జెక్ రిపబ్లిక్, పోలాండ్, రుమేనియా, హంగరి, తూర్పు జర్మనీ దేశాలు గతించిన ‘కమ్యూనిస్ట్ విప్లవ’ స్వప్నానికి గురుతులు. ఈ మాజీ కమ్యూనిస్ట్ దేశాలన్నీ దాదాపుగా తూర్పు యూరోప్ ప్రాంతం లోనే వున్నాయి. అంతకు మునుపే మేము చాలా నాటో కూటమి దేశాలను చూసివుండటం వల్ల కమ్యూనిస్ట్ పాలన ఎలా సాగిందో తెలుసుకోవడం కోసం ఈసారి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొన్నాం. ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ లో హైదరాబాద్ నుంచి అతి తక్కువ సమయం లో (ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన మా ప్రయాణం మధ్యాహ్నం పండెండు గంటలకు జెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ కు చేరుకున్నాం). చాలా యూరోప్ దేశాలలో లాగే ఇక్కడ కూడా 24 గంటలు, 48 గంటలు, 72 గంటల సిటీ టూర్ పాస్ లు అందుబాటులో ఉండటంతో మూడు రోజులకు కలిపి మాకు నగరం లో తిరగడానికి తొమ్మిదివందలు మించి కాలేదు. అంతే కాకుండా, ప్రతి నిమిషానికి బస్సు లేదా ట్రామ్ లేదా మెట్రో అందుబాటులో ఉండటం వల్ల మేము ఎక్కడా ఇబ్బంది లేకుండా నగరం తో పాటు సబర్బన్ ప్రాంతాలను కూడా సంపూర్ణంగా చూడటానికి వీలయ్యింది . మేము ఎంచుకొన్న నివాస ప్రాంతం టూరిస్ట్ ప్రాంతానికి బయట ఉండటం వలన నగర జీవితం మీద అవగాహన కలగటానికి అది మాకు సహాయ పడింది .
నగరం లోని ప్రాంతాలను భాగాలుగా విభజిస్తే కమ్యూనిస్టులు రావడానికి ముందు కాలం నాటి ప్రాంతం, కమ్యూనిస్టుల నాటి ప్రాంతం, ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత విస్తరిస్తున్న ప్రాంతాలుగా చూడవచ్చు. అమెరికా, సింగపూర్, దుబాయ్ లలోగా యూరోప్ లో ఆకాశహర్మ్యాలు ఎక్కువగా వుండవు. ప్రేగ్ అందుకు మినహాయింపు ఏమి కాదు. మాకు నగరం మొత్తం మీద రెండు లేక మూడు మించి ఆ తరహా భవనాలు కనిపించలేదు. మాకు బాగా నచ్చింది మా ఇంటి వెనుక భాగం లో వున్న ఒక స్కూల్, దాని ప్లే గ్రౌండ్. హై స్కూల్ ప్లే గ్రౌండ్ ఎంత పరిశుభ్రం గా ఉందంటే ఒలింపిక్స్ కోసం తయారుచేసినట్లుగా వుంది. మేము వున్న అపార్ట్మెంట్ కమ్యూనిస్టు పాలనలో కట్టిందే. ఒకే తరహా లో ఏ మాత్రం కొత్త దనం ఆశించకుండా చాలా ఇరుకు గా కట్టారు. మా ఫ్లాట్ జెక్ దేశం ఉత్తర ప్రాంతం లోని ఒక పల్లెటూరు నుంచి వచ్చిన జంటది. వయస్సు నాలుగు పదులు దాటి ఉండదు. అతను ఫిజిసిస్టుగా పనిచేస్తున్నాడు. ఆ ఫ్లాట్ కొనుక్కోవడం కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం వలన ఆర్థిక అవసరాలు ఏర్పడడం తో వారి ఇంటి లోని ఒక రూమ్ ఇలా బాడుగ కు ఇస్తున్నామని చెప్పారు. మేము వున్న మూడు రోజులు ఆమె కంటే అతనే ఎక్కువగా వంట చేస్తుండం మేము చూశాం. బ్యాంకు లోన్ తీరిన తరువాత తన భార్య జాబ్ మానేస్తుందని చెప్పాడు.
యాత్రికులు ఎక్కువగా రాజరిక పాలనా కాలం లో కట్టిన సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలు చూడటానికి వస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చార్లెస్ బ్రిడ్జ్, ఆస్ట్రోనామికల్ క్లాక్, పదుల సంఖ్యలో మ్యూజియమ్స్, యూదుల కాలనీ, కాఫ్కా మ్యూజియం మొదలైనవి గా చెప్పుకోవచ్చు. ఇది యునెస్కో చే చారిత్రాత్మక నగరంగా గుర్తించబడింది.
