విద్యా మాధ్యమం
కత్తికి రెండంచులు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం విషయంలో అనుసరిస్తున్న ధోరణి, ఇపుడు తెలుగును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మరియు ఆంగ్ల మాధ్యమ బోధన అవసరం – ఈ రెండింటిని తెలిసి వచ్చేలా చేస్తున్నాయి. సంబంధం ఉందో లేదో, అవసరమో లేదో కానీ ఆంగ్లం విషయంలో నా అనుభవాన్ని చెప్పాలనిపించింది. పదవతరగతి వరకూ నా విద్యాభ్యాసమంతా మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో, తెలుగు మాధ్యమంలో జరిగింది. పరిస్థితి ఎలా ఉండేదంటే – హెడ్ మాస్టర్, క్లర్క్, రికార్డు అసిస్టెంట్, 8 – 10 తరగతులకు ఇంగ్లీష్, సైన్స్ బోధించడం – ఇవన్నీ ఒకే వ్యక్తి బాధ్యతలు. మాథ్స్ కు ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేకపోవడంతో, విద్యార్థులు డబ్బులిచ్చి వేరే వ్యక్తితో బోధనా జరిపించుకునేవారు. కాబట్టి, మా చదువులు ఎలా ఉండేవో మీ ఊహకు వదిలేస్తున్నాను. మొత్తానికి మేము పదవ తరగతికి వచ్చేసరికి పాఠశాలకు హెడ్ మాస్టర్, క్లర్క్, రికార్డు అసిస్టెంట్, మాథ్స్ టీచర్ అందరూ వచ్చారు (అప్పటికి మా పదవ తరగతి పుణ్యకాలంలో సగం పూర్తయ్యిందనుకోండి).

తరువాత ఇంటర్మీడియట్ కర్నూల్ లో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు. నాతొ పాటు ఒక ముగ్గురో, నలుగురో తప్పించి మిగతా అందరూ చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నవారు. మాకు డౌట్ అడగాలన్నా సిగ్గుగా ఉండేది, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఎలా అడగాలో తెలియదు. దానికి తోడు మా కెమిస్ట్రీ లెక్చరర్ ప్రసాద్ గారు డౌట్ అడిగితే, ‘క్లాస్ చెబుతున్నపుడు గాడిదలు కాస్తున్నావురా’ అంటూ కొట్టేవారు. ఆ యాతనలన్నీ మౌనంగానే అనుభవిస్తూ మొత్తానికి బ్రేక్ రాకుండా ఇంటర్మీడియేట్ పూర్తి చేయడం జరిగింది. ఇక డిగ్రీ కూడా అందుకు పెద్ద మినహాయింపేమీ కాదు. అదే తరహాలోనే సాగింది. ఇంగ్లీష్ మీద అవగాహన, కాస్తో కూస్తో మాట్లాడటం అన్నది హైదరాబాద్ కు వచ్చాక అలవడింది. అయిదేళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివినా, ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే గొంతు పెగిలేది కాదు. అటువంటి పరిస్థితిలో హైదరాబాద్ లోని రామకృష్ణ మఠంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ జాయిన్ అయ్యాక, పరిస్థితిలో మార్పు వచ్చింది. రామకృష్ణ మఠంలో చేసిన కోర్స్ ఇంగ్లీష్ కంటే ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అన్న విషయం అర్థమయ్యేలా చేసింది.

తరువాత జాగృతి పక్ష పత్రికలో అసోసియేట్ సబ్ ఎడిటర్ గా చేసిన కాలంలోనూ, ఓం పబ్లికేషన్స్ వారికి కొన్ని పుస్తకాలు రాసిపెట్టిన సమయంలోనూ – ఆంగ్ల పుస్తకాలు, పత్రికలూ చదివి వాటిని అనువదించడం అనేవి చేశాను. అపుడు ఆ హై లెవెల్ ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కష్టంగానే ఉండేది, అందునా అనువాదంలో మూల భావం చెడకుండా రాయటం అన్నది ముఖ్యం. (అనువాదం విషయంలో అప్పటి జాగృతి సంపాదకులు కీ.శే. శ్రీ రామ్మోహన్ రావు గారి ప్రశంసలు మరిచిపోలేనివి) ఆయా అనుభవాల వల్ల ఆంగ్లం అర్థం చేసుకోవడంలో మార్పు వచ్చినప్పటికీ, ఆంగ్లం మాట్లాడాలంటే ఏదో బెరుగ్గా ఉండేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టాల్సొచ్చినపుడు – ఇంటర్వూస్ లో మాట్లాడాల్సిన అవసరం అర్థమైంది.
ఇక్కడ ఒక అనుభవం ప్రస్తావిస్తాను – లాజికా సిఎంజి (Logica CMG) అనే కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ముందుగా వ్రాత పరీక్ష అయ్యాక, గ్రూప్ డిస్కషన్ రౌండ్ – ఆ రౌండ్ మొదలు పెట్టేముందు కంపెనీ హెచ్ఆర్ ఒకమాట చెప్పింది – ‘we really don’t care how correctly or grammatically you are speaking in this round, all we look at is your communication skills’ అని. ఇచ్చిన టాపిక్ మెర్సీ కిల్లింగ్ – మెర్సీ కిల్లింగ్ కు సపోర్ట్ గా ఎవరు, ఎగైనెస్ట్ గా ఎవరు మాట్లాడతారో చెప్పమన్నారు. 50 మంది ఉంటే, అందరూ 49 మంది ఎగైనెస్ట్ గా మాట్లాడతామని చేతులెత్తారు – సపోర్ట్ గా ఎవరూ లేరని, నేను సపోర్ట్ గా మాట్లాడతానని చెప్పాను. అదొక అవధానంలా జరిగిందనుకోండి – 49 vs 1. మొత్తం 50 మందిలోంచి ఇద్దరే తరువాతి రౌండ్ కు వెళ్ళారు – అందులో నేనూ ఒకడిని. ‘Language is just a tool, it is important to make others to understand what you are trying to tell even by signs if required and necessary’ అన్న నా నమ్మకాన్ని దృఢపరచిన అనుభవం అది. భాష అనేది ఒక సాధనం మాత్రమే అని తెలిసాక, నా మీద నాకు నమ్మకం పెరిగింది.

