అనేకానేకాల వడపోతల్లోంచి
బుద్ధుని బోధనల వంటి చేతులు పేర్చిన
ప్రవేశి కగూటిలోని పదాలపక్షులు
చలిజ్వరంతో మూగులుతున్నాయి
ఇవేవీ మన దేశభక్తి కళ్ళకు కనిపించవు కదా.!
రోగకారక క్రిములు ఘనంగా
దినోత్సవాలు జరుపుతున్నప్పుడు
రకరకాల జబ్బు గొంతులు
దబాయిస్తూ దౌర్జన్యం చేస్తున్నాయి
ఇవేవీ మన రాజకీయ చెవులకు వినిపిస్తాయా.?
కులం డెంగ్యూ
మతం మశూచి
జీవితకాలం జీడబట్టినట్టు పట్టి యీమట్టిని
కొన్ని పంతాలు పట్టింపులు
కొన్ని పైత్యాలు ప్రకటనలు
కార్పొరేట్ కక్కూసుదొడ్డిని చేస్తూ
సెలెబ్రేషన్ మానియా పొరలుకింద
నడుం విరిగిపోయిన చెట్లను
చెట్లపై రెక్కలు తెగిపోయిన పావురాలను
కుట్రలతో కన్నీళ్ళవుతున్న గాలిని
కనిపించకుండా కప్పేస్తున్నాయి
మన దశాబ్దాల బానిస మెదళ్లకివన్నీ
చీమకుట్టినట్టైనా పట్టనే పట్టవుకదా
రండి
అహంకార ప్రసంగాలకు
అవమానాల చప్పట్లు కొడుతూ
నిరుపేద కడుపుకంచాలపై దరువులేస్తూ
నిరుద్యోగ దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలి
ఆశయాలను తుంగలో తొక్కేస్తూ
దినాలను డంపింగ్ యార్డ్లలో దొర్లించుకుంటూ
ఆకలి దరిద్రాలను అందంగా అడ్వటైజ్ చేస్తూ
ఆలోచనలకు తూట్లు పొడిచేవాళ్ళతో చేరి..
రండి
అంటరాని మంటల్లో
చావుల్ని కూడా సెలబ్రేట్ చేసుకుందాం
పాసిస్టు పాదాలకు పొర్లుదండాలు పెడుతూ
Excellent