నీవు నిర్వాత మేఘ శకలానివి, కదలలేవు; ఆకాశం నీకు ఊచలు లేని పంజరం ! నేను కటకటాల వెనుక చిలుకను, ఎగిరిపోలేను; నేను నిగళాలకు చిక్కిన నింగిని ! నీవేనా ఆ నీలి మబ్బుల నీడలలో చువ్వలను కట్టుకొని ఎగురుతున్న లోహ విహంగానివి ! తొంగి చూడకు శూన్యం లోకి ; అక్కడ నీకు కనిపిస్తవి వేలాడే అస్థిపంజరాలు, ముక్కలౌతున్న ఆకాశాలు . దూకకు లోకం లోకి అక్కడ నీకు ఎదురౌతవి అశోకాల హరిత ఛాయలలో ఆడుతున్న కోడె నవ్వులు, జారి పడుతున్న స్వర్గాలు . నేను నింగి నేలల నడిమి నీటి పొగలను ఈదుతున్న చేప రెక్కను ! నాకు శూన్యాలలో కనిపిస్తవి దేహాలను తొడుక్కుంటున్న అస్థికలు, ఒక్కటౌతున్న ఆకాశ శకలాలు. ఐహిక అగాధాలలో నన్ను స్వాగతిస్తవి హసిత పగడాల పసిడి దీవులు, నింగి కెక్కుతున్న భూతాల స్వర్గాలు. కలుద్దాం మనిద్దరం అక్కడ నింగీ నేలను కలుపుతున్న ఆ మెలకువ వేకువ గాలిలో .

బాగరాశారు!👌👌సర్!ధన్యవాదాలు.