యుద్ధం చిదిమేసిన ప్రేమ:
‘ది క్రేన్స్ ఆర్ ఫ్లయింగ్’ (1957)

యుద్ధం వ్యయంతో కూడిన వ్యవహారం. అది చెల్లించే వాట్లోకెల్లా గరిష్టమైనది మానవ మూల్యమే.” – రోజ్ కెంప్.

ప్రపంచాన్నే జయించాలనుకున్న జాత్యహంకారి ఫాసిస్ట్ నాజీ హిట్లర్ దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి సోవియట్ రష్యా సైనికులూ, పౌరులూ కలిపి రెండు కోట్ల డబ్భై లక్షల మంది ప్రాణాలొడ్డారు. ‘ఒక్క ఇంచి కూడా వెనక్కి తగ్గేది లేదు’ అనుకునే ఒక నియంత కోసం దేశ, పరదేశ ప్రజలు చెల్లించే భారీ మూల్యాలు ఈ స్థాయిలో  వుంటాయి. ఈ అశేష త్యాగాల ఫలితంగా ప్రపంచ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చెదిరిన జీవితాల్లో మిగిలిన చిగురుల్ని ప్రోదిచేసుకుని ముందుకు సాగారు. సుదూరాల్లోంచి, భవిష్యత్తులోంచి చూస్తే యుద్ధం కొన్ని గణాంకాల సమాహారమే. కానీ, సమీపంలోంచి చూస్తే సమసిన ప్రతి జీవితం ఒక విషాద గాధను వినిపిస్తుంది. అటువంటి రణరక్తసిక్తమైన సోవియట్ ప్రేమజంట కథే ‘ది క్రేన్స్ ఆర్ ఫ్లయింగ్’.

దర్శకుడు మిఖాయిల్ కలటోజోవ్

రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ త్యాగాలను చిత్రీకరించిన సినిమాలు స్టాలిన్ హయాంలోనూ చాలా వచ్చాయి. కానీ, వాటిలో అధిక భాగం ప్రభుత్వ నిర్దేశాల మేరకు తయారౌతూ, మహానాయకుల నేతృత్వంలో ప్రజాపోరాటాలు, త్యాగాలు అన్న మాదిరిగా ప్రచారధోరణిలో, ఒకింత మూస ధోరణిలో సాగేవి. కాబట్టి అవి స్థల కాలాలకతీతమైన శాశ్వతత్వాన్ని సంతరించుకోలేక పోయాయి. స్టాలిన్ అనంతర కాలంలో కళారూపాల వ్యక్తీకరణలో సడలింపులు వచ్చాయి. ‘అలా వచ్చిన స్టాలిన్ యుగానంతర అతి గొప్ప సినిమా ఇది’ అని ప్రశంసించారు సినీ విశ్లేషకురాలు జోసెఫిన్ వోల్. యుద్దం ఒక సామాన్య రష్యన్ స్త్రీ జీవితాన్ని చిధ్రం చేసిన వైనాన్ని ఆమె దృక్కోణంలో చిత్రించింది ఈ సినిమా. సోవియట్ బయటి సినీ ప్రపంచం ఈ సినిమాను వెంటనే గుర్తించి గౌరవించింది. 1958లో ఈ సినిమా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పామ్ డియోర్ అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డు పొందిన ఏకైక సోవియట్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘బల్లాడ్ అఫ్ ఏ సోల్జర్’ (1959), ‘ఇవాన్స్ చైల్డ్ హుడ్’ (1962) లాంటి సినిమాలు కూడా బహు ప్రశంసలు పొందాయి.

సినిమా కథ:

