సర్పశిఖి

అతడు రాజప్రాసాదం నుంచీ బయటకే చూస్తున్నాడు. అన్నీ సగం కట్టి వదిలిన ఇళ్లు సగం తవ్వి వదలిన నేలలు. తలలు లేని వాళ్ళంతా వుత్త మొండేలతో కొడుతున్న జేజేలు. ఒళ్లు ఆనందంతో  గగుర్పొడుస్తోంది. గర్వంతో మీసం దువ్వి తలపై జుట్టు పైకెగదోయ బోయాడు. వెంటనే తనకు వరమిచ్చిన హువాయ గురుతొచ్చాడు. ‘నువు ఎవరి తలమీద చెయి పెడితే వాడు భస్మమే’. అప్లీస్తియా గర్వంతో మీసం వెలివేశాడు. పెద్దగా నవ్వాడు. వికటాట్టహాసానికి ఆకాశమంతా ప్రతిధ్వనించింది. కొన్ని నక్షత్రాలు అక్కడక్కడా వులికిపడి రాలిపడ్డాయి

లునాబూ తన పీఠాన్ని కదిలించేందుకు చేసే ప్రయత్నాలన్నీ తలుచుకుని నవ్వుకున్నాడు. అతన్ని తన సేనలు తరిమి కొట్టిన రోజు గుర్తు చేసుకున్నాడు. అతని ప్రయత్నాలు నిర్వీర్యం చేయాలంటే పాతాళ లోకంలోని సర్పశిఖి ని వివాహమాడాలని అజియోస్ చెప్పినప్పటినించీ అదే వూహల్లో తేలుతున్నాడు. తన అశ్వాన్ని సిద్ధం చేయమని సైనికులకు చెప్పి కవచం ధరించి సిద్ధమయ్యాడు.

కొన్ని క్షణాలలోనే డేగ రెక్కల వుల్పిస్ సకిలించింది. ఒక్క వుదుటులో దాన్ని అధిరోహించాడు. సర్ప శిఖి ద్వీపానికి పొమ్మని ఆజ్ఞాపించాడు. ఆతని తలపులు తన తాత ముత్తాతల విజయాల వైపు మళ్ళాయి. తన తండ్రి ఎందరో శత్రువుల వెన్నులు విరిచాడు. తన మామ తన తంత్రాలతో తన విజయ మార్గాన్ని రచించాడు. ప్రయాణం విజయవంతమైతే తన అధికారం మరింత బలపడుతుంది.

కఠోరమైన విషపు వాసనలు ముక్కుకు తగులుతున్నై. ఆమె విష జ్వాలలకి ఎన్నో సరోవరాలు గండశిలలల కొండల్లా మారిపోయాయి. అలాగైనా పాము తలల రాణిని సర్ప శిఖిని పెళ్ళాడాలి. కానీ ఎలా. ఆమెను ముఖాముఖి చూసిన వాడు బతికి బట్టకట్ట లేడు. ఆమెను ఎలా జయించాలి. ఆమెను డాలులో చూసి పర్సియస్ సంహరించాక మళ్ళీ ఎలాగో బతికి మరింత బలంగా సమ్మోహనంగా తయారయిందట. ఆమెను జయించాలంటే ఆమె తలపైనున్న సర్ప రోమాలను ఒకేసారి దునుమాడాలి. హువాయ నుంచీ పొందిన పదునైన తొమ్మిదంచుల ఖడ్గంతో జయించాలి. ఆమె మూడు రోజులు నిద్రిస్తే మూడు రోజులు మేల్కొంటుంది. సర్ప కేశాలను వధించడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది. ఈలోగా కన్ను తెరిచి చూసిందంటే శిలలా మారిపోవడమే. విజయమో వీర స్వర్గమో. ఓసారి ఆమె శక్తిని కోల్పోతే మరలా పదిహేను వందల రోజులు పొందలేదు. ఇలాటి తలపులతో భూమిని పరికిస్తూ కిందకు చూశాడు.

సర్పశిఖి ఆదమరచి చెట్ల మధ్య నిద్రపోతోంది. ఆమె తలమీది సర్పాలు ఒకదాన్నొకటి చుట్టుకుని బుసలు కొడుతూ ఆడుతున్నై. భయంకరంగా విషం చిమ్ముతున్నై. అప్లీస్తియా తన తొమ్మిదంచుల ఖడ్గాన్ని ఒడిసిపట్టుకుని ఒక్కవేటుతో సర్పాలను నరికివేశాడు. చీకటి పడుతుండగా ఆమె తలను గొరిగివేశాడు.

శక్తిహీనురాలైన ఆమెను తన గుర్రంపై ఎక్కించుకుని తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆమె కనులు తెరిచి చూసి ఆశ్చర్యపోయింది. అతని వీరత్వానికి లొంగి పోయింది. ఆమె పెదవులను ముద్దాడిన గర్వంతో ఆనందంలో తన శరీరం లేత నీలంలోకి మారుతుండడం గమనించలేదు. ఆమె  నవ్వుతూ వెడల్పాటి చెవు వెనక అలాగే వున్న ఒక చిన్న సర్పాన్ని ప్రేమగా తడుముకుంది. తన శిరసు మీది సర్పం త్వరలోనే శక్తినందిస్తుందని ఆమెకు తెలుసు. వెన్నెల కురుస్తున్న ఆకాశంలో నల్ల మబ్బొకటి కమ్ము కొస్తోంది.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

1 comment

  • చిన్నికధ బాగుంది, సర్!ధన్యవాదాలు. మంచి కథ రాసినందుకుమీకు. సర్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.