ఉ…
ఉయ్యాల్లో తమ్ముడు వూకొడతాడు.
ఊ…
అమ్మ వొడిలో తల పెట్టుకొని నేనూ వూకొడతాను.
అమ్మ కథ చెపితే యెవరు వూకొట్టరు?
ఎవరైనా వూకొడతారు.
నాకు కథలంటే యిష్టం.
అయినా కథలంటే యెవరికి యిష్టం వుండదు?
మా అమ్మకు బోలెడు కథలొచ్చు. రాత్రిపూట తమ్ముడికీ నాకూ అన్నం తినిపిస్తూ కథ చెపుతుంది. కథ చెప్తూ తినిపిస్తే కాకరకాయ కూర కూడా చేదుగా వుండదు. మామూలుగా అన్నం తినిపిస్తే చుక్కలూ చంద్రమండలమూ చూపించే తమ్ముడు కథ చెప్తూ తినిపిస్తే మాత్రం నాకు కాదు, యేకంగా బుద్ధుడికి తమ్ముడైపోతాడు.
కాని అమ్మ అన్ని రోజులూ కథలు చెప్పదు. ఔను, అమ్మకు అన్ని రోజులూ వంటపనీ యింటిపనీ వుంటుంది. ఆఫీసుపనీ వుంటుంది. తీరికెక్కడిది? పాపం అమ్మ అలసిపోతుంది. కథ వినకుండా కాదు, చెప్పకుండా నిద్రపోతుంది. అప్పుడప్పుడూ అర్థం చేసుకున్నా అప్పుడప్పుడూ మేం అడిగి తిట్లు తింటుంటాం. పేచీ పెట్టిన తమ్ముడు దెబ్బలు కూడా తింటాడు.
అప్పుడు నేను తమ్ముడ్ని వొడిలో కూచో పెట్టుకుని కథ చెపుతాను. చెప్పగానే వాడు నవ్వుతాడు. పాలిచ్చినా తాగేస్తాడు. తాగుతూ వూ కొడతాడు. అప్పుడు అమ్మ మమ్మల్ని చూసి భలే అందంగా నవ్వుతుంది. నాన్న మాత్రం సిగ్గు పడతారు. ఎందుకంటే నాన్నకి కథలు రావు. ‘నాన్నా… నానమ్మ కథలు చెప్పలేదా?’ అని అడిగితే, ‘నాకు వాటి విలువ తెలీలేదమ్మా’ అని వొకసారి కళ్ళలో నీళ్ళు తిప్పుకోవడం నాకు యిప్పుడు కూడా బాగా గుర్తుంది.
అమ్మమ్మ లేదు. నానమ్మా తాతయ్యా వున్నా వూళ్ళో వున్నారు. ఎప్పుడో గాని రారు. వచ్చినప్పుడు నానమ్మ మంచి మంచి కథలు చెపుతుంది. కాని మధ్యలో ‘వూ…?’ అని ఆగిపోతుంది. నెత్తి కొట్టుకుంటుంది. ‘మర్చిపోయాన్రా’ అని చాలా చాలా బాధ పడిపోతుంది. ‘నా మతి మండిపోయిన మతి’ అని తనని తానే తెగ తిట్టుకుంటుంది. నెత్తి కొట్టుకుంటుంది. వయసు అయిపోతే అంతేనట. ఎవరైనా వొకటేనట. రేపు మనమైనా నట. అని మతిమరుపు మీద మళ్ళీ వొక కథ చెప్పి నవ్వించేస్తుంది.
తాతయ్య అలా కాదు. తాతయ్యకు కథలు రావంటే రావని కాదు. తోచింది చెప్పేస్తారు. కనిపించిన దానిమీదల్లా కథ అల్లేస్తారు. మధ్యలో మనం కూడా కథల్లోకి వచ్చేస్తాం. మన యింట్లోనే మనకు తెలియని కథ కూడా నడిచేస్తూ వుంటుంది. కార్లూ సైకిళ్ళూ ఫేన్లూ కిటికీలు వొకటేమిటి అన్నీ- కుండీలో మొక్కలు కూడా- అలా నోళ్ళు తెరిచి మాట్లాడేస్తూ వుంటాయి. బొమ్మలు డాన్సులు చేసేస్తూ పాటలు పాడేస్తూ వుంటాయి. ఆ కథలకి అంతూ పంతూ వుండదు. అలా ఆగకుండా సాగిపోతూనే వుంటుంది. ‘అది తెగని రామాయణం. ఆగని భారతం’ వెక్కిరిస్తుంది నానమ్మ.