యువ ఇంజనీరు బోరిస్ (అలెక్సీ బటాలోవ్), వెరోనికా (టటియానా సమోయిలోవా) గాఢ ప్రేమికులు. సువిశాలాకాశంలో ఎగిరే కొంగలు వారికి ప్రేరణ. వారి నిష్కపట ప్రేమకు అడ్డే లేదు. తాము ఏ డ్రెస్సులు వేసుకుని, ఎలా వివాహం చేసుకోబోతున్నారో కలలు కంటుంటారు వారు. కుమారుడు అర్ధరాత్రి ఇంటికి వస్తే నిద్ర నటిస్తున్న తండ్రి ‘ప్రేమ అనేది ప్రమాదరహిత మానసిక రోగంలే’ అనుకుంటాడు. బోరిస్ తండ్రి ఫ్యోడర్ ఇవనోవిచ్ (వాసిలి మెర్కురీవ్) ఆ వూరిలో పేరైన వైద్యుడు. తండ్రితో పాటు తల్లి, అక్క ఇరినా, కజిన్ మార్క్ (అలెక్సాండర్ ష్వోరిన్) ఆ ఇంట్లో వుంటున్నారు. మార్క్ కి కూడా వెరోనికా అంటే ఇష్టం. ఆమెను మెప్పించడానికి వ్యర్ధ ప్రయత్నాలు చేస్తుంటాడు.

ఇంతలో జర్మనీ సోవియట్ పై దాడి చేస్తుంది. మాతృదేశ రక్షణ కోసం పిలుపు రాక మునుపే తన స్నేహితుడు స్టెపాన్ తో కలిసి రణక్షేత్రానికి వెళ్ళడానికి దరఖాస్తు పెడతాడు బోరిస్. బోరిస్ నిర్ణయాన్ని విని విస్తుపోతుంది వెరోనికా. కానీ దేశ రక్షణ కోసం బోరిస్ కృతనిశ్చయం ముందు ఆమె ఏమీ మాట్లాడలేదు. వెరోనికా పుట్టిన రోజు నాడే ఆర్మీలోకి చేరుతాడు బోరిస్. తను ‘ఉడుతా’ అని ప్రేమగా పిలిచే ప్రేమికురాలి కోసం ఒక ఉడుత బొమ్మను కానుకగా పంపిస్తాడు. కానీ, ఆ బొమ్మలో దాచి పెట్టిన ఉత్తరం సంగతి వెరోనికాకి తెలీదు. వెరోనికా తన ప్రేమికుడికి వీడ్కోలు చెబుదామని ఆర్మీ కార్యాలయానికి వెళుతుంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా అతడితో కలిసి, వీడ్కోలు చెప్పలేకపోతుంది. అక్కడ్నుంచి ఆమె కష్టాలు పెరుగుతూనే వుంటాయి.

జర్మన్ సైన్యాలు సోవియట్ జనావాసాలపై బాంబు దాడులు చేస్తాయి. ప్రజలు కందకాలలో దాగొంటారు. కానీ వెరోనికా తల్లిదండ్రులు తమ అపార్ట్మెంట్ నుండి బయటికి రావడానికి నిరాకరిస్తారు. ఫలితంగా ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోతారు. వారి ఆనవాళ్ళు కూడా దొరకవు. ‘అయినా ముందుకు సాగిపో’ అని చెప్పడానికా అన్నట్టు ఒక్క గోడగడియారం మాత్రం నడుస్తూంటుంది. అనాధగా మారిన వెరోనికాను ఫ్యోడర్ తన ఇంటికి ఆహ్వానిస్తాడు. బోరిస్ నుండి ఉత్తరాలు రావడం లేదన్న బాధకు తోడు వెరోనికాకు మార్క్ వేధింపులు ఎక్కువవుతాయి. బోరిస్ కోసం ఎదురు చూస్తున్న ఆమె అతన్ని నిరంతరం తిరస్కరిస్తుంది. మరో బాంబు దాడి సమయంలో ఒంటరిగా వున్న వెరోనికాపై మార్క్ అత్యాచారం చేస్తాడు. అపరాధ భావంతో, అలసటతో, ఎదో ఆవహించిన జడత్వంతో వెరోనికా మార్క్ ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. విషయం తెలీని బోరిస్ కుటుంబ సభ్యులు బోరిస్‌కు ద్రోహం చేసిందని వెరోనికాను తప్పుగా అర్ధం చేసుకుంటారు.

