మేక కాదు మనిషి
మనిషి కాదు మేక

పెరుమాళ్ మురుగన్ ఆత్తూర్ తమిళంలో రచించిన “పూనాచ్చి ” తమిళ నవలకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం ‘పూనాచ్చి’ ఒక మేక పిల్ల కథ.

2014లో “మాధొరు భాగన్” తమిళ నవలకు ఆంగ్లానువాదం ‘వన్ పార్ట్ విమన్’కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. దాని తెలుగు అనువాదమే ‘అర్థనారీశ్’. అవార్డు ప్రకటన తర్వాత తమిళనాడులో వివాదాలు మొదలయ్యాయి. పెరుమాల్ మురుగన్ పై కేసులు పెట్టి, అరెస్టు చేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని కొన్ని సమూహాలు ప్రయత్నించాయి.

మద్రాస్ హైకోర్టు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా, భావప్రకటనా స్వేచ్ఛను గుర్తు చేస్తూ, పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీం కోర్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరు తమ భావాలను వ్యక్తపరచవచ్చని. “పెరుమాళ్ మురుగన్ రచన నచ్చకపోతే కొనకండి, చదవకండి, కానీ ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించకండి” అని చెప్పడంతో వివాదం ముగిసింది.

సుప్రీంకోర్టు తీర్పుతో “వివాదాలు దాడులతో రచనా వ్యాసంగాన్ని వదిలేస్తున్నాను” అని ప్రకటించిన మురుగన్ తో పాటు అనేకమంది కవులకు రచయితలకు ధైర్యం వచ్చింది.

ఈ వివాదం తర్వాత “మనుషుల గురించి, మతాల గురించి, దేవుళ్ల గురించి రాయలేను. కనుక పశువుల గురించి, అందులో ఎటువంటి వివాదాలు లేని మేకను ఇతివృత్తంగా ఎంచుకుని “పూనాచ్చి” రాశానను” అని రచయిత పెరుమాళ్ మురుగున్ ముందుమాటలో రాశారు.

దానిని తెలుగులోకి పునాచ్చి పేరుతోనే గౌరీ కృపానందన్ అనువాదం చేశారు. దీని గురించి సంవత్సరం క్రితమే విన్నప్పటికీ చదవడం కుదరలేదు. అనేక సమీక్షలు వ్యాఖ్యానాలు దీనిపై వెలువడ్డాయి.

20-01-2020న పునాచ్చి ఒక కవిద్వారా నా చేతికి చేరింది. చదివిన తరువాత నాకు ఈ నవలపై కొన్ని మాటల్ని రాయాలనిపించింది.

చదువు తున్నంత సేపు ఎక్కడ అది అనువాదం అనిపించలేదు. అనువాదకురాలు గౌరీ కృపానందం తన స్వంత రచన లాగా చాలా స్వేచ్ఛగా ఈ అనువాదాన్ని కొనసాగించారు.

చూడడానికి ఇది ఒక మేక గురించి చెప్పినట్టుగా ఉన్నా ఈ నవల అంతా ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు, ప్రభుత్వాలు, చివరికి ఎవరికీ పట్టని స్వార్ధ ధోరణులు అనేకం చెప్పబడ్డాయి. మానవ జీవన తాత్వికతను వ్యాఖ్యానిస్తూ కథ నడుస్తుంది.

నవలలో మనుషులు ఉన్నప్పటికీ వారికి ఎక్కడా పేరు చెప్పబడలేదు. ముసల్ది, ముసలివాడు, ముసలి దాని కూతురు, చెవులు కుట్టే అధికారి, మేకలు కొనడానికి వచ్చిన వ్యాపారి ఇలా మనుషుల పేర్లు పెట్టలేదు. కానీ అందులో పాత్రలుగా చెప్పబడిన పునాచ్చి, కుడువాయన్, పీత్తన్, పోరుమి, ఉళుంబన్, ఊత్తన్ అనే పేర్లతో పాత్రలను సృష్టించి మానవ స్వభావాలను వాటి విపరీత పోకడలను చెప్పడం జరిగింది.

