అల వైకుంఠపురములో… ?

.‘మీరు కథలు ఎలా రాసుకుంటారు?’ అని గతంలో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని అడిగారు, (అఫ్ కోర్స్ ఆయన ప్రతి సినిమాకు కథనందించేది వారి తండ్రి విజయేంద్రప్రసాదే అయినా). దానికి సమాధానంగా రాజమౌళి ‘నాకు తెలిసి కొత్త కథలంటూ ఏమీ ఉండవండీ. పురాణాలు, అనుభవాలు నుండి పుట్టే కథలే అన్నీనూ. నా వరకూ నేను తీసే సినిమాలు కొత్త కథలు అని చెప్పను, కాకపొతే తెలిసిన కథనే నా కోణంలో చెపుతాను’ అన్నారు. (అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడారు, ఎగ్జాక్ట్ గా ఇవే పదాలు కాకపోయినా). ‘ఆల వైకుంఠపురములో’ సినిమా గురించి త్రివిక్రమ్ మీద కథాచౌర్యం ఆరోపణ గురించీ అదే చెప్పుకోవాలేమో. రాజమౌళి చెప్పారు, త్రివిక్రమ్ చెప్పలేదు అంతే తేడా. ఈ ‘వైకుంఠపురములో’ కథకు మూలం, దశాబ్దాల క్రితం నాటి ‘ఇంటిగుట్టు’ అంటున్నారు. ‘మీనా’ సినిమాను తనదైన శైలిలో ‘అ ఆ’ సినిమాగా మలచిన రీతిలోనే; ‘ఇంటిగుట్టు’ను ‘అల వైకుంఠపురములో’ సినిమాగా మలచారు. మొదటినుండీ త్రివిక్రమ్ బలం కథ కంటే ఎక్కువగా మాటలు, సున్నితమైన భావోద్వేగాలను అంతే సున్నితంగా సమర్థులైన నటులతో తెరకెక్కించటం.  

అనేకానేక పాత సినిమాల వాసనలు మోసుకుని తిరిగేవి త్రివిక్రమ్ సినిమాలు. ఈ సినిమాలో కూడా కొత్త కథను ఆశించననక్కర్లేదు. ఒకే చోట జీవితం మొదలుపెట్టిన ఇద్దరిలో – ఎదిగిన వాడి మీద కోపంతో, పిల్లలను మార్చిసి, తద్వారా తన బిడ్డ ధనవంతుడిగా పెరగాలని అనుకునే చేతకాని, సాధారణ, మధ్యతరగతి వ్యక్తి కథ ఇది. మామూలుగా అయితే ఇది మధ్యతరగతి వ్యక్తి పాత్ర పోషించిన మురళీశర్మ పాత్ర కోణంలోంచి చెప్పాల్సిన కథ ఇది. అలానే మొదలైనప్పటికీ, పిల్లవాడు పెరిగి అల్లు అర్జున్ గా మారగానే ఇక అతడి కోణంలోకి మారిపోతుంది, అఫ్ కోర్స్ హీరో సెంట్రిక్ కాబట్టి. అకారణంగా తనను ప్రతిసారి తక్కువ చేసి, అమానించే తండ్రితో వేగడం; అతడు తన తండ్రి కాదని తెలిశాక, తన అసలు కుటుంబ సమస్యలను పరిష్కరించడం ఆలా ‘అల …’ సాగిపోతుంది. ముందే చెప్పినట్టు కొత్త కథ కాదు కాబట్టి, దానిని తనదైన శైలిలో చెప్పేందుకు త్రివిక్రమ్ ప్రయత్నించారు. మూల పాత్రను వదిలేసి, దీనిని అల్లు అర్జున్ పాత్ర కోణంలోంచి చెప్పాలనుకోవడంతో తడబాటు మొదలైంది, అలా ‘అల …’ పలు తడబాట్లను మోసుకుని వైకుంఠపురం పయనిస్తుంది. మధ్యలో అప్పుడప్పుడూ మురళీశర్మ పాత్రను కీలకంగా చూపినా అది కేవలం విలన్ లాగానే తప్పించి, ఆ పాత్రలోని సంఘర్షణను చూపలేదు.

