గర్జించే పోస్టర్లు… గాండ్రించే బ్యానర్లు

 

ఎర్రని ఎరుపు, నల్లటి నలుపు-  రెండూ ఒకటే మాట్లాడతాయి. చిత్రకళ ఈ రెండు రంగుల్ని ప్రతిఘటనకు, నిరసనకు ఒకటిగానే చూపెడుతుంది చిత్రంగా. ప్రాపంచికంగా ఒక పెను మార్పు తెచ్చిన మహా సంఘటన మేడే. రెండే పదాల్లో ఇమిడి సదా నిలబడే ఈ మే డే ప్రతిధ్వనించే ఎరుపు రంగు కి ఊతంగా నిలిచిన రంగు నలుపు… నలుపు తెలుపులో చెప్పాలంటే రంగు మన ఉద్వేగపు భాష లోంచి రూపాంతరం చెందుతుందనిపిస్తుంది.

కరుణ ముఖ్య అని గ్రహించటానికి, మునుపు వంతెన కింద చాలా ఎరుపే ప్రవహించింది. క్రౌర్యం పారించిన నెత్తురు చేసిన ప్రకటన ఎరుపే. అణగారిన కొద్దీ కేక పెట్టేది ఎరుపే… నిత్య హెచ్చరికగా నిలదీసేదీ ఎరుపే…. చిత్రకళలో ఇది చాలానే కనిపిస్తుంది. ఐతే చిత్రకళా ప్రపంచంలోని చిత్రమేమంటే నిండా ఎరుపు గాని, చిక్కని నలుపు గానీ లేకుండానే విప్లవ చైతన్యాన్నీ పలికిన కేన్వాస్ లు, ఆర్టిస్టులు వెరసి పెద్ద జాబితానే వుంది. ఇది చూస్తే చిత్రకళ చరిత్రలో టూకీగా ఉదహరించటానికి వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు గోయా, పికాసో. ఇక్కడ మన చిత్త ప్రసాద్. ఇటువంటి మొన్న, నిన్నటి చిత్రకారులు కొందరు అనేక సార్లు బొత్తిగా బూడిద రంగులో తాము చెప్పేవన్నీ పలికించారు. నిజానికి ఏదేనా చెప్పడంలో, అనిపించడంలో, కనిపించడంలోనే గొప్ప కళ మహాకవిలా కాస్తంత అవతలే వుంటుంది. కళ మన మొహం మీద నిరర్థకంగా నాట్యం చెయ్యదు కదా… చూడండి గుయెర్నికా చిత్రంలో మనల్ని నిలువునా వణికించే ఎరుపు నెత్తురు లాగ ఏపాటీ పైకి కనిపించదు. అంతకు ముందు స్పానిష్ సివిల్ వార్ కాలపు చిత్రాల్లోనూ ఇంతే… తిరుగుబాటు సమూహాల్లో దొరికిపోయింది గాక, ఎదురు ప్రశ్నించిన వాళ్లను ఆనాడు మేడ్రిడ్ గోడల దగ్గర నిలబెట్టి పొడవాటి కోట్ ధరించిన సైనికులు తీరిగ్గా తమ తుపాకులలో బులెట్ లు నింపుకుంటూ కాల్చి పడేస్తోంటే పైకెత్తిన చేతులతో అలాగే కూలిపోయే పేదల దుస్తుల రంగు తెలుపు… చంపే సైనికుల దగ్గర వున్నవి పసుపు రంగు వెలుగునిచ్చే పాతకాలపు పొడవాటి పెట్టెల వంటి లాంతర్ లే. ఇవే బీభత్సాన్నీ చూపెట్టాయి. రంగు ఏదయినా సందర్భాన్ని బట్టి దాన్నీ వాడే తీరుది ఎరుపే. దీన్ని గమనించడమే కంటి పని. అలాగే నాటి మేడే ముందు వెనుకల, ఇరుపక్కల చిచ్చు రేపిన సంఘటనల వరస రేపెట్టింది చుర్రుమనే ఎరుపే. పార్టీల, సిద్ధాంతాల అఫీషియల్ రంగు ఎరుపయినా గాని అక్టోబర్, అమ్మ, దోస్ టెన్ డేస్, రెడ్ స్టార్ ఓవర్…. వంటి అనేక పదాలు ఏ రంగులో అచ్చయినా అవి ఎరుపునే కదా అనువదించాయి. ఒకనాటి ప్యారిస్, న్యూయార్క్ వీధులు, అక్కడి నిరుపేద కళాకారుల చీకటి గదుల్లో అచ్ సింథి (స్పెల్లింగ్ కరెక్టే నండోయ్) అనే మూసిన నీలి రంగు సీసా పలికింది తిక్కరేగిన ఎరుపే. యుద్దానంతరం, ఉద్యమ విజయానంతరం శాంతి పలికిందీ ఎరుపే. చైనా, టిబెట్ ల మార్మిక వజ్ర సమాసం బుద్ధ ప్రతిమ, దాని ముందుండే ఎర్ర చందనపు అడ్డుకట్ట చెక్క కూడా ఎర్రటిదే. వివిధ జాతుల నాయకులు చుట్టూ మూగి వుండగా ఉత్తరాలు రాస్తున్న లెనిన్ చిత్రంలో చలిని తట్టుకోలేని చేతులకు వేడినిచ్చింది ఎరుపే. కిక్కురుమనకుండా రోజుకు 25 గంటలు పని చేయడాన్ని ప్రశ్నించిన కార్మికుడు హద్దు మీరి చేసిన నినాదాల అక్షరాల్లోనికి జోరు తెచ్చింది ఎరుపే.

