తనిఖీ 

కళాశాలలో తనిఖీకి ఇంకా రెండు రోజులే ఉంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా బి.కాం బ్లాకు లో రంగులు పూర్తి కాలేదు. అటెండర్ సరిగా రావడం లేదు. మొత్తం 10 మంది ఉన్నాం. 20  పోస్టులు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఎక్కడి చెత్త అక్కడే అలాగే ఉంది. మునిసిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే అది పనిచేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి గ్రేడు ఎలా వస్తుంది? చాలా అయోమయంగా ఉంది. ఉన్న స్టాఫ్ నుంచి కోపరేషన్ లేదు. చంద్రశేఖర్ కు ఏదైనా పని చెప్తే  డబ్బులు తీసుకుని పోతాడు. రికార్డులు బైండింగ్ చేయించమని చెప్పి పది రోజులైంది. ఇదిగో అదిగో అంటూ మాయమాటలు చెప్తాడు. 

ప్రిన్సిపాల్ రూమ్ లో బండలు పగిలి చాలా అధ్వాన్నంగా ఉంది. కిటికీ తలుపులు లేవు. బాత్రూం లో కూర్చున్న వాడే తలుపుకి తాడు కట్టి పట్టుకు  కూర్చోవాలి. 40 ఏళ్ల కాలేజీ అయినా డబ్బులు లేవు. గ్రాంటు  లేదు. వస్తుందో రాదో తెలియదు. ఇచ్చిన పదిలక్షలూ రంగులకే అయిపోయాయి.  ఇప్పుడు మేము తనిఖీకి సిద్ధంగా లేము అంటే పై అధికారులు ఎవరూ వినడం లేదు అని తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉపన్యాసం ముగించాడు ప్రిన్సిపాల్ దంబోల్ రావు .  వచ్చిన డబ్బు మొత్తం స్వాహా చేశాడని తెలిసిన సూర్యా రావు ఉరిమి చూసే సరికి తల పక్కకు తిప్పుకున్నాడు.

 ‘సార్ మీరు ఉండండి. మీరు బీపీ టాబ్లెట్ వేసుకోండి. మిగిలిన సంగతి మనం చూసుకుందాం అంటూ ఊరడించాడు ఉడతల సత్యం.  మొదటి నుంచి కళాశాల ప్రిన్సిపాల్ కి ఉడతల సత్యం కుడి భుజం, ఎడమభుజం, వెన్నెముక , నిక్కరు, చెడ్డీ అన్నీ. మొదట్నించీ  కళాశాలలో క్వాలిటీ లేదు అనే సూర్యం నిశ్శబ్దంగా చూస్తూ వింటూ ఉన్నాడు. 

అందరం కలిసి కాలేజ్ చుట్టూ రౌండ్ వేద్దాం అని బయలుదేరారు. మొత్తం 20  గుంటల స్థలం.  రెండు అంతస్తులు.  నాలుగు  క్లాసులు కింద, నాలుగు పైన. మెయిన్ గేటు లోపలికి రాగానే పెద్ద గుంటలు ఉన్నాయి. వీటిని ఎలా గైనా  పూడ్పించాలి అని సత్యం వైపు చూశాడు. అవును సార్ వీటికి లక్ష రూపాయల ఖర్చు రాశామ్.’ అని అతి వినయం గా చెప్పాడు ఉడతల సత్యం.  ప్రిన్సిపాల్ కి వెరైటీ పేరుతో కళాశాలలో చెట్లన్నిటికీ తెల్ల సున్నం కొట్టించి ప్రశంసలు అందుకున్నాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏం చేయాలో అన్నీ  ప్రిన్సిపాల్ దంబోల్ పురమాయించాడు. అటెండర్ ని పిలిచి తనిఖీ రోజు తాగి రావద్దని మరీ మరీ చెప్పాడు. ఇంతలో ఆ రోజు రానే వచ్చింది. చండీగఢ్ నుంచి ఒక లేడీ ప్రొఫెసర్, చెన్నై నుంచి ఒకళ్ళు, నాగాలాండ్ నుంచి ఒకరు రావడంతో ముగ్గురు స్టాప్ మెంబర్లు ఎయిర్పోర్టుకు వెళ్లి సాదరంగా తీసుకొని వచ్చారు.

