అమెరికా లేఖ

ఒక మంచి పరిణామం జరుగుతోంది. దీన్ని మంచి ప్రయోగం అన్నా తప్పు లేదు. మొదటి అంకం ముగిసే సరికి, మంచికి మన్నన దొరుకుతుందో పాత దుర్మార్గం ఇటేపు కంచె దూకి తానే విజేత అంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేం. ‘మన’ ఎత్తుగడలు, పంథాలు … ఈ రెండు పరిణామాల్లో దేనికి దోహదం చేస్తాయో కూడా చెప్పలేం. 

అమెరికాలో ఎన్నికల తతంగం మొదలయ్యింది. ఈ దేశంలో ప్రధానంగా రెండే రెండు పార్టీలు అల్టిమేట్ పవర్ కోసం పోటీ పడతాయి. అల్టిమేట్ పవర్ అంటే అమెరికా మేరకు ప్రెసిడెంట్ గిరీ. పర్యావరణ పరిరక్షణోద్యమంలో భాగంగా గ్రీన్ పార్టీ వంటివి పోటీలో వుంటాయి గాని, ఇప్పటివరకు అవి సిగ్నిఫికెంట్ కాదు. 

అచ్చంగా ప్రెసిడెంట్ ఎవరో తేల్చే ఎన్నికలకు ముందు… డెమొక్రాట్‍, రిప‍బ్లికన్‍.. రెండు పార్టీల అభ్యర్థులెవరో తేలాల్సి వుంటుంది. రెండు పార్టీలు తమ తమ అభ్యర్థుల్ని ఖరారు చేయాలి. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు… పార్టీ కాకస్ లలో ఓట్లేసి తమ అభ్యర్థిని ఖరారు చేస్తారు. ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనడానికి తానే తగిన మనిషినని ప్రచారోద్యమంలో నిరూపించుకోడానికి పలువురు ప్రయత్నిస్తారు. అందులో ‘గెలిచి’, పార్టీ ఆమోదం పొందిన మనిషి ఆ పార్టీ అభ్యర్థి అవుతారు.

పార్టీలు తమ అభ్యర్థులెవరో తేల్చుకునే ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు రెండో సారి తానే పోటీ చేస్తానని అనేశాడు. కుర్చీలోని మనిషి రెండో టర్మ్ కూడా తనకే కావాలంటే పార్టీ సాధారణంగా మారుమాట లేకుండా మన్నిస్తుంది. ట్రంపు ఆ ప్రకటన చేయడం, దాన్ని అతడి (రిపబ్లికన్) పార్టీ ఆటొమాటిక్ గా మన్నించడం… రెండూ జరిగిపోయాయి. 

ప్రస్తుతం కొన సా..గుతున్న అధ్యక్షుని ఇంపీచ్మెంట్ ప్రక్రియ… లోకమెలా కోడై కూసినా.. ట్రంపు తలవెంట్రుకను కూడా కదిలించలేదని అనిపిస్తున్నది. ఎందుకంటే, కాంగ్రెసులో మెజారిటీగా వున్న డెమోక్రాట్లు అతడిని ఇంపీచ్ చేయాలని (అధ్యక్షుడిగా అతడిని తీసెయ్యాలని) తీర్మానించినా సెనెట్ లో ట్రంపేయులు తమకున్న కొద్దిపాటి మెజారిటీతో దాన్ని తిప్పి పంపించే అవకాశం వుంది.

ఇప్పుడు, ఈ సంపాదకీయానికి సంబంధించి… ట్రంపేయుల వైఖరి గురించి మాట్లాడుకోడానికి చాల సమయం వుంది. ఐడియొలాజికల్ గా ‘మన’కు కాస్త చేరువ అనిపించే డెమోక్రాట్ల సంగతి ఆసక్తికరం. డెమొక్రాట్ల నుంచి ట్రంపును ఎవరు ఎదిరిస్తారనేది ఇక తెలియాల్సి వుంది.

