ఒక తప్పు కొన్ని మెప్పులు!

దేశం మొత్తం పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై భగ్గుమంటోంది. పార్లమెంటులో చట్టంగా రూపుదిద్దుకున్న ఆ బిల్లు మీద దేశంలో సకల మేధావులూ రచయితలూ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ ఏకకంఠంతో నిరసన వినిపిస్తున్నారు. డిల్లీ మహా నగరమైతే తగలబడిపోతోంది. ఆ సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దగా తగలడం లేదు. రాష్ట్రంలో ప్రజలు వేరే చర్చల్లో తలమునకలై వున్నారు. రాష్ట్ర  ప్రభుత్వాన్ని నడిపే వైసీపీ పార్లమెంటులో ఈ వివాదాస్పద బిల్లుకు మద్దతు తెలిపింది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పటడుగు వేశాడని కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. బిల్లు ప్రభావం ప్రత్యక్షంగా తెలుగు రాష్ట్రాల మీద పడదు. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వంగానీ, ఇక్కడి ప్రజలుగానీ ఇటువంటి క్రూర నిరంకుశ చట్టాలకు మద్దతు తెలపడం సరైంది కాదు. భవిష్యత్తులో ఇటువంటి నిరంకుశమే మరో రూపంలో మన నెత్తిన తాండవం చేయదని లేదు. రాష్ట్రంపై ప్రత్యక్ష ప్రభావం చూపే మరో ఘటనలో ఫాసిస్టు పోకడ సున్నితంగా వుంటుందనుకోవడం పొరపాటు. ఇక బిల్లు పాసైన రెండు వారాల తర్వాత ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్నార్సీకి వ్యతిరేకం అని చెప్పుకున్నా , ఎన్నార్సీని రాష్ట్రంలో అమలు పరచకున్నా ముందా చట్టానికి మద్దతిచ్చారనే నింద మోయకతప్పదు. 

నెరవేరిన ఆర్టీసీ కల 

మొన్న జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరింది. ప్రభుత్వం ఆర్టీసీ విలీనం బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న కార్మిక సంఘాల పోరాటాలు ఫలించాయి. మరో  నెలలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కానుంది. 53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీరికి పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెరగనుంది. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అందనున్నాయి. అయితే రోడ్ ట్రాన్స్ పోర్ట్ యాక్ట్ 1950 ప్రకారం ఆర్టీసీలను కంపెనీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయరాదనే నిబంధన ఉంది. ప్రభుత్వాలు ఆదాయం కోసం రవాణా వ్యవస్థను విలీనం చేసుకుంటాయనే ఉద్దేశంతో అప్పట్లో ఈ నిబంధన పెట్టారు. అందుకే ఏపీ సర్కారు నూతన ప్రక్రియను ఎంచుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూనే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ రూపంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి 1950 ఆర్టీసీ చట్టం ప్రకారం సంస్థ పేరును మారుస్తున్నట్లు తీర్మానం చేస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులను, ఆస్తులను ఈ శాఖకు బదిలీ చేస్తూ తీర్మానం చేస్తుంది. ఆర్టీసీ పేరును పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ గా మారుస్తూ చట్టం కూడా చేయనుంది. ఇలా ఆర్టీసీ రాష్ర్ట ప్రభుత్వంలో విలీనం కానుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటే.. ఆర్టీసీ ఆదాయం, ఖర్చులను రవాణా శాఖ ద్వారా ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. లాభనష్టాలను ప్రభుత్వమే భరిస్తుంది.ఇప్పటి నుంచి రవాణా శాఖలో అంతర్భాగంగా ఇది పని చేస్తుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అధికారులను అదే పోస్టుల్లో ఉంచి వారి డెసిగ్నేషన్లను మాత్రం రవాణా శాఖ కింద మారుస్తారు. అధికారికంగా విలీన నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ర్ట ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న సర్వీస్‌‌ రూల్స్‌‌నే కొనసాగిస్తారు. ఐఏఎస్ ర్యాంకుకు తగ్గని అధికారిని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్‌‌ జనరల్‌‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ఆర్టీసీ వీసీ అండ్‌‌ ఎండీ ఎక్స్‌‌ అఫీషియో సభ్యుడిగా కొనసాగుతారు. ఈడీలను అడిషనల్‌‌ డైరెక్టర్లుగా, రీజినల్‌‌ మేనేజర్లను జాయింట్‌‌ డైరెక్టర్లుగా, డివిజనల్‌‌ మేనేజర్లను డిప్యూటీ డైరెక్టర్లుగా, డిపో మేనేజర్లను అసిస్టెంట్‌‌ డైరెక్టర్లుగా రీ డెసిగ్నేషన్ చేస్తారు. ఇన్సెంటివ్ లు, పే స్కేళ్లలో నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కమిటీ వేస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు పీఎఫ్‌‌ ఖాతాలను పబ్లిక్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ (పీపీఎఫ్‌‌)లో ఉంచుకోవడమా.. లేక నోషన్‌‌ పెన్షన్‌‌ స్కీంలో కలపడమా అన్నది సిబ్బంది ఇష్టానికే వదిలేస్తారట. ఇది ఒక మంచి పరిణామమే. 