పిల్లలలో  కొందరు రోజూ వచ్చే వాళ్ళు,  రోజూ రాని పిల్లలకు తర్ఫీదు ఇచ్చి ఆహ్వానం పలుకమని చెప్పారు. ఇంగ్లీషులో మాత్రం మాట్లాడవద్దని చెప్పారు. ఉడతల సత్యం కోయ డాన్స్ అయితే బాగుంటుందని వారికి ట్రైనింగ్ ఇప్పించాడు. మెయిన్ గేటు దాటి కారు లోపలికి రాగానే ఒక పెద్ద దిగుడు గుంట లో ఇరుక్కు పోయింది. సత్యం మెయిన్ గేటు నుంచి కాకుండా పక్క నుంచీ రమ్మంటే కారు డ్రైవర్ మెయిన్ గేట్ నుంచి వచ్చాడు. విద్యార్థులంతా కోయ డాన్స్ ‘కుర్రో తుర్రో’ మంటూ మొదలుపెట్టారు. కారులో వారి కోపం, విద్యార్ధుల ఆనందం తారా స్థాయికి చేరింది. సత్యం ఆహ్వానించడం లో ప్రత్యేకత కోసం ఊర్లో ఉన్న డప్పు వాద్య బృందం వాళ్లను పిలిపించాడు. వాళ్ళు కూడా అదే సమయానికి వచ్చి కారు చుట్టూ చేరి ఢమ ఢమ లాడించడం మొదలెట్టారు. 

ఈ లోపు ఆఫీసర్లను కష్టపడి బయటికి తీసుకు రాగానే వాళ్ళు ముగ్గురు ఇంగ్లీష్ లో  దంబోల్ ను ఉతికి ఆరేశారు . దంబోల్ కు ఇంగ్లీష్ పెద్దగా రాదు. వారేమన్నా హి హీ మని నవ్వడంతో వాళ్ళు విస్తుపోయారు. ‘స్పెషల్ అరేంజ్మెంట్ అంటూ చెప్పాడు. అసలే కొంచెం  ధైర్యం కోసం మందు వేసుకొని వచ్చాడేమో అసహజమైన ఉషారులో ఉన్నాడు.  తాను వేసుకున్న కోటు గంభీరంగా పట్టుకుని చాలా స్టైల్ గా నడుస్తూ వాళ్ళని తీసుకెళ్లాడు. ‘’ప్రిన్సిపాల్ రూమ్ లోపల ప్రజెంటేషన్ అని చెప్పాడు.  వాళ్ళు లోపలికి వచ్చి చుట్టూ చూసి స్క్రీన్ ఎక్కడ అన్నారు. యల్ సీ డీ ఇంచార్జ్ వచ్చి ‘ ‘నేనండీ చాలా పొదుపు చేయడానికి ఇష్టపడతానండీ. మాటైనా అంతేనండీ చేతైనా అంతేనండీ. ఒక్కసారి మీ పైకి చూడండి. చూశారాండీ. అలా యల్ సీ డీ అక్కడ పెట్టానండీ. దాని వైరేమో ఇక్కడ చూడండి. ఇక్కడ ప్లగ్ లో పెట్టానండీ. ఇప్పుడు ఈ స్విచ్ వేయగానే అక్కడ గోడ మీద బొమ్మ పడుతుందండీ’ అని తన మేధావి తనాన్ని ప్రదర్శించి దూడ పెయ్య నవ్వు నవ్వాడు. ‘వై ఈజ్ దిస్ ఎక్స్ప్లనేషన్? ఆన్  చేయమన్నారు. చేయగానే బొమ్మ వంకర టింకరగా తలకిందులుగా పడింది. అందరూ ముఖాలు చూసుకున్నారు. ఈ లోపు వాళ్ళకి డ్రై ఫ్రూట్స్, కాజు పకోడి, డ్రింకులు తెచ్చారు. ఓకే  ప్రెజెంట్ ఓరల్లీ’. అన్నారు ముగ్గురు కలిసి. దంబోల్ కి ఒక్కసారి గుండె నూట డెబ్భై కొట్టుకుంది. సత్యం వైపు చూశాడు. సత్యం పాంటు పైకి లాక్కుంటూ  పరిగెత్తుకుంటూ వెళ్లి బయట అటెండర్ ను కేక వేశాడు. సత్తిగాడు పరిగెత్తుకు వెనకవైపు కిటికీలోంచి ఒక సంచి ఏదో పడేసాడు. 5 నిమిషాల్లో భయంకరమైన ఎలక చచ్చిన వాసన వ్యాపించింది.  ముగ్గురు ఆఫీసర్లు ముక్కుమూసుకుని బయటకు పరిగెత్తారు.  ప్రజెంటేషన్ అంటూ దంబోల్ వెంటపడ్డాడు.

