ఈ వ్యాసంలో కొక్కోక శాస్త్రం, అప్పటి సామాజిక పరిస్థితులను ఎలా చెప్పింది, సమాజాన్ని ఎలా చైతన్య పరిచింది అనే సున్నితమైన అంశాలనే అందించాను. పోర్న్ సంబందిత విషయాలు ప్రస్తావించలేదు. ఎక్కడైనా ప్రస్తావనకు వచ్చినా, అది కేవలం విషయ సమగ్రత కోసం మాత్రమే.
“అది 8 వ శతాబ్దం. భోజరాజు పరిపాలిస్తున్న రోజులు. సభలో మేధావులు, పండితులు కొలువున్న ఒకానొక రోజు, ఒక అందమైన స్త్రీ ఎలాంటి ఆచ్చాదన లేకుండా, కాంక్షాపూరిత దేహంతో, కళ్ళతో సభలో ప్రవేశిస్తుంది. రాజు, సభికులు నిశ్చేష్టులవుతారు. అప్పుడామె, “ఈ సభ లో నా కామవాంఛ తీర్చగల మగాడు లేడు…అందుకే నేను నగ్నంగా ఉండటానికి పెద్దగ సిగ్గు పడను” అంటుంది. సభ మొత్తం తల దించుకుంటుంది. అక్కడే, ఆ రాజాస్థానం లో ఉన్న పండితుడు కొక్కోకుడు లేచి, రాజు అనుమతి తీసుకొని, ఇలా అంటాడు. ఈ అమ్మాయి కి తగిన గుణపాటం చెపుతాను. అని కొక్కోక పండితుడు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లి, తన రతి రహస్య నైపుణ్య విద్య తో ఆమెను సంతృప్తి పరిచి, ఆమె చేతులకు, కాళ్ళకు బంగారు పిన్నులు ధరింప చేసి, ఆమెను సభకు తీసుకు వస్తాడు. అక్కడే ఆమె ఆ ఆ రాజుతో తాను సంత్రుప్తి పడినానని చెప్పి, తిరిగి వొంటిపై దుస్తులు వేసుకొని వెళ్ళిపోతుంది. అంతట రాజు, ఆ కొక్కోక పండితుడి ని పిలిచి, ఆ రతి రహస్య నైపుణ్యాలు, విద్య, ప్రయోగం వగైరా అంశాలను ఒక గ్రంధంగా రాయమని చెపుతాడు. అప్పుడు కొక్కోకుడు పూనుకొని కొక్కోకం అనే గ్రంధాన్ని సంస్కృతం లో రాస్తాడు. ఆ రతి రహస్య గ్రంధం కొక్కోక శాస్త్రం గా పేరు వచ్చింది. ఇది జనంలో వున్న కథ. కొక్కోకుడు బహుశా, ఒక రాజు ను సంతృప్తి పరుస్తూ రాసిన కావ్యం గా భావిస్తారు. ప్రతి చరణం చివరలో , “సిద్ధ పతియా పండిత” అని ముగిస్తారు. అంటే, “పండితుల్లో మేలైన పండితుడు” అని. ప్రపంచం లో మొట్ట మొదటగా, ఈ శాస్త్రం లోనే, స్త్రీ ప్రవర్తన, దేహం, దేహ సంస్కృతి ని బట్టి, ఆమెను నాలుగు జాతులుగా విభజించడం, ఆ నాలుగు జాతులకు పద్మిని, చిత్రిణి, శంఖిని, హస్తిని అని పేర్లు పెట్టారు. వారు ఏ ఏ రోజుల్లో ఎన్నెని గంటలలో ఏ ఏ జాతి స్త్రీలు ఎలా కాంక్షా పూరితమై ఉంటారు? ఎలా సంతృప్తి చెందుతారు అనే రతి రహస్యాల్ని ఇందులో ప్రస్తావించారు. గోనికపుత్ర, నందికేశ్వర అనే వారి అభిప్రాయాలను అనుసరించి రాశానని కొక్కోకుడు చెపుతారు. వాత్స్యాయనుడి కామశాస్త్రం లో కూడా వీళ్లిద్హరి పేర్లనే ప్రస్తావిస్తారు. వీరి అభిప్రాయాలు మనకు ఎక్కడా విడిగా లభ్యం కావు.
పురుషార్థాలలో ఒకటైన కామం గురించి అంతవరకూ ఎవరూ నోరు మెదపలేదు. క్రీ .పూ 150 ప్రాంతం వాడైన వాత్స్యాయనుడి కామసూత్ర అనే గ్రంధం ఉంది. ఆ తర్వాత 8 వ శతాబ్దం లో (కొందరు 12 వ శతాబ్దం అని అంటారు) కొక్కోకుడు అనే పండితుడు రాసిన కొక్కోకం (రతి రహస్యం) తెలుగు రాష్ట్రాల్లో చాల ప్రసిద్ధి గాంచింది. అందుకు కారణం, ఈ కొక్కోక శాస్త్రాన్ని మొట్ట మొదట కూచిరాజు ఎర్రన్న తెలుగు లోకి అనువదించారు. అప్పటి సమాజం లో ఇలాంటివి సాహసోపేతమైన రచనలే. భారత దేశం అంతటా ఈ రెండు రతిరహస్య శాస్త్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కొక్కోక శాస్త్రం విశేషంగా ప్రాశస్త్యంలోకి వచ్చింది.
