అనగనగా ఒక కథ… ఏం చేస్తుందంటే !

తెలుగుతనము అంటే అచ్చమైన అర్థం ఏవిటో నాకు తెలీదో లేదా మరిచానో?  కానీ వేలూరి శివరామశాస్త్రి గారి కథలు చదువుతున్నప్పుడు మనసు అచ్చమైన తెలుగు ఇదే ఇదేనని పలకడం మాత్రం గమనించాను.  ఈయనని చదువుతుంటే తెలుగు అనేది ఒక తియ్యని భాష అని, ఇది ఒకప్పుడు చాల సంపన్నంగా ఉండేదని కూడా తెలుస్తూ వుంటుంది సాహిత్యం మీద  ప్రేమతో  బ్రతికే నా వంటివాడికి. ఆదివారం ఆదివారం పత్రికల్లో కథల బారినబడి ప్రాణాలు కోల్పోయే నాకు ఇంకొంత కాలం ఊపిరూది  బ్రతికించే ప్రాణవాయువు ఇటువంటి  రచనలే అని కూడా ఎరుక కలుగుతుంది. పుసులు పట్టినట్టు అయిన కళ్లను ఉన్నట్టుండి  రససిద్ధి దారి పట్టించేది ఈ ఇట్టి కథకులే. కథా విషయం ఎన్నిక, భాషా విన్యాసం, క్లుప్తత, కథ నడకలోని పచ్చని దారి, పాత్ర నడతలో నాణ్యత, గొప్ప పనితనం, కథ అనే  ప్రక్రియ పట్ల గౌరవం…  శాస్త్రిగారి కథలలో  ప్రతిబింబిస్తుంది. చేతనయిన వారు  కథా రచన చేపట్టితే ఆ సాహితీ ప్రక్రియ ఎంతగా భాషని సమృద్ధమైనదిగా చేసి నలభై కాలాలు ఎలా నిలబెడుతుందో తెలుసుకోడానికి వేలూరివారి కథానికలు చదవాలి. (ఇది రూలేం కాదు, మన అజ్ఞానం వల్ల మనకేం నష్టం లేదని అనుభవవేద్యము నాకు).  వేలూరి శివరామశాస్త్రి గారి రచనలో నాకు తోచి ఎక్కడా భాషాడంబరం లేదు, అత్యంత  సముచితమైన  భాష,  గ్రాంధికంగా తోచే  అత్యంత వ్యావహారిక నడక ఈయన వ్రాతది.  

వేలూరి శివరామశాస్త్రి గారి కథా భారతి శాస్త్రి గారి రచనలలో నేను మొదలు పెట్టిన మొదటి పుస్తకం. ఇది మొత్తం పదకొండు కథల  సంకలనం. ఇందులో  మొదటి కథ తల్లి లేని పిల్ల తో మొదలవుతుంది.  ఇదంతా ఈ కథ గురించి నేను వ్రాసుకున్నది కాదు ఈ కథ నాతో వ్రాయించినది ఈ కింది మాత్రము.

చిట్టెమ్మ మేకల మంద నడుమ కూచుంది. చుట్టూ పది పన్నెండు దుత్తలు, ఐదారు చెంబులూ. చిట్టెమ్మ కొడుకు రాఘువులు మేకపాలతో ఒక చిన్న గుంట అలికి దానిలోనూ, ఒక చిన్న రాతి తొట్టిలోనూ కుక్కలకూ, కుక్క పిల్లలకూ మేకపాలు పోస్తున్నాడు. రాఘువులు తండ్రి నాగాయ మంద చివర నించుని మేకలని పరీక్ష చేసి పళ్ళు కదిలిన వానికి క్షౌరం చేసి చక్రాంకితాలు వేశాడు. కొన్ని మేకల డెక్కల నడుమ ముళ్ళు లాగాడు. ఒక మేకవి కాలిమీది వెంట్రుకలు లిక్కితో కోసి నెత్తురు కంటచూసి- ఓరే నాయనా! ఉప్పుపెట్టి రుద్దు” అని పురమాయించాడు”