ఓపెన్ గ్రౌండ్ లోకి వెళ్లి ప్రింట్ అవుట్  ఇవ్వండి అన్నారు. ఈ లోపల నాగాలాండ్ ప్రొఫెసర్ ‘వాష్ రూమ్ ఎక్కడ అని అడిగాడు. అనుకోని ఈ పరిణామంతో అటూ ఇటూ  చూశాడు దంబోల్. సమయానికి ఎవరూ కనిపించలేదు. ఇక తప్పదన్నట్లు వాళ్ళని వాష్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తలుపులు బార్లా తెరిచి ఉండేది. ఇప్పుడేమో తలుపు దగ్గరగా వేసి ఉంది. హమ్మయ్య  అనుకున్నాడు. తలుపు లాగాడు కానీ అది రాలేదు. గట్టిగా లాగాడు లోపలి నుంచి గట్టిగా లాగి పెట్టినట్లు అనిపించింది. అవతల ఆఫీసర్ అర్జెంట్ అర్జెంట్ అన్నట్టు చూస్తున్నాడు. ఒక వెకిలి నవ్వు నవ్వి ముందుకు తీసుకెళ్లి షెడ్ వెనకాల వైపు చూపించాడు. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అంటూ తన పని ముగించి వచ్చాడు ఆఫీసర్. ఇంతలో సత్యం బయటికి వచ్చాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. భలే చేశావ్ అనుకున్నాడు.  మిగిలిన ఇద్దరు ప్రొఫెసర్లు ‘కాలేజ్ రౌండప్’ అన్నారు. 

ఏ క్లాస్ లోనూ పదిమంది పిల్లలు లేరు.  పైన సీలింగ్ విరిగి పెచ్చులు పడేట్లు ఉంది. సత్యం పెచ్చుల వరకే రంగులు వేయించాడు.  బెంచీలు, బ్లాక్ బోర్డ్ పగిలి ఉన్నాయి.  యల్ సీ డీలు ఉన్నాయి కానీ కరెంట్ కనెక్షన్ లేదు. మధ్యాహ్నం అయిపోయింది. బయట బండి మీద బజ్జీలు, పునుగులు, పప్పుండలు అమ్ముతున్నారు. ‘వాట్ ఇస్ దట్’ అన్నారు వాళ్ళు.  ‘స్టార్ట్ అప్ సర్. ఎర్న్ వైల్ లెర్న్ ప్రోగ్రామ్’ అన్నారు. ‘ఓ. గుడ్ ప్రాక్టీస్.’ అన్నారు. వాళ్ళు బయటి వాళ్ళని, వాళ్ళ దగ్గర దంబోల్ డబ్బులు నోక్కాడని వాళ్ళకు తెలియదు.  

ఎంత పిలిచినా  వాళ్ళు మాత్రం ప్రిన్సిపాల్ రూమ్ లోకి మళ్ళీ  రాలేదు. సత్యం పర్యవేక్షణలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అందరికీ సార్ , మేడం ఇవి తినండి  ఆంధ్రా స్పెషల్ తినండి అంటూ దగ్గరుండి వడ్డించారు. నాగాలాండ్  ప్రొఫెసర్ మాత్రం ఏది చూసినా ఇస్ దిస్ స్నేక్? ఇస్ దిస్ ఫ్రాగ్’ అని అడుగుతున్నాడు. మళ్ళీ వాష్ రూమ్ తలుపు రాకపోవడంతో అర్జెంటుగా హోటల్ కి వెళ్దాం’ అంటూ  మీటింగ్ పెట్టేశారు. ఆంధ్ర ఆవకాయ, బొబ్బట్లు, పట్టుచీరలు, స్వీట్లు, శాలువాలతో వాళ్లని బాగా సత్కరించారు. వాళ్ళు పది నిముషాల్లో మీటింగ్ ముగించి చావు కబురు  చల్లగా చెప్పారు. మా చేతుల్లో ఏమీ లేదు ఆన్లైన్లో మీ గ్రేడ్ ఎపుడో డిసైడ్ అయిపోయింది. మీరు ఇంకా కళాశాల అభివృద్ధి చేయాలి అని . 

కారు గేటు దాటంగానే  ఘనంగా దంబోల్ , సత్యం పెద్దగా నవ్వుకుని ‘నాకవుట్’ పార్టీ మొదలుపెట్టారు. సత్యం నీ బుర్ర అమోఘం. నీలాటి వాడు కాలేజ్ కి ఒకడుండాలి. ఆ సూర్యం చూడు ఎప్పుడూ ఇంకా క్వాలిటీ లేదు. మనం చేసేది కరక్ట్ కాదు. అని సణుగుతాడు. అవునూ ఈ ఖర్చు కూడా వాళ్ళ దాంట్లో కలిపావుగదా’ అని చీర్స్ చెప్పేందుకు గ్లాస్ పైకి లేపాడు.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.