పూనాచ్చి గురించి ఆమె నిలబడలేక పోయింది, బాధపడింది, ఎదురు చూసింది, ఆమె అంటూ వివరించారు. జంతువుల గురించి కాకుండా ఒక స్త్రీ మానసిక శారీరక స్వభావాలను, బలహీనతలను చెప్పారు రచయిత. సమాజంలోని విపరీత పోకడల వివరణ మాత్రమే కాక రచయిత చాలాచోట్ల స్త్రీవాదిగా కనబడతాడు. ముసలామె పాత్రను వర్ణించిన తీరు కవిలో ఉన్న అమ్మతనాన్ని మనకు పట్టిస్తుంది. ఒక తల్లి తన కూతురి కోసం పడే ఆత్రుత, బలహీనంగా ఉన్న పూనాచ్చికి ఆహారాన్ని అందించిన తీరు, చేసిన సేవ చిన్నప్పుడు బలహీనంగా పిల్లగా ఉన్న పూనాచ్చిని పట్టుకొని పాలు తాగించడం, అడవి పిల్లి పూనాచ్చిని ఎత్తుకు పోయినపుడు ముసలివాని కంటే ముందు తేరుకొని రక్షించడం, ఇలా అనేక చోట్ల మనకు బాధ్యతగా తల్లి తన పిల్లలకు సేవచేసినట్లున్నది. ఒక స్త్రీ సేవా స్వభావాన్ని ప్రేమ తత్వాన్ని ఆవిధంగా వివరించారు రచయిత.

నవలలో ఒక చోట ఇలా ఉంది.

కళ్ళ నుంచి నీళ్ళు కారుతుండగా కడువాయన్ అలాగే క్రిందికి ఒరిగాడు. ఇప్పుడు అతన్ని ఎవరూ పట్టుకునే అవసరం లేదు .

“అన్ని ఆటలు ఇది ఉన్నంతవరకే అన్నాడు ఒక పోరగాడు”.

ఈ మాటల ద్వారా జరుగుతున్న అత్యాచారాలకు మరణశిక్షలు ఎన్కౌంటర్లు కాకుండా క్యాస్ట్రేషన్ చెయ్యడమే పరిష్కారమని చెప్పినట్లనిపిస్తూంది. కానీ వెంటనే బీజాలు కొట్టే వ్యక్తి

“ఇంత పాపం చేస్తున్న నా ప్రాణానికి మంచిగతి దొరుకుతుందా ఏమిటి” అన్నాడు .

“పీక కోసేవాడు ఏ భయమూ లేకుండా ఉన్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు” అన్నాడు ముసలాడు.

“హత్యా పాపం కన్నా, నేను చేస్తున్న పాపం పెద్దది” అంటాడు వాడు.

బీజాలు కొట్టబడిన పశువులు బాధతో అరుస్తూ ఉండడం చూసి. “పాపిని పాపిని మహాపాపిని నేను” అంటూ బీజాలు కొట్టేవాడు. తనకు రావలసిన ధాన్యాన్ని కూడా తీసుకోకుండా ఏడుస్తూ వెళ్తుంటాడు.

హత్యలు చేసే వాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు, నిర్భయంగా చేస్తున్నారు వృత్తులు చేసే వాళ్ళు కనీసం పాప భీతి కలిగి ఉండాలని, మానవీయత మనుషుల్లో మిగలాలంటే ప్రతి ఒక్కరికి పాప భీతి ఉండాలని చెప్పినట్టు అనిపించింది నాకైతే.

తర్వాత “ఎందుకు వెళ్లి ఆడ మేకలను తరమాలి? ఈ పాట్లు ఎందుకు పడాలి? ఊరికే ఉండడానికి అవడం లేదు. నువ్వు అనుకున్నా లోపల పారుతున్న రక్తం ఉండనిస్తుందా? ఆ తర్వాత ఈ కష్టాలు పడాల్సిందే”.