రేపిస్టుల వురి చెల్లుతుందా?

సభలో పాసైన మరో ముఖ్యమైన బిల్లు దిశా చట్టం. తెలంగాణ రాష్ట్రంలోని షాధ్ నగర్ వద్ద జరిగిన అత్యాచార సంఘటనతో ఏపీ ముఖ్యమంత్రి ఆడవారిపై జరిగే ఇటువంటి ఘోరాలకు సరైన శిక్షలు అతి తక్కువ సమయంలోనే పడేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఏడు రోజుల్లో దర్యాప్తును, 14 రోజుల్లో విచారణను పూర్తి చేయాలని ఆ చట్టం చెబుతోంది. అలాగే కేసులో నిశ్చయమైన సాక్షాలు వున్నప్పుడు తుది  తీర్పు వెలువరించే వ్యవధిని ప్రస్తుతం వున్న నాలుగు నెలలను ఇరవైయొక్క రోజులకు కుదించింది. సాంకేతికంగా ప్రభుత్వం ఒక రిజిష్టర్ ను ఏర్పాటు చేసి అందులో నేరగాళ్ల వివరాలు నమోదు చేసి వాటిని బహిరంగంగా వుంచుతారు. జిల్లాకొక ఫాస్ట్ ట్రాక్ కోర్టు, జిల్లాకు ఒక స్పెషల్ పోలీసు టీం వంటి పాయింట్లు సమర్ధనీయమే కానీ ఉరి శిక్ష అనేదాంట్లో సుప్రీం కోర్టు జోక్యం ఎంతమేరకు అన్నది చూడాలి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ చట్టం చేయడం దేశం అంతటికి ఒక మార్గదర్శకం అయ్యే అవకాశం వుంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంపై హర్షం వ్యక్తం చేసి ఆ రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టం తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. రేప్ వంటి ఘోర నేరాలలోసత్వరం శిక్ష పడే చట్టాలు ఉంటే నేరగాళ్ళకు కొంత భయం ఉండవచ్చు. అయితే ఇలాంటి వారిలో కొందరికి చట్టం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. అయితే, అకృత్యాలకు పాల్పడేవారికి, మద్యం మత్తులో దారుణాలకు పాల్పడే కిరాతకులకు జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం గట్టి గుణపాఠం చెప్పే అవకాశం వుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఒక్క రోజులలో కేసు విచారణ పూర్తి కావాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. అది ఎంతవరకు సాద్యమో తెలియదు. జగన్ ప్రభుత్వ చిత్తశుద్ది, మహిళల పట్ల నీచంగా వ్యవహరించేవారిపట్ల కఠినంగా ఉండాలన్న సంకల్ప శుద్ది అభినందనీయం. రాజ్యాంగ రీత్యా చెల్లుతుందా అని సందేహాలున్నాయి. కేంద్ర స్థాయిలో చట్ట సవరణ లేకుండా  రాష్ట్ర స్థాయిలో చెల్లుతుందా, సుప్రీం కోర్టు జోక్యం వుండబోదా అని అనుమానాలున్నాయి. ఏదేమైనా ఆడపిల్లలకు భరోసా ఇచ్చే ప్రయత్నం మంచి పరిణామం. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. మానవ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలపై ప్రత్యేక  అవగాహన సదస్సులు నిర్వహించాలి.   

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.