కత్తి పట్టమని యా న్యాల సెప్తాది?

ప్రతి కథకు ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం ఆధారంగా ఆ కథను నడిపిస్తాడు కథకుడు. అనేక నేపథ్యాలలో ఫ్యాక్షన్ నేపథ్యం ఒకటి. ఫ్యాక్షన్ కథలను సినిమాగా తెరకెక్కించడం ఇదేం మొదటిసారేం కాదు. సినిమా అంత నరకడం, చంపడం చూపించి చివరగా ఈ సంస్కృతి వద్దు అని చెప్పడం పరిపాటి. అలా వచ్చిన మరో సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. 

రాయలసీమలో మనుషులను రాక్షసులుగా చూపించడం సినిమా వాళ్లకు మాములైంది. రాయలసీమలో మనుషులు ఇలాగే ఉంటారనే భావన మిగతా ప్రాంతాల వారి మనస్సులలో పడిపోయింది.

రాయలసీమలో ఊర్లకు ఊళ్లు ఫ్యాక్షన్ హింస ఎక్కడా కనపడదు. అది నిజం కాదు. 

గ్రామాలలో రెండు గ్రూపులు ఆధిపత్యం కొరకు చేసుకునే దాడులకు ఫ్యాక్షన్ గా ముద్రవేశారు. ఏ ప్రాంతంలో లేదు రెండు గ్రూపుల మధ్య తగాదా? అన్ని చోట్లా వుంది. ఇవన్నీ అధికారం కోసం ఆధిపత్యం కోసం జరిగేవే! రాయలసీమలో జరిగితే దానికి ఫ్యాక్షన్ ముద్ర! 

ఈ ముద్ర నుంచి బయటపడాలని ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత యువత చైతన్యమవుతున్నది. ఇలాంటి సమయంలో ఫ్యాక్షన్ సీమ సినిమాల ద్వారా సీమ యువతకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఈ సినిమా దర్శకులు?

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరో ఊరి పేరు కొమ్మద్ది. ఇది నిజం ఊరు. ఇది కడప జిల్లా వీరపునాయనిపల్లె మండలంలో ఉంది. ఒకప్పుడు ఈ వూరు ఫ్యాక్షన్ తగాదాల్లో నలిగిన గ్రామమే. ఫ్యాక్షన్ కోరలలో చిక్కి రక్తతర్పణం చేసిన గ్రామమే.

కాని, అది గతం, ఇప్పుడు కాదు. దాదాపు 30 సంవత్సరాల క్రితం మాట అది. రెండు వర్గాలు ఇప్పటికి అదే ఊరిలో ఉన్నాయి. వాళ్ల పిల్లలు చ్దువుకుని, పట్టణాలలో స్థిరపడ్డారు. వాళ్లకు ఇది ఒక కథగా మాత్రమే తెలుసు.

కానీ, సినిమా రూపంలో వచ్చిన తరువాత పాతగాయాలను మళ్లీ రేపుతున్నారని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. సినిమాను సినిమాలా చూడాలని సినిమా వాళ్లు అంటున్నారు. 

పెద్దలు చెప్పిన ఒక మాట ఒకటి ఉంది. మనుషులు మంచిని అంత త్వరగా నేర్చుకోలేరు. చెడును మాత్రం చాలా త్వరగా నేర్చుకుంటారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సినిమా పాతగాయాల మీద కారం చల్లే ప్రయత్నం చేసిందని జనం భావించారు. సీమ ప్రజా సంఘాలు కూడా అలాగే భావించాయి. ప్రజలు 30 సంవత్సరాలుగా శాంతియుతంగా బతుకుతున్నారు. ‘ఎలా బతకాలో మీరు చెప్పేదేముంది? కర్నూలు కత్తులు, కడప బాంబులు యాడున్నాయ్ ఇప్పుడు, మీరు చూపించే సినిమాలో తప్ప?’

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే; నేను మొదటి రోజే అరవింద సమేత వీరరాఘవ సినిమా చూశాను. నేను ఒక రిసెర్చ్ స్కాలర్ ను. నేను చూసిన తరువాత పీజీ విధ్యార్థులను, నా సహచర పరిశోధక విద్యార్థులను సినిమా ఎట్టుంది, నచ్చిందా అని అడిగాను. నాకు వచ్చిన సమాధానం విని ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యాను! నాకు వచ్చిన సమాధానం ‘మాది కడప కదా! మాది రాయలసీమ కదా!’ అని. అంతే. నాకు ఇంక ఏం మాట్లాడాలనిపించలేదు. వీళ్లు ఇలా మాట్లాడటానికి కారణం ఏమిటా అని మళ్ళీ ఒకసారి సినిమా చూశాను. అప్పుడర్థమయింది. అందరూ సినిమా స్టార్టింగ్ లో ఉండే నలభై నిమిషాల ఫ్యాక్షన్ స్టోరీకి కనెక్ట్ అయ్యారని, సినిమాలో డైలాగులు కూడా కొద్దిగా సీమ యువకుల మీద ఫాక్షనిస్టు ప్రభావం చూపే విధంగా ఉండాయనిపించింది.