అలాగని ఎరుపు కేవలం ఒక స్లోగన్ కాదని పికాసో తన వాక్యాల మధ్య, మాటల మధ్య శాండ్ విచ్ లా చెబితే పార్టీ శ్రేణులకు అర్థం కాలేదు. అసలే పికాసో కదా, స్టాలిన్ ను ఒక సిసలైన జార్జియా రైతన్న గెటప్ లో చార్కోల్ గీతలతో వేసి ఇచ్చాడు. కొంత ఆలస్యమైనా  అది స్టాలిన్ కు అర్థమైంది. పార్టీ చిన్నా పెద్దలకు వారు కోరుకున్న ఎరుపు అగుపడలేదు. పోలిష్ పోస్టర్ లు, రష్యాలో ముట్టడి దృశ్యాల కేన్వాస్ లు, మేడే నిరసన వరుసల జనం బేనర్- ఏవైనా, అన్నీ ఎరుపు రంగునే ప్రత్యేకించినా వాటి లోని మనుషుల, అక్షరాల, కదలికల ఏర్పాటు, బ్రష్ స్ట్రోక్ లు చిత్రపరంగా మహా చైతన్యాన్ని, భూకంప ప్రకంపనలనూ చూపగలిగాయి. మంచు పిట్టలు సైతం రాలిపడే చలి వర్షంలో పాత కాలపు తుపాకీ పట్టిన ముసలి రైతు పిడికిలి, రాలి పడుతున్న చింపిరి తల ఉక్రెయిన్ కార్మికుడూ ధ్వనించే ఎరుపూ ఒక గొప్ప కూర్పువల్ల ఆ చిత్రాల్లో, పోస్టర్లలో సాధ్యపడింది. మేడే స్థాయి ప్రతి ఉద్యమం ఊపు చూపేందుకు చిత్రకారులంతా చూపిన ఆధునిక పనితనం ఎర్రటి బ్రష్ తనమే. కొన్ని తిరుగుబాటు సంఘటనలు కాలమేఘం నీడల వెనుకకు తరలిపోయినా వాటి స్ఫూర్తి, ప్రభావం, వెలుగులను పదిలం చేసిన చిత్ర, శిల్ప కళల్లోని కళ ఎరుపే, దాన్ని నిలిపిన ఆధునిక కూర్పే.

