‘నేను భంగీని’

“మై భంగీ హూ” ఒక అంటరాని వాని ద్వారా రాయబడిన అంటరాని కులపు ఆత్మకథ.హిందీలో భగవాన్ దాస్ రచించిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి “నేను భంగీని” అంటూ డా.జి.వి.రత్నాకర్ గారు అనువదించారు.”నేను భంగీని” మొదటగా ఉర్దూ పత్రిక “భీమ్ పత్రిక”లో 1957 నుండి సీరియల్ వ్యాస రూపంలో ప్రచురింపబడింది.

భారతదేశంలో తొలితరం దళిత చైతన్యానికి నిలువెత్తు ప్రతీక భగవాన్ దాస్(1927-2010).తన జాతి ప్రజల చరిత్రకారుడిగా సుప్రసిద్దుడైన ఆయన దేశంలో దళిత కులాల,దళిత ఉద్యమ చరిత్రను అక్షర బద్దం చేశారు.

భంగీ(పాకీ) వృత్తి కులంలో జన్మించిన భగవాన్ దాస్ పదహారేళ్ళ ప్రాయంలోనే అంబేద్కర్ స్థాపించిన ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్’ లో చేరారు.1983 లో అంటరానితనం, దాని అమానుషాల గురించి ఐరాస వేదిక మీద ప్రసంగించారు.ఈ కథ అంతా ఒక మామూలు వ్యక్తి వినిపిస్తున్నట్లుగా రాయబడింది.

” బ్రాహ్మణులకి భారతం కావల్సి వచ్చింది.
వ్యాసున్ని పిలిపించారు.
వ్యాసుడు వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి.
బ్రాహ్మణులకి రామాయణం కావల్సివచ్చింది.
వాల్మీకిని పిలిపించారు.
వాల్మీకి ఆదివాసీ సమాజం వ్యక్తి.
నేడు ఈ దేశానికి రాజ్యాంగం కావాల్సి వచ్చింది.
నన్ను పిలిపించారు.
నేనొక అంటరాని వాన్ని.
చరిత్ర నిర్మాతలు బహుజనులే కానీ బ్రాహ్మణులు కాదు.”
—– రాజ్యాంగాన్ని సమర్పిస్తూ అంబేడ్కర్‌ చెప్పిన కవితను ప్రేరణగా తీసుకుని భగవాన్ దాస్ ఈ ఆత్మకథను రచించారు.

గతకాలంలో నన్ను ఛండాలుడు అని పిలిచేవారు.శూద్రుడు ఇంట్లో పనిచేసే బానిసైతే, నేను సమాజం నుండి బహిష్కరించబడిన వ్యక్తిని. సమాజం నుండి ఖండించబడిన అంగాన్ని అంటాడు భంగీ. భంగీకి ప్రత్యేకమైన మతమంటూ ఏదీ లేదు. ఈ దేశంలో చట్టాలు బ్రాహ్మణుల చేత తయారు చేయబడ్డాయి. హిందూమత చట్టాలు కేవలం భంగీని దరిద్రునిగా జీవించడానికే కాదు,బానిసగా ఉంచడానికి తయారు చేయబడ్డాయి. శతాబ్దాల నుంచి నెత్తిన మళమూత్రాల తట్టను మోస్తూ,చేతిలో చీపురు కట్టను పట్టుకొని శుభ్రం చేయడమే తన కర్తవ్యమనుకొని పేడ పురుగు జీవితాన్ని అనుభవిస్తూ వస్తున్నాడు.పూర్వజన్మ కర్మ ఫలంగానే భంగీ బతుకు ఉన్నదని,దీన్ని ఎవరూ మార్చకూడదంటూ స్వార్థంతో బ్రాహ్మణ చట్టాలను రూపొందించబడ్డాయంటాడు.
“నీళ్ళు జీవితాన్నిస్తాయి.కానీ నాకు మాత్రం నీళ్ళు బానిస సంకెళ్లు.ప్రకృతిలో నీరు,గాలిపై అందరికీ సమాన హక్కులుంటాయి.కానీ హిందూ సమాజంలో నీళ్లపై హక్కు కూడా నాకు దక్కకుండా చేశారని తన మనోవేధనని చెప్పుకుంటాడు.

ఆ తర్వాత భారత దేశానికి వచ్చిన ఇస్లాం పాలనలో భంగీకి హిందూమతం కంటె కొంతలో కొంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుతుంటాడు భంగీ.స్వార్థంతో వారి మతంలోకి మతమార్పిడీలు చేసుకుని వారి సమాజాన్ని పెంచుకోడానికి ప్రయత్నాలను మొదలుపెట్టారే తప్ప నాకు కావాల్సిన రక్షణ అక్కడ కూడా లేదని పేర్కొంటాడు.బుద్దభగవానుని బోదనలు,బౌద్దమతం మాత్రం నన్ను నన్నుగా స్వీకరించిందని పేర్కొంటాడు.

భారతదేశంలోని వర్ణ వ్యవస్థను,మతాల పెత్తనం చూస్తుంటే ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పుతుంటాడు.