మార్క్ చేతిలో వెరోనికా జీవితం నలిగిపోయిన కాలంలోనే అటు యుద్ధ రంగంలో గాయపడిన స్నేహితుడు స్టెపాన్ ప్రాణాలను కాపాడుతూ తను తూటాకు గురై మరణిస్తాడు బోరిస్. ఆ సంగతి అతని కుటుంబానికి గానీ, వెరోనికాకి గానీ తెలీదు. జర్మన్ దాడుల నుండి కాపాడడానికి చాలా కుటుంబాలతో పాటు ఫ్యోడర్  కుటుంబాన్ని కూడా తూర్పు ప్రాంతానికి తరలిస్తారు. తాత్కాలిక గృహాలలో నివసిస్తూ, ఫ్యోడర్, ఇరినా, వెరోనికాలు సైనిక ఆసుపత్రిలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందిస్తుంటారు. వెరోనికాను సాధించేసుకున్న మార్క్ తన సమయాన్ని పార్టీల్లో, జల్సాల్లో గడుపుతుంటాడు. వెరోనికాకు ఆ వివాహబంధంలో సంతోషమన్నది మిగల్లేదు.

యుద్ధమైదానంలో తనుండగా తన ప్రేయసి మరొకన్ని పెళ్ళిచేసుకుందని తెలుసుకున్న సైనికుడొకడు ఆసుపత్రిలో గోల చేస్తుంటాడు. తనను చావనీయండనీ, వైద్యం వద్దనీ కేకలు వేస్తుంటాడు. ఫ్యోడర్ అతన్ని కోప్పడి సముదాయిస్తాడు. ‘యుద్ధానికి వెళ్ళిన వీరుడి కోసం వేచివుండలేకపోయిన అటువంటి ఆడదాన్ని మరిచిపోవడమే మేలు’ అని ఫ్యోడర్ అన్న మాటల్ని చాటుగా విన్న వెరోనికా కలత చెందుతుంది. ఆ మాటలు తనను ఉద్దేశించినవిగా అన్పిస్తాయి. అసలే వివాహబంధంలో దెబ్బతిన్న వెరోనికా తీవ్ర అపరాధ భావంతో వేగంగా వచ్చే రైలు ముందు దూకి చనిపోవాలనుకుంటుంది. కానీ ఆఖరు క్షణాల్లో కారు కింద పడబోతున్న ఒక పసివాణ్ణి కాపాడుతూ తన ప్రయత్నం విరమించుకుంటుంది. ఆ యుద్ధ అనాధ బాలుడి పేరు కూడా బోరిస్ కావడంతో అతడిని దత్తత తీసుకుని తన జీవితానికి ఒక లక్ష్యం దొరికిందనుకుంటుంది.

ఫ్యోడర్ కు మార్క్ అసలు స్వరూపం తెలుస్తుంది. తన మంచి పేరును వినియోగించి, ఒక అధికారికి లంచం ఇచ్చి మరీ యుద్ధానికి వెళ్ళకుండా తప్పించుకున్నాడని తెలుస్తుంది. మార్క్ రష్యాకు మాత్రమే కాకుండా, తన కుటుంబానికి కూడా ద్రోహం చేశాడని తెలుసుకున్న ఫ్యోడర్ మార్క్‌ను తన ఇంటి నుండి తరిమేస్తాడు.

బోరిస్ ప్లాటూన్లోని ఒక సైనికుడు అతడి మరణవార్తను మోసుకొస్తాడు. వెరోనికా మాత్రం తనావార్తను నమ్మనంటుంది. జర్మన్ పతనంతో యుద్ధం ముగిసిన తర్వాత, వీర సైనికులు తిరిగి వచ్చినపుడు, స్టెపాన్‌ బోరిస్ మరణవార్తను ధృవపరుస్తాడు. వెరోనికాకు ఒక పుష్పగుచ్చం అందిస్తాడు. జయజయధ్వానాల  జనసమూహం మధ్య కన్నీళ్లతో తూలుతూ అడుగులు వేస్తుంది వెరోనికా. రైలింజను పైకి ఎక్కి స్టెపాన్ ఉద్వేగభరితమైన ప్రసంగం చేస్తాడు.