ఆధునికంగా ఉద్యమం చూపే చిత్రకళలో భాగమైన భారీ బేనర్ లూ, పోస్టర్ లూ అలా ఎలాగో సులువుగా రచనల్లో అలవాటయిన స్టాక్ ఎక్స్ ప్రెషన్ లా ఊడిపడలేదు. బేనర్, పోస్టర్ ల సృష్టి ప్రథమ దశ పెద్ద కథే. చిత్రకళ అతి ప్రాచీనమైన దయినప్పటికీ ఫోటోగ్రఫీ పుట్టుకురావడానికి ముందు కార్టూన్, కేరికేచర్, పోస్టర్ కళ చరిత్రలో అత్యవసరాలయ్యాయి. కారణం రెండు రకాల విప్లవాలు. శాంతియుత విప్లవం, సాయుధ విప్లవం…. రాచరిక, జమీందారీ వ్యవస్థలు తెచ్చిపెట్టిన దుస్థితిని, మానవ విలువల విధ్వంసాన్నీ ఆకాశం అంత ఎత్తుగా విస్తృతంగానూ కళాపరంగా ఆధునిక శైలిలోకి తర్జుమా చేసి చెప్పవలసిన సందర్భాలు తోసుకు వచ్చాయి. అందుకే కళాకారులు నాటికి లేని కొత్త ప్రయోగాలు ఆలోచించి చేయవలసి వచ్చింది. ముఖ్యంగా ఫ్రాన్స్ లో నెపోలియన్ పతనానంతరం అక్కడి అకాడమీల పాత తరాన్ని వెనక్కి నెట్టి కొత్తదనానికి పెద్దగానే కళాకారులు ఉద్యమించవలసి వచ్చింది. ఆట్టే శబ్దం చేయని ఉద్యమం అది. ఆ వరసనే రష్యా, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో నృత్య సంగీత నాటక ప్రయోక్తలు కొత్త శైలి కోసం చిత్ర, శిల్ప కళాకారులతో పోటీ పడవలసి వచ్చింది. . చిత్రకారులకయితే నాటికి అలవాటు లేని రెండు రకాల దృశ్యాలను తక్కువ రంగుల్లో, రేఖల్లో, కూర్పు, వెలుగు నీడల్లో మెలోడ్రామా రెచ్చిపోకుండా చూపే పనితనానికి కృషి మొదలయ్యింది. ఆ దృశ్యాలు- ఒకటి- తిరుగుబాటు దృశ్యం. రెండు- విజయానంతర సంబరాలు, ఉత్సవాలు జరిగే దృశ్యం. ఐతే వీటిని చూపడంలో కళ విలువ తరిగి పోరాదన్న నియమం లేకపోతే ఏమవుతుందో కూడ ఊహించాల్సి రావడమే కళాకారుల మధ్య గట్టి చర్యలకు దారి తీసింది- వాట్ మస్ట్ బి డన్ వలె. ఉద్యమ దశ చెప్పే ఒక పోస్టర్ తయారీలో కళాపరంగా కళాకారుల తిప్పలకు ఉదాహరణ…. అతి సామాన్యుడికి, ఉద్యమకారుల గుంపులోని ఆవేశపరులకు సైతం మేడే వంటి సామాజిక చైతన్య సంకేతాన్ని క్లుప్తంగా, పదునుగా, శాశ్విత చిరునామా లాగ ఎలా చూపెట్టాలి? ఇది మొదటి తరం ఆధునిక కళాకారుడికి పెద్ద సమస్య అయింది. తిరుగుబాటు రాస్తాలో ఢంకా మోగిస్తూ కదిలి వచ్చే కార్మిక బృందం లెనిన్ నిప్పులు కురిపిస్తూ చేసే ప్రసంగాలు వినే జనం, నిండు గర్భంతో వున్నా సరే ముందుకు నడిచే తల్లులు, ఫ్యాక్టరీ కార్మికులు తమ నూనె మరకల చేతుల్లోని పనిముట్లను ఆయుధాల్లా ఆకాశానికెత్తి కదిలే హోరు, మూత పడ్డ సర్కస్ కంపెనీ విదూషకులు, వారి పిల్లలు వీథుల్లో చేసే ప్రదర్శనలు, సంకెళ్లు తెంపుకుని వొళ్లు విరుచుకునే వీరులు- హెర్క్యులిస్, శాంసన్, స్పార్టకస్ వలె గర్జించటం వంటి దృశ్యాలు చూపేందుకు ఫ్రెంచి, రష్యన్, స్పానిష్, జర్మన్, అమెరికన్ కళాకారుల వలె అనంతర కాలంలో ఇక్కడ మన చిత్త ప్రసాద్ వంటి చిత్రకారులూ తలకిందులై ఎనిమిది కష్టాలూ పడ్డారు. కదలిక లేని పోస్టర్ లో విశాలమైన చైతన్యాన్ని ఏర్పాటు చేసే పనితనం, దాని సాధనా పెద్ద ప్రయత్నమే. దీని వెనుక కళకు అర్థం తెలీని అర్జెంట్ గా పోస్టర్ తయారు చేయాలన్న పార్టీల పెద్దలతో పేచీలు పడి మరో రకం తిప్పలు పడవలసి వచ్చింది. కళంటే పడి చచ్చే కళాకారులకు ఇదంతా ఒక క్రమం, సాధన దశ, పరిశ్రమ, శ్రమ పుట్టించే సౌందర్యం కదిలించిన కళారూపమూనూ.