నటీనటుల విషయానికి వస్తే ఇందులో ప్రధాన పాత్ర మురళీశర్మది. ఆ పాత్రలో మధ్యతరగతి అమాయకత్వం, అవకాశాలను సృష్టించుకుని ఎదగలేని అమాయకత్వం, ఎదిగిన వాడిని దెబ్బతీయాలనుకునే శాడిజం, చేతకానితనం, తండ్రి ప్రేమ ఇలా రకరకాల ఎమోషన్స్ ప్రదర్శించే అవకాశం లభించింది. మురళీశర్మ అద్భుతంగా ఆ పాత్రను పోషించాడు. ఎంతో ప్రభావవంతంగా ఉండవలసిన పతాక సన్నివేశాలు మురళీశర్మ పాత్రను డమ్మిగా మార్చడంతో తేలిపోయాయి. ఇక ఈ సినిమా హీరో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కథనంలోని లోపాలను మరిపించేలా సినిమాను తన స్టార్డం మరియు నటనతో భుజాన మోసి విజయతీరాలకు చేర్చాడు. ప్రధానంగా చిరాకు తెప్పించే స్థాయిలో ఉన్న అనేక సన్నివేశాలను తన ప్రెజెన్స్ తో నిలబెట్టాడు. రాములో రాములా పాటలో కొద్దిగా మినహాయించి అల్లు అర్జున్ మార్క్ డాన్సెస్ పెద్దగా లేకపోవడం ఒక లోటు. పాత్ర ఆహార్యం, డైలాగ్ డెలివరీ, పాత్ర చిత్రణ చాలావరకూ సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. అతడి నటనలో వంక పెట్టడానికేమీ లేకపోగా, ఈ సినిమాతో నటన విషయంలో తనను తాను మెరుగు పర్చుకున్నాడనే చెప్పవచ్చు. సచిన్ ఖేద్కర్, వెన్నెల కిషోర్ లు ఓకే. ఇక టబు, సునీల్, నాగ సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సముద్రఖని, అజయ్ లాంటివాళ్ళను చూసినపుడు పాపం అనిపిస్తుంది. వాళ్ళ పాత్రలు అలా వున్నాయి మరి. హర్షవర్ధన్ తన పాత్ర కామెడీనా, సీరియస్సా, విలనీనా, కరివేపాకా అనే కన్ఫ్యూషన్ లో ఏదో చేసాడు ఫాఫమ్. బోర్డు రూమ్ కామెడీ అని అందరూ అంటుంటే ఏంటో అనుకున్నా, హరీష్ శంకర్ నుండి ఇన్స్పైర్ అయ్యారేమో తప్పించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు అక్కడ. అవునూ మరిచే పోయాను పూజా హెగ్డే ఉంది కదూ, ఊప్స్ ఆవిడే కదా కథానాయిక. సామజవరగమనా … హేవిటో మొహం చూపాల్సినపుడు కాళ్ళు, కాళ్ళు చూపాల్సినపుడు మొహమూ చూపడంతో సరిగా గుర్తుంచుకోలేకపోయాను సార్, మన్నించండి. ప్రైమ్ లో వస్తే మళ్ళీ చూసినపుడు గమనించటానికి ప్రయత్నిస్తా ఓకే, ఈసారికి ఒగ్గెయ్యండి. 

ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే థమన్ ఈ సినిమాకు ప్రచార దశనుండి హీరో. నేపథ్య సంగీతం గొప్పగా లేకున్నా, చెడగొట్టలేదు. థమన్ స్వరపరచినంత అందంగా పాటలు తీయలేకపోవడం త్రివిక్రమ్ వైఫల్యం. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ సరిగా పని చేసుంటే ఫస్ట్ హాఫ్ లో కనీసం ఒక పావుగంట లేచిపోయేది. నిర్మాణ విలువలు బావున్నాయి. డైలాగ్స్ లో త్రివిక్రమ్ మార్క్ తగ్గినా, ‘గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది’ అంటూ బానే ఉన్నాయి. చాలా డైలాగ్స్ లో డెప్త్ ఉన్నప్పటికీ, సన్నివేశాలలో అంతటి గాఢత తీసుకురావడంలో త్రివిక్రమ్ విఫలమయ్యాడు. ఫోటోగ్రఫీ అందంగా, చాలా బాగా వచ్చేలా తీశారు. సిత్తరాల సిరపడు పాట నేపథ్యంగా వచ్చే పోరాట సన్నివేశాలు కాసింత కొత్తదనాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. మిగతా అంతా ఒకే … పెద్దగా ఇబ్బంది పెట్టదు. టైం పాస్ మూవీ. ఇవాళ్టి రోజుల్లో విజయమే కొలమానం కాబట్టి, నేను పేర్కొన్న లోపాలన్నీ ఈ సినిమా ఘన విజయం సాధించడంతో కొట్టుకుపోతాయి. మరో విషయం – గ్యాప్ వచ్చిందో లేక తీసుకున్నారో ఏదైతేనేం కానీ ఆ గ్యాప్ ఎఫెక్ట్ అల్లు అర్జున్ శరీరం మరియు కదలికలపై ఉందని చెప్పవచ్చు. తెరపై ఫిట్ గా కంటే నిండుగా కనబడ్డాడు. ఇంతకీ సెప్పొచ్చేదేమిటంటే ‘అల … వైకుంఠపురములో’ అలా ఉందన్నమాట.

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.