‘విరామం’ చాల సురక్షితమైన పదం. 🙂 ఫుల్ స్టాప్ కూడా ఒక విరామ చిహ్నమే.
ఈ విరామం ఫుల్ స్టాపో, కామాయో, జస్ట్ సెమీ కోలనో తెలీదు.
మరి కొన్నాళ్ల వరకు ‘ఈ రోడ్డు ఎక్కడికీ పోదు’. ‘రస్తా’ ఇక్కడే వుంటుంది. పూటకూలి ఇంటికి చెల్లించాల్సింది చెల్లిస్తాం. ఇప్పటి వరకు వెలువడిన రచనలు ఇలాగే వుంటాయి. మాంఛి రచనలు అందితే, ప్రచురిస్తాం కూడా. ప్రతి నెలా, ప్రతి పక్షం పాతవి అటకెక్కించి, కొత్త రచనలు పత్రికకెక్కించాలని ఇక తాపత్రయపడం. అలాంటి పనికి,…
ఇక బై బై.
రస్తా కు ఇవాల్టితో సరిగ్గా రెండేళ్లు. మాకు సంబరమే.
‘తాపత్రయం’ తగ్గించుకోడానికి కారణం: వేరే పనులు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నాయి. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వుంది. తెంపు లేని దృష్టి అవసరమవుతోంది.
ఒక సంపాదకుడిగా నేను ‘రస్తా’ నిర్వహణను చాల ఎంజాయ్ చేశాను. మెహెర్, మూలా రవికుమార్, ఎండపల్లి భారతి వంటి కొందరు కథకుల విలువైన కథలను సంపాదకుడిగా కాకుండా చదివే వాడినో కాదో.
బాగోగులు తర్కించుకుంటూ చదవడం సంపాదకుని అవసరం.
‘రస్తా’ పాఠకుల ప్రశ్నలకు సుప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ జవాబులు… మాకు చాల చాల సంతోషమిచ్చిన శీర్షిక. ఆమెకు ‘రస్తా’ కృతజ్ఞతలు.
విజయ్ కోగంటి, రాజ కుమార్, చెలుమల్లు గిరిప్రసాద్, సుంకర గోపాలయ్య. పలమనేర్ బాలాజీ, పల్లిపట్టు వంటి సీనియర్ కవులతో పాటు అప్పుడే రాస్తున్న వారితో ‘రస్తా’ కలం కలం కలుపగలిగింది. రియల్లీ హ్యాపీస్. ఎలనాగ, నాగరాజు రామస్వామి అనువాద కవితలు ‘రస్తా’ కు అంతర్జాతీయతనిచ్చాయి.
సినిమా వుట్టి వినోదం కాదు. అనిర్దిష్ట కళా విలువల పేరిట విద్యైక చర్చలూ కాదు. జన జీవన కోణం లోంచే సినిమా బాగోగులను చూడాలనే ఐకా బాలాజీ సినిమా రివ్యూలను ‘రస్తా’ గుండెలకు హత్తుకుంది. అడపా దడపా డాక్టరు విరించి ఆఫ్ ది బీట్ సినిమా రివ్యూలను కూడా.
‘స్ట్రీట్ ఫైటింగ్ టైమ్స్’ పేరుతో ఎస్ జయ రాసిన సిరీస్ దేశదేశాలలో ప్రజల వీధిపోరాటాలకు, ‘ప్రతిఘటన జయిస్తుంది’ అనే ‘రస్తా’ నమ్మకానికి అద్దం పట్టాయి. మమత రాసింది తక్కువైనా ఆమె నేటివ్ అమెరికా ప్రాంతాల ప్రయాణ కథలు ‘రస్తా’కు ఒక వ్యక్తిత్వాన్ని నెలకొల్పాయి.
