అరుపులు కాదు ఆలోచించండి

ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ హైటెక్-సిటీ అభయ ……… ఇప్పుడు హైదరాబాదు శంషాబాద్ లో ఇద్దరు యువతులు …. 

దారుణంగా సామూహిక అత్యాచారం చేయటం, అత్యంత పాశవికంగా చంపటం కొనసాగుతూనే వున్నాయి.  ఈ సంఘటలనన్నిటినీ మనం విడివిడిగా చేపడితే ఫలితం వుండదు. మూల కారణాలను వెదికి, వాటికి వ్యతిరేకంగా మహోద్యమాలు చేపట్టాలి. 

సామాజిక స్థితిగతులు గాక, సినిమా మీడియాలు యువతను విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. సినిమాల్లో, టీవీల్లో, పత్రికల్లో, మాగజైన్లలో రెచ్చగొట్టే విషయాలని కోకొల్లలుగా గుమ్మరిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో, హీరోయిన్లు నీతిని చాటేవాళ్ళు. విలన్లూ వాంపులూ వేరేగున్నా, హీరో హీరోయిన్లది ముఖ్య భూమికగా ఉండేది. ఇప్పుడు హీరోయిన్లే వాంపుల అవసరం లేకుండా చేస్తున్నారు. ఇక నీతీనియమాలను వదిలేసి, ఎదుటి వారిని ఏడిపించి ఆనందించే శాడిస్టులుగా హీరోలను చిత్రీకరిస్తున్నారు. స్త్రీలు తమ ఆస్తులంటూ, తనకు దక్కకపోతే మరెవ్వరికీ దక్కనీయమనే డైలాగులతో యువత మెదళ్ళలోకి విషాన్ని ఎక్కిస్తున్నారు. స్త్రీని ఒక విలాస వస్తువుగా చిత్రీకరిస్తున్నారు. అంతర్జాలంలో బూతు అంశాలు పుంఖానుపుంఖాలుగా దొరుకుతున్నాయి. వీటన్నిటినుండీ పిల్లలను తల్లిదండ్రులు దూరం చేయలేక పోతున్నారు. ఈ విష ప్రభావాల వల్ల, ఈతరం పిల్లలలో పెద్ద వారిని గౌరవించటం గానీ, స్త్రీలను సమానంగా చూడటం గానీ ఏమాత్రం లేకుండా పోయింది. యువతలో నీతీనియమాలు లేకుండా చేస్తున్నారు. అడ్డుఅదుపూ లేకుండా కామాన్ని రెచ్చగొడుతున్నారు.

ఈతరం అమ్మాయిలు తమ ఇష్టాయిష్టాలను కుండబద్దలు కొట్టేలా చెబుతున్నారు. తమ హక్కులకై నిలబడుతున్నరు. అబ్బాయిలు దీన్ని ధిక్కారంగా అర్ధం చేసుకోవటంతో, పెళ్ళయిన తరువాత మొదటి మూడు, నాలుగు సంవత్సరాలు పెద్ద గండంగా గడుస్తున్నాయి. ఈ గండం గట్టెక్కితేనే కాపురాలు నిలుస్తున్నాయి. 

ఈ రోజు సినీరంగ ప్రముఖులు శంషాబాద్ లో బలైపోయిన అమ్మాయిపై నిస్సుగ్గుగా సానుభూతి చూపిస్తున్నారు. సినీ “హీరోయిన్లు” ఎంత రెచ్చగొట్టినా, వారికి మాత్రం పోలీసు రక్షణ ఉంటుంది. రెచ్చిపోయిన వారెవరైనా వారి పై చేయివేస్తే వెంటనే అరస్టు చేస్తారు. బలైపోయేది సామాన్యులే.

ఈ విధంగా యువతలో నీతినియమాలు లేకుండా చేయటమే గాక, అడ్డు అదుపు లేకుండా కామోద్రేకాన్ని రేపుతున్నారు. ఒకపక్క ఈ పాశ్చాత్య సంస్కృతి విషప్రభావంతో యువత పబ్బుల్లో ఎగురుతూ, ఇంకోపక్క భూస్వామ్య సమాజ విష సంస్కృతి ప్రభావంతో ఇళ్ళ దగ్గర మూఢ నమ్మకాలను అమలు చేస్తున్నారు. 

ఈ విష సంస్కృతులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనావుంది.

అలాగే మద్యం ఏరులై పారుతుంది. ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యాన్ని ప్రోత్సహించటం అమానుషం. ఈరోజు యువత మద్యపానానికి బానిసై పోయింది. అదొక ఫాషన్ గా మారింది. 

సంపూర్ణ మద్యపాన నిషేధం వున్నప్పుడు నేరాలు, తగవులూ చాలా తక్కువగా వుండేవి. 

మళ్ళీ సంపూర్ణ మద్య నిషేధంకై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ప్రగతిశీల ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడే రోజుల్లో ఇలా స్త్రీలపై హింసలు గానీ, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వారిపై దాడులు గానీ చాలా తక్కువగా వుండేవి.

ఈ నిజాలనన్నిటినీ దాచేస్తూ, నేడు రక్షణకోసం పోలీసులకు ఫోన్ చేయమనీ యాప్ లు వాడమనీ బోధిస్తున్నారు. ఆపదలో వున్న వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేయాలనే ఆలోచన రావటం లేదంటే, పోలీసులు తమ విధులు ఎంత చక్కగా నిర్వర్తిస్తారో అర్ధమౌతుంది. రక్షకభటులనే పదం నామమాత్రం గానే మిగిలిపోయింది. పోలీసులు నూరు శాతం రక్షణ కల్పిస్తారనే నమ్మకం ప్రజల్లో లేదు. పోలీసుల దగ్గరకు పోవాలంటే భయపడే పరిస్థితే వుంది. 