“కాలం ముందుకు సాగుతుంది
పట్టణాలు, గ్రామాలు పునర్నిర్మితమవుతాయి
మన గాయాలు నయం అవుతాయి
కానీ యుద్ధంపై మనకున్న తీవ్రమైన ద్వేషం ఎప్పటికీ తగ్గదు.
ఈ రోజు తమ ప్రియమైన వారిని కలవలేని వారి బాధను మనం పంచుకుందాం.
ప్రేమికులు మళ్లీ యుద్ధం వలన వేరుపడకూడదు, అందుకు ఏమైనా చేద్దాం.
తల్లులు తమ పిల్లల జీవితాల కోసం మరలా భయపడనవసరం రాకూడదు,
దాచిన కన్నీళ్ళు తండ్రులను ఎప్పటికీ ఉక్కిరిబిక్కిరి చేయకూడదు.
గెలిచిన మనం వినాశకరమైన పనులు చేయకూడదు.
కొత్త జీవితాన్ని నిర్మించడానికే పనిచేయాలి! ”

వెరోనికా తన దు:ఖాన్ని దిగామింగుతూనే ఒక్కో పువ్వును తిరిగొస్తున్న సైనికులకు అందిస్తుంది. అదే సమయంలో ఆకాశంలో ‘వి’ ఆకారంలో ఒక కొంగల గుంపు ఎగుర్తూ కనిపిస్తుంది. సినిమా ఆరంభంలో వెరోనికా    వర్ణించినట్టు – ‘అందమైన కొంగలు; ఆకాశంలో ఓడల్లా! తెల్ల తెల్లని కొంగలు, ఊదారంగు కొంగలు, పొడుగాటి ముక్కులతో ఎగురుతున్న కొంగలు!’ – ఎన్నో విషాదాల మధ్య మరో కొత్త జీవితానికి ప్రతీకలా!

దర్శకుడు – సాంకేతికవర్గం:                                                   

ఈ సినిమా దర్శకుడు మిఖాయిల్ కలటోజోవ్. విక్టర్ రోజోవ్ నాటకం ‘ఫరెవర్ ఎలైవ్’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. సంభాషణలకంటే సినిమా భాష ద్వారా, నటన ద్వారా కథను అర్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు దర్శకుడు. అందుకు సరిజోడిగా అతడితో గతంలో కలిసి పనిచేసిన సినిమాటోగ్రఫర్ సెర్గీ ఉరుసేవ్స్కీ, అంతే ప్రతిభావంతంగా ఎడిటర్ మరియా టిమోఫేయేవా సహకరించారు. మొయిసీ వాన్బెర్గ్ సంగీతం దృశ్యాన్ని మింగేయకుండా దానికి సహాయకారిగా పనిచేస్తుంది. వంకర్లు తిరిగిన మెట్లపై కథానాయకుడు పరుగెత్తే సందర్భాల్లో వినిపించే నేపథ్య సంగీతం ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో మనం విన్నదేననిపిస్తుంది.

కొన్ని కొన్ని ఐకానిక్ దృశ్యాలు సదా గుర్తుండిపోతాయి. వాటిల్లో అతి గొప్ప దృశ్యం బోరిస్ కు తుపాకి గుండు తగిలి చనిపోతున్నప్పటి దృశ్యం. గుండు తగలగానే కళ్ళు బైర్లు కమ్మడం, చనిపోతున్నానని అన్పించాగానే ఉన్నపళంగా ప్రేయసి దగ్గరికి తిరుగుడు మెట్ల మీంచి పరుగెడుతున్నట్టు కలగనడం, గది తలుపు తెరుచుకోగానే, లోపల్నుంచి మ్యారేజ్ గౌన్ లో వెరోనికా, నల్లని కోట్ తో తనూ, సుకుమారమైన ఆ గౌన్ వస్త్రంతో దృశ్యమంతా కప్పబడి పోవడం, ఆ దృశ్యం పైనే పొడుగాటి చెట్లు గిరగిరా వేగవంతంగా తిరగడం, రెండు మూడు దృశ్యాలు ఒకదానిపై ఒకటి సూపరింపోజ్ చేసి చూపిన వైనం ఆనాటికి సరికొత్త ప్రయోగం. నిజంగా అలానే చనిపోతారేమో అన్పించే ఆ దృశ్యాన్ని ఆ తర్వాత ఎందరు దర్శకులు ఎన్ని సార్లు కాపీ కొట్టారో!

