వచన ప్రేమికుడు

      

3010

చాలా కాలమైంది నేను కలల్లోకి వెళ్లడం మానేసి. తాకడానికి వీల్లేని వాటి మీద ఆసక్తి చచ్చిపోయింది.
ఇంకా పూర్తిగా తెల్లారలేదు. అప్పటికే ఇంట్లో అందరూ లేచి ఏదో దూర ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇది రోజూ జరిగే కార్యక్రమమే!
చుట్టూ చూశాను. ఇల్లు ఎంత గందరగోళంగా వుండాలో అంత గందరగోళంగానూ వుంది. మూలల్లో వేలాడుతున్న బూజు. పెన్ను వుండాల్సిన చోట దువ్వెనా, బెడ్‌షీట్‌ వుండాల్సిన చోట విడిచేసిన బట్టలు ఇలా ఎక్కడివక్కడ పడేసివున్నాయి. నేనే ఎప్పుడో పూనుకోవాలి.
ఎప్పుడెప్పుడు ఈ ఇరుకు ఇంట్లోంచి బయటపడదామా అనే తొందర అందరిలో!
మా కోసం ఇంకా మంచి మంచి ఇళ్లు ఎదురుచూస్తున్నాయి. ఎలా కావాలంటే అలా అలంకరించుకోవచ్చు. రోజుకో రంగు మార్చుకోవచ్చు. ఒక్క కమాండ్‌తో ఇల్లంతా సర్దెయ్యొచ్చు. రకరకాల పచ్చటి లాన్స్‌తో మొదలెట్టి ప్రపంచంలోని సౌందర్యాన్నంతా తెచ్చి చుట్టూ అమర్చుకోవచ్చు. అయితే ప్రతీదీ కొనుక్కోవాల్సిందే.
నేనయితే ఒకసారి ‘డాలీ’ పెయింటింగ్‌ను వారం పాటు వుంచుకున్నా నా బెడ్‌రూంలో, ఇంట్లో అందరూ డబ్బు దండగంటున్నా వినిపించుకోకుండా.
ఇదంతా డ్రీమ్‌బుక్‌ మహాత్యం. దీన్ని సాధ్యం చేసింది మాత్రం ‘అబ్సల్యూట్‌ రియాలిటీ’నే! వర్చువల్‌, ఆగ్‌మెంటల్‌, మిక్స్‌డ్‌ రియాలిటీస్‌ని దాటి చాలా దూరం వచ్చేసింది ప్రపంచం.
పూజలూ, పునస్కారాలూ, షాపింగ్‌, డ్రెస్‌ ట్రయల్సూ అన్నీ డ్రీమ్‌బుక్‌లోంచే. అయినా మంచిడ్రెస్సులేసుకుని బయటికెళ్లే అవసరం ఎప్పుడో కానీ రాదు.
ప్రపంచమంతా డ్రీమ్‌బుక్‌లో కూరుకుపోయిన రోజులివి.
తెల్లారక ముందే అందరూ ఎవరి గిల్మెట్లు వాళ్లు తగిలించుని డ్రీమ్‌బుక్‌ లోకి వెళ్లిపోతారు. అది రాత్రి తొమ్మిది, పది, పదకొండు అలా కొనసాగుతూనే వుంటుంది. భోజనాలకు, కాఫీ టీలకు తప్ప ఇక ఈ ప్రపంచంతో పనే వుండదు.
వుద్యోగాలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమే! అదీ డ్రీమ్స్‌బుక్‌ లోంచే!!
ఇంకా నయం అందులో తినడానికీ, సెక్స్‌కీ  వీలుండదు. లేకపోతే అది కూడా అక్కడే  కానిచ్చేవాళ్లు. ఇక ఈ ప్రపంచంతో పనే వుండేది కాదు.
అయినా నా వెర్రి కానీ మనిషి భౌతిక అవసరాల్ని తీర్చుకోడానికి తప్ప ఈ భూమ్మీద బతికిందెప్పుడు? అంతా మానసిక ప్రపంచమేగా!
దాన్నే ఇప్పుడు సైన్స్‌ మరింత గాఢం చేస్తూ ఆలోచనకు రూపాన్ని కూడా అమర్చిపెడుతోంది. అంతే తేడా! నిజంగా కొత్తది ఈ గ్రహం మీద అవతరించాలంటే విశ్వహృదయం పూనుకోవాల్సిందే!
ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడబోయినా ”ఎందుకు నాన్నా ఇక్కడ. హాయిగా డ్రీమ్‌బుక్‌లో మాట్లాడుకోక” అంటారు. డ్రీమ్‌బుక్‌ పరిసరాలు అంత ఆహ్లాదంగా వుంటాయి మరి.
”నేను డ్రీమ్‌బుక్‌లో లేను కదా” అంటే నీ ఖర్మ అన్నట్టు అదోలా చూస్తారు. ఏ అర్థరాత్రో అపరాత్రో మాట్లాడాలి అదీ ఏదైనా చాలా ముఖ్యవిషయమైతేనే.
ఏదో బరువు నాలో! ఇది లోకం మారడం వల్ల వచ్చిన బరువు కాదు, నేను మారపోవడం వల్ల వచ్చిన బరువు!
***
బాత్‌రూముల్లో అంతా బిజీబిజీగా వున్నారు.