కవితలో పదాల వలె, నాటకంలో సంభాషణ వలె, కథలో క్లుప్తత వలె, నినాదంలో కుదింపు వలె, చంధస్సు దాటిన లయ వలె ఒకటి అరా రంగులతో కాగితంపై బేనర్ వస్త్రంపై సంగ్రహంగా, సారాంశం వలె చిత్రం కూర్చటం అంటే కళలో సత్తా చూపటం. ఇందులోని అసాధారణ శ్రమ, బుర్ర వేడెక్కించే (మనది కాదు, కళాకారునిది) శ్రమలో ఉదాహరణలు….మొదటి దశలోనివే. ఆకాశం ఎత్తులో దేవతా మూర్తి వంటి విప్లవ నినాదాన్నో, హక్కుల పత్రాన్నో మేఘాల దొంతర వంటి సిల్కు బేనర్ పట్టి చూపటం ఆనాటికి ఒక రకం క్లాసికల్ దశ వంటిదే. ఆ దృశ్యాన్ని నేల మీదికి దించి జనరంజకంగా, వాస్తవికంగా చూపెట్టడం ఎలా? కొండల వెనుక సూర్యోదయాన్నో, పెద్ద కెరటం వంటి, మడతల వరుసలు గల ఎర్రజండా నేపథ్య దృశ్యం లేకుండా చూపిద్దామా? పోనీ కార్మికుల గుంపు కదలికను లోహపు ముద్దలా చిత్రిస్తేనో? ఒక డప్పు/కాగడా/ఒక్క బిర్చి చెట్టు చిత్రిస్తే చాలదూ? వీటన్నిటి స్థానే ఛాయా చిత్రాలు వచ్చి పడ్డాయి గదా- ఎలా? ఈ దృశ్యాల్నే సిల్హటి- వెలుగు నీడలతోనే చూపిస్తే నయం కదా? ఇలా చేస్తే దృశ్య రూపం మరీ ఆధునికమై చూసే వారికి అర్థం కాకుండా పోతుందా? ఇలా వేయి పూలో, వెయ్యిన్నొక్క ఆలోచనలో వికసించి, సంఘర్షించుకుంటేనే పోస్టర్, బేనర్లపై తిరుగుబాటు రూపాలు సిద్ధమయ్యాయి. పాత అంతరించి సరికొత్తదనం తిరుగుబాటు బావుటాల చిత్రకళ వచ్చి నేటికి నిలిచింది. దీన్ని ఆలస్యంగా గుర్తించిన ఇప్టా కళాకారులూ, వారి సన్నిహిత కళాకారులూ, వారి వెనుక జాతీయ కవులూ విప్లవ చిత్ర దృశ్యాలకు ఇక్కడ మన దేశంలో అదనపు విలువలు కూర్చారు. అప్పటికి గాని పాత బెంగాలీ తనం విప్లవ చిత్రకళను వదల్లేదు. తమ సొంత శైలిలో నందలాల్, చిత్త ప్రసాద్ లు పాత శాంతి (ని)కేతనాన్ని దించి కొత్త కేతనాన్ని పైకెత్తి పట్టారు ఈ దశలో.

