చిటపటలాడుతున్న పెనం ఇప్పుడు భూగోళం!

పెనం మీద పేలాలు చిటపటలాడుతూ ఎగిరెగిరిపడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు భూగోళం. ఏ దేశంలో ఎప్పుడు నిరసన జ్వాలలు చెలరేగుతాయో తెలియదు. అనేక దేశాల్లో ప్రజలు సమస్యలతో రోడ్ల మీదకు వస్తున్నారు. ఫ్రాన్స్ తో మొదలైన వీధి పోరాటాలు ఇప్పుడు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఇండియాలో కూడా నిరసన జ్వాలలు రాజుకున్నాయి. కొలంబియా, బొలివియా, చిలీ, ఈక్వెడార్, బ్రెజిల్, లెబనాన్, ఇరాక్, ఇరాన్, ఈజిప్టు, సూడాన్, హైతీ, హాంగ్ కాంగ్, అల్జీరియా… మరెన్నో దేశాల్లో ఆందోళన పథంలో చేరాయి.     

ఫ్రాన్స్ లో మొదలైన ‘’ఎల్లో వెస్ట్” ఉద్యమం ఆగలేదు. ప్రతి శనివారం ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నా, దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ దానికి ఆజ్యం పోసినట్టు  పింఛన్ స్కీములో సంస్కరణలు తీసుకవచ్చాడు. సంస్కరణలంటే అవి ప్రజలపై మరిన్ని బండలు మోపడమే కదా! కోపొద్రిక్తులైన ఫ్రాన్స్ ప్రజలు పోరాటాలను మరింత ఉధృతం చేశారు. గతేడాది నవంబర్ లో ఫ్రాన్స్ లో “ఎల్లో వెస్ట్’’ ఉద్యమం మొదలైనప్పుడు మనం అనుకున్నదే… 1968 ఉద్యమం రీతిలో ఇది కూడా ప్రపంచాన్ని కమ్ముకుంటుందని.

లెబనాన్, చిలీ, కొలంబియా, బొలివియా తదితర దేశాల్లో జరుగుతున్న పోరాటాల గురించి,  పర్యావరణ మార్పు (క్లైమేట్ ఛేంజ్ ) లపై ప్రపంచ వ్యాప్త ఉద్యమాల గురించి వివరించాను. ఈ సారి ఇండియాలో జరుగుతున్న నిరసన పోరాటాలు, దాదాపు ఏడాది కాలంగా అల్జీరియాలో జరుగుతున్న పోరాటాలను పరిశీలిద్దాం.   

ఇండియాలో జరుగుతున్న నిరసన పోరాటాలు ఉత్తర దక్షిణ భారతాలను ఒకటి చేయడమే గాక, అన్ని కులాల, మతాల ప్రజల్ని  ఏకం చేస్తున్నాయి. బహుళ సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోడానికి, ప్రజాస్వామ్యాన్ని, 70 ఏళ్లనాటి రాజ్యాంగాన్ని, అది ఇస్తున్న హక్కులను కాపాడుకోడానికి ‘కా’ చట్టం వ్యతిరేకతను కేంద్రం చేసుకుని నిరసన పోరాటాలు పెల్లుబుకుతున్నాయి. ఇండియాలో జరుగుతున్న ఈ పోరాటాలు అంతర్జాతీయ మీడియాను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇండియాకు ఇన్నాళ్ళు ఒక పెద్ద ప్రజాస్వామిక, సెక్యులర్ దేశంగా అంతర్జాతీయ గుర్తింపు వుండేది. ఈ ప్రజాస్వామిక, సెక్యులర్ దేశంలో రైట్ వింగ్ శక్తులు అధికారంలోకి రావడమే గాక ఇప్పుడు ఈ దేశ చట్టాలను మార్చి ( ఉదా: జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగింపు), కొత్త చట్టాలు( కా, ఎన్నార్సీ)  తీసుకరావడం తాజా పరిణామాలు. వీటిని వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన నినానాలు చేస్తున్నారు. దేశంలోనే కాక, వివిధ దేశాల్లో వున్న భారతీయులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోనే అనేక నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అంతర్జాతీయ పత్రికలు, అంతర్జాతీయ టీవీ ఛానల్స్ కూడా ఇండియాలో “ఎన్నార్సీ- కా’’వ్యతిరేక పోరాటాల గురించి ప్రముఖంగా పేర్కొం టూ వార్తలు, చర్చలు ప్రసారం చేస్తున్నాయి.

  

అల్జీరియా లో ప్రభుత్వ అవినీతికి, అణచివేతకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది కాలంగా ‘’ఎల్లో వెస్ట్ ‘’తరహాలోనే ఫిబ్రవరి 16 నుంచి ప్రతి శుక్రవారం ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. తమ కోసం పనిచేసే, మాట్లాడే అధ్యక్షుడు కావాలని, ఒక ‘పోస్టరో’, ‘మెడికల్ జాబితా’నో మాకు అధ్యక్షుడు కాదని నినాదాలు చేస్తూ మొదటి సారి ఆ దేశం యువత రోడ్ల మీదకు వచ్చారు. ఈ పోరాట వార్తను ప్రసారం చేస్తూ ఆ దేశ అధ్యక్షున్ని ఒక టీవీ ఛానల్ చూపించినప్పుడు అవాక్కు కావడం ప్రపంచం వంతవుతుంది. 2013 నుంచి పక్షవాతంతో, మాట్లాడలేని పరిస్థితిలో వీల్ ఛైర్ కే పరిమితమైన అధ్యక్షుడు  82 ఏళ్ళ అబ్దులజీజ్ బౌతిఫ్లికా(Abdelaziz Bouteflika) 5 వ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ దేశ యువతరం నిరసన గళమెత్తింది. అధ్యక్షుడిని ఒక పోస్టర్ గా చూపించి ఆయన తమ్ముడే ప్రధానిగా, ఆయన అనుయాయులు మంత్రులుగా ఆన్ని వ్యవహారాలు చక్కబరుస్తూ అవినీతి బురదలో కూరుకపోయారని, ఈ ఘోరం ఇంకానా ఇకపై సాగదు అని యువజనం నినదించారు,

ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా 50 ఏళ్ల క్రితం వరకు ఫ్రాన్స్ కు వలసగా వుండేది. 1962, నవంబర్ 1 న ఫ్రాన్స్ నుంచి విముక్తమయ్యింది. స్వాతంత్ర్యం పొందిన పాతికేళ్లకే అంతర్యుద్ధం (సివిల్ వార్)లో చిక్కుకొని పదేళ్లపాటు టెర్రరిజంతో పోరాడింది. ఆ పోరాటంలో అబ్దులజీజ్ టెర్రరిజాన్ని ఓడించి ప్రజల నాయకుడిగా, శాంతిదూతగా పేరు తెచ్చుకున్నాడు. దేశంలో శాంతి నెలకొల్పాడు కనుక, ఇక బతికినంతకాలం అధ్యక్షుడిగా ఆయననే ప్రజలు ఆమోదిస్తారని అనుయాయులు భావించారు. ఇప్పుడు దేశ జనాభాలో 70% మంది 30 ఏళ్ల లోపు యువత. నిరుద్యోగం 29% ఉందని తెలుస్తున్నది. సివిల్ వార్ గురించి, అప్పటి అబ్దులజీజ్ గురించి తలిదండ్రులు,అవ్వ తాతలు వీరగాథలు వినిపిస్తే… పాత కథలు సరే, ఇప్పుడు మా భవిషత్తేమిటీ అని ప్రశ్నిస్తూ ప్రతి శుక్రవారం రోడ్ల మీదకు వస్తున్నారు. యువతతో పాటే వారి తలిదండ్రులు. దేశంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలుస్తున్నది. అన్ని వయసుల వారు పిల్లల్ని భుజాల మీదనో, చంకల్లోనో మోస్తూనో వస్తే, జబ్బు పడ్డవారు, నడవలేని వారు సైతం వీల్ ఛైర్ లలో ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. 46 వారాలుగా ఒక క్రతువులాగా, శాంతి యుతంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిరసనకారులు కోపోద్రేకాలు ప్రకటించడం లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. దీన్నుంచి బయటపడేదెలా అన్నదే అన్ని వయసుల వారిని తొలుస్తున్న  ప్రశ్న. ఓ యాభై అరవై ఏళ్ళ ఆమె వద్ద తన 5 గురు పిల్లలు నిరుద్యోగులని, వాళ్ళు ప్రదర్శనలో వున్నారని, వారి పక్కన తను వుండాలని, వారిదగ్గరకు వెళ్లడానికి కాస్త దారి ఇవ్వమని ఆర్మీ బారికేడ్ ను అడిగి మరీ తన పిల్లలను చేరుకుంది. 

నిరసన ప్రదర్శనలు మొదలైన తరువాత 5 వారాలకు అంటే ఏప్రిల్ 2 న ఆ దేశ ఆర్మీ చీఫ్ అహమద్ గైద్ సలాహ్ ( Ahamed Gaid Salah) దేశాధ్యక్షున్ని కలిసి నిరసనల గురించి నివేదించి, పదవికి రాజీనామ చేయడమే గాక, ఎన్నికల్లో పోటీ చేయవద్దని సలహా ఇవ్వడంతో అబ్దులజీజ్ తన పదవికి రాజీనామా ఇస్తున్నట్టు టీవీలో ప్రసారం చేశారు. అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఆయన అనుయాయులు కొందరు అరెస్ట్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. మిలిటరీ పాలనాధికారాలను చేపట్టినట్టు, కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు ఆర్మీ చీఫ్ గైద్ సలాహ్( ఈ వ్యాసం రాస్తుండగా తెలిసిన వార్త: గైద్ సలాహ్ గుండె పోటుతో నిన్ననే మరణించారని.) “ఎన్నికలు కాదు, ముందు ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలని” ప్రజలు నినదిస్తున్నారు. తమ దేశ రాజ్యాంగమే ప్రజాస్వామ్య యుతంగా లేదని, ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగినా, తిరిగి ప్రభుత్వ నిర్బంధం పెరగడమే గాక అవినీతి యథాతదంగా కొనసాగుతుందని, రాజ్యాంగాన్ని మార్చాలని, ఆ తరువాతే ఎన్నికలు జరగాలని యువతరం డిమాండ్ చేస్తున్నది. 

అల్జీరియాలో  ప్రజాస్వామ్యం కోసం  జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఉన్నత చదువులు చదువుకున్న, రాజకీయాలపై ఆసక్తి, పట్టు వున్న మధ్యతరగతి యువత  నడిపిస్తున్నది. ఇంటర్నెట్, సోషల్ మీడియా కూడా ముఖ్య భూమికను పోషిస్తున్నాయని చెప్పకతప్పదు. ఇవి మాస్ మీడియాకు ప్రత్యామ్నాయంగా పని చేస్తూ ఎప్పటికప్పుడు  ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి బట్టబయలు చేస్తూ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనే ప్రజలకు తగిన సమాచారం, సలహాలిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా,సాంప్రదాయక రాజకీయ నిర్మాణాలను కాదని, సరికొత్త రీతిలో దేశ రాజకీయాల్లో మంచి మార్పులు తీసుకరావాలని యువత ప్రయత్నిస్తున్నది. 

(30/12/2019)  

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.