కూచిరాజు ఎర్రన క్రీ.శ.1400-1500 సంవత్సరాలకు చెందిన వాడు. తెలుగు లో లభ్యమయ్యే కామశాస్త్ర గ్రంధాలలో ఇదే మొదటిది. అతి ప్రాచీనమైన వాత్స్యాయన కామశాస్త్రం ఉండగా, కొక్కోకాన్నే మన వాళ్ళు తెలుగు లోకి అనువదించారు. అందుకు కారణం నాటి తెలుగు సామాజిక పరిస్థితులు కావచ్చు.
వాత్స్యాయనుడు “ధర్మార్థ కామేమోభయనమః” అని మొదలు పెట్టి, గ్రంధాంతం లో …..
‘’తదేత బ్రహ్మ చర్యేణపరేణచ సమాధినా –విహితం లోక యాత్రార్ధం న రాగార్దోన్య సంవిది
‘’రాక్షణే ధర్మార్ధ కామానాం స్థితిం స్వం లోక వర్తినీం –అస్య శాస్త్రస్య తత్వజ్నో భవల్యేవజితేన్ద్రియః ‘’
అని పూర్తి చేశాడు. ఇలా మొదలు పెట్టి ముగించడంతో, ఈ శాస్త్రం మడి కట్టుకున్న కామశాస్త్రం గా భావించారు. కానీ, కొక్కోక పండితుడు‘కొక్కోకం’ ఆరంభంలోనే,
“అసాధ్యాయా స్సుంసిద్ధి స్సాధ్యాయా శ్చానురంజనం
రక్తయా శ్చ రతి స్సమ్యఖ క్కామ శాస్త్ర ప్రయోజనం” అన్నాడు.
ఈ శ్లోకాన్ని తెలుగు లోకి కూచిరాజు ఎర్రన తెలుగు లో….
“తన కసాధ్యమైన తరుణి సాధించుట
దొరకెనేని తన్ను మరగికొనుట
మేలు కలుగు సతులు మెలుపంగ నేర్చుట
కామ శాస్త్రమునకు కలుగు ఫలము “
అసాధ్యం అయిన ఆడవాళ్ళను వశపరచుకోవడమెలా? అని చిట్కాలు చెప్పే కొక్కోకం బహుళ ప్రాచుర్యం పొందడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. “కామి గాక మోక్ష గామి కాడు” అనే దృక్పధంతో రాయడమే కాకుండా, శృంగారానికి, ఒక శాస్త్రీయ విశ్లేషణ (సైంటిఫిక్ ఎనాలిసిస్) ను జత చేసిన శాస్త్రం కొక్కోకం. పంచ కావ్యాలపై విశ్లేషణ రాసిన మల్లినాథ సూరి తన వ్యాఖ్యానంలో కొక్కోక శాస్త్రం నుంచి కొన్ని అంశాలను ఉదహరించారు. ఈ శాస్త్రం అనేక ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం తో, సెక్సలొజికల్ పరిశోధనలకు కూడా ఉపయోగ పడింది.
కొక్కోక శాస్త్రాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, కామశాస్త్ర ప్రయోజనాన్ని బాహాటం చేశాక, ఈ గ్రంధం దేశవ్యాప్తంగా విజయ దుందుభి మ్రోగించింది. తృతీయ పురుషార్ధమైన ‘కామం’ గురించి పూర్వశాస్త్రకర్తలు చెప్పిన దానిని శ్రద్ధగా అధ్యయనం చేసిన మహాపండితుడు కొక్కోకుడు. సృష్టి, స్థితి కారకమైన ‘కామం’ గృహస్థ ధర్మాలలో కెల్లా మిన్న అని భావించాడు. శరీర పోషణకు ఆహారం ఎంత అవసరమో, కామమూ అంతేనని లోకానికి చాటాలనుకున్నాడు.
ప్రాచీన శాస్త్రాల్లో ఇలా కామ భావన గురించి రేవణారాధ్యుడు “సర్వతత్వ ప్రకాశిక “ గ్రధంలో రాశాడు. వేద వేదాంగాలలో నిక్షిప్తమైన కామ భావనకు ఉదాహరణలను ఉటంకించాడు.
కొక్కోక శాస్త్రాన్ని తెలుగు లోకి అనువదించాక, ఇది ప్రజలకు ‘దిండు కింది పుస్తక’మని పేరు తెచ్చుకుంది. సుకవులు ఈ కొక్కోకానికి ఓ నమస్కారం పెట్టారు. కూచిరాజు ఎర్రన తెలుగు లోకి అనువదించేందుకు పూనుకున్నాడు. ఇతడిని రాచరామన అని, నవఘంటాసూత్రాముడు అని కూడా పిలుస్తారు.
