ప్రేమకు ఆవలి తీరం
చలం జీవితాత్మక నవల

జీవితాన్ని జీవితంగా మొట్టమొదటగా తెలుగు వాళ్లకు చూపించిన తెలుగు కథకుడు గుడిపాటి వెంకటచలం. నిజానికి చలం గారి ఇంటిపేరు కొమ్మూరి. వాళ్ల నాన్న పేరు కొమ్మూరి సాంబశివరావు. తన తల్లి తండ్రి అంటే తాతగారు గుడిపాటి వెంకట్రామయ్య కు మగ సంతానం లేకపోవడం వల్ల తన కూతురు మొదటి సంతానం అయిన చలంను దత్తత కు తీసుకున్నాడు.ఆ విధంగా తన ఇంటిపేరు గుడిపాటిగా మారింది. తన పుట్టుక గురించి చెప్పుతూ “మొదలంటూ లేని ఈ సృష్టికైన ప్రథమ చలనం శూన్యంలో స్పందించినప్పుడు పంచభూతాలతో పాటు అవ్యక్తంగా నేనూ జన్మించాను. ఈ లక్షన్నర కోటి ప్రాణులతో పాటు కలిసి కాంతికి, శబ్దానికి, స్పర్శకి క్రమంగా స్పందించి, వ్యక్తిత్వాన్ని ప్రతిష్ఠించుకున్నాను” అంటాడు చలం. స్త్రీ పక్షపాతి అయిన చలంకు స్త్రీల పట్ల విపరీతమైన సానుభూతి తన బాల్యంలోనే ఏర్పడింది. ఒక వ్యక్తి బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలే, ఆ వ్యక్తి భవిష్యత్ జీవితం మీద ప్రగాఢమైన ముద్ర వేస్తాయని మనో విశ్లేషణ సిద్దాంతాలు నిరూపించాయి. బాల్యంలో పిల్లలకు వాళ్ల తండ్రి  సమాజంలోని వ్యవస్థీకృతమైన విలువలకు, సంప్రదాయాలకూ సంకేతంగా ఉంటాడట. తండ్రి మీద అతిగా ద్వేషాన్ని పెంచుకున్న వాడు పెద్దయ్యాక సమాజంలోని వ్యవస్థీకృతమైన విలువలన్నింటి మీద తిరుగుబాటు చేస్తాడని ఫ్రాయిడ్ చెప్పాడు. చలం విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే బాల్యంలో చలం అనుభవించిన తండ్రిలోని క్రౌర్యమే కారణం. తన తల్లి పడ్తున్న బాధలు, చెల్లెలు అమ్మణ్ణి కి ఇష్టం లేకుండా జరిగిన బాల్య వివాహం.. ‌తన భర్త అత్త లచే పడుతున్న కష్టాలను చూసి స్త్రీల పట్ల విపరీతమైన ప్రేమ, పురుషుల పట్ల విపరీతమైన ద్వేషాన్ని అలవరుచుకున్నాడు.

చలం తన బాల్యం నుండే పురుషులతో కన్నా  స్త్రీలతోనే ఎక్కువ స్నేహం చేసేవాడు. బాల్యంలోనే ముగ్గురు స్త్రీలను అతిగా ప్రేమించాడు…ఆరాధించాడు. ఆ ముగ్గురిలో మొదటి స్త్రీ బంగారమ్మ.  తన కన్నా 12 సంవత్సరాలు పెద్దది. తన వయసు 8 సంవత్సరాలు మాత్రమే. బంగారమ్మ అంటే అతని భావనలో సౌందర్యానికి గీటురాయి వంటిది. రెండవ స్త్రీ సుందరమ్మ. స్కూల్ గోడల మీద చలం పేరును, సుందరమ్మ  పేరును కలిపి రాస్తుండేవాళ్లట.

సుందరమ్మది చిక్కినట్టే చిక్కి చిక్కకుండా పోయే స్త్రీత్వపు ఆకర్షణ. మరో స్త్రీ “చి”. ఈమె కాల్పనిక ప్రేమకు పరకాష్ఠ. చలానికి ఇష్టం లేకున్నా 16వ ఏటనే చిట్టి రంగనాయకమ్మ తో పెండ్లి చేస్తాడు తన తాత గారు. హిందువుల అబద్దం, మోసం, క్రౌర్యం, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం తనను ఎంతో కలవరపరిచేవి. తనొక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ వారి ఆధిపత్యాన్ని ఎదిరించేవాడు. చలం భావాలను ఇష్టపడే రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మ సమాజంలో చలాన్ని చేర్పించాడు. తన ఒంటి మీది జంధ్యాన్ని, భార్య మెడలోని మంగళ సూత్రాన్ని తీసేసి  బ్రహ్మ సమాజం బోధించే పద్దతులను తు.చ.తప్పకుండా ఆచరిస్తారు. స్త్రీలు చదువుకోకపోవడమే వాళ్లు మన సమాజంలో బానిసలుగా బతకడానికి ప్రధాన కారణమని చెప్తుండే వాడు. తన భార్యను చదివించి,భర్త – భార్య తేడా ఉండకూడదని తన ఇష్టానుసారం ఉండమని చెప్పేవాడు. తన భార్య సోదరి రంగనాయకమ్మ బాల వితంతువు. ఆమె ఇష్ట ప్రకారం వైద్య విద్య చదివించి డాక్టర్ చేశాడు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి డాక్టర్ పట్టా పొందిన మొట్టమొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కింది. రాయటం అనేది అతనికి చాలా సహజంగా అలవడిపోయింది. చేప నీటిలో ఈదినట్టుగా, మేఘం వర్షించినట్టుగా చలం రాయడం మొదలుపెట్టారు. నిజానికి అతనెప్పుడూ ఓ రచయిత కావాలని అనుకోలేదు. అతనిలో అనుక్షణం చెలరేగుతున్న భావాలు… ముఖ్యంగా అతని బాహ్య ప్రపంచానికి, మనో ప్రపంచానికి సామరస్యం కుదరక పోవడంతో నిరంతరం అతనిలో చెలరేగిన సంఘర్షణే అతన్నో రచయితగా మార్చింది.