ఇంద్రియనిగ్రహం గురించి పట్టించుకోకుండా ఎదుగుతున్న యువతను గురించి చెప్పినట్టు ఉన్నాయి పైమాటలు. అసలు నిగ్రహాల గురించి చెప్పే అవకాశమూ చెప్పే మనుషులు మృగ్యం అనేమో.

“నోరు ఉండేది మూసుకో డానికే, చేతులు ఉండేది దండం పెట్టడానికే, కాళ్లు ఉండేది మోకాళ్ళ మీద వంగడానికే, శరీరం ఉండేది కుంచించుకు పోవడానికే. ప్రభుత్వం దగ్గర ఎలా నడుచుకోవాలి అని అందరూ బాగానే నేర్చుకున్నారు.”

“తన ప్రజలను ఏ క్షణంలోనైనా శత్రువు గానూ, దేశద్రోహులుగానూ మార్చేటంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి” అనడంలో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య ఉన్న పీడిత పీడక స్వభావం వివరిస్తూ, అనాదిగా పాలకులు మారకపోగా మరింత ప్రమాదకరంగా మారారని హెచ్చరించాడు రచయిత.

“పునాచ్చీ” సంతానమైన చెమినీని అమ్మడం కోసం ప్రయత్నించినప్పుడు జరిగిన సంఘటనలను రచయిత వివరించిన తీరు మార్కెటింగ్ మేనేజ్మెంట్ వివరించినట్లు ఉంటుంది.

మేక పిల్లలను కొనడానికి వచ్చిన వాళ్ళలో చాలా మంది వ్యాపారులే. వారికి తెలుసు దానిని వీలైనంత వరకు క్రిందికి దింపుతారు. ఒకరి తర్వాత ఒకరు, నలుగురైదుగురు కలిసి మూకుమ్మడిగా అలా చేస్తారు. ఎవరికైనా ఒకరికి దొరికితే చాలు అన్న ఉద్దేశ్యం అందరికీ ఉంటుంది. పెదవి విరుచుకుంటూ ఏమీ చెప్పకుండానే వెళ్లిపోతారు. ఎక్కడ వస్తువు అమ్ముడు పోదేమో అనే భయాన్ని కలిగిస్తారు.

రైతుల వద్ద దళారీలు చేసే పని ఇదే కదా. ధాన్యం బాగాలేదని, ధర ఎక్కువ రాదని మోసం చేస్తారు రైతులను.

అన్ని ముసలాడికి అర్థం అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే వ్యాపారులకు ఇవ్వకూడదని మనసులో అనుకుని తీర్మానం చేసి పెట్టుకున్నాడు. కానీ బయటకి చెప్పలేదు. వాళ్లతో సుముఖంగానే నడుస్తున్నాడు. వాళ్ళు భయపెట్టినప్పుడు, భయపడినట్లు నటించాడు. అమ్ముడు పోకుండా ఉండి పోతుందేమో , అని ఆందోళన పడుతున్నట్టు వైఖరి చూపించాడు. వాటిని పెంచడానికి తాను చేసిన ఖర్చులను పలు రకాలుగా ఎక్కువ చేసి చెప్పాడు. పాలకు మాత్రమే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసినట్టు చెప్పాడు. మంచి పాలకోసం ఖర్చుచేశానని వాపోయాడు. పెట్టిన ఖర్చు కూడా రాలేదంటే, తిరిగి ఎందుకు అమ్మడం అని ఏడుస్తూనే అడిగాడు. వ్యాపారులు అయోమయంలో పడ్డారు పిల్లలను చూడడానికి వచ్చే వాళ్లను బయలుకి రమ్మని చెప్పాడు .

ముసలాడి తీరు ఎన్నికల సమయంలో అన్ని పార్టీల వద్ద డబ్బు తీసుకొని, తమకు నచ్చిన వారికి ఓటు వేసే అతి తెలివి ఓటర్లను ఇక్కడ చూపించాడు రచయిత అని అనిపించింది నాకు.