ఆ మధ్య ‘ఎస్, వియ్ కెన్’, ‘ఛేంజ్ వియ్ కెన్ బిలివ్ ఇన్’ అంటో కొన్ని నైరూప్య నినాదాల‍తో ఒకాయన డెమొక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని, ఆ తరువాత, ప్రెసిడెంట్ పదవిని గెల్చుకున్నాడు. ఆయన పేరు బరాక్ ఒబామా. ఆయన నల్లాయన. మొదటిసారి ఒక నల్లజాతీయుడు శ్వేత సౌధ వాసి కావడం… కాంట్రాస్ట్ బాగా కుదిరింది గాని. చివరికి ఆయన తెచ్చిన ‘మార్పు’, నిలిపిన ‘నమ్మకం’ హళ్లికి హళ్లి సున్నకు సున్న. మార్పేమయినా వుంటే ఆ వెంట‍నే ట్రంపు వొచ్చే ప‍రిస్థితులేర్పడడమే ఆ మార్పు. 

మన వూళ్లో చిరంజీవి ఆనే వెండితెర నక్షత్రం ఆ ‘మార్పు’ నినాదాన్ని మ‍రీ అనర్థంగా కాపీ కొట్టి, ఏదో కాస్త సొమ్ము చేసుకుని, ఆ వొచ్చిన సీట్లతో జగన్ ఆశలకు అడ్డుకట్ట వేయ‍డంలో సోనియాకు సాయ‍ప‍డి, తానుగా ఢిల్లీలో ఒక మంత్రి పదవి కొట్టేయ గలిగారు. దరిమిలా ఆయన తమ్ముడు ఆ కాసిన్ని సీట్లు కూడా గెలవకున్నా ఢిల్లీలో చిన్నదో పెద్దదో పాగా వేయాలనుకోడం మ‍న‍కొక‍ తాజా కామెడీ ట్రాక్. మనూరోని ‘మార్పు’ లాంటిదే ఒబామాది కూడా.

బరాక్ ఒబామా… వాయ్యో చాల చాల చేస్తాడని మన ఎన్నారైలు కూడా బాగానే ఊదరగొట్టారు (నాతో స‍హా).

ఒబామా పాలన మరీ ట్రంపు మాదిరి తుపాకులూ పిల్లల చావులు లేకుండా సాగినా; పాజిటివ్ గా ఆయన చేసింది శూన్యం. ఆయన కాలంలో కూడా అమెరికా నేతృత్వంలో జగద్వ్యాప్తంగా నెత్తురుటేళ్ళు పారాయి. ప్రతిసారి ఎన్నికల్లో వేల‍ మంది నల్లవాళ్లు ఓటు హక్కు కోల్పోయే ఒక దుస్థితిని సైతం ప్రెసిడెంట్ ఒబామా సరిదిద్దలేకపోయారు. 

ఎందుకలా జరిగిందనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న.

నాయకుని ఒంటి రంగు కాదు, ఆయన వెనుక నుంచి తాడు లాగుతున్నదెవరు అనేది కీలకం. వెనుక‍ తాళ్ల విశ్వరూపం ప్రస్తుతం డెమోక్రాటిక్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో మరింత బాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆభ్యర్థిత్వం కోసం పోటీ పడే వారిలో ముఖ్యుడు బెర్నీ శాండర్స్. ఆయనకు దొరుకుతున్న ప్రజా మద్దతు ప్రకారమైతే ఆయనే అభ్యర్థి కావాలి. కాని, కాడేమో అనిపిస్తున్నది. వై?

డెమొక్రాట్ల అభ్యర్థిగా బెర్నీ ముందుకు రావడం ఇది మొదటి సారి కాదు. రెండో సారి. పోయిన ఎన్నికల్లో కూడా ఆయన హిల్లరీ క్లింటన్ తదితరులతో పోటీ పడ్డారు. మిగిలిన వాళ్ళు మధ్యలో రాలిపోగా. బెర్నీ, హిల్లరీ లు చివరి వరకు వున్నారు. చాల అంశాలు బెర్నీకి అనుకూలంగా వుండినయ్. అయినా, అతడిని పక్కకి జరిపి హిల్లరీని ఎంపిక చేసింది డెమోక్రాట్ కాకస్. 