‘ఏం… మీ నానమ్మ కథల్లో పక్షులూ జంతువులూ మాట్లాడగా లేంది… మన కథల్లో నోరులేని వాటికి నోరొస్తే తప్పా? అసలు అన్నీ మాట్లాడితే కదా మజా?’ అంటారు తాతయ్య. ‘మీ తాతయ్యవి అన్నీ బుర్రతిరుగుడు కథలు’ అని నానమ్మ తగువుకి దిగుతుంది. అది వేరే కథ. ఎవరి కథ వారిది. అయితే వూహ కూడా తెలియని తమ్ముడికి తాతయ్య కథలే బాగా నచ్చుతాయి. ‘పిచ్చి కథలు’ అని తీసి పారేస్తుందిలే నానమ్మ.
ఆ పిచ్చి కథలు కూడా యిప్పుడు లేవు. ప్చ్…
‘నువ్వు రమ్మన్నప్పుడల్లా వాళ్ళు రాలేరు కదా? ఎవరి బతుకు యెక్కడైతే వాళ్ళు అక్కడే’ అనే అమ్మ యేదేదో మాట్లాడుతుంది.
మరి కథలకి దారేది?
నీమటుకు నువ్వే బుక్స్ చదువుకో- అంటుంది అమ్మ. బాధేసింది. బోధ పడింది. అంతకంటే దారి లేదు. నాన్న బుక్ ఫెయిరుకు తీసుకువెళ్ళారు. కొన్ని నాన్న సెలెక్ట్ చేస్తే కొన్ని నేను సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను. మెల్లగా చదవడం మొదలు పెట్టాను. చెప్పకేం?, టెక్స్ట్ బుక్కులో పాఠాలకన్నా కథలే బావున్నాయి. విన్న పాఠం వినాలంటే బోరు. కాని విన్న కథ వినాలంటే భలే జోరు. ఔను, కథ వింటుంటే మనకి ముందే తెలిసిపోయినప్పుడు ఆ కిక్కే వేరు. ఇంకో విషయం చెప్పనా- నానమ్మ చెప్పిన జానపద కథలు వింటుంటే అవి మనకీ అంటే విన్నవాళ్ళకీ వచ్చేస్తాయి. అందుకే అవి అంత బావుంటాయి.
ఇంకో విషయం చెప్పనా- నే చదివితే తమ్ముడి ముఖం మరీ అంతగా వెలగలేదు. బొమ్మలు చూసినప్పుడు వెలిగినంతగా. ఇంకా చెప్పాలంటే నానమ్మ చెప్పినప్పుడు విన్నప్పుడు వాడి ముఖంలో యెన్ని రంగులో? ఇప్పుడు కొన్ని రంగులే. చెప్పే కథలూ చదివే కథలూ రెండూ వేరేమో?
కథలు వినే అవకాశం అందరికీ లేదట. చదివే అవకాశం అయితే కొందరికయినా వుందట. ఉన్న అవకాశం వాడుకోవాలట. నన్నే చదువుకోమంది అమ్మ.
నేను కథలు చదివి తమ్ముడికి వినిపించడం కన్నా, నేను చదివేసి చెప్పడమే బెటర్ అని అర్థమయ్యిది. అలా చదివినప్పుడు కొన్ని పదాలు అర్థం కాకపోతే అమ్మనో నాన్ననో అడిగితే చెపుతున్నారు. ఇపుడు అంతా బావుందా?- అంటే బాలేదు.
ఔను, కథలు చదువుతుంటే నాకెన్నో అనుమానాలు వస్తున్నాయి. క్లాసు పుస్తకాల డౌట్లయితే హేపీగా ఆ సబ్జెక్ట్ టీచర్ చెప్పేస్తారు. మరి యీ కథలకి యెవరు చెప్తారు? చెప్పినా వొక్కొక్కరు వొక్కో రకంగా చెపుతున్నారు? అలా చెప్పింది కూడా నాకెందుకో సరి కాదనిపిస్తోంది.
ముందు నా అనుమానాలు చెప్తాను, సరేనా?
