పొద్దున్నే ఆఫీసుకెళ్ళటానికి పదినిమిషాలు టైముందని పేపరు తిరగేస్తూ ఉంటే నా సహోద్యోగి ఫోను చేసి, “ఒ
క్కసారి లోకల్ న్యూస్ చూడు. పది నిమిషాలే.” అన్నాడు.
టివీ పెట్టి చూస్తే, పక్కవీధిలో ఒక ఇంటిలో ఏదో వింత జరుగుతోంది అని చెబుతున్నారు. ఆ పదినిమిషాల్లో టివీలో ఒక ఇంటిని చూపెడుతూ పదే పదే చెప్పిన సారాంశం ఇదీ.
ఆ ఇంట్లో పెరటి గుమ్మం వైపు తెరచి ఉన్న కిటికీ లోంచీ పదే పదే కాకులు లోపలికి వెళ్ళి వస్తున్నాయట. పక్కింటివాళ్ళు రెండు రోజులు గమనించి, మరొకరికీ వాళ్ళు ఇంకొకరికీ చూపెడితే చివరగా ఈ చానెల్ కెమెరా మెన్ కూడా దాన్ని వీడియో తీశాడు.
ఆ ఇల్లు గత రెండు నెలలుగా ఖాళీగా ఉంటూ, ఈ మధ్యే ఒకాయన అందులో దిగి, అడ్వాన్సు ఇచ్చి, తన తాళం వేసుకొని వెళ్ళేడుట. సామానులు తేవటానికి ఒక వారం పడుతుందట. యజమాని కూడా వేరే ఊళ్ళోనే ఉంటాడుట.
ఇంట్లోకి కాకులు వెళ్లటం అందరికీ వింతగా అనిపించింది.
చానెల్ వాళ్ళు ఊరుకోకుండా పండితులను అడిగారు. ఆయా సిద్ధాంతులు చెప్పే సమాధానాలు కూడా మళ్ళీ మళ్ళీ తమ చానెల్లో చూపెడుతూ టౌనంతటినీ చైతన్యపరచే కార్యక్రమం పెట్టుకున్నారు.
ఒకాయన అన్నాడు. “కాకి శనీశ్వరుడి వాహనం. అది ఒక ఇంట్లో స్తావరం ఏర్పరచుకున్నదీ అంటే ఆ ఇంటికి ఏలినాటి శని పట్టే సూచనలు ఉన్నాయి. రెండు నెలలుగా ఖాళీ ఉన్న ఇంట్లోకి వెళ్ళని కాకులు ఒకాయన దిగేకా వస్తున్నాయంటే ఆ దిగిన వారి జాతకంలో లోపం ఉండొచ్చు. ఆయన జాతకంలో ఉన్న శని, ఈ కాకులద్వారా ఈ ఇంటికి పడితే, ఆయన ఖాళీ చేశాక కూడా ఏడేళ్ళవరకూ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళనీ శని పట్టూకొనే అవకాశం ఉంది. అందుకని ఇంటి యజమాని అద్దె ఒప్పందం రద్దుచేసుకొని వెంటనే శాంతి చేయించుకోవటం శ్రేయస్కరం.”
తరువాతరోజు వాస్తు పండితులు రంగప్రవేశం చేశారు. “ఆ కిటికీ దక్షిణ దిక్కున ఉంది. దక్షిణ దిక్పాలకుడు యముడు కనుక ఈ కాకులు మోసుకు వచ్చే ఏలినాటి శనితో పాటు యమగండం, ఆయుక్షీణం కూడా ఉండొచ్చు.”
మూడో ఆయన ఇంకో భాష్యం చెప్పాడు. “కాకి పితృ దేవతల ప్రతిరూపం. అందుకే మనం పితృ దేవతలకు పెట్టాల్సిన ఆహారాన్ని వాయస పిండాలు రూపంలో పెడతాం. ఈ ఇంట్లో అద్దెకు దిగిన వ్యక్తి బహుశః పితృదేవతల ఋణం తీర్చుకోకపోవటం వల్లే అసతృప్తి చెందిన పితృదేవతలు కాకులను ఆవహించి వస్తున్నాయి. తప్పు ఎవరివల్ల జరిగినా, ఈ ఇంటి అసలు యజమానికే అరిష్టం కనుక వెంటనే ఈ ఇంట్లో పెద్దలకు శ్రార్ధకర్మలు నిర్వహించి వాయస పిండాలు పెట్టాలి. లేకపోతే వంశనష్టం.”