వ్యాపార నిమిత్తం వచ్చిన ఆంగ్లేయుల వల్ల అంటారాని వాన్నైన నాకు చదువుకునే అవకాశం దొరికింది.ఎందుకంటే ఆ మతంలో ఎలాంటి మూఢ వ్యవస్థ లేదు.నాకో ఉద్యోగం ఇచ్చి నాకు కొంత జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది.కానీ దీన్ని ఓర్చుకోలేని నా దేశంలోని ఆధిపత్య మతాలు నన్ను మళ్లీ వెనక్కినెట్టాయి.నాకు పోరాడటం తెల్వదు.వాళ్లు చెప్పినవే గుడ్డిగా నమ్మడానికి అలవాటు పడిన వాన్ని.నా ఇంటి ఆడవాళ్లను అనుభవిస్తారు.జీవితాలతో ఆడుకుంటారు.అయినా పళ్లెత్తు మాట మాట్లాడకుండ భరిస్తూ ఉండాలి.ఈ యుగంలోనే  గాంధీ మహాత్ముడు అనే నాయకుడు “భంగీ తల్లిలాగా నిస్వార్థంగా పనిచేస్తున్నాడు.దాన్ని హీనమైన వృత్తిగా భావించకుండా సేవగా భావించాలి” అని అవమానకరమైన నరకంలోనే ఉంచేందుకు ప్రయత్నించాడు.మా నాయకుడు అంబేద్కర్ విద్య నేర్చుకో,సంఘాన్ని స్థాపించు,ఉన్నతమైన జీవితం కోసం పోరాటం చెయ్యి.విద్య ఉన్నతి మరియు ప్రగతికి మార్గం.గౌరవంగా బతికే కొన్ని సంవత్సరాలైనా వందల సంవత్సరాల బానిస జీవితం కంటే ఉన్నతమైనదని చెప్పుతుండే వాడు.కానీ నా సోదరులు ఆ మహా పురుషుని మాటలు వినకుండా మహాత్ముల సలహానే పాటించారు.నా చీపురుకట్ట గొప్పతనం అమెరికా ప్రధానమంత్రి భార్య వరకు వెళ్లింది.కానీ నా జీవన స్థితిలో మాత్రం ఎలాంటి అభివృద్ధి కలగలేదంటాడు.

భారతదేశం ఒక విచిత్రమైన దేశం. ఇక్కడి పాలక రాజకీయ పార్టీలు  అంటరాని, బలహీన వర్గాల్లోని కొంతమంది చదువులేని లేక సగం చదువుకున్న స్వార్థపరుల్ని ఎంచుకొని పార్లమెంటుకి,అసెంబ్లీకి పంపి ప్రజల నెత్తిపై నాయకులుగా కూర్చోపెడతారు.ఈ నాయకులు పాలక,శక్తివంతమైన వర్గాలకు దళారులుగా తయారవుతారని చెప్పుతుంటాడు భంగీ.భారతదేశంలో దొంగలకు,హంతకులకు,వేశ్యలకు గౌరవం ఉంది.భంగీ వాళ్లకంటే హీనమైన  వాడిగా భావించబడుతున్నాడని పేర్కొంటాడు.అందుకే ఈ దేశంలో పుట్టడానికి నేను ఇష్టపడటం లేదంటాడు.ఇప్పటి నా ఉద్దేశం పాత ఆచారాలకు నిప్పుపెట్టి సుందరభవితని నిర్మించడం.నేను బ్రతకాలనుకుంటున్నాను,

అల్పునిగా,అంటరానివానిగా,మాలగా,మాదిగగా,

రెల్లిగా, బైండ్లగా బ్రతకాలనుకోవడం లేదు. మంచి మనిషిగా,గౌరవంగా,ఉన్నతంగా తలెత్తుకొని బ్రతకాలనుకుంటున్నాను‍.

నేటి వరకు నేను ప్రజల ఇళ్లల్లో పెంటని, మురికిని ఎత్తి శుభ్రం చేస్తూ వచ్చాను. అయితే మతపరమైన,రాజకీయమైన, ఆర్థికమైన,సామాజిక మైన మురికి మనిషిలో ,సమాజంలో గూడుకట్టుకొని ఉంది.దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా నా భుజ స్కంధాలపైనే ఉంది.అప్పుడే స్వాతంత్ర్యం, సమానత్వం, న్యాయం, సోదరభావం, ప్రేమలే పునాదిగా కొత్త లోకాన్ని,సుందర భవితను నిర్మించగలమని భంగీ తన  అంతర్ముఖాన్ని వినిపిస్తాడు.

30.11.2019

వెంకి, హన్మకొండ

అసలు పేరు గట్టు రాధిక మోహన్. హన్మకొండలో నివాసం. వృత్తిరీత్యా మ్యాథ్స్ టీచర్. పుస్తకాలు చదవడం ఒక అలవాటు. అడపాదడపా "వెంకి" కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. కవిత్వం మీద "ఆమె తప్పిపోయింది" పేరుతో పుస్తకం వెలువరించారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.