ఆ మధ్య వొక కథ. ఆ కథలో దెయ్యం వుంటుంది. ఉండనీ. దెయ్యాలు వుంటేనే బావుంటుంది. దెయ్యాలు చాలా సరదాగా కూడా వుంటాయి. అయితే యీ కథలో దెయ్యం అలా కాదు. గొర్రెల కాపర్ని తినేస్తానని అంటుంది. వద్దంటాడు కాపరి. అయితే నీ గొర్రెల్ని యిచ్చేయ్ అంటుంది దెయ్యం. చివరికి యిద్దరిమధ్యా వొక వొప్పందం కుదురుతుంది. రేపు పొద్దుట మొదట వంతెన మీదకు వచ్చినదాన్ని తినేస్తాను అంటుంది. అయితే కాపరి తెలివిగా ముందుగా గజ్జికుక్కను వంతెన మీదకు వచ్చేలా చేస్తాడు. దెబ్బకు దెయ్యం పారిపోతుంది.
తమ్ముడు నవ్వాడు. నాన్న కూడా. నే నవ్వలే. ఏమయిందంది అమ్మ. గజ్జి కుక్క కూడా జీవే కదమ్మా? పాపం ప్రాణే కాదమ్మా?- అంటే అప్పుడు అమ్మా నాన్నా వొకరి ముఖాలు వొకరు చూసుకొని ఆలోచనల్లో పడ్డారు.
మరో కథలో అతి తెలివితో మరీ బురిడీ కొట్టించిన పిల్లాణ్ణి తిట్టకుండా పెద్దలందరూ చతురత అని వేనోళ్ళ మెచ్చేసుకుంటారు. అదేమిటో?
అబద్దం ఆడిన వాడిదే సమయస్పూర్తి అని నిరూపిస్తింది వొక కథ.
ఇంకో కథలో మోసం చేసి అనుకున్నది సాధించిన వాణ్ణి తప్పు పట్టకుండా భలే భలే అంటారు. ఊరంతా వూరేగించి సన్మానం కూడా చేస్తారు.
అయ్యో… వొక కథలో దేవుడు ప్రత్యక్షం కాలేదని వొకడు తలని నరుక్కుంటాడొకడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు. వాడ్ని తిట్టాలి కదా? ఇదేమి బుద్దిలేని పని అని. తిట్టడు. తిరిగి అతికిస్తాడు. కోరిన వరాలిస్తాడు. వాడు మళ్ళీ మళ్ళీ ఆపద వచ్చినప్పుడో అవసరం వచ్చినప్పుడో చీటికి మాటికి అదేపని చెయ్యడా? తల నరుక్కోడా?- అనిపించింది.
ఒక వూరి దేవత బలికోరుతుంది. అంతా కోళ్ళూ గొర్రెలూ బలిస్తారు. నిష్ఠగా పూజలు చేస్తారు. అప్పుడు వొక్క కోడిగాని గొర్రెగాని మీ అవసరాలకు మమ్మల్నెందుకు చంపుతున్నారు? అని అడగవు. నానమ్మ చెప్పిన కథల్లోలా జంతువులేవీ మాట్లాడవు. మూగగా వుంటాయి. అసలు అరుస్తాయన్నా లేదో?
నిజం చెప్పాలంటే తాతయ్య చెప్పిన పిచ్చి కథలే యెంతో కొంత మంచి కథలు. అక్కడ అన్నిటికీ నోరుంటుంది. నిలదీస్తాయి. నవ్విస్తాయి.
ఇవేం కథలో? చదివిన కథే మళ్ళీ మళ్ళీ మరోలా వస్తుంది. పాత రోత కథలే. అవే కనువిప్పులు. అవే మేలుకొలుపులు. జ్ఞానోదయాలు. మార్పులు.
మా పిల్లలకీ యెన్నో కథలున్నాయి. ఇంట్లోనూ. బళ్ళోనూ. చెప్పుకున్నవీ. చెప్పుకోలేనివీ. చెప్పాలంటే వొక్కొక్కరికీ వొక్కో కథ వుంది.
మరి మా యే కథా కథ కావడం లేదు యెందుకనో?
మా కథలు కూడా కథలయితే? ఆ కథలు మేం చదువుకోమా? నవ్వుకోమా? మీరూ చదువుకోరా? మీరూ నవ్వుకోరా? మా యేడుపులు మీరు తుడవరా? మాకు బాధలు వున్నాయని గ్రహించరా? గుర్తించరా? తీర్చరా? మిమ్మల్ని మీరు దిద్దుకొని మమ్మల్ని దిద్దరా?
మా గురించి కథ రాయరూ?
మా కథలన్నీ మాకు కావాలి.
కథ మారాలి! మా కథ కూడా మారాలి!
-మాలిక,
నాలుగో తరవతి, సెక్షన్ ‘సి’
రెయిజింగ్ బర్డ్స్ స్కూల్.
Add comment