ఈలోపల టివీ చానెళ్ళవాళ్ళు హేతువాదులనీ, నాస్తికులనీ కూడా రంగప్రవేశం చేయించేశారు. “కాకులు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి శాస్త్రీయ కారణాలు ఉంటాయి తప్ప ఇవేవీ కాదు. ఇంటికి కొత్తగా అడ్వాన్సు ఇచ్చిన ఆయన వస్తే గానీ అసలు కారణం తెలీదు.” అన్నారు.
కాకుల ప్రవేశానికి కారణాలు ఏమైనా, టౌనులో ఉన్న జనాలు తండోపతండాలుగా ఆ ఇంటికి రావటం, కిటికీలోంచి కాకులు దూరి మళ్ళీ వస్తూ ఉంటటం చూసి, ఇంటీకి వచ్చి తలస్నానం చేయటమే కాకుండా కొంతమంది గుళ్ళకి వెళ్ళి నవగ్రహ పూజలు కూడా చేయించుకున్నారు.
మూడో రోజుకల్లా, కాకులవల్ల వచ్చే అరిష్టం ఇరుగు పొరుగు ఇళ్ళకు కూడా పాకవచ్చు అనే పుకారు బయలుదేరటంతో, వాళ్ళు గాబరాగా ఇంటి యజమాని కోసం ప్రయత్నించారు. అతడు వేరే ఊళ్ళో ఉండటం వల్ల అతడి బంధువులను కలిసి, ఫోను నెంబరు తీసుకొని రప్పించారు.
ఈ చానెల్ టౌనులో మాత్రమే వచ్చే లోకల్ నెట్వర్క్ కనుక ఇతర ఊళ్ళలోకి వార్త పెద్దగా పాకలేదు.
ఇంటి యజమానితో నాకు కాస్త ముఖపరిచయం మాత్రం ఉంది. మూడేళ్ళక్రితం వాళ్ళబ్బాయి హైదరాబాదులో బీటెక్ జాయినప్పుడు అదే కాలేజీలో నా మితృడు లెక్చరర్ కావటంతో, అప్పుడు ఒకసారి నన్ను కలిశాడు, కానీ ఫోను నెంబర్లు ఇచ్చి పుచ్చుకొనే పరిచయం కూడా లేదు. ఆయన వచ్చినరోజున నేను కూడా ఆ ఇంటికి వెళ్ళాను. అతడు తన ఇంటికి వచ్చీ రాగానే ఇరుగుపొరుగువారంతా అతణ్ణే దోషిలా చూస్తూ, “ఏమండీ, ఇంట్లో అద్దెకి దిగేవారి గురించి కొంచెం చూసుకోవద్దూ. అతడి శని మాకు చుట్టుకుంటే ఎవరు బాధ్యులు? వెంటనే అతణ్ణి ఖాళీ చేయించి ఇంటికి శాంతి జరిపించండి.” అని నిలదీశారు.
“ఏమండీ, నన్ను ఆయన ఫోనులో సంప్రదించాడు. అతడు చేసే ఉద్యోగం విని, నా బేంకు ఎకౌంటులో అడ్వాన్సు తీసుకొని అతడికి తాళం ఇప్పించాను. ఐనా ఇంట్లోకి అద్దెకు వచ్చేవాళ్ళ జాతకాలూ, వాళ్ళు పెట్టే తద్దినాలూ అడిగి ఇస్తారా? మీ ఇళ్ళల్లో అద్దెకు ఉన్నవాళ్ళని మీరు ఈ వివరాలు అడిగేరా?” అంటూ ఇరుగుపొరుగువారి నోళ్ళు మూయించాడు. కానీ, ఈ కాకులు దూరటం దానికి పండితులు చెబుతున్న భాష్యాలూ తనకీ కొంచెం భయంగానే ఉన్నాయి.
ఇరుగుపొరుగు వారి సలహా ప్రకారం తాళం పగలుకొడితే అది చాలా తప్పు. పైగా, అద్దెకు దిగిన ఆయన వచ్చినప్పుడు తెచ్చుకున్న బేగూ, సూట్కేసూ లోపలే ఉన్నాయిట.
