ఆధునిక నాటకానికి నాంది
పలికిన వాడు: బెర్నార్డ్ షా

ఆంగ్ల నాటక పితామహుడైన విలియం షేక్స్పియర్ తర్వాత అంతటి పేరుగాంచిన  నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా. 1856 జులై 16న ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జార్జ్ బెర్నార్డ్ షా  ఒక పేద కుటుంబం లో జన్మించాడు. తల్లి సంగీత అధ్యాపకురాలు అయితే తండ్రి ఆల్కహాల్ కు బానిస. ఇంటి వద్దనే సంగీతాన్ని, కళలనీ అభ్యసించాడు. పాఠశాల చదువులతన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆర్థికమైన ఇబ్బందుల వల్ల డబ్లిన్ వదిలేసి తల్లితో ఇంగ్లాండు వెళ్ళాడు. అక్కడ  తల్లి, ఇద్దరు సోదరీమణులు తో కలిసి ఒక సంగీత పాఠశాల నడిపాడు. పత్రికలకు విమర్శనా వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. సోషలిస్ట్ వర్గ సభ్యుడిగా , 1884లో ఫేబియన్ సొసైటీ సభ్యుడిగా చేరాడు. కార్ల్ మార్క్స్ ‘ దాస్ కాపిటల్’, హెన్రీ జార్జ్ ఉపన్యాసాలు అతన్ని ప్రభావితం చేశాయి. 1888-1894  మధ్యకాలంలో సంగీత విమర్శకుడిగా అతని వ్యాసాలు అతనికి చాలా అరుదైన కీర్తిని తెచ్చిపెట్టాయి. బ్రిటిష్ చదువరులకు ఇబ్సెన్ను పరిచయం చేశాడు. 

జార్జి బెర్నార్డ్ షా తన 42 వ ఏట 1898లో శాలేట్ పైన్ టౌన్స్ హెడ్  ను పెళ్లాడాడు. 52 నాటకాలు, ఐదు నవలలు, రెండు చిన్న కథలు, ఇంకా అనేక వ్యాసాలు వ్రాసిన షా 1925 లో నోబెల్ బహుమతిని, ‘పిగ్మాలియన్’ నాటక స్క్రీన్ ప్లేకి  1938లో ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. వృక్ష ప్రేమికుడైన షా 1950 నవంబర్ 2న యాపిల్ చెట్టు నొక దాన్ని సరి చేస్తూ కిందపడి మరణించాడు.

జార్జ్ బెర్నార్డ్ షా గొప్ప నాటక రచయిత, విమర్శకుడు, హాస్యప్రియుడు, వ్యాసకర్త, ఉపన్యాసకుడు, సాంఘిక విప్లవ వాది. ఆలోచనాత్మకమైన నాటకరంగాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేశాడు. ‘గ్రీకులకు అరిస్టాటిల్ ,ఇంగ్లాండ్ కి  షేక్స్పియర్, ఇటలీకి డావించి ఎలాగో, ఐర్లాండ్ కు జార్జ్ బెర్నార్డ్ షా’ అని చెప్పుకున్నాడు. 

తన నాటకాలలో సంఘంలోని మోసాన్ని, కాపట్యాన్ని, అన్ని వర్ణ వర్గ వైషమ్యాలను, మతాన్ని, మౌఢ్యాలను తీవ్రంగా విమర్శించాడు. డబ్లిన్ లో  చాలా సిగ్గరిగా పెరిగిన ఈ చిన్న పిల్లవాడు ప్రపంచాన్ని కవ్వించేటంత మాటకారిగా మారాడు. ప్రపంచపు దుర్మార్గాన్ని ప్రశ్నించే రచయితగా ఎదిగాడు. తనను తాను ఎగతాళి చేసుకుంటూ మనుషుల లోపాలను ఎగతాళి చేస్తూ సామాజిక రుగ్మతలను ఎండగడుతూ దైనందిన ప్రయోగాలు  నాటక శిల్పం లాంటివి పక్కనపెట్టి, తనదైన నాటకశైలిని పెంపొందించాడు. బోజ్వా సమాజాన్ని సవాలు చేశాడు. తన లోతైన చూపుతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. నాటకాలలో ఆయన దీర్ఘమైన ముందుమాటలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి.