సినిమా చివరిలో విలన్ తో పలికించిన డైలాగ్ గుర్తొస్తోంది. 

‘ఈ న్యాల కూడా కత్తి పట్టమని సెప్తాంది’. 

ఈ డైలాగ్ రాయలసీమ ప్రాంతానికి మొత్తం ఆపాదించాడు. మా రాయలసీమ నేల కత్తి పట్టమని మాకు యానాడు చెప్పలేదు. కాసిన్ని నీళ్లు ఇయ్యండి మీకు బువ్వ పెడతామని మా మాడిపోతున్న కడుపులను సూసి దీనంగా అర్థిస్తుంది. నీళ్లు ల్యాక, వర్షాలు ల్యాక, నెర్రలిచ్చిన భూమి పొగలు కక్కుతూ కంటికి కనపడకుండా రోదిస్తోంది. మా సీమలో వలసలు ఉన్నాయి, కరువుంది, అన్నదాతల ఆత్మహత్యలున్నాయి, పూటగడవడం కష్టమై పిల్లాపాపలతో వలసలు వెళ్లిన ఊర్లకు ఊర్లున్నాయి. ఎందుకు వలసెల్లుతున్నారని ఈ వలసలను ఇలా నిరోధించొచ్చని ఎవరు సినిమా తీయరు. వీళ్లకు కావలసిందల్లా నరకడం, చంపడం చివరకు మారాలి అని మెసెజ్ ఇవ్వడం. అందరికి కనెక్ట్ అయ్యేది మాత్రం నరికేదే! ఆ విషయం ఈ దర్శకులకెప్పుడు అర్థమవుతుందో మా సీమ బాధలను ఎప్పుడు సినిమాలుగా వస్తాయో!?

మరొక డైలాగ్ ‘కదిరప్పా ఈడ మంది లేరా కత్తులు లేవా!’ అంటే సీమలో మంది ఉంటే కత్తులు పట్టుకుని తిరగాలా? ఏమి, పెన్ను పట్టుకుని, అక్షరాలు నేర్చుకుని, మీ జీవితాలు మార్చుకోండ్రా అని మెసెజ్ ఇవ్వొచ్చుగా! ఇవ్వరు ఎందుకంటే సీమ సినిమాలో కత్తి పట్టుకుంటేనే కలెక్షన్స్! పెన్ను పట్టిస్తే ప్లాప్ అవుతుందని భయం. 

మీ కలెక్షన్స్ కొరకు ఇంకా సీమ సినిమాలలో నరకడం, చంపడం చూపడం మానండి. ఎండిపోతున్న మా గొంతులు తడుపుకోడానికి కాసిన్ని నీళ్లు ఇచ్చే సినిమాలు తీయండి. ఇంకా ఎన్నాళ్లు నరకడం, చంపడం సూపిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు

ఫ్యాక్షన్ మీరు చూపించేంత ఎక్కడా లేదు. అసలు ఫ్యాక్షనే లేదు. దీన్ని ఒకసారి గుర్తించి ఎడారి సీమ బతుకులను సినిమాలుగా తీయండి.

ఇక ఈ సినిమాలో రాయలసీమ యాసను బాగా వాడారు అందుకు ఆనందపడ్డా! జేజి అనే పదం సినిమాలో వినగానే ఒకింత ఒళ్లు పులకరించింది. చాల మంచి పదాన్ని పరిచయం చేశారు. అలాగే సీమలో స్త్రీలు తాము ముండమోసినా మరో స్త్రీ ముండమోయాలని ఎవరు కోరుకోరని సీమ స్త్రీలలో ఉండే కల్మషం లేని మనస్తత్వాన్ని చూపించినందుకు అభినందించాలి. పేరుకు ఇది సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి విడనాడాలనే మార్పు మీద తీసిన సినిమా. కాని, ఫ్యాక్షన్ ను ఆకాశానికి ఎత్తి చూపించి, మార్పును మాత్రం పాతాళంలో చూపిచ్చినట్టనిపించింది. ఏది ఏమయినా ఇప్పటి నుంచి వచ్చే సీమ నేపథ్య సినిమాలయినా సీమ బతుకు వెతలను సూపించాలని దర్శకులకు విన్నవించుకుంటున్నాం!

వెంకట నరేంద్ర ప్రసాద్

వెంకట నరేంద్ర ప్రసాద్: రచయిత రాయలసీమ విశ్వవిద్యాలయాల పరిశోధకుల సంఘం సభ్యులు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.