ఆయన కొంచెం పక్కకి వచ్చాకా నేను “మాస్టారూ, ఏది ఏమైనా, అద్దెకు దిగిన అతడూ, మీరూ కూడా గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తున్నారు. మీ ఇరుగుపొరుగు వారి భయాలూ, ఈ పండిత భాష్యాలూ ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి. మానవ సంబంధాలు ముఖ్యం కనుక అతడు లారీసామానుతో వచ్చినప్పుడు ముందు ఇంట్లోకి దిగనివ్వండి. అతడు తాళం తీశాకా ఈ కాకులు దూరడానికి అసలు కారణం తెలియవచ్చు. అప్పుడు అవసరమైతే తాపీగా మాట్లాడవచ్చు. ఈలోపల మీరు అతడితో పరుషంగా మాట్లాడకండి.” అని సలహా ఇచ్చాను.
వెంటనే అద్దెకు దిగినాయనకి ఫోను చేశాడు. ఔటాఫ్ కవరేజ్ ఏరియా. అప్పుడు ఫోను మరోసారి చూసుకున్నాడు. రెండు రోజులక్రితం ఆయన దగ్గరనుంచి వచ్చిన మెసేజి ఉంది. రేపుదయానికల్లా ఆయన లారీడుసామానులతో, వెనుకే టేక్సీలో కుటుంబంతో రాబోతున్నట్టు ఉంది.
బంధువులింటికి వెళ్ళబోతే, వాళ్ళు కూడా ఈయన్ని ఇంట్లో ఉంచుకుందికి భయపడుతున్నట్టు తెలిసి, లాడ్జిలో దిగాడు. మా ఇంటికి రమ్మనేంత వ్యక్తిగత సాన్నిహిత్యం లేదు.
మర్నాడు ఉదయం పదిగంటలకు అద్దెకున్నాయన తన లారీ సామానులతో, ఆ వెనుక కారులో కుటుంబంతో ఈ వీధిలోకి దిగేసరికి తాను దిగబోయే ఇంటి ముందు కనీసం వందమంది గుమిగూడి ఉన్నారు. ఇంటి యజమాని నన్ను కూడా ఉండమని అడిగాడు. వెళ్ళాను.
టేక్సీ దిగినాయన ఈ గుంపుని చూసి ఆశ్చర్యపోయి, అందరినీ తప్పించుకుని ఇంటి తాళం తియ్యబోతూ ఉంటే, అప్పుడు, ఇంటి యజమాని వచ్చి, తనని తాను పరిచయం చేసుకొని, ఏమి చెప్పాలో ఆలోచిస్తూ ఉండగానే, ఇరుగుపొరుగువారు గట్టిగా. “ఏమండీ పెద్దమనిషి, మీ పక్కన మేముండాలా వద్దా?” అని అడిగారు.
ఆయన కంగారు పడిపోయాడు. “అయ్యో నేనేమైనా టీవీ ఆన్ చేసి మరిచిపోయి వెళ్ళిపోయేనా? మా ఇంట్లో గేసు లీకవుతోందా? అసలు లోపల ఈ సామానులే లేవు కదా?” అనాడు.
అప్పటికే గుమిగూడిన అందరూ ఇతణ్ణి దోషిగా తీర్మానించేశారు. అదే గుంపులో టీవీ చానెల్ వాళ్ళు, హేతువాదులు కూడా ఉండటం వల్ల గుంపు సంయమనం పాటిస్తూ ఉంది.
“మీ జాతకంలో ఏలినాటి శని ఉంటే అది మీదగ్గరే ఉంచుకొండి. మా పక్కింట్లో దిగి మాకు అంటించకండి.” అన్నాడు ఒక పొరుగాయన.
“నా జాతకం నేనెప్పుడు చూపించుకోలేదు. నా పుట్టిన తేదీ వివరాలు మీరెప్పుడు తెల్సుకున్నారు? ఎవరికి చూపించారు?”
నేను వారించటం వల్ల ఇంటి యజమాని మాట్లాడకుండా ఆగిపోయాడు.
“మీరు అడ్వాన్సు ఇచ్చాకా ఈ ఇంటికి పట్టిన అరిష్టం కన్నా ఇంకేం ఋజువు కావాలి?” పొరుగాయనే అడిగాడు.
రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాడెమో ఆయనకేమీ అర్ధం కావట్లేదు. అప్పుడు టీవీ చానెల్ వాళ్ళని చూసి, “మీరెందుకు వచ్చారు? అరిష్టం ఏమిటీ?” అని అడిగాడు.
టీవీ చానెల్ రిపోర్టర్ విషయం చెప్పాడు.