హిల్లరీ నిర్ణయం జరగ్గానే ప్రముఖ ప్రగతిశీల సిని నిర్మాత, గట్టి డెమొక్రాటు  మైఖేల్ మూర్ ‘ఇక గెలిచేది (రిపబ్లికన్ అభ్యర్థి) డొనాల్డ్ ట్రంప్’ అని ఆనాడే ప్రకటించేశాడు. ఈ రోజు ఈ సంపాదకీయం రాయడానికి కాసేపు ముందు చూశాను. ‘ఎమ్మెసెన్బీసీ’తో మాట్లాడుతూ మూర్ అదే హెచ్చరిక మళ్లీ చేశారు. 

మైఖేల్ మూర్ 1960 ల నాటి నుంచి… వీత్నాం మీద అమెరికా దురాక్రమణ యుద్దాన్ని నిరసిస్తో జరిగిన ప్రగతిశీల వూరేగింపుల నాటి నుంచి ఇప్పటి వరకు జాతి వివక్షకు, జెండర్ వివక్షకు, అమెరికా గన్ వైలెన్స్ కు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న వారిలో ఒకరు. పార్టీ అభ్యర్థిగా శాండర్స్ వుండాలని గట్టిగా వాదించాఢు. మూర్ మాట అమెరికాలో చాల మంది ప్రగతిశీలుర మనస్సులను ప్రతిబింబిస్తుంది.

మొదట్లోనే చెప్పుకున్నాం. అమెరికాలో అతి కీలక పదవి ఆధ్యక్షుడిదే. ఆ పదవి ఎవరిదో నాలుగేళ్ళ కొకసారి నిర్ణయవుతుంది. జనాలకు ఉన్న ఛాయిస్ దాదాపు ఎప్పుడూ ఇద్దరే. ఇతను లేదా అతను. విజయం చాల వరకు ప్రచారోధృతి మీద ఆధారపడుతుంది. ప్రచారోధృతి చాల వరకు… దేశమంతటా తిరగడానికి అవసరమైన డబ్బు మీద ఆధారపడుతుంది. డబ్బు సమకూర్చే యంత్రాంగం చాల వరకు ధనికస్వాముల జేబుల్లోనే వుంటుంది.

ఈ జేబుల ఓన‍ర్లు అటు ఇటు రెండు పార్టీలలో ఇద్దరు అభ్యర్థులు తమ వాళ్లు అయ్యేలా చూసుకుంటారు. వాళ్ళ ఫండ్స్ తో గెలిచిన వాడు వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగా వుండాలనుకుంటారు. ఉంటాడు కూడా. 

ఆ రకం ‘అనుకూలుడు’గా బెర్నీ వ్యవహరించే అవకాశాలు చాల తక్కువ. కౌమారం నుంచి బెర్నీ శాండర్స్ జీవితం చూసినా, ఇప్పుడు ఆయన చేస్తున్న విధాన ప్రకటనలు చూసినా… ఆయన మీద ట్రిలియనీర్లు ఆశలు పెట్టుకోలేరు. ఎందుకు?

బెర్నీ శాండర్స్ జనులందరికి వైద్యం అందుబాటులో వుండేలా చట్టాల్ని మారుస్తామంటున్నారు. అమెరికాలో ఇప్పుడలా లేదు. ఇన్సూరెన్స్ పేరిట వైద్యం ఖర్చులు సామాన్యునికి అందనంత ఎత్తులో వుంటాయి. సమయానికి ఆదుకోడానికి ఖరీదైన  ఇన్సూరెన్సు లేకపోతే జనం పని గోవిందా. స్కూలు విద్య మాత్రమే కాదు, ఉన్నత విద్యలకు కూడా ఫీజులు తొలగించి, విద్య అందరి అందుబాటులో వొచ్చేలా చట్టం తెస్తామంటున్నారు. (ఇవన్నీ వింటుంటే మీకు మ‍న‍ దగ్గర ఎవరైనా గుర్తొస్తే నేనేం చేయ‍లేను). 

