చేతి గడియారం కావాలని పదవ తరగతిలో చేరినప్పటి నుండి ఎన్నో సార్లు అడిగినట్టు ఏడ్చినట్టు గుర్తు! వాయిదాలు ఓదార్పులతో తీరని ఎన్నో కోరికల జాబితాలో అదీ చేరిపోయింది! వారం రోజులయితే పబ్లిక్ పరీక్షలనంగ చేతిలో గల్లగురిగితో మహాలక్ష్మిలా ప్రత్యక్షమైంది నా బంగారు తల్లి నాకన్నా మూడేళ్లు చిన్నదే అయినా పెద్ద మనసు! కొన్నేళ్లుగా కూడబెట్టిన తన ప్రేమను ఇల్లంతా పరిచింది బొంగరాల్లెక్క పైసలు... గిర్రున జ్ఞాపకాలు! యుద్ధ వీరుడికి కంకణంలా నా చేతికి గడియారం ఆ క్షణం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన అన్నను నేనే! అప్పుడు మొదలు కర్ణునికి కవచ కుండలాల్లా చేతి గడియారం నా శరీరంలో ఒక భాగమైంది! అమ్మలా వేళకు అన్నానికి పిలుస్తుంది అలసిపోతే కాసేపు సేద తీరమంటుంది బద్ధకిస్తే గట్టిగా మందలిస్తుంది నిరాశానిస్పృహలు వదిలి నిరంతరం పోరాడమని ముల్లులు ఎల్లవేళలా నన్ను పొడుస్తూనే ఉంటాయి! గుండె మీద చెయ్యేసి ఒరిగినప్పుడల్లా అన్నా అన్న పిలుపే ఇరవై ఏళ్లు ఇక్కడ ఆడిపాడిన మా యువరాణి అక్కడ ఎట్లుందో ఏమోననే తలపులతో తలదిండు తడిసి ముద్దయితది ఎడతెగని బంధాలు అనుబంధాల నడుమ గుండెకు ఎన్ని వేదనలో ఆఖరి గంట మోగే దాకా ఈ అనురాగపు గడియారం ఇలా తిరుగుతూనే!

Add comment