నాగాయ తన కొడుకును పురమాయిస్తే పురమాయించాడు కానీ, ఊరికే టైమ్ పాస్ కొద్ది   కూచుని కథ చదూకోకుండా ఇప్పుడు  ఇక్కడ తెచ్చుకోవాల్సిన చావు  ఏవిటి? ఎందుకుని  ఈ చక్రాంకితాలు,  అదీనూ పళ్ళుకదిలిన వాటికే ఎందుకు?  లిక్కి దూసి మేక నెత్తురు పరీక్ష చెయ్యడం అదేవిటి?  సరే ఉప్పు రాయడం ఎందుకో కాస్త అంచనాకు అందిందనుకో. కంప్యూటరు ముందు టిక్కుం టిక్కుం అని ఏ గూగుల్ వాడిని అడిగితే వీటికి సమాధానం దొరకాలి??? ఇలాంటప్పుడే  నాకు  ఆచ్చంగా రక్త మాంసాలతో పల్లె జీవితం రుచి ఎరిగిన చదువరులు, విషయ జ్ఞానం గల్గిన  విద్యాకరులు పనికి వస్తారు. విషయం ఏమిటో మనకు విప్పి చెప్పడానికి.  పైగా వారు కథకులు అయితే అంతకన్నానా! ఎపుడైనా  గ్రామీణ జీవితం మరియూ రచన  అనే మాటలు తలవగానే విశ్వనాథ సత్యనారాయణ గారి ఆత్మకథలోని కొన్ని వాక్యాలు గుర్తుకు వస్తాయి

మాగాని పల్లెటూరిలో పుట్టి పెరుగనివాడు. రెండవ పక్షములో మెట్ట పల్లెటూరైనను సరియే- మహాకవి కానే లేడు. వర్ణనా సౌభాగ్యము వానికి తెలియనే తెలియదు, మాతృభాషలోని రామణీయకపు లోతులు వాని కందవు. వాడు మర్మ కవి కావచ్చును, బ్రహ్మ కవి కావచ్చును. వైయక్తికానుభవమును చెప్పెడి కవి కావచ్చును, వారందరును మహాకవు లెప్పుడును కాలేరు. వారికి రసానుభూతి యుండదు. వారి రచనలలో రసస్పర్శ యుండదు. ఒట్టి పట్టణములలో పెరిగిన వాడు నేటి ఇంగ్లీషు రచయితవలె తయారగును. నా పల్లె జీవితము నాకు ప్రధానముగా కవిత్వము వచ్చుటకు, కవి నగుటకు, అనంత కల్పనలు చేయగలుగుటకూ , నిరాఘాతముగా వర్ణనలు సాగించుటకు, పలుచోట్ల యధాతథముగా వర్ణించునట్లు కనిపించుటకు నాకిది యంతయూ పునాదియైనది….

ఇదంతా కథా రచన, కవిత్వ రచన సాగించే వారి కల్పనకు వుండవలసిన పునాది. మరి ఒక చిత్రకారునిగా చిత్ర రచన సాగించేవానిగా నేను కోల్పోయినదేమిటి? పూర్వం ఒకసారి గురువులు, మహా రచయిత పతంజలి గారు తమ వేటకథల పుస్తకానికి నన్ను బొమ్మలు అడిగారు నేను ఆయనతో విన్నవించుకున్నదేవిటి? “మీ పుస్తకం లోని కథలు మీ ప్రాంతానివి, అక్కడి వాతావరణం, ఇళ్ళ తీరు తెన్నులు, మనుషుల రూపు రేఖలు, కట్టు బొట్టు అదేమీ నాకు తెలియనిది, ఊహకు అందనిది. అదంతా ఒకటి అయితే ఇక్కడ ఈ కథలో మీరు వ్రాసినదాన్ని చూడండి అన్ని పందుల్లాగా తురువోలుపంది కుక్కల్ని జూసి పరిగెత్తలేదు. తాజుగా నడుస్తూ ఒక సీమ నేపాళం పొదలో దూరింది. కుక్కలు ఆ పొద దగ్గరికి పరిగెత్తాయి. కుక్కలు ఆ పొదని సమీపించే సరికి ఢోక్ మని ఆ పంది ఒక పొలి కేక వేసింది. ఒక పంది అంత పెంకిగా కేక పెట్టడాన్ని జగన్నాధరాజు ఎన్నడూ వినలేదు. కుక్కలు పొద చుట్టూ ముసిరేయిగాని, పంది వేస్తున్న  కేకలకు  జంకి పోయి పొదలో దూరడానికి అవి సాహసించలేదు.నేను పుట్టిబుద్దెరిగాకా నేపాళం  పొద అనే పలుకే వినలేదు, మా ఊళ్ళో పందులు  పిల్లల్ని నిండా వేసుకుని పెంట తినడాన్ని చూడ్డం తప్ప వేటకుక్కల్ని కూడా ఉచ్చబొయించే తురువోలు పంది అనేదాన్ని ఊహించను కూడా లేను. పైగా ఈ పుస్తకం పిల్లలకోసం అంటున్నారు, తెలీకుండా, తెలుసుకోకుండా రాని బొమ్మలు వచ్చినట్టు గీసేసి ఇదే వేట అని ఇదిగిదిగో అదే నేపాళం పొదని చెప్పి పిచ్చి గీత గీసి పిల్లల్ని మోసం చేయ నా చేత రాదు సార్” అని తప్పుకున్నా.

