నువ్వు గుర్తొస్తావు

  

ఎందుకంటే ఏం చెప్పను
గుర్తొస్తావు అంతే.
క్రితం వరకూ నిద్రపోయిన గాఢత
అంతలోనే చెదిరి
నిద్ర మంచం మీదే కనులు విచ్చుకున్నట్టు
నువ్వు గుర్తొస్తావు.

ఆకాశంలోని మేఘాలు
నల్లని పాండ్స్ పౌడరు అద్దుకుని
క్యుములోనింబస్ మేఘాలై
గొర్రెల గుంపులా అన్నీ ఒక చోట గుమిగూడి
పగటిని రాత్రిలా తలపింపచేసినప్పుడు
నువ్వు గుర్తొస్తావు
ఆకాశపు టీనేజీ అమ్మాయి
అందమైన నీలిరంగు మెడను
అలంకరించడానికా అన్నట్టు
నెక్లెస్ ఆకారంలో
కొంగలు బారులు తీరి ఎగిరెళ్లుతున్నప్పుడు
నువ్వు గుర్తొస్తావు

భూమి ఆవిరులు ఎగజిమ్ముతున్న
మే మాసపు మధ్యాహ్న వేళ
గాలి నాలుగు గడ్డి పోచల్ని పోగేసుకుని
తనలో తానే గుండ్రంగా
గరాటులా గిర గిరా తిరుగుతున్నప్పుడు
నువ్వు గుర్తొస్తావు

చూస్తుండగానే
చూడగా చూడగా
కనుచూపు సరిహద్దుగా
పరుచుకున్న సముద్రం
చిక్కని నీలం రంగులోకి మారిపోతున్నప్పుడు
నువ్వు గుర్తొస్తావు.

సన్నని తుంపరగా మొదలైన వర్షం
కాలవకు గండిపడ్డట్టు
ధారాపాతమై
నన్ను నిట్టనిలువునా తడిపేసినప్పుడు
నువ్వు గుర్తొస్తావు.

ఇక్కడో మొక్క అక్కడో చెట్టుగా
మొదలైన వనం
నెమ్మది నెమ్మదిగా
దట్టమైన దండకారణ్యంగా విస్తరించిన
ముదురాకు పచ్చని చిక్కని నీడలను చూసినప్పుడు
నువ్వు గుర్తొస్తావు.

నువ్వైనా ఎందాకా గుర్తొస్తావులే!
నిన్ను గుర్తు పెట్టుకున్నానన్న
గుర్తు నాకున్నంత వరకు.
ఒక శుభోదయాన
నేనెవరో ఇతరులు తప్ప
నన్ను నేను గుర్తు పట్టలేని క్షణాన
నిన్నూ నన్నూ కలిపి గుర్తు పట్టే వ్యక్తి
వ్యక్తంగానో అవ్యక్తంగానో
ఎక్కడో ఉండే వుంటాడు-

(గతించి రెండేళ్ళు అవుతున్నా గుర్తొస్తున్న భాస్కర్ స్నేహానికి)

– శిఖామణి 

శిఖామణి తన మొదటి కవితా సంపుటి మువ్వల చేతికర్రతోనే సుప్రసిద్ధులై, తరువాత పదకొండు కవితా సంపుటాలు ప్రచురించారు. అవి కాక ఐదు అనువాద సాహిత్య గ్రంధాలు వెలువరించారు. నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. బోల్డన్ని అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో తులనాత్మక అధ్యయన శాఖలో ఫ్రొఫెసర్ గా పని చేస్తున్నారు. దైనందిన జీవితంలోని చిన్న చిన్న ఘటనలను… చివరికి గేటు మీద పాకే నందివర్ధనం పూల తీగెను కూడా తన లోనికి తీసుకుని కవిత్వం చేసి అందించే సుకుమార కవి శిఖామణి. స్నేహం గురించి ఆయన అప్రయత్నంగానే చాల అందంగా చెప్పిన ఈ కవిత తన కవితా శక్తికి ఓ మంచి ఉదాహరణ. శిఖామణి కాంటాక్ట్ నంబరు:  9848202526 (ఇండియా)

***

శిఖామణి

4 comments

  • అద్భుతంగా ఉంది సార్👌👌👌

  • శిఖామణి గారి మార్కు కవిత. చాలా చదవ యోగ్యంగా మెత్తగా, హత్తుకునేట్టు ఉంది. చదివి కేవలం సంతోషపడ్డామని మాత్రం చెబితే అది చిన్న మాటే అవుతుంది సార్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.