఆయన వ్రాసిన మరి కొన్ని పాటల గురించి గుర్తు చేసుకున్నారు. పైగా నాకు కూడా ఆయన గురించి మరి కొంత వ్రాయాలనిపించింది.

కొనసాగింపుగా మరికొంత జాలాది సాహిత్యం చూద్దాం.

వ్యాపారమే అయిన సినిమారంగంలో వాణిజ్య సూత్రాలకు లోబడుతూనే, సమాంతరంగా, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, సమాజంలో జరిగే ఘోరాలు, నిరుద్యోగం, ఆనాటి స్వతంత్ర భారతంలోని నిర్వేదం, నిరాశ, సంఘం మీద బడాచోర్ల మీద తిరుగుబాటు, ఇవి ఇతివృత్తాలుగా భారీతారాగణం లేని చిన్న సినిమాలు మొదటినుంచి వస్తూనే ఉన్నాయి. మార్క్సిస్టు కమ్యూనిస్టు నేపథ్యం నుంచి వచ్చి ఎనభయ్యవ దశకంలో ముందు మాదాల రంగారావు తర్వాత టీ కృష్ణ తిరుగుబాటు బావుటాల్లాంటి సినిమాలు తీసి సంచలనాలు సృష్టించారు.

టీ కృష్ణ అన్ని సినిమాలకు సహాయకుడిగా పనిచేసిన ముత్యాల సుబ్బయ్య ఈ వారసత్వాన్ని తరవాత కొనసాగించారు. విధివశాత్తు టి.కృష్ణ 1987లో అకాల మరణం పొందినప్పుడు, ఆ సంవత్సరం ముత్యాల సుబ్బయ్య అదే పంధాలో తీసిన కృష్ణ చక్ర వారి ‘ఇదా ప్రపంచం’ సినిమా వచ్చింది.
జాలాది గారికి తొలి అవకాశం కలిగించిన పీసి రెడ్డి గారి దగ్గర కూడా ముత్యాల సుబ్బయ్య చాలా సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. వీరికి ముందే మంచి పరిచయం ఉండి ఉండాలి. ముత్యాల సుబ్బయ్యకు తొలిసారి మంచి విజయం సాధించి పెట్టిన అరుణకిరణం సినిమాలోని ‘ఆరుణా అరుణా’, ‘ధన్వంతరి వారసులం’ వంటి హిట్ పాటలు జాలాది రాసినవే.

‘ఇదా ప్రపంచం’ సినిమాకి జాలాది వ్రాసినవి రెండు పాటలు. ఈ రోజున ఇవి మరుగున పడిపోయినా రెండూ గొప్ప పాటలే. వీటిలో జాలాది మార్క్ జానపద శైలిలో సాగే పాట ‘బండెల్లి పోతందె సేల్లెలా’.

రైల్లో ఒక మనిషి దైన్యంలో చనిపోతే అతని శవాన్ని దించేసి రైలు సాగిపోతుంది. అప్పుడు రైల్లో బిచ్చగాళ్ల నోటివెంట రైలుప్రయాణాన్ని మానవజీవితాన్ని ముడి పెడుతూ జాలాది వ్రాసిన పాట ఇది.

బండెల్లి పోతంది సెల్లెలా 
బతుకు బండెల్లి పోతందె సెల్లెలా 
బండెల్లి పోతంది సెల్లెలా 
బతుకు బండెల్లి పోతందె సెల్లెలా 
గతుకుబితుకూలేక బతకానేర్సిన బండి
శతపోరు పెడతందె సెల్లెలా 
బండెల్లి పోతందోరన్నయ్యా 
బతుకు బండెల్లి పోతాందోరన్నయ్యా హో 
బండెల్లి పోతందోరన్నయ్యా 
బతుకు బండెల్లి పోతాందోరన్నయ్యా 
ఆ బతుకు ఈ బతుకు అతుకు పెట్టెలతోటీ 
బతుకెల్లి పోతందోరన్నయ్యా 
బతుకు బండెల్లి పోతందోరన్నయ్యా  ఓ 

దొరలెక్కే డబ్బీలో బల్బులు 
అల్ల పేదోళ్ళ బతుకంత బరువులు 
పరువే బరువైపోతె సెల్లెలా 
దాన్ని కూలోడె మొయ్యాలె సెల్లెలా 
దరమమడిగావంటె సెల్లెలా 
మనకరమానె తిడతారె సెల్లెలా 
పేదోళ్ళ డబ్బీల సెల్లెలా 
ఇంత ఆదరణ దొరికేనె సెల్లెలా 

కష్టాల పట్టాల మెలికెలు 
మనిషి గుండెల్లో సెగపుట్టే పరుగులు  
పెట్టెల్ల జనమేమొ కిటకిట 
ముద్ద పెట్టె దిక్కేలేక కటకట 
దేశంలెన్ని మారి పోయినా 
బండి ఏ దేశానికెళ్ళి ఆగినా ఓ 
పట్టాల మార్పేలె సెల్లెలా 
మన పొట్టైన నిండాదె సెల్లెలా 