*అందరి తలలు ఆకాశం వైపే చూస్తున్నాయి. తల పైకెత్తేలా చేసింది వర్షం.

*లోకం ఉన్న తీరును ముసలాడికి అర్థమయ్యేట్టు చేసింది సంత.

*పున్నాచ్చి అందరికీ వింత. ఆ వింత చూసిన విడ్డూరం ఫూమన్.

*ముసలామె బిడ్డకు ఇచ్చిన ‘పోరుమి’ ఏమైందని , కూతుర్ని అడుగుతది. దానికి సమాధానంగా మా ఆయన “మా చెల్లికి పుట్టింటి సారి పెట్టొద్దు” అని పంపించాడు. నేను ఏ దిక్కుకి వెళ్లి మొరపెట్టుకోను. అని కన్నీరు పెట్టుకున్న కూతుర్ని ఇదంతా సంసారుల ఇళ్లలో జరిగేవే కదా. నువ్వు ఊరుకో అమ్మ అని ఓదారుస్తుంది.

ఇవన్నీ మానవ సంబంధాల మధ్య వైరుధ్యాలను, వైపరీత్యాలను చిత్రీకరించడంలో రచయిత నైపుణ్యాన్ని తెలుపుతాయి.

ఆకలి గురించి చెప్పిన మాటలు అద్భుతంగా ఉంటాయి .” అన్ని పిలుపులను ఆహ్వానాలను పక్కకు పెట్టి పైకి వినబడేది ఆకలి గొంతు మాత్రమే. దాని తరువాతే మిగిలిన వాటి గురించి ఆలోచన వస్తుంది. శ్రీమంతుడైన అన్నం తినాలి. నోట్లకట్టలను తినలేడు కదా” అంటాడు

“గొర్రెలకు శృంఖలాలు లేవు, ప్రయత్నమూ లేదు. సహజంగానే వంగుతున్నప్పుడు, ఎందుకు శృంఖలాలు. తలవంచి ఉండడం బానిసత్వం అన్న గ్రహింపు లేకుండా బ్రతికే భాగ్యం కలిగినవి గొర్రెలు” ఈ వాక్యాలు చదివినప్పుడు కొందరు మనుషులు మన కళ్ళముందు కదలాడుతారు.

చదువుకుని, చైతన్యవంతులమని అనుకుంటూ బతికే కొందరి బానిస చైతన్యాన్ని అంటే అన్నీ తెలిసి ప్రశ్నించకుండా లొంగి పోయే స్వభావం కల మనుషుల గురించి చెప్పినట్టుగా ఉంటుంది.

“ఏడు పిల్లలు ఈనిన వార్తను అధికారికి చెప్పాలని, లేకపోతే ఏదో ఒక రకంగా జైలుకు పంపుతారు అని భయపడతాడు ముసలివాడు. పునాచ్చికి వైద్యం చేసిన పశు వైద్యుణ్ని తోడు రమ్మని తీసుకుపోవడం, అధికారి ముసలాడు చెప్పేది వినకుండా తలుపు వేసుకోవడం, అతని భార్యకు సవివరంగా వైద్యుడు విషయం వినిపించడం, ఆమె చెప్పినది విని, తలుపులు తీసి ఏదో రాసుకొని రేపు పొద్దున వస్తానని అధికారి స్పందించడం, ప్రభుత్వ పాలనలో ఉన్న డొల్ల తనాన్ని హింసను తెలియజేస్తాయి.

తెల్లవారి అధికారులతో పాటు మీడియా వారు వచ్చి చేసిన హడావుడి, వారు ఇచ్చిన సలహాలు, ప్రభుత్వ సహాయం కోరమని చెప్పినప్పుడు, సహాయం అడిగితే మేక పిల్లల్ని ఎత్తుకు పోతారేమో అని ముసలిది భయపడటం, మీరు ఏం చెప్పదలచుకున్నారు మర్యాదగా వినయంగా తలవంచి అడుగుతే ప్రభుత్వం ఏమీ చేయదని బూటకపు హామీ ఇవ్వడం, ఇవన్నీ బ్రష్టు పట్టిన మీడియా ప్రజలను బానిసలుగా బ్రతకమని సలహా ఇవ్వడం వంటిదే.