మేము ప్రేగ్ ను ఎలా చూడాలి ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ మోసాలు జరుగుతాయి, టాక్సీ, మనీ ఎక్స్చేంజి, బీర్ ఎలా తాగాలి, అందుబాటులో రుచికరమైన జెక్ సాంప్రదాయిక భోజనం ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి విషయాలన్ని యూట్యూబ్ లో Janek rubes అనే గైడ్ వీడియో లు చూసి తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఎవరైనా జెక్ రిపబ్లిక్ వెళ్ళేవాళ్ళు అతని వీడియోస్ చూడమని సలహా ఇస్తాను. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలలో మాత్రమే మనకు ఇంత నిజాయితీగా సమాచారాన్ని ఇచ్చే ఆ ప్రాంత వాసులు దొరుకుతారు. మేము చూసిన ప్రపంచంలోని మిగతా ఏ దేశాల గురించి కూడా మాకు ఇలాంటి వీడియో లో దొరకలేదు. ఇతని వీడియోలకోసం యూట్యూబ్ లో ప్రాగ్ honest guide అని టైపు చేస్తే చాలు కొన్ని వందల వీడియో లు మనకు లభిస్తాయి.
మేము ఈ నగరాన్ని దర్శించాలి అనుకున్నప్పుడు దీని గురించి కొంత చరిత్ర చదివాం . అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అద్దెకు దిగిన ఇంటి యజమానులతో మాట్లాడటం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాం.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరోప్ లో ఏ మాత్రం ధ్వంసం కాని నగరంగా ప్రేగ్ ను చెప్పవచ్చు. అందువల్ల నగరంలో పాత కట్టడాలు చాలా వరకు అలాగే ఉన్నాయి. దీనివల్ల ఈ నగరాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
చార్లెస్ బ్రిడ్జ్: వితార నదిపై నిర్మించిన ఈ వారధి 14వ శతాబ్దంలో మొదలుపెట్టి 15వ శతాబ్దానికి పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బ్రిడ్జి పై దారికి ఇరువైపులా ఆనాటి చరిత్రను తెలిపే అనేక శిల్పాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇది ఓల్డ్ టౌన్ కు ప్రేగ్ క్యాజిల్ కు ముఖ్యమైన దారి. నిర్మించి ఎన్నో ఏళ్ళు కావస్తున్న ఇంకా చాలా పటిష్టంగా ఉంది. బ్రిడ్జిపై నుంచి నది సుందరంగా కనిపిస్తుంది. నీటి శుభ్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
ఆస్ట్రోనామి కాల్ క్లాక్: 15వ శతాబ్దం మొదట్లో నిర్మించబడ్డ ఈ గడియారం ప్రపంచంలోని అతి పురాతన గడియారంలో ఒకటి. అప్పుడప్పుడు అవసరమైన మరమ్మతులు చేయబడుతూ ఇప్పటికీ చక్కగా పని చేస్తోంది. ప్రతి గంటకు గంట మోగిస్తూ కొన్ని బొమ్మలు తలుపులు తీసుకుని కనిపిస్తాయి. సాలార్జంగ్ మ్యూజియంలో గంటకోసారి బొమ్మ బయటికి వచ్చి గంట పడుతుంది కదా అలాగన్నమాట, దీన్ని చూడటానికి అక్కడ వేలమంది కాచుకుని ఉంటారు. ఆ కాలంలోనే ఇలాంటి నిర్మాణం చేయటం అద్భుతం అనిపిస్తుంది.
మీకు సాహిత్యమంటే మక్కువుంటే మీకు కాఫ్కా మ్యూసియం వుంది, కాఫ్కా కు ప్రపంచ వ్యాప్తం గా అభిమానులు భారీగానే వున్నారు. ఆయన పుస్తకాలు చాలా వున్నా అందరికి పరిచయమున్నది మాత్రం ‘The Trial “.
కమ్యూనిస్టుల కాలం లో నిర్మించిన TV టవర్ ఆ నగరంలో ని ఎత్తైన నిర్మాణం. కానీ మా ఇంటి యజమాని మాత్రం దానిని “Ëurope’s second biggest ugly structure” అని అనుకొంటామన్నాడు. ఇక మిగతా యూరోపియన్ నగరాలలో మాదిరిగానే క్యాజిల్స్ కు (కోటలకు), చర్చిలకు ప్రేగ్ లో కూడా కొదవలేదు.
అద్భుతం ! స్వయంగా చూసిన అనుభూతి కల్గింది
అప్పుడే ఐపోయిందా అని దిగులేసింది. ఇంకా కొంత రాస్తే బావుండేది. ధన్యవాదాలు.