ఒక అమ్మాయి తప్పిపోయిందని పోలీసుల దగ్గరకు వెళ్తే, వారి నుంచి వచ్చే సమాధానం ఎవడితోనో లేచిపోయి వుంటుందనే. తమ పరిధిలో లేక పోయినా కేసు రిజిస్టర్ చేసుకోవాలనే ఆదేశాలున్నా, వేరే పోలీస్ స్టేషన్లకు పొమ్మంటారు. శంషాబాద్ మృతురాలి తల్లిదండ్రులకు కూడా ఈ రెండు అనుభవాలూ ఎదురయ్యాయి. ఒక అమ్మాయి అత్యాచారానికి గురైందంటే, ముందు ఆ అమ్మాయి ఎలాంటిదోననే అంటారు. ఈ అమ్మాయి డాక్టర్ కావటంతో ఆ అపవాదు తప్పించుకుంది.

ఇక యాప్ లు వాడాలంటే స్మార్ట్ ఫోన్ కావాలి. ఎంతమందికి వాటిని కొనే స్థోమత వుంటుంది? వాటిని కొనలేని వారు, వీరి దృష్టిలో అసలు మనుషులే కాదు. యాప్ లు వాడే వారు కూడా, భౌగోళిక స్థాన సూచి(GPS)ను ఎల్లప్పుడూ తెరచి వుంచాలి. మన మదుగు (privacy) కోసం జీపీయస్ ను మూసి వుంచినాగానీ, గూగుల్ మొదలైన కంపెనీలు మన కదలికలను రికార్డు చేస్తూనే వున్నాయి. పైగా మీరు ఫలానా ప్రదేశానికి వెళ్ళారు, ఆ ప్రదేశం గురించి వివరంగా రాయండని భయం లేకుండా మనల్నే అడుగుతున్నాయి. మదుగు మన హక్కు అనే పరిజ్ఞానం మనకు లేనందునే వాళ్ళిలా బరితెగిస్తున్నారు. 

పైగా ఈ యాప్ లు వాడితే, మనకు మదుగంటూ ఉండనే ఉండదు. ఇప్పుటికే మనకు తెలియకుండా మన ధ్వని, ఫోటోలు, విడియోలు రికార్డు చేస్తున్నారు. మన మదుగు, మన హక్కని ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ లు మన మదుగును అతిక్రమించడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని మనం పోరాడాలి!

యాప్ లు వాడినా ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పనిచేస్తాయనే నమ్మకం లేదు. రాజకీయ నాయకులూ, ప్రభుత్వ ఉన్నతోద్యోగ్యులు వారి వారి విధులను నిర్వర్తించడం కంటే, ఏమి చేస్తే సంపాదించుకోవచ్చోననే చుస్తూవుంటారు. యథా రాజా – తథా ప్రజా అన్నట్లే కింది వారు కూడా వుంటారు. ప్రజా సేవకులనేది ఉట్టి మాటే

హత్యగావించబడ్డ డాక్టర్ విషయంలో, మొదట హంతకులు కర్నూలు  అనంతపూర్ లకు చెందిన లారీ డ్రైవర్లుగా వార్తలొచ్చాయి. రాష్ట్రం దాటెళ్ళి పోయిన అసలైన హంతకులను పట్టుకోవటం కష్టం కావున, స్థానిక అమాయకుల్ని నేరస్తులుగా చూపించే అవకాశం ఉన్నదా? నిందితులుగా చూపించిన వారినే మనం నేరస్తులుగా పరిగణించి, మనం వారిని ఉరితీయాలనీ, ఎన్ కౌంటర్ చేయాలనీ డిమాండ్ చేయకూడదు. నిందితులకు, నేరస్తులకు మద్య తేడా మనం గమనించాలి. నిందితులే నేరస్తులా కాదా అన్నది మనం స్వతంత్రంగా విచారించాలి.

అయేషా మీరా కేసులో సత్యం బాబు నేరస్తుడని పోలీసులు చెప్పినా, ఆమె తల్లి ఒప్పుకోకుండా ధైర్యంగా పోరాడింది కాబట్టే అమాయకుడైన సత్యంబాబు ఉరి తప్పించుకున్నాడు. ఒకసారి ఉరితీసిన తరువాత నిజం బయట పడితే, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకు రాగలుగుతామా?

శంషాబాద్ లో హత్యగావించబడ్డ రెండో మహిళను తగలబెట్టిన చోట రక్తం వున్నా, మద్యం సీసాలు వున్నా పోలీసులు దానిని ఆత్మహత్యగా చిత్రిస్తున్నారంటే – నిందితుల్ని దోషులుగా పోలీసులు, ప్రభుత్వం, మీడియాలు చెప్పినా మనం ఉరి తీయమని  ఎన్ కౌంటర్ చేయమని డీమాండ్ చేయకూడదనీ, స్వతంత్రంగా విచారించ వలసిన అవసరం ఉన్నదనీ గ్రహించాలి. గుంపులో గోవింద కొట్టకూడదు. ధైర్యంగా మళ్లీ మళ్ళీ ఆలోచించాలి!

  • రాప్ర   2019.11.30

 

రాప్ర

Add comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.