పునాచ్చీని కొనడానికి వచ్చిన వ్యాపారికి పిల్లలను అమ్మడానికి అంగీకరిస్తుంది ముసలామె. తల్లి మేకైన పునాచ్ఛీని అమ్మడానికి ఒప్పుకోదు ..

ఇంకో ఈత దాకా పెట్టుకొని చూద్దాం అంటుంది. ఎంత కష్టం వచ్చినా ఈ పట్టుదల సేద్యం చేసే వాళ్లకే సొంతం. ఇంకా కొన్ని రోజులు చూద్దాం చూద్దాం అనుకుంటూ వాయిదా వేస్తూ వస్తారు.

పిల్లల కోసం అరుస్తున్న పునాచ్చీని చూసి మా ఇంటికి వస్తానని నీ కూతురు చెబుతోంది వదిలి పెట్టరాదు అన్నాడు ఆ మనిషి.

కూతుర్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లి యాచించి తినడం అన్నది ముసలిది .

అందుకోసం ఇంట్లోనే ఉంచేసుకుంటావా. ఏనాటికైనా ఇంకొకరు ఇంటికి వెళ్లాల్సిందే కదా. అన్నాడు వ్యాపారి. కానీ అతనికంటే తెలివైన ముసలిది ” ఆమె మా ఇంటికి వచ్చిన కోడలు. మా వంశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన రాచబిడ్డ ” అంటుంది సగర్వంగా.

ఇవన్నీ చదువు తుంటె కుటుంబ సభ్యుల గురించి సాగిన సంభాషణలు గా అనిపిస్తాయి. కాని మేక గురించి అనిపించదు.

వాకిట్లో అరుస్తున్న తల్లి మేక తో “ఎందుకు అలా అరుస్తున్నావు. నేను కూడా నా కూతురికి పెళ్లి చేసి ఇలానే సాగనంపి ఒంటరిగా పడి ఉన్నాను. వయసు రాగానే వెళ్లిపోతుంది. మనం బాధ పెట్టుకోకూడదు” అని పిల్లలు వయసురాగానే తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళడం సహజమనే జీవిత సత్యాన్ని చెప్పాడు.

మేక పిల్లల్ని అమ్మిన డబ్బుతో ముసలిది ఎన్నాళ్ళనుంచో అడుగుతున్న చెవులకు కమ్మలు, మెడకు గొలుసు కొన్నాడు. కూతురికి గాజులు మనవరాలికి గొలుసు కొన్నాడు. మనవడికి మొలతాడు కొన్నాడు . డబ్బు ఇచ్చిన ఆనందం తో పూనాచ్చిని తనకిచ్చిన ఆ బకాసురుడికి గుడి కట్టాలని మనస్ఫూర్తిగా అనుకున్నాడు. ముసలాడు

తెచ్చిన నగలను పెట్టుకుంటూ మురిసిపోతూ కొత్త పెళ్ళికూతురిలా సిగ్గు పడింది ముసలిది. పూనాచ్చి వీటిని ఇచ్చిందని, దానిని మరి ముద్దు చేసింది.

కానీ ఆకలికి తట్టుకోలేక పిల్లలతో పాటు బక్క చిక్కి పోయి ఎముకల పోగులా ఉన్న పూనాచ్చీ కడుపులో పిల్లల ఉనికి ఉబ్బినట్లుగా బాగా కనపడింది. పిల్లలు బయటికి రాగానే వాటిని పూడ్చి పెట్టి. పూనాచ్చీని ముక్కలుగా కోసెయ్యాలని అనుకున్నాడు ముసలివాడు. దానికి ఒప్పుకోలేదు, దానిని పూడ్చి పెట్టిన పర్వాలేదు గానీ ముక్కలుగా కోయడానికి ఒప్పుకోను అని గట్టిగా చెప్పేసింది ముసలిది.