కిటికీలో కనిపించె కాలము 
అల్ల గిరగిరా తిరిగె బూగోళము 
ఏడాది పోతందో తెలవదూ 
తండ్రి గుండెల్లో బరువేమొ తరగదూ 
బుక్కింగులోపుట్టి వచ్చినా 
తల్లి టిక్కెట్టు నీచేతి కిచ్చినా 
ఊరు పేరు రాసె ఉంటాదీ 
బతుకు దూరమెంతో ఏసె ఉంటాదీ 

పుట్టేటప్పుడు కొన్న టిక్కెట్టు 
నిన్ను మోసేటప్పుడు కాస్త చూపెట్టు 
పదుగురితో పరిగెత్తే పయనమూ 
కడకు నలుగురితో నడిచెల్లే దూరమూ 
జెండాలు రెండేనె సెల్లెలా 
జెండాలు రెండేనె సెల్లెలా 
అయ్యి సావుపుట్టకలంటా సెల్లెలా 
సిగినేలిచ్చేవోడు దేవుడూ 
బండి దిగియెల్లిపొయ్యోడు జీవుడు 
సిగినేలిచ్చేవోడు దేవుడూ 
బండి దిగియెల్లిపొయ్యోడు జీవుడు 

బండెల్లి పోతంది సెల్లెలా 
బతుకు బండెల్లి పోతందె సెల్లెలా 
బతుకెల్లి పోతందోరన్నయ్యా 
బతుకు బండెల్లి పోతందోరన్నయ్యా

పల్లవిలో, చావు పుట్టుకలను దాటుకుంటూ సాగిపోయే జీవన ప్రవాహం లాంటి బండిని, గతుకు బితుకు లేక బతకనేర్చిన బండి’ అంటారు జాలాది. రైలు ఘోష బతుకులోని శతపోరు.

జీవితాలు కలిసి ఉండటం అశాశ్వతం అని చెప్పటానికి వాటికి అతికించిన రైలుపెట్టెలతో, అలాగే బతుకు వెళ్ళమారటం బండి వెళ్లిపోవడంతో పోలిక.
గొప్పవాళ్ళ పరువుల భారం కూలోడే మోయాలి అన్నది నిలవేసి ఆలోచింపజేసే నిజం.

పట్టాలమెలికలు జీవితంలోకష్టాలు. అవి దాటడానికి గుండెల్లో సెగలు.

స్టేషన్లు మారినా దేశాలు మారినా మనుషుల కష్టాలు మాత్రం మారవు. ఇక్కడ దేశానికీ దేశానికీ మధ్య పట్టాల వెడల్పు కొన్నిసార్లు మారుతుంది అన్నవిషయం చమత్కారంగా వాడుకున్న విధానం చూడండి.

కిటికీలోంచి చూస్తే ప్రపంచం వెనక్కి పెడుతున్నట్టే గాక గుండ్రంగా తిరగడం కనపడుతుంది. దీనికి భూభ్రమణంతో (దివారాత్రాలతో) ముడి. కాలానికి, (జీవిత) ప్రయాణానికి ఇది మరోసామ్యం.

పుట్టుకతోనే జీవితానికి టికెట్టు కొనుక్కుంటాడు జీవి. దానిమీద రాసున్నది ఆయుష్షు ప్రమాణం. ప్రయాణం ఆగిపోయినప్పుడు రైలు దిగి పోయేటప్పుడు స్టేషన్లో టిక్కెట్ ఇచ్చెయ్యాలి. ఇక్కడితో ఆయుష్షు అంతం.

ఈ జీవితంరైల్లో చావు పుట్టుకలే ఎర్రజెండా పచ్చజెండాలు.

గీతం యావత్తూ అద్భుతంగా జీవనగమనానికీ రైలుప్రయాణానికీ సామ్యం చెప్పిన ఈ పాటలో ‘సిగినేలిచ్చేవోడు దేవుడూ/ బండి దిగియెల్లిపొయ్యోడు జీవుడు’
అని చివర్లో వచ్చే మాటలు కలకాలం గుర్తుంటాయి.

ఎంతో ప్రతీకాత్మకంగా సరళసుందరమైన జానపదగేయపద్ధతిలో జాలాది ఎంతబాగా వ్రాశారో, స్వరపరిచి అంతబాగానూ తన శిష్యులైన నాగూర్ బాబు(మనో), వందేమాతరం శ్రీనివాస్ లతో పాడించినవారు చక్రవర్తి. ఇందులో వినబడే స్తీకంఠం లలితాసాగరి అన్న అమ్మాయిదట. అచ్చు ఎస్.పి.శైలజ లాగా అంత కమ్మగానూ వినిపిస్తుంది.

నాలుగు చరణాల సుదీర్ఘమైన పాటను అప్పుడే అయిపోయిందా అనుకునేలా తీర్చిదిద్దటంలో కవితోపాటు సంగీతదర్శకుడు, గాయనీగాయకులు, కత్తిరించకుండా మొత్తంవాడుకున్న దర్శకుడు అందరూ అభినందనీయులు.

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

Add comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.