మొక్కపాటి రామ్మూర్తి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చలం ముగ్గురు కూడా బ్రహ్మసమాజం వ్యాప్తికి ఎంతో కృషి చేసారు. బ్రహ్మ సమాజాన్ని కీర్తిస్తూ చలం రాసిన వ్యాసాలు, కృష్ణశాస్త్రి పాటలు సమాజాన్ని చాలా ప్రభావితం చేశాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకసారి ప్రేమించుకుంటే ఆ ప్రేమ శాశ్వతంగా ఉండిపోవాలని యేమీ లేదు.ఆ స్త్రీకి వేరే పురుషుని మీద, ఆ పురుషునికి వేరే స్త్రీ మీద ప్రేమ కలుగవచ్చు. కాబట్టి ఒకసారి జనించిన ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుందనే భ్రమ నుండి ఈ సమాజం బయటపడాలి.

ఎవరికిష్టమొచ్చినట్టుగా వాళ్లు బతికేందుకు అవకాశాలుండే సమాజం ఏర్పడాలి. స్వేచ్ఛ, ప్రేమ- ఇవి రెండూ మానవజాతికి అత్యవసరాలు అనే వాస్తవాన్ని ఈ మనుషులు ఎప్పుడు గుర్తిస్తారోనని తన అభిప్రాయం…ఆలోచన. చలం మీద ప్రేమతో… మోహంతో తనంతట తానొచ్చిన ఏ స్త్రీ ని కాదనక స్వీకరించే వాడు. అది తన ధర్మంగా భావించేవాడు. ఇదే ఆలోచనతో స్వేచ్చా ప్రణయవాద సిద్దాంతాన్ని అమలులోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించాడు.ఇదే ఉద్దేశ్శాన్ని “అరుణ* లో చిత్రించాడు. తన మొదటి నవల ” శశిరేఖ ” గ్రాంధిక భాషలో రాసినప్పటికీ, మిత్రుడు చింతా దీక్షితులు చేసిన మనవితో …సమాజంలో ఎన్నో రకాలుగా అణచివేయబడుతున్న ఆడవాళ్ళ మీద రాయాలని నిర్ణయించుకుంటారు. ఆ విధంగా ఎన్నో నవలలు, కథలు, నాటకాలు, వ్యాసాలను వాడుకభాషలో రాశారు. సమాజం నుండి ఎన్నో అవమానాలను, స్త్రీల నుండి ప్రేమను పొందినాడు. చింతా దీక్షితుల పరిచయం చలం జీవితాన్ని ఒక మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. బాల్యం నుండి కూడా శృంగార వాంఛ ఎక్కువగా కలిగిఉన్న చలం…దీన్ని జయించడానికి ఎన్ని సార్లు ప్రయత్నించిన విఫలుడయ్యేది. దేవుడు, జోస్యం మీద నమ్మకం లేకపోయేది. చలానికి దీక్షితులు పరిచయం చేసిన భగవాన్ రమణ మహర్షి ఆశ్రమ ప్రవేశం, తన పెద్ద కూతురు సౌరిస్ సహకారంతో ఆధ్యాత్మికతను క్రమక్రమంగా పెంచుకొని తన బలహీనతలను క్రమంగా జయిస్తాడు. చిన్న వయసులోనే తన పెద్ద కుమారుడు రవి గుండెకు చిల్లుపడి చనిపోవడం దేవుని మీద నమ్మకం లేకపోవడం వల్లనే చనిపోయాడని భార్య నిందిస్తుంది. చలం రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను ఎంతో ఇష్టపడేవాడు. ఆ ఇష్టంతోనే తన పెద్ద కుమారునికి రవి అని పేరు పెట్టినాడు. పిల్లల పెంపకం అంతా తనే చూసుకునే వాడు. వాళ్లకు స్వేచ్ఛాయుత వాతావరణంను కల్పించాలని చెప్పుతుండే వాడు. పిల్లల పెంపకంపై పుస్తకం కూడా రాశారు. కానీ తన రెండో కుమారుడు వసంత్ చెడు అలవాట్లకు లోనయ్యి ఇంటినుండి వెళ్లిపోయాడు. ఈ విధంగా ఇద్దరు కొడుకులు దూరమైన బాధలో భార్య మతి చలించింది. ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్ళు వాళ్లు సౌరిస్, నిర్మల, చంపకలు. చిత్ర, నర్తకి అనే ఇద్దరు అనాధ పిల్లలని కూడా పెంచుకున్నారు.చంపక వజీర్ రెహమాన్ ని మతాంతర వివాహాన్ని చేసుకుంది. వజీర్ రెహమాన్ చలం అభిమాని. చలం రచనలతో ఏకీభవించిన వ్యక్తి. సాహిత్యం, కవిత్వం అంటే ఏమిటో తెలువకుండానె తన మనసును తొలిచే భావాలతో రచనలు చేశారు. చలం రచనలలోని కవిత్వ గాఢతను సేకరించి “కవిగా చలం” అను కవిత్వాన్ని వజీర్ రెహమాన్ తీసుకొచ్చారు. ఎన్నాళ్లు గానో చలంకు టాగోర్ “గీతాంజలి” నిత్య పారాయణ గ్రంథం. తను వెతుకుతున్న అన్వేషణ గీతాంజలి లో దొరికిందని చెప్పుతారు. 1958 లో గీతాంజలికి తెలుగు అనువాదాన్ని పూర్తి చేశారు.