యూరప్, రష్యా దేశాల తిరుగుబాటు బావుటాల కళని న్యూయార్క్,, వాషింగ్టన్ కళా కేంద్రాలు, రష్యాలో హెర్మిటస్, త్రెచ్కోవ్, అరోరా, పుష్కిన్ ఆర్ట్ గేలరీలు, ప్రచురణ సంస్థలు గౌరవించి ప్రదర్శించాయి. ఆనాటి ఉడ్ కట్ ప్రింట్ లు, కేన్వాస్లు, పోస్టర్ లు, బేనర్ల భ్లాక్ లు నేటి ప్రపంచ వ్యాప్తంగా సకల డిజైనర్లకు కళాపరంగా కొత్త ఆలోచనల ఊపిరి ఇచ్చాయి. ఐతే ఆనాటికే  చైనా తన సంప్రదాయ శైలినే ఆధునికంగా విప్లవ బేనర్ ల పై సవరించి కొనసాగించింది అది వారి కళకు సంబంధించిన సూత్రం… సౌందర్య సూత్రం. కళాకృతిలో కళకు ఎక్కువ చోటు ఇచ్చినంత కాలం ఉద్యమ, విప్లవ చిత్ర కళ మేడే గళం వలె నిరంతరం పై ఎత్తున ఎలుగెత్తి పిలువక మానదు కదా

– తల్లావజ్ఝుల శివాజి

తల్లావజ్ఝుల శివాజీ వెటెరాన్ పాత్రికేయులు. కళా, సాహిత్యాలు ఆయన రెండు కళ్లు. చాల కథలు, విమర్శలు రాశారు. ఉదయం తదిిిితర పత్రుకల్లో  చిరకాలం పని చేసి, ఇప్పుడు బొమ్మలేయడమే జీవితంగా హైదరాబాదులో నివసిస్తున్నారు.

తల్లావజ్ఝుల శివాజి

తల్లావజ్ఝుల శివాజీ వెటెరాన్ పాత్రికేయులు. కళా, సాహిత్యాలు ఆయన రెండు కళ్లు. చాల కథలు, విమర్శలు రాశారు. ఉదయం తదిిిితర పత్రుకల్లో  చిరకాలం పని చేసి, ఇప్పుడు బొమ్మలేయడమే జీవితంగా హైదరాబాదులో నివసిస్తున్నారు.

2 comments

  • రక్తం లాంటి ఎరుపు! జీవం ఎరుపు. ఎరుపు నలుపైతే జీవం ప్రశ్నార్థకం.

    ఆవేశంలో యేవో రాశాను నాకు రంగులూ వాటి అర్థాలూ తెలియవు. శివాజీ వారి వ్యాసమో ఏదో చదివాక ఉన్మత్తుడినై ఇలా…

    చంద్రశేఖర్
    కర్నూలు.

  • బహుశా తక్కువ స్పేస్ లో చాలా విషయాలు వున్నాయి. ఈ రచనని దగ్గర పెట్టుకుని స్టడీ చేయాలి -ప్రభు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.