ఇదంతా కేవలం నాకు ప్రకృతితో పరిచయం లేకపోవడం వల్ల, టౌన్ జీవితంలో పెరగడంవల్ల, ప్రకృతితో పరిచయం చేసుకోవాలనే ఎరుక లేకపొవడం వల్ల జరిగింది. ఇప్పుడు అదంతా తెలుసుకోవాలని  ఆ స్పృహ వున్నాకూడా సంవత్సరానికి రెండు మూడు నెలలు స్కెచింగ్ పైన ఊళ్ళు తిరగడానికి అనుమతి దొరకని జీవితం. అందువల్లనే నా బొమ్మలు కేవలం బొమ్మలే, రసస్పర్శ తెలీని గీతలు. కాలం సాగి గాలిలో ధూలిలా జీర్ణమయ్యే ఖాలీ సంతకాలు. చివరకు మిగలని చిత్రకారుల జాబితా తాలుకు విషాద యోగం ఇది.

పనిగట్టుకు మనస్సు ఇలా విషాదమవడానికి ఒక  మంచి కథ మాత్రమే ఇంత పనిచేయగలదు ఆనందంని.  మంచి కథ అంటే ఏవిటి? కొలనులోని నీటిని  చేత్తో తాకినా చెదరని ప్రతిబింబం వంటిది కదా. అలాగని అది గడ్డకట్టలేదు సుమా. దోసిలితో నీరు పట్టి తాగు ఆ వాక్యాలు నీ గుండెని హృదయావరణ త్వచం వలే కావిలించుకుంటాయి చూడు. మంచి కథ కాలాలు గడుస్తూ ఉండినా కమ్మగా గుర్తుండిపోయిన చక్కని కల వంటిది కాదా? కథ అనేది వేలూరి శివరామశాస్త్రి గారి వంటి వారి చేతిలో పడ్డప్పుడు మాత్రమే అది మంచి కథగా మనగలుగుతుంది . శాస్త్రి గారి వంటివారిని మాత్రమే కథకులని గుర్తుంచుకుంటారు నావంటి సాహితీ ప్రేమిక తరం తరం.

– అన్వర్

అన్వర్ పుట్టింది కశ్మీర్ లో, పెరిగింది రాయల సీమలో, ప్రస్తుతం  హైదరాబాదులో.

చదవడం ఇష్టం, సినిమాలు కూడా. చదివింది  చూసింది ఊరికే వదిలెయ్యలేక చేతనయినట్లుగా రికార్డ్ చెయ్యడం కూడా ఇష్టం .

బొమ్మలంటే ఇష్టం, డబ్బులంటే కూడా. డబ్బులకు బొమ్మలేయడం మరీ మరీ ఇష్టం.

అన్వర్ రాతలకు :http://thisisanwar.blogspot.in/

అన్వర్ గీతలకు: https://www.flickr.com/photos/anwartheartist/

 

***

అన్వర్

అన్వర్ పుట్టింది కశ్మీర్ లో, పెరిగింది రాయల సీమలో, ప్రస్తుతం  హైదరాబాదులో.

చదవడం ఇష్టం, సినిమాలు కూడా. చదివింది  చూసింది ఊరికే వదిలెయ్యలేక చేతనయినట్లుగా రికార్డ్ చెయ్యడం కూడా ఇష్టం .

బొమ్మలంటే ఇష్టం, డబ్బులంటే కూడా. డబ్బులకు బొమ్మలేయడం మరీ మరీ ఇష్టం.

అన్వర్ రాతలకు :http://thisisanwar.blogspot.in/

అన్వర్ గీతలకు: https://www.flickr.com/photos/anwartheartist/

2 comments

  • అన్వర్ కథకుడు చిత్రకారుడు విమర్శకుడికి మించి నోరూరించే తిరునల్వేలీ హల్వా.

  • మీ గీత ఇష్టమే మీ రాత మరి మరి ఇష్టం సర్

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.