రచయితగా తన ప్రారంభదశలో వ్రాసిన నాటకాలు తన సమకాలిక సాంఘిక దురలవాట్లను దుయ్యబట్టాయి.  1885 లో రాసిన తన మొదటి నాటకం ‘విడోయర్స్ హౌసెస్స్’మురికివాడల్లోని యజమానుల గురించి, ‘మిసిజ్ వారెన్స్ ప్రొఫెషన్’ లో వ్యభిచారం గురించి, ‘ఆమ్స్ అండ్ ద మాన్’ లో సైనికుల గురించి చెప్తాడు. అద్భుతమైన నూతనత్వాన్ని, నాటక రచనా చాతుర్యాన్ని వ్యక్తపరిచాడు.నాటకరచన గురించి ఏమీ నేర్చుకోకపోయినా ఇబ్సెన్ నుంచి ఎలాంటి వస్తువులను ఎన్నుకోవాలో, నేపధ్యాన్ని ఎలా ఎంచుకోలో, చర్చలను ప్రోత్సహించే సన్నివేశాలను ఎలా వ్రాయాలో తెలుసుకొన్నాడు. నాటక రచనలో సంభాషణలను అమేయమైన చతురతో నింపాడు. సాంఘిక, నైతిక, రాజకీయ, మత సమస్యలను చర్చించాడు. సంగీత ప్రేమికుడు,  విమర్శకుడు కావడంతో భాషలోని లయను అభ్యసించి దానికి హాస్యాన్ని, సహజమైన సొబగును అద్దాడు.

ఇంత విలక్షణమైన వ్యక్తిత్వం గల షా ఎప్పుడూ కూడా సమాజం నుంచీ వ్యక్తిని విడదీసి చూడలేదు. ఇబ్సెన్, విషెర్లీ లాగా లోతైన విశ్లేషణా దృక్పథం కలిగి అనిర్వచనీయమైన చతురతతో కూడిన నాటకాలు రచించాడు. ఆధునిక నాటక రంగం జార్జ్ బెర్నార్డ్ షాకు రుణపడి ఉంటుంది. 

తన  పాత్రలను వాటి పరిసరాలను పరిచయం చేయడంలో ఆయనది ఒక ప్రత్యేక శైలి. ‘మాన్ అండ్ సూపర్ మాన్’ ‘ఆమ్స్ అండ్ ద మాన్’ లో  పాత్రలను వాటి గతాన్ని ఇలాగే పరిచయం చేశాడు. ‘ప్లేస్ ప్లజంట్ అండ్ అన్ప్లజంట్’ (1898) ఇంకా ‘ప్లేస్ ఫర్ ప్యూరిటన్స్’ (1900) ఆయనను అగ్రగామిగా నిలిపిన నాటకాలు. ఈయన నాటకాలు వాదనాశైలిని, భిన్నత్వాన్ని, పరస్పర వ్యతిరేక స్వభావాన్ని కూడా చూపుతాయి. అవి చర్చలను చాటే గ్రంథాలుగా అగుపడతాయి. షా మాటలలోని నిష్పాక్షికత, ధైర్యం అణువణువునా ప్రదర్శిస్తాయి. 