జి ఎల్ నర్సింహా రెడ్డి, వేణుగోపాల రెడ్డి పేద, ధనిక తేడా లేకుండా దేశ దేశాలు తిరిగి రాసిన ట్రావెలోగ్స్… యాత్రా కథనాలంటే సువనీర్లు ఎత్తిరాయడం కాదని, ఊళ్లు తిరగలేని వారికి ‘అజ్ఞాత’ ప్రదేశాలను ‘జ్ఞాతం’ చేయడమని అక్షరాలా చూపించారు.
పిల్లల విషయంలో పెద్దాళ్ల చేష్టల గురించి పిల్లల స్వరాలతోనే బమ్మిడి జగదీశ్వర రావు రాసిన ‘ఈ పెద్దాళ్లున్నారే’ సిరీస్ ను అందరం ఆనందించాం. ఇందులో చాల రచననలను కలిపి ‘మంచి పుస్తకం’ వాళ్లు ఓ మంచి పుస్తకం వేశారు.
తాము చదివిన మంచి పుస్తకాల్ని మనం చదవడానికి ప్రోత్సహిస్తూ వెంకీ, జ్వలిత రాసిన వ్యాసాలు ఒక మంచి ఒరవడి కల్పించాయి.
‘మా వూరు’ శీర్షిక కింద సొదుం శ్రీకాంత్ తన పఠితలను వాళ్ల వాళ్ల వూళ్లకు తీసుకెళ్లి తిప్పి చూపించాడు. మా ఎన్నెలమ్మ (లక్ష్మీ రాయవరపు) ‘కాస్త నవ్వండి సారు’ అని రాసిన సిరీస్ కేవలం నవ్వులాట కాదు. పఠితల ఆధ్యాత్మిక అవసరం కూడా తీర్చాయి. పాత సాహిత్యాన్ని పరిచయం చేస్తో లెనిన్ వేముల మెట్రికల్ పద్యాల సొబగులను వివరించిన తీరు ‘రస్తా’ కు మంచి వైవిధ్యాన్ని సంతరించి పెట్టాయి
ఆధునిక కవిత్వంలో ఇప్పటి తరం మరిచిన బలమైన కలాలపై తన ఉద్విగ్నాక్షరాలతో శ్రీరాం పుప్పల ప్రసరించిన ‘మలి చూపు’, రెగ్యలర్ గా కాకపోయినా అప్పుడప్పడు అనిల్ డ్యాని పరామర్శించిన మునుపటి దళిత బహుజన కవితా సౌరభాలు, సినిమా పాటల్లో సాహిత్యం గురించి విజయ్ చంద్రహాస రాసిన సరస వ్యాసాలు… ‘రస్తా’లో అందమైన మైలురాళ్లు. ప్రాచీన సాహిత్యంలో సామాజిక చేతనను తీసి చూపించిన సివి సురేష్ ‘పువ్వులూ మొగ్గల’ సిరీస్ దీ అదే కోవ. విజయ్ కోగంటి, పద్మజ కలపాల సంయుక్తంగా నిర్వహించిన ‘పడమటి రాగం’ వ్యాసాల్ని సాహిత్య విద్యార్థలు కాపీ చేసి జాగ్రత్త చేసుకుంటారు.
‘రస్తా’ శుద్ధ సాహిత్య పత్రికగా వుండాలని మేము అనుకోలేదు. శుద్ధ సాహిత్యం అనేది ఒక ఆధునిక అబద్ధం. కవితలో, కథలో రాజకీయం వుండడం మాత్రమే కాదు. అలాంటి కథా కవితలను తగిన పీట వేయడం మాత్రమే కాదు. పత్రికలో సాహిత్యం పక్కనే దైనందిన రాజకీయానికి తగినంత చోటు వుండి తీరాలి. సాహిత్యానికి వేరే అంతఃపురాలు అక్కర్లేదు. ఈ అవగాహనను ‘రస్తా’ మొదటి నుంచి అనుసరించింది.