అంతా విని, నవ్వేసి, “ఓ అదా? నేను బేగూ సూట్కేసూ తో వచ్చి ఈ ఇల్లు తీసుకొని సామాను లేకుండా ఇక్కడ వారం రోజులున్నాను కదా. ఊరెళ్ళే గంట ముందు పెరట్లో చెట్టు మీదనుంచీ ఒక కాకిగూడు పడింది. చూస్తే అందులో రెక్కలు వచ్చీ రాని కాకిపిల్లలు మూడు ఉన్నాయి. పక్షి పిల్లలు గూటితో పాటు పడటం వల్ల నేరుగా కింద పడకపోవటం వల్ల చనిపోలేదు కానీ, దెబ్బలు తగిలిన నొప్పితో అరుస్తున్నాయి. చిన్నిచిన్ని రెక్కలు టపటపా కొట్టుకుంటూ నొప్పిచేసిన కాళ్ళతో నిలబడలేకపోతున్నాయి. ఆ టైములో బహుశః పెద్ద పక్షులు మేత తేవటానికి వెళ్ళి ఉంటాయి. అలా వదిలేస్తే కుక్కలో, పిల్లులో ఈ పిల్లలిని తినేస్తాయి. ఎలాగో వంటిల్లు ఖాళియే కదా అని, ఆ గూడుని పిల్లలతో సహా తెచ్చి వంటింట్లో నేలమీద పెట్టేను. పక్కనే ఒక టబ్బుతో నీళ్ళు, ప్లేటులో ఒక కేజీ బియ్యం కూడా పెట్టి, తల్లిపక్షి వెతుక్కోగలిగితే రావటానికి వీలుగా కిటికీ తలుపు తీసి పెట్టి, నేను ఊరు వెళ్ళిపోయాను. ఆ కాకులు వాటి పిల్లలిని చూసుకుందికి వచ్చి వెళ్ళి ఉంటాయి.”
హేతువాదులు వెంటనే, “మేము చెప్పలేదూ?” అంటూ స్వరం పెంచారు.
ఇరుగుపొరుగువారికి ఇది నమ్మశక్యంగా లేదు. “అలా ఐతే ఒకటో రెండో కాకులు వెళ్ళాలి కానీ, పది పదిహేను కాకులకు ఇంట్లో ఏంపని?” అని.
“నేను చెప్పేను కదండీ, కేజీ బియ్యం కూడా అక్కడ పెట్టాను అని. ఎక్కడ మేత దొరికినా తోటి కాకులని పిలవటం ఆజాతి లక్షణం. కావాలంటే చూడండి.” అని తలుపు తెరచాడు.
వీళ్ళు వంటింటి తలుపు తెరచేసరికి పెద్ద కాకులు కావ్ కావ్ అని అరుస్తూ ఎగిరిపోయాయి. మూడు పిల్లకాకులు తడబడుతూ ఎగిరి, కిటికీ మీద ఒక్క సెకేను ఆనుకొని మళ్ళీ ఎగిరి అవి కూడా సన్ షేడు మీదికి చేరిపోయాయి. ఈ వారం రోజులూ అవి దెబ్బలనుంచి కోలుకొని కొద్దికొద్దిగా ఎగరటం నేర్చుకొని ఉండాలి. మనుషులిని చూసేసరికి గాబరాగా వెళ్ళిపోయాయి.
వంటింట్లో నేలమీద కర్రపుల్లల గూడూ, పక్కనే కొంచెం తడి మిగిలి ఉన్న టబ్బూ, జల్లుకుపోయి ఉన్న బియ్యం గింజలూ, ఎండిన రెట్టలూ.
నేను చొరవగా, అద్దెకొచ్చినాయనతో, మాస్టారూ, “మీరు ఇంట్లో సామాను సర్ధుకొని సేద దీరండి.” అని చెప్పి యజమానిని చెయ్యిపట్టుకొని బయటకు లాక్కొచ్చాను. రోడ్డు మీదకొచ్చేసరికి గుంపు కూడా నవ్వుకుంటూ చెదిరిపోవటం మొదలుబెట్టింది.
యజమాని మాత్రం నాతో, “మాష్టారూ, తొందరపడి ఆ పెద్దమనిషిని మాట తూలకుండా ఆపేపి, గొప్ప మేలు చేశారు.” అని మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశాడు.
***
‘వాయస గండం’ కథ ‘సాలూరు సాహితీమిత్రబృందం” నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి (రు.3000) సంపాదించింది. రచయిత రవి కుమార్ కు ‘రస్తా’ అభినందనలు.
Add comment