బెర్నీ మాటలు కేవ‍ల‍ం ఎన్నికల వాగ్దానం అనిపించడం లేదు. వక్తలోనూ, శ్రోతల్లోనూ సీరియస్ నెస్ కనిపిస్తోంది. ఈ పనులన్నీ ఎలా చేస్తారు, డబ్బులెక్కడివి అని అడిగితే… బిలియనీర్ల మీద పన్నులు పెంచి సేకరిస్తామంటున్నారు. అలా చేస్తే ఎన్నెన్ని డబ్బులొస్తాయో లెక్కలు చెబుతున్నాడు. అంతే కాదు… ఇప్పటికిప్పుడు ఎన్నికల ప్రచారం కోసం… కోట్లీశ్వరుల మీద కాకుండా సాధారణ జనం మీద, వారివ్వగలిగిన చిన్న చిన్న చందాల మీద  అధారపడుతున్నాడు. 

ఇప్పటి వరకు బెర్నీ, ఆయన వెంట నడుస్తున్న యువజనం అమెరికా యాంటీ ఫాసిస్టులలో, పేదలలో, నర్సులలో, టీచర్లలో,  వలస వచ్చిన వారిలో గొప్ప ఆశలు రేకెత్తిస్తున్నారు. చాల‍ మంది ప్రజా మేధావులు బెర్నీ మీద‍ ఆశ‍లు పెట్టుకుంటున్నారు. (‘అమెరికాలో ఎన్నికలు ‘కొన బడడమే’ ఎక్కువ. ఇలాంటి చోట బెర్నీ గెలవడం కష్టమే గాని, ఆయన విధానాలు బాగున్నాయ’ని ఎండార్స్ చేశాడు నోమ్ చామ్ స్కీ). 

సరిగ్గా ఇందుకే డెమొక్రాట్ కాకస్ బెర్నీని… పోయిన సారి మాదిరిగానే ఈసారి కూడా పక్కకు నెట్టాలనుకోవచ్చు. దానికి ఒబామా సారు మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కలరేదు. ఈలోగానే డెమొక్రాట్లు తమ‍ అభ్యర్థిగా… బిలియనీర్లకు ఇష్టుడైన (ఒబామా ఆడ్మినిస్ట్రేషన్ లో వైస్ ప్రెసిడెంట్ గా పని చేసిన‍)  జో బైడెన్ కు ‘యుక్రేన్’ కేసులో ప్రతిష్ఠా భంగమయి, ఆయ‍న తప్పుకున్నా, తాను బరిలోకి దిగుతానంటున్న మరో ట్రిలియనిర్ బ్లూమ్ బర్గ్ ను లేదా కనీసం తమకు బెర్నీ మాదిరి ప్రమాదకారి కాని ఎలిజబెత్ వారెన్ ను ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. (యుక్రేన్ కేసు ప్రాతిపదికపైనే ఇప్పుడు ట్రంపు ఇంపీచ్మెంటు విచారణ నడుస్తోంది.  ఈ కేసు నేపధ్యంలో బైడెన్ మీద ట్రంపు చేసిన అవినీతి ఆరోపణలు నిజం కాకపోయినా, తన మీద ప్రసరించిన అనుమానపు నీడలు ఆయనకు ఇబ్బంది కలిగించ వచ్చు. సంపాదకీయంలో నేను ఇంతకు మించి ముందుకెళ్తే, అది వేరే గాథ అయిపోతుంది. ఇక్కడ అనవసరం కూడా.)    

ఇదీ నాటకంలో ఇప్పటి వరకు కథ.

బెర్నీ పోటీ రెండు దశలలోనూ గొప్ప ప్రయోగాంశమే అవుతుంది. ఎందుకంటే… రిపబ్లికన్లకే కాదు. డెమొక్రాట్‍ ‘ఎస్టాబ్లిష్మెంట్‍’కు కూడా ఆయన ఒక కొరకరాని కొయ్యగానే వున్నాడు.

బెర్నీ మేర‍కు సోషలిస్టు రాజకీయాలున్న వ్యక్తి అమెరికా ఎన్నికల్లో ఒక్క అడుగు ముందుకేసినా అది పెట్టుబడి ఓటమిలో మొదటి అడుగుకు సంకేతమే. బెర్నీ గెలిస్తే చెప్పిన‍వన్నీ చేస్తాడా లేదా అనేది ద్వితీయాంశం. అతడి విజయం ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని స్పష్టం చేస్తుంది. బెర్నీ గెలిస్తే, గెలిచి మాట(లు) నిలబెట్టుకుంటే అది పెట్టుబడి పొట్టలో పుట్టి పెరిగే సోషలిస్టు చేతనకు… అంటే, కార్ల్ మార్క్స్ మాటకు పెను విజయమవుతుంది. 