చలం నిరంతర ప్రేమికుడు. మానవునిలో ఎన్నో బలహీనతలున్నాయి. వాటిని జయించడానికి మనిషి తనతో తను గొప్ప పోరాటం చెయ్యాలి. ఎవరో కొందరు…. చలం లాంటి వాళ్లు తప్ప తమతో తాము ఈ నిరంతరం పోరాటం చేసుకోలేరు. రమణాశ్రమం చేరిన తర్వాత చలం రాసిన కవితా రచన “సుధ”. స్త్రీ హృదయ లోతులపై చేసిన ఎన్నో రచనల వల్ల చలం సమాజం నుండి ఎన్నో ఛీత్కారాలను అందుకున్నాడు. తన రచనల్లో “స్త్రీ” మరియు “మైదానం” ఎక్కువ ముద్రణలకు నోచుకున్నాయి. అదే విధంగా “మ్యూజింగ్స్” ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ రమణాశ్రమంలో స్థిర పడ్డాక ఏనాడు తన కలానికి విశ్రాంతి నివ్వలేదు. ఈ దశలో తను రాసిందంత భక్తి సాహిత్యమే. సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగు జాతిని తట్టి, తిట్టి, ఊపి, నిద్రలేపి, బాధించి బోధించి తన రచనల కొత్త కాంతిలో కండ్లు చెదరగొట్టి, కొడిగట్టిన హృదయాలను ఉద్దీపింపచేశాడు. తెలుగు జాతికొక జీవిత దృక్పధాన్ని ఇచ్చినాడు. చలం జీవితంలో ఎన్నో దశలు… కాల్పనిక వాదిగా, భావుకుడుగా, ప్రకృతి ఆరాధకుడిగా, శృంగార జీవిగా ప్రారంభమైన చలం జీవితమంతా దేనికోసమో…స్పష్టంగా తెలియని దానికోసం అన్వేషిస్తూ… తనను తాను సంస్కరించుకోవటానికి, ఉన్నతీకరించుకోవడానికి తనతో తాను ఘర్షణ పడ్తూ జీవితమంతా తీవ్రమైన అశాంతితో కొట్టుమిట్టాడిన చలం రమణాశ్రమంలో శాంతి లభిస్తుందనుకొని, కూతురు సౌరిస్ నే ఈశ్వరుడనుకొని తనువు చాలించాడు.

   *ప్రేమకు ఆవలి తీరం* పేరుతో చలం గారి జీవితాన్ని జీవితాత్మక నవలగా అంపశయ్య నవీన్ రచించారు. తెలుగులో వాస్తవ జీవిత నవల ఇదే అవుతుందేమో. చలం గారిది జీవిత ప్రయోగం అయితే… జీవిత నవలగా నవీన్ గారిది రచనా ప్రయోగం. చలం గారి కోణం నుండి అర్థం చేసుకొని చలం జీవితాన్ని చదివే వారికి కండ్ల ముందు చూపించారు.

వెంకి, హన్మకొండ

అసలు పేరు గట్టు రాధిక మోహన్. హన్మకొండలో నివాసం. వృత్తిరీత్యా మ్యాథ్స్ టీచర్. పుస్తకాలు చదవడం ఒక అలవాటు. అడపాదడపా "వెంకి" కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. కవిత్వం మీద "ఆమె తప్పిపోయింది" పేరుతో పుస్తకం వెలువరించారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.