తెలుగు నాట, ఎస్, మొత్తం తెలుగునాటనే, ఉమ్మడి తెలుగు నాటనే చీకటి మీద పోరాటానికి, ఔను పెట్టుబడీ మతమౌఢ్యం ఇంకా కులజాడ్యం కలగలిసిన పెంజీకటి మీద పోరాటానికి ఇవాళ వున్న ఒక మంచి పనిముట్టు ‘విరసం’. సాహిత్యంలో నమ్మదగిన వామపక్షం ‘విరసం’. దేశంలో నేటి స్థితి ఎమర్జెన్సీ కన్న ఘోరం. ఎవడు ఏ చీకట్లోంచి ఏ గౌరీ లంకేష్ మీద పంజా విసురుతాడో, ఇంకెవడు ఏ హైన్యం లోంచి నిర్భయ, అసిఫా, దిశ తల్లులను కిరాతకంగా పొట్టన పెట్టుకుంటాడో చెప్పలేనంత చీకటి. ఇంత చీకట్లో ఒక సాహిత్య కాంతి రేఖగా కనిపిస్త్రున్నది ‘విరసం’. ఇది నిజమేనా లేక పేరాశ యేనా? ఔనిది ‘విరసం’ ఆత్మశోధన అంశం కూడా. విమర్శ-ఆత్మవిమర్శ దారిలో ‘విరసం’ నిగ్గుదేలి, తెలుగు భావుకులను తానే సమీకరించాల్సి వుంది. మరి ఇందుకు విరసం ఏం చేయాలి? తనను తాను ఎలా విస్తరించుకోవాలి? ఎలా అధిక జనామోద యోగ్యం కావాలి? ఏం చేయాలని, ఏం జరగాలని మనం అనుకుంటున్నమో అటు ‘విరసం’లో, ఇటు బయట ప్రజా ప్రేమికులు ఆలోచించాలి. ‘విరసం’ యాభయ్యేళ్ళ సంబర సమయంలో ఇలాంటి ఆలోచనలు మనందరిలో ముప్పిరి గొనడం సహజం. ఈ విషయమై మీరేమైనా చెప్పదలిస్తే రాసి ‘రస్తా’కు పంపితే ప్రచురిస్తాం. — ఎడిటర్

Add comment