జార్జ్ బెర్నార్డ్ షాకు ప్రజాస్వామ్యం పట్ల, ఆర్థిక సంస్కరణల పట్ల నమ్మకం లేదు. ‘పాపులిస్ట్ విధానాలు, అధికారతత్వం, బోజ్వా దౌత్యలక్షణాలు, సామాన్య మానవుడి అవసరాలు తీర్చే లేవు’ అని అభిప్రాయపడ్డాడు. ‘యాపిల్ కార్ట్’ అనే నాటకంలో ఆయన పార్లమెంటు వ్యవస్థను తీవ్రంగా ప్రశ్నిస్తాడు. పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరంతరం దాడి చేశాడు.  ‘కార్మిక వర్గాలు పెట్టుబడిదారీ వ్యవస్థ పై ఆధారపడి ఉందని, వారితో కలిసి తోటి కార్మికులపై పోరాటం చేస్తోందని’ నిర్భయంగా చెప్పాడు. ‘మిసేజ్ వారెన్స్ ప్రొఫెషన్’ నాటకంలో ‘వ్యభిచారం పెట్టుబడిదారీ వ్యవస్త లాటిదనీ, కార్మికులు బతికేందుకు తమ శ్రమను అమ్ముకుంటే స్త్రీలు బతికేందుకు తమను తాము అనుకుంటార’ని తెలియజేస్తాడు. ‘ద ఇంటెలిజంట్ వుమన్స్ గైడ్ టు కాపిటలిజం’ నాటకం లో ధనం కోసం లైంగిక సంబంధాల గురించి మాట్లాడుతూ, ‘జర్నలిస్టులు, తనలాటి రచయితలు, స్త్రీలు శరీరాలనమ్ము కున్నట్లు  శక్తియుక్తులను అమ్ముకుంటారని’ చెప్పాడు. 

సమాజంలోని ప్రతి విషయం అంతరంగికంగా ఎలా పెట్టుబడిదారీ వ్యవస్థతో ముడిపడి వుందో, పేదరికం ఎలా నేరమౌతోందో ‘మేజర్ బార్బరా’ అనే నాటకంలో తెలియజేస్తాడు. ఒక ఆయుధ వ్యాపారి ఇచ్చే ధనం తో పనిచేసే సాల్వేషన్ ఆర్మీ గురించి మాట్లాడుతూ అదే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ, దాని చెడు ప్రభావం నుంచి సమాజం, ఎలా బయట పడదో చూపుతాడు. భాష, ఉచ్చారణా వ్యత్యాసాలను ఆధారంగా చేసుకుని వర్గ సమాజం ఎలా ప్రవర్తిస్తుందో ‘పిగ్మాలియన్’అనే నాటకంలో తెలియజేస్తాడు.

 షా మార్క్స్ సూచించిన కార్మిక వర్గ పోరాటాన్ని అంగీకరిస్తాడు. మార్క్స్ వ్యక్త పరిచిన 19వ శతాబ్ద నిరసను తన 20వ శతాబ్ద నిరసనతో ముడిపెడతాడు. ఆర్ధిక అవసరాలు లేని వర్గ రహిత సమాజ నిర్మాణాన్ని ఒక సరియైన సమాజ ఆవిర్భావానికి దోహదపడే జీవ శక్తిని నిర్మించగల గొప్పనాయకులకై ఆశపడతాడు. 1919లో వ్రాయబడిన ‘హార్ట్ బ్రేక్ హౌస్’ లో ప్రముఖ రచయిత ఆంటన్ షెహోవ్ శైలిలో సమాజం గురించి మారుతున్న మనుషుల గురించీ మాట్లాడతాడు. 

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కల సన్నివేశాలతో ఈ నాటకం సమాజం యొక్క అర్ధరాహిత్యాన్ని చూపుతుంది. 

1894లోని ‘కాండిడా’ఒక మంచి హాస్య నాటకం. విక్టోరియన్ కాలపు ద్వితీయార్ధం లోని భార్యభర్తల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తుంది. కాండిడా మొరెల్, రెవరెండ్ జేమ్స్ మొరెల్ భార్యాభర్తలు. కాండిడా చాలా అందగత్తె.  మార్చి బ్యాంక్స్ అనే స్నేహితుడైన కవి ఆమె పట్ల తన ఆరాధనను ప్రేమను వ్యక్తం చేస్తాడు. అయితే మోరల్ ఆమె ప్రేమను గెలవగలడేమో చూసుకోమని సవాలు చేస్తాడు. అతను తన భార్యకు తన రక్షణ ప్రేమ అవసరమని భావిస్తాడు.అయితే ఇద్దరి అంచనాలకు భిన్నంగా కాండిడా వారిద్దరిలో బలహీనుడైన వాడినే తానెన్నుకుంటానని భర్తనే ఎన్నుకుంటుంది.1894లోని ‘ఆమ్స్ అండ్ ద మాన్’ కూడా విభిన్నమైన హాస్య ఇతివృత్తంతో ఇద్దరు ప్రేమికుల ఎంపికను, స్త్రీల మనోభావాలు గురించి వ్రాయబడిన నాటకం. 