ఈ దరిద్రం కాలు మోపి ఇంటిని ఏదీ లేకుండా తుడిచి పెట్టేసింది, ఇప్పుడు మనుషుల్ని కూడా లేకుండా చేస్తుంది చూడు అంటూ తిట్టిపోస్తున్నాడుముసలివాడు. ఇక్కడ ఒకే విషయంలో స్త్రీ పురుషుల స్పందనల్లో తేడాను తెలుపుతూంది. ముసలిది పునాచ్చీ మీద ప్రేమను పెంచుకుంది. కానీ ముసలివాడు కఠినంగా మాట్లాడాడు.

ఈ మనసు ఉంది చూసావు దానికి ఎంత ఇచ్చిన చాలదు. అది నేర్పడానికి రాక్షసుడు తమకు ఆ వింతను ఇచ్చాడని, ఆ పాఠం నేర్పడం కోసమే మేకపిల్లను ఇచ్చాడని అనుకుంటారు.

చివరికి కి ఆకలి తట్టుకోలేక తల్లి మేక పూనాచ్చి చచ్చిపోయిన తీరు ఆకలి చావులను మన కంటి ముందు చిత్రీకరించాడు రచయిత.

పేరుకు ఇదొక ఉత్తమజాతి అంటే ఒక ఈతలో ఏడు పిల్లలను కనగల ప్రత్యేక జాతి మేకపిల్ల కథ. కానీ మానవీయత అంతరించిన ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే నవల. 

నవల వెనుక అట్ట

జ్వలిత

జ్వలిత: అసలు పేరు - విజయకుమారి దెంచనాల. పుట్టిన తేది- 11/03/1959. స్వస్థలం - పెద్దకిష్టాపురం , ఉమ్మడి ఖమ్మం. తెలంగాణ రాష్ట్రం. వృత్తి - విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని.
ప్రస్తుతం. సాహితీవనం మిద్దెతోట సాగు.

రచనలు: 1)కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం) 2)మర్డర్ ప్రొలాంగేర్-2008 (కవిత్వం,ఆంగ్లానువాదం) 3)సుదీర్ఘ హత్య-2009(కవిత్వం) 4)ఆత్మాన్వేషణ -2011(కథలు ) 5) అగ్ని లిపి- 2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం ) 6) జ్వలితార్ణవాలు- 2016 (సాహిత్య సామాజిక వ్యాసాలు) 7) సంగడి ముంత- 2019(కవిత్వం) 8) రూపాంతరం - 2019 (కథలు)

*సంపాదకత్వం: 1) పరివ్యాప్త-2007(స్త్రీవాదకవిత్వం) 2)గాయాలే గేయాలై-2010(సహసంపాదకీయం- తెలంగాణ స్త్రీల కవిత్వం) 3)రుంజ-2013(విశ్వకర్మ కవుల కవిత్వం) 4)ఖమ్మం కథలు-2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు) 5)అక్షర పుష్పాలు-భావ సౌరభాలు-2016 (ఖమ్మం బాలకవుల రచనల సంకలనం) 6)ఓరు-2017 ( జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన) 7. పూలసింగిడి( బతుకమ్మ కవిత్వం 2019) సహసంపాదకత్వం.
పని చేసిన సాహితీ సంస్థలు-1)మట్టిపూలు , 2)రుంజ , 3)అఖిల భారత రచయత్రుల సంఘం ,4)దబరకం ,5)తెలంగాణ విద్యావంతుల వేదిక.
6)Tmass

ఇతర వివరాలు: విద్యార్హతలు- M.A.(Telugu), M.Sc(Psychology), M.Ed, L.L.B.
Blog. జ్వలితార్ణవాలు.org
Www.jwalitha.com
jwalitha2020@gmail.com
Mobile.9989198943.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.