పెట్టుబడిదారీ విధానం అత్యున్నత స్థాయికి ఎదిగిన దేశంలోనే మొదట సోషలిజం… అని కార్ల్ మార్క్స్  మాట కదూ?!   

హెచ్చార్కె

4 comments

 • నాకు గుర్తుకొచ్చేడు. అందుకే అతడి మీద పెట్టుబడిదారీ పార్టీలన్నీ ఏకమై మతదాడి చేస్తున్నాయి

 • సార్, మీ సంపాదకీయం ఓ గొప్ప రాజకీయ విశ్లేషణ. ముందు కాలం ఏమంత ఆశాజనకంగా ఉన్నట్టు లేదు. ఇంకో ఏడాది వేచిఉండేది మరో నాలుగేళ్లు భరించేందుకు నెమో. గన్ కంట్రోల్ తీరని ఆశే నెమో.
  గాడ్ GOP!

 • ఒబామా ఏంచేసాడు అంటే, అనేకం చేసాడు. అమెరికా కేవలం ఫారిన్ పాలసీ మాత్రమే కాదు. నిజానికి, డొమెస్టిక్ పాలసీ బడ్జెట్ చాలా ఎక్కువ. మనకి నచ్చనివి చేయకపోయినంత మాత్రాన, ఆయన్ని పూర్తిగా తోసివేయ్యడం తగదు. ఉదాహరణకి:

  1 ) ఫైనాన్స్ రిఫార్మ్ laws: నిజానికి అవి లేకపోతె, 2008 ఇంకా దారుణంగా తయారయేది (ఇంకా ఎక్కువగా చేసి ఉండాల్సింది అంటే, ఆయన రాజు కాదు. అవి కాంగ్రెస్ లో పాస్ కావాలి. అప్పటికే ఎగ్జిక్యూటివ్ లెటర్స్ సైన్ చేయడం ద్వారా కొన్ని సంప్రదాయాలకు వ్యతిరేకం గా పోవడం మూలాన, ఇప్పుడు ట్రంప్ కూడా అలాగే చేస్తున్నాడు.

  2 ) సోషల్ మార్పులు: స్త్రీ హక్కులనుండి, LGBTQ హక్కులవరకు చట్టాలు కల్పించాడు.

  3 ) ఎన్విరాన్మెంట్ కోసం రకరకాల చట్టాలు — ఇప్పటికి బొగ్గు, చమురుల మీద ఆధారపడకుండా చేసాడు.

  ఇంకా అనేకం ఉన్నాయి. నేను పూర్తిగా టైపు చెయ్యలేను.

  ఆఫ్గనిస్తాన్ నుండి పూర్తిగా తియ్యలేదు. సిరియాలో పూర్తిగా జోక్యం చేసుకోలేదు. అలా అని పూర్తిగా సైన్యాన్ని మిడిల్ ఈస్ట్ నుంచి తీయలేదు. డ్రోన్ యుద్ధాలు పెరిగాయి. ఇవన్నీ నిజమే. ముందు వెనక ప్రెసిడెన్సీ లను చూసుకుంటే ఎంత బెటర్ అని అర్థం అవుతుంది.

  ఇప్పుడు బెర్నీ వచ్చినా కూడా, ఏకపక్ష పరిపాలన ఉండదు. రాజకీయాలు అంటే పరస్పర విరుద్ధ శక్తులతో సర్దుకు పోవడం ఉంటుంది. కేవలం పెట్టుబడిదారీ పార్టీలు అని చూస్తే సరైన అవగాహన దొరకదు. ఈ రెండు పార్టీలలో చూడాల్సింది — ప్రజలకీ, ప్రభుత్వానికీ మధ్యన ఏమి సంబంధం అనేది.

  కొంచెం టైపు చెయ్యడం కష్టం గా ఉంది. ఆపేస్తాను.

 • అమెరికా ఎన్నికల తంతు బాగావివరించారు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.