1903లో రచించిన ‘మాన్ అండ్ సూపర్ మాన్’ రచనలలో మరొక గొప్ప నాటకం. జాక్ టర్నర్ ఒంటరిగా మిగిలిపోవాలని నిర్ణయించుకుంటాడు.ఆన్ వైట్ ఫీల్డ్ అనే స్త్రీ ఎలాగైనా అతన్ని పెళ్ళిలోకి లాగాలని నిర్ణయించుకుంటుంది. సమాజం మనుషుల స్వభావాలు ప్రకృతి గురించిన చర్చలు సాగుతాయి. నాటక చరిత్రలో ఇలాంటి అద్భుత నాటకం ఇంకొకటి కనిపించదు. పురుషుడు, స్త్రీ పురుషుల పంతాల పెనుగులాటలో పురుషుడే ఓడిపోతాడని చెప్తాడు.

ఉద్దేశపూర్వకంగానే విమర్శించి నవ్విస్తాడు షా. కాంగ్రీవ్ నాటకాలలోని హాస్యం, జాన్సన్ నాటకాలలా పరుషమైన వ్యంగ్యం, ఇబ్సెన్ నాటకాలలోతుతో మనలను నవ్విస్తాడు . కొన్ని నాటకాలు  కేవలం విజ్ఞాన దాయకమైన వుపన్యాసాలలా సాగుతాయి. 1914-18 మధ్య ఏ నాటకం రాయని బెర్నార్డ్ షా 1919లో ‘హార్ట్ బ్రేక్ హౌస్’ తో యుద్ధ నేపథ్యంలో ప్రజల నిరాశను ప్రభుత్వ చట్టాల నిరుపయోగతను  చూపుతాడు. నాటకాన్ని సమాజహితంకోసం పలుకోణాల్లో చూసినవాడు బెర్నార్డ్ షా. విప్లవాత్మక మార్క్సిజం కాక ఫేబియన్ సంఘసభ్యుడిగా సంస్కరణాత్మక, పరిష్కారాత్మక, సంఘవాదం బ్రిటీష్ రాజకీయ సంప్రదాయానికి తోడ్పడుతుందో సూచిస్తాడు. బోజ్వా విద్యావ్యవస్థను తూర్పారపడతాడు.

ఈ సమాజం దొంగలను దోపిడీదారులను గొప్పవారిగా విజేతలుగా చూపుతుందనీ వర్తకం తో నాశనమైన భూస్వామ్యవాద నైతికతను మన విద్యా వ్యవస్థ ఎలా నేర్పుతుందో చూపుతాడు. ‘బాక్ టు మెతుసలా’, ‘యాజ్ ఫార్ యాజ్ ద తాట్ కెన్ రీచ్’ ‘సింపుల్ టన్ ఆఫ్ ద అన్ ఎక్స్ప్రెస్డ్ ఐర్’ ఇలాటి ఆలోచనలను ప్రతిఫలిస్తాయి. ‘డాక్టర్స్ డైలమా’ నాటకంలో వైద్య రంగాన్ని, ‘మిసలయన్స్’ అనే నాటకంలో విద్యావ్యవస్థను విమర్శిస్తాడు.

