జాన్రా: థ్రిల్లర్ / హారర్ / సందేశాత్మకం
తారాగణం:
హీరో: ‘కరోనా’ (కొత్త పరిచయం)
హీరోయిన్: ప్రకృతి మాత (ప్రతిరోజూ మన ద్వారా వేధింపబడుతున్న కారెక్టరే)
విలన్: మానవజాతి
దర్శకుడు: కలికాల ఖర్మ
బాగా ఫేమస్ అయిన హీరో డైలాగ్: ‘కంటికి కనబడకుండానే దుమ్మురేపుతా’
కథ సారాంశం:
విలన్ (మానవాళి) రోజూ ఎన్నోరకాలుగా హీరోయిన్ (ప్రకృతి మాత) ని హింసిస్తూ ఉంటాడు. విసిగిపోయిన హీరోయిన్ విలన్ కి బుద్ధి చెప్పాలనుకుంటుంది. కరోనా అనే సరికొత్త వైరస్ ని వదిలి విలన్ని ముప్పుతిప్పలు పెడుతుంది.ఆ మధ్య హిట్ అయిన ‘ఈగ’ సినిమాలో ఈగ పాత్రను గుర్తుచేస్తుందీ కరోనా క్యారెక్టర్.
నేనే గొప్ప అని అప్పటివరకూ కాలరెగరేసినవిలన్, కంటికి కూడా కనబడని ఆ కరోనా సృష్టించే ఉత్పాతానికి బెంబేలెత్తిపోతాడు. భయంతో విలన్ వణికిపోయే సన్నివేశాలు చాలా సహజంగా చిత్రీకరించబడ్డాయి. భవిష్యత్ దర్శనాన్ని తలపించే
ఆ దృశ్యాలు ఆలోచనాపరులకు కంటతడి పెట్టిస్తాయి.
కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోతున్న దృశ్యాలు చూసినప్పుడు…ఏందుకో తెలీదు…మనం ఇష్టంగా కాల్చుకు తినే పిట్టలు గుర్తొచ్చాయి.
సందేశం:
- ప్రకృతికి అనుగుణంగా జీవించరా పాడు మానవా!
- బతుకు, బతకనివ్వరా బరితెగించిన మనిషీ!
- అనవసరపు వినియోగం, ఆర్భాటం తగ్గించరా వెర్రి వెధవాయ్!
సినిమాలో చాలా సటుల్ గా, అంతర్లీనంగా ఉంది ఈ ‘ఆదేశం’.
క్లైమాక్స్ (స్పాయిలర్!):
విలన్ అష్టకష్టాలు పడతాడు, ఎలాగోలాతప్పించుకుంటాడు. క్లైమాక్స్‌లో వాడి మొహం చూస్తే ఇంకా బుద్ధి వచ్చినట్లు కనిపించదు, కుక్క తోక వంకరలా. అందుకే సీక్వెల్ ఉంటుందేమో అంటున్నారు విమర్శకులు!
ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?:
తొలి టీజర్ చైనా వుహాన్‌లో విడుదలైనప్పుడుఅందరూ మామూలు సినిమానే అనుకున్నారు. అయితే, రెండు నెలలు తిరిగేలోపే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రేక్షకులు విరగబడి చూస్తుండటంతో దేశదేశాలు
ఈ సినిమాను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
ఎక్కడ ఆడుతోంది: మీ దగ్గరి టీవీలో
రేటింగ్: ఫైవ్ స్టార్స్!!
👌👌👌