కూచిమంచి ఎర్రన అనువాదం గురించి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు… “:ఎర్రయ కవి ఆంధ్రీకరణం భావ ప్రధానమైనది. ప్రతిపదార్థ పరిపాటిని పాటింపడు. అసలే కొక్కోక కవి కొత్త దారిని ద్రోక్కినాడు. ఆపైన కూచిమంచి ఎర్రయ కవియును మరియొక ఆకు ఎక్కువ చదివినాడు. ఈయన ఏ అధికారమునం దేశ్లోకము నాంధ్రీక రించినను నరనారీ ప్రయోజనం లేనిదే కదలు వాడు కాడు. కామశాస్త్రమునందంతటను ముఖ్యమగు నాయిక వేశ్య యేనా… అని ఈయన గ్రంధము చదువు తున్నప్పుడు దోచును”
ఎర్రయ కవి కొక్కోకాన్ని తెలుగు లోకి అనువదించిన తర్వాత, ఆ గ్రంధాన్ని కుంటుముక్కల భైరవ మంత్రికి అంకిత మిచ్చాడు. ఎర్రయ ఇంకో సామాజిక చైతన్య గ్రంధాన్ని వ్రాసాడు. “సకల నీతి కథా విధానము” అని ఒక అయిదు ఆశ్వాసాల గ్రంధాన్ని రాశాడు. దీన్ని
“సుకవులు చెప్పిన కవితా – నికరములు శిలాక్షరముల నిలకడ గాంచున్
గుకవులు చెప్పిన కవితా – నికరములు జలాక్షరముల నీచత నణుగున్”
అని మంచి కవుల మాటలు ఎలా నిలబడి పోతాయో విశదీకరించాడు. ఈ గ్రంధం లో బద్దెన నీతి శాస్త్రాన్ని, సుమతి శతకమ లోని కొన్ని పద్యాలను కాస్తో కూస్తో మార్చి మార్చి పదాలు, పద్యాలు రాశారని విమర్శా ఉంది. కేవలం ఆ బూతు శాస్త్రం ఒక్కటే కాదు, నీతి కోవిద శాస్త్రాన్ని కూడా రాసాడని చెప్పుకోవడానికి ఎర్రయ ఈ నీతి గ్రంధాన్ని భుజాన కెత్తు కొన్నాడేమో.
ఏది ఏమైనా, కొక్కోక శాస్త్రాన్ని తెలుగు లోకి అనువదించడం సామాన్య సాహసం కాదు. ఆయన తెలుగు లోకి అనువదించడమే కాకుండా, తెలుగు ప్రపంచమంతా తన ఈ రతి రహస్య శాస్త్రాన్ని ప్రాచుర్యం వచ్చేలా అత్యధిక నైపుణ్యత తో రాసారు.
ప్రయోగాలు చేయడానికి, పనికివస్తుందేమో గాని,..మగవాలకి,,ఈకాలం లో,waste, ఇలాంటి సాహిత్యం.. అజంతా, ఎల్లోరా, గుహలు లో,చిత్రాలు చాలు, చూడలను కుంటే..పుస్తకం పుట్టు పూర్వోత్వాలుతెల్సింది.. అభినందనలు. రచయిత కు,,ఎడిటర్ గారికి..!
ప్రత్యెక ధన్యవాదాలు పద్మ … మీ ఆత్మీయ స్పందనకు
మూల గ్రంధ నేపథ్యాన్ని మూల రచయిత అభినివేశాన్ని , ఆనాటి సామాజిక నేపథ్యాన్ని సముచితంగా విశ్లేషించారు. అనువాదకుడి ప్రతిభా పాటవాలను, ప్రత్యేక ఆసక్తిని అనురక్తిని పరిచయం చేయడం వల్ల ఈ గ్రంధానికి అదనంగా చేకూరిన సొబగులు అవగతమైనాయి. మంచి విశ్లేషణ
చాల ధన్యవాదాలు సర్… మీ ఆత్మీయ స్పందనకు
సర్ ఎంత ఆధునికసాంకేతిక యుగంలో ఉన్నప్పటికీ శషభిషల్లేకుండా చర్చించటం సాధ్యం కాని అంశం. కానీ.. Human behaviour is guided and shaped by forces like wishfulfillment sexuality the unconscious and repression అంటారు విల్ హెల్మ్ రీచ్. రాతియుగం నుంచి పరిణామం చెందుతున్న క్రమంలో మానవ వికాస పురోగమనంలో ఇది కూడా ఒకటి. ప్రవర్తన అసహజంగా రోగుల్లా మారకుండా మానవులు educate కావాలనే ఎరుక వైపుగా ఈ శాస్త్రం మనోవైజ్ఞానిక తత్వం పరంగా పరిగణించారు పూర్వీకులు. గ్రంథ తత్వాన్ని సముచిత విశ్లేషణతో అందించారు మీరు.