‘గెట్టింగ్ మారీడ్’ లోవివాహ వ్యవస్థను గురించి చర్చిస్తాడు. నటన, కథాపరమైన విషయాలని పక్కన పెట్టి వివాహ వ్యవస్థలోని లోటుపాట్లను చూపుతాడు.  ఎప్పుడూ ఒక సృజనాత్మక పరిణామాన్ని కోరుకున్నాడు షా. దానినే తన మతంగా భావించాడు. మానవునికి పేదరికం శాపమనీ తగిన ఆదాయ వనరులు లేకుండా సమాజం అగమ్యగోచరం అవుతుందని భావిస్తాడు. పరిపుష్టమైన  ఆర్థిక సమాజానికి పనికొచ్చే పరిపుష్టమైన నమ్మకాన్ని ఇస్తుందని తెలిపాడు. సాంప్రదాయికత, తార్కికతను అణగతొక్కే నియంతృత్వం పక్కన పెట్టి అనిర్వచనీయమైన జీవశక్తిని పెంపొందించుకొమ్మని చెప్పాడు.  ఆర్థిక సంబంధమైన, భావ సంబంధమైన, తార్కిక సంబంధమైన, నైతిక సంబంధమైన నిరంకుశత్వాన్ని ఎదిరించమని చెప్తాడు. తన నాటకాలలో దీన్నే ప్రతిపాదించి చర్చిస్తాడు. 

షా నాటకాలన్నిటిలోకి  తలమానికమైన1903 లో రచించిన ‘సెయింట్ జోన్’గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1429-1431  మధ్యకాలంలో కేంద్రీకరించబడిన ఈ నాటకం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ల మధ్య నూరు సంవత్సరాల యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. నిజమైన మేధావులు, ఆధ్యాత్మిక వేత్తలను ఈ సమాజం ఎలా చులకనగా చూస్తుందనే వివరణ చేస్తుంది. భగవంతుడి ఆదేశానుసారం ఒక పేద యువతి తన దేశాన్ని కాడి నిరాడంబరంగా ఎలామిగిలిపోతుందో అయితే ఆమె మంచితనాన్ని పవిత్రతను అణచి వేయడం కోసం రాజ్యం మరియు చర్చి  ఎలా కుట్ర పన్నుతాయో చూపుతాడు బెర్నార్డ్ షా.

షా లైంగిక అనుభవాల అవసరాన్ని కాదనడు. అది ఆనందదాయకమనీ విజ్ఞానవంతమనీ చెప్తూ పశుప్రవృత్తిని విడనాడాలనీ, అవసరమైనప్పుడు మానసిక విజ్ఞతకే పెద్దపీట వేయాలని అలాంటి అనుభవం స్వాభావికమే అయినప్పటికీ దానికి బానిస కారాదనీ చెప్తాడు. సీజర్ క్లియోపాత్ర సౌందర్యానికి బానిస అయినప్పటికీ తన ధర్మాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు తన సుఖాలను తృణప్రాయంగా వదిలివేయడం గుర్తు చేస్తాడు.

షా దృష్టి లోని గొప్ప వ్యక్తులు అందరూ కూడా యదార్థ వాదులు. స్వాభావికంగా మంచివారు. ఉన్న విషయాలను ఉన్నట్లుగా చూస్తారు. కష్టజీవులు. వారి కొన్ని బలహీనతలను కూడా దాట గలిగిన వారు. నిష్పక్షపాత ధోరణితో తార్కికంగా ఆలోచన చేయగలిగిన వాళ్ళు. ఇలాంటి లక్షణాలను పెంపొందించుకోవాలని  సూచిస్తాడు. ఇలాంటి సమాజంలో అవసరమని ఆశిస్తాడు. కళ ద్వారా సమాజ శ్రేయస్సు కోరుకున్నాడు. షా ప్రస్తావన లేకుండా ఆధునిక నాటక ప్రస్తావన ఉండదు. అందుకే ఆయన ఆధునిక నాటక పితామహుడయ్యాడు.

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

1 comment

  • ఈ వ్యాసం చదువుతుంటే నాకు తెలిసిన బెర్నార్డ్ షాఎనా అని అనుమానం వేస్తుంది. బెర్నార్డ్ షా వర్గ పోరాట మార్గాన్ని తిరస్కరించిన ఫ్యాబియాన్ సోషలిస్ట్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.