అందుకే, వంశీ పులి, వంశీ కలుగొట్ల వ్యాసాలకు ‘రస్తా’ ప్రాధాన్యమిచ్చింది.వంశీ పులి ఎప్పటికప్పుడు ‘రాష్ట్రంలో రాజకీయం’ తీరుతెన్నులను సూటిగా సరళంగా పరామర్శించారు. వెనుకబడిన ప్రాంతం రాయలసీమ పై చర్చించే ప్రయత్నం ‘రస్తా’ తన చాతనయినంత మేరకు చేసింది. మరింత ఎక్కువగా చేయాలని ప్రయత్నించింది. కొంత వరకే కుదిరింది. ‘ప్రతిరోజు’ పేరుతో దైనందిన జీవితం మీద తోట రాంబాబు వ్యాఖ్యానాలతో ‘రస్తా’ అందగించింది. ఎడనెడ, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి ‘మంచి మాట’ వల్ల కూడా.
ఈ రచనలన్నీ, వీటిపై వివాద ప్రవాదాలు కూడా ‘రస్తా’లో అలాగే వుంటాయి. మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వొచ్చి చదువుకోవచ్చు.
తరువాత్తరువాత; ఈ స్థలాన్ని ఇంతకన్న బాగా వుపయోగించవచ్చా?
ఏమో. చూద్దాం. 🙂
ఇప్పటికి సెలవు.
29-3-2020
రస్తా
మళ్ళీ
రావాలని
కోరుకుంటూ
మీ
సలహాలు
సూచనలు
ఆశిస్తున్నాను
Thank you సర్
గిరిప్రసాద్. చెలమల్లు
అబినందనలు సర్ . నేను నీల నవల మీద రాసిన విమర్సా కూడా ప్రచురించారు థాంక్స్
రస్తా మళ్లీ వస్తే మళ్లీ రాస్తా.
అందర్నీ తలోమాట తలుచుకుని తలుపు మూసేస్తున్నారన్నమాట ! లోపల కూచుని ఏం చేద్దామని వ్యూహం ? పత్రిక ఆపడం నచ్చడం లేదు. మీ తొలి సంచిక సంపాదకీయం ఎంత ఉత్తేజాన్నిచ్చింది ? ఇది అంత అసహనాన్ని ఇచ్చింది.
రస్తా లేకపోతే, హెచ్చార్కే లేకపోతే నేనిన్ని వ్యాసాలు రాసేవాణ్ణి కాదు.
చదివేవాణ్ణి కాదు. కవిత్వ పిచ్చి పట్టించింది రస్తా ! అందుకు చాలా కృతజ్ఞుణ్ణి. కానీ ఆపేస్తున్నందుకు కోపంగా ఉంది. 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
రస్తా విరామం తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు.మనస్సొప్పుకోవడం లేదు సర్.ఎన్నెన్ని నేర్చుకున్నాన్నేను ఎలా చెప్పేది.ప్లీజ్ మాకోసం త్వరగా మీ నిర్ణయం మార్చుకుంటారని ఆశపడుతున్నాను సర్
కొన్నిసార్లు విరామ చిహ్నాలు మంచివే.నావరకు నాకు విపరీతంగా అధ్యయనం నేర్పింది రస్తా.నా వ్యాసాల పరంపరకి మూలాలు పడింది ఇక్కడే . వ్యాసం ఎలా రాయాలి అన్నది వ్యాసానికి వ్యాసానికి మధ్య చాలా నేర్చుకున్నా. స్మరణ మీద కొన్ని వ్యాసాలు, ఒకటో రెండో కవితలు, కొన్ని సమీక్షలు చేశాను. రస్తా లో రాయడం వల్ల బయటకాస్త బిజీ కావాల్సి వచ్చింది. ఆపేయడం పూర్తిగా కాదు కదా మళ్ళీ వస్తే బాగుంటుంది.
Hrk మీకు కూడా రెస్ట్ అవసరం.