మిలట్రీ కాంప్ దగ్గర బోరిస్ ను వెరోనికా వెదుకుతున్న దృశ్యం కూడా మరో గుర్తించదగ్గ దృశ్యం. ఇది వెరోనికా కథే అని చెప్పడానికి కెమెరా నిత్యం ఆమెకు సమీపంగా మసులు కోవడం మనం గమనించవచ్చు. ప్రేమికుడ్ని ఒక్కసారి మనసారా చూడడానికి వీధుల్లోంచి వెళ్తున్న ట్యాంక్ ల మధ్య వెరోనికా పరిగెడుతున్నట్టు చూపిన క్రేన్ షాట్ మరో హైలైట్. అమెరికా సినిమాటోగ్రాఫర్ హస్కేల్ వెక్ష్లెర్ తనపై అత్యంత ప్రభావం చూపిన షాట్ ఇదే అని చెబుతాడు. కొంగల్ని, తెల్లని పువ్వుల్ని, మెలికలు తిరిగిన మెట్ల వరుసనల్ని సింబాలిక్ గా వినియోగించుకున్నాడు దర్శకుడు. ప్రేమికురాలిని చేరడానికి ఒకసారి, తల్లిదండ్రుల మృత్యువును తెలపడానికి ఒకసారి, ఒకసారి ఆనందానికి, మరోసారి విషాదానికి దారిచూపుతుంది మెట్ల వరుస.  విధ్వంసం శిధిలాల మధ్య కూడా గడియారంలోని లోలకం శబ్దం చేస్తూ, కాలం ఆగిపోదని చెబుతుంది.

ఆత్మహత్య దృశ్యంలో వెరోనికా పరిస్థితిని ప్రేక్షకులు తామే అనుభవించేలా దృశ్యీకరించాడు దర్శకుడు. వెరోనికా మనసును మార్చడానికా అన్నట్టు పసివాడితో కొంచెం కామిక్ టచ్ వున్న మాటలు మాట్లాడించాడు దర్శకుడు. ‘ఎవరి అబ్బాయివి నువ్వు?’ అని అడిగితే, ‘మా అమ్మ అబ్బాయిని’ అని చెబుతాడు. ‘నీ వయసెంత?’ అన్న ప్రశ్నకు, ‘మూడు నెలల మూడు సంవత్సరాలు’ అని బదులిస్తాడు బుల్లి బోరిస్. అంత విషాదంలోనూ, అతి చిన్న చిరునవ్వు మెరిపిస్తుంది నటి. రష్యన్ సినిమాలో నిజంగా మరపురాని నటి టటియానా. ఈమెను హాలీవుడ్ అడ్రి హప్బర్న్ తో పోల్చారు చాలామంది.

 రెండో ప్రపంచయుద్ధం ముగిసి 75 ఏళ్ళు కావస్తోంది. ప్రపంచం మరో ప్రపంచయుద్ధానికి సమాయత్తమవుతోందా అనిపించేలా వుంది ఈనాటి వాతావరణం. “యుద్ధాన్ని మానవీకరించుకునే పరిస్థితి లేదు, దాన్ని నిషేధించాల్సిందే” నంటాడు ఐన్ స్టీన్. యుద్ధబీభత్సాన్ని చూపే ఇటువంటి నలుపు-తెలుపు దృశ్యకావ్యాలు ఈ కాలానికి ఒక హెచ్చరికలా పనిచేస్తాయి. 

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

4 comments

  • ఆర్టిస్ట్ మోహన్ కి చాలా ఇష్టమైన సినిమా ఇది. ఈ సినిమా చూసి ఆయన కొంగలతో తన చిత్ర లేఖనాన్ని మొదలు పెట్టారు. మోహన్ కి నివాళిగా నేను కూడా ఈచిత్ర సమీక్ష మాతృకలో రాశాను గానీ మీ సమీక్ష వల్ల ఇంకా చాలా విశేషాలు తెలిసి చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాను. ధన్యవాదాలు బాలాజీ గారూ!

  • ఒక గొప్ప సినిమా ని అంతే గొప్పగా పరిచయం చేశారు. మీ పరిచయం నన్ను ఉత్కంఠ కి గురి చేసింది. చిన్న బోరిస్ ని రక్షించే సంఘటన రాతలో చదివితేనే గొంతు తడారిపోయింది. ఇక సినిమా లో ఎలావుందో? అభినందనలు బాలాజీ గారు 👏

    • ధన్యాదాలండీ. తప్పక చూడాల్సిన సినిమా. కొన్ని classics ఎప్పటికీ వన్నె తరగని వి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.