మన దగ్గర మనవారు ఇంగ్లీష్ మాట్లాడినా, అర్థం చేసుకోవడం సులువే – ఎందుకంటే వారి ఉచ్చారణ సులువుగా అర్థమవుతుంది. జాబ్ లో భాగంగానో లేక ఎదుగుదలలో భాగంగానో ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ అసలు పరీక్ష మొదలయింది – మొదట్లో వారి ఉచ్చారణ అర్థమయ్యేది కాదు. మీటింగ్స్ అటెండ్ అయ్యాక, తిరిగొచ్చి వారికి మెయిల్ పంపేవాడిని ‘could you please come again with the required details’ అని. నేను పని చేసిన చోట అనేకమంది స్పానిష్, ఇతర యురోపియన్ దేశాల వారు, ఆఫ్రికన్ దేశాల వారు కూడా పని చేసేవారు. వారి ఇంగ్లీష్ తో పోలిస్తే, నిజంగానే నా ఇంగ్లీష్ చాలా బెటర్ అనిపించేది. వారి దగ్గరనుండి నేను నేర్చుకున్నది – బెరుకు, భయం లేకుండా మాట్లాడటం.

ఎదుటివాడికి నీ ఇంగ్లీష్ భాష కాదు ముఖ్యం, నువ్వేం చెప్పాలనుకుంటున్నావన్నది ముఖ్యం. ఇవాల్టికి కూడా ఇంగ్లీష్ నాకు పర్ఫెక్ట్ గా రాదు – కానీ, ఎదుటి వారికి అర్థమయ్యేలా మాట్లాడగలనన్న నమ్మకం ఉంది. తెలుగు మీడియంలో చదివిన నేను ఇంగ్లీష్ లో కథలు, కవితలు, వ్యాసాలు రాయగలిగే స్థాయికి నేర్చుకున్నాను. కెరీర్ లో, జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగటానికి ఇంగ్లీష్ ఒక అదనపు బలం కావచ్చు. దానికోసం మొదటినుండి ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిన అవసరం లేదనడానికి నాలాంటి అనేకమంది ఉదాహరణ. నేను మా ఊరి విద్యార్థులకు, ఉద్యోగార్థులకూ అనేకసార్లు అవగాహనా తరగతులు తీసుకున్నాను – నాకు తెలిసిన, నేను తెలుసుకున్న అనేక అంశాలు వివరించాను. వారికి నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే ‘English is not everything, it is just a language. More than English, it is important how you communicate and make them understand.’
మరొక విషయం – ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు రాదనే అపోహ – అపోహ అని ఎందుకంటున్నానంటే, ఇది ఆసక్తిని బట్టి ఉంటుంది అని నా అభిప్రాయం. తెలుగు మీడియంలో చదివిన అనేకమంది మిత్రులు తెలుగు పత్రికలూ, పుస్తకాలూ చదవాలంటే కూడబలుక్కుని చదవడం చూశాను. అలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న కొందరు మిత్రులు తెలుగు సులువుగా చదవడం, వ్రాయటం మాత్రమే కాక సాహిత్యంలో, పదజాలంలో ఎంతో పట్టు కలిగి ఉన్నవారిని చూశాను. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన ఆంగ్లమాధ్యమపు విద్యాబోధన అన్నది ఒక మంచి అడుగు అన్నది నా అభిప్రాయం. భవిష్యత్తు తరాల వారికి మంచి అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దానివల్ల తెలుగు భాషకు కీడు జరుగుతుందన్న ఆందోళన నిజమే అయినప్పటికీ – తెలుగును బతికించుకోవటానికి ప్రత్యామ్న్యాయ మార్గాలు ఆలోచించాలి అన్నది నా అభిప్రాయం. తెలుగు భవిష్యత్తును ఇవ్వగలదు అన్న నమ్మకాన్ని ఏర్పరచగలిగితే, ఎవరూ చెప్పనక్కరలేకుండానే తెలుగు మాంద్యంలో చదువుతారు. తల్లిదండ్రుల అవసరం తీరిపోయాక కూడా, తల్లిదండ్రులను ప్రేమగా చూస్తోసుకునే పిల్లలున్నారు కదా. తెలుగు కూడా అంతే – అవసరం లేదని వదిలేయకుండా భాషను ప్రేమించేవారు నాలాంటిమంది అనేకం ఉన్నారు. పెళ్ళాన్ని ప్రేమించడమంటే, తల్లిని ద్వేషించడం కాదు. ఆంగ్ల, తెలుగు భాషలూ అంతే. ఇపుడు ఇంగ్లీష్ అవసరం – నేర్చుకోనివ్వండి. వారికి తెలుగులోని గొప్పతనం, తియ్యదనం అర్థమయ్యేలా ప్రత్యామ్న్యాయ మార్గాలేవైనా ఆలోచించండి, సూచించండి.

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.