దీపాలు అవసరంలేని కాంతి హాలు నిండా!
కాంతిని కాస్త తగ్గిద్దామనే ఆలోచనని పక్కకి తోసేశా. ఇంకాసేపు ఇదే ఆలోచిస్తే కాంతి తగ్గిపోతుంది. అందరూ నావేపే గుర్రుమంటూ చూస్తారు మరో ఆలోచన లేకుండా. అలాంటి చాదస్తుడు నేను కాక మరెవరున్నారు ఈ ఇంట్లో! నాకెందుకీ సెట్టింగ్స్‌ అన్నా వినిపించుకోకుండా డీఫాల్ట్‌ ఇంట్లో అందరికీ పెట్టిపోయాడు లైటింగ్‌ ప్రొవైడర్‌. ఇవన్నీ నాలోంచి తీయించుకోవాలి! ఎందుకొచ్చిన గొడవలు వూరికే?
ఓ మూల నించి నిర్లిప్తంగా గమనిస్తున్న జెర్రీ. అంటే మా పిల్లి! అది ఏమనుకుంటుందో అంచనా వెయ్యడానికి ప్రయత్నిస్తుంటా. బహుశా వుండీ లేకుండాపోయే ప్రతిభ ఎలా అబ్బిందబ్బా వీళ్లకు అని ఆశ్చర్యపడుతూంటుందేమో! చెవుల్ని రిక్కించడం కూడా ఎప్పుడో మానేసింది ఈ ఏకాంతవాసిని. ఈ ఇంట్లో నేనూ అదే భూలోకవాసులం!
అందరూ బ్రేక్‌ఫాస్ట్‌ చేసే హడావిడిలో వున్నారు, మా అమ్మాయి, అల్లుడు, నా భార్య, మా వియ్యంకులు.
రోజూ ఇంతే! అందరి గమ్యం డ్రీమ్‌బుక్‌లోకి! నా గమ్యం పొలానికి!!
బాత్‌రూం లోంచి వస్తూనే చేతుల్ని డ్రై కూడా చేసుకోకుండా తన రెక్లయినర్‌లో వెనక్కి వాలి అడ్జస్ట్‌ చేసుకుంటోంది మనవరాలు.
ఏమిటో ఆ తొందర!
చిరాకేస్తుంది.
”అదేంట్రా. తినకుండానే డ్రీమ్‌బుక్‌” అన్నా గిల్మెట్‌ తగిలించుకోబోతున్న నా మనవరాలితో.
అయితే ఎప్పుడూ లేంది అనాలోచితంగా తన గిల్మెట్‌ని పట్టుకున్నా.
అదెంత నేరమో వెంటనే అర్థమైంది!
చురుగ్గా చూసింది నాకేసి.
నా చేతిలోని గిల్మెట్‌ని విసురుగా లాక్కుంది, తాచుపాములా.
”ముసలికంపు కొంపనిండా. ఎప్పుడొదుల్తుందో ఈ తద్దినం… బ్లడీషిట్‌” అమ్మమ్మ భాష బాగా వొంటబట్టింది దీనికి.
చివుక్కుమంది.
బిగుసుకుపోయాను!
విసుక్కోవడం మామూలే. కానీ… ఈ స్థాయిలో ఇదే మొదటిసారి.
నా మనవరాలికేసి ఎగాదిగా చూశాను.
పదహారేళ్ల పిల్ల. నా కంటే నాలుగంగుళాల పొడగరి!
చిన్నప్పుడు ‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌ మా తాతే’ అని నా చుట్లూ తిరిగిన పిల్లేనా ఇది!
‘మనుషుల్ని టచ్‌ చెయ్యబుద్ధి కాదు. టూ లెగ్సే వుంటాయి. తాతను మాత్రం టచ్‌ చేస్తా’ అని అందర్నీ నవ్వించిన పిల్లేనా?
‘హల్లో మిస్టర్‌ తాతాజీ కుక్కా’
‘తాతా నీ మైండ్‌కి చెబ్తా. నిన్ను ఆఫీస్‌రూంలోకి పంపొద్దని నన్నొదిలి’ అన్న పిల్లేనా?
అఫ్‌కోర్స్‌ ఆ పిల్లే. కానీ ఆ కాలపు పిల్ల కాదు!
అందరూ దానికన్నీ తాత పోలికలే అన్నప్పుడు మురిసిపోయిన నేను ఇప్పుడు మాత్రం కోపంతో రగిలిపోయాను.
బిగుసుకుంటున్న మందపాటి నా పిడికిళ్ల వేపు చూసుకున్నాను.
ఈ పిడికిళ్లు ధ్వంసం చేసిన ఎన్నో వస్తువులు కళ్ల ముందు మెదిలాయి.
వొకప్పుడైతే ఈ గిల్మెట్లనీ, డ్రీమ్‌బుక్‌నీ, సిస్టమ్స్‌నీ దుమ్ము దుమ్ము చేయగలిగిన వాణ్ణే!
నిస్సహాయంగా విసురుగా లేచి నిల్చున్నా మూతిని కిందికి బిగిస్తూ.
డైనింగ్‌ టేబుల్‌ చుట్టూ వున్న ఎవరూ ఈ విషయాన్ని  గమనించే స్థితిలో లేరు.
అక్కడ ఒక్క క్షణం వుండబుద్ధి కాక అల్మారా వేపు చూశాను.
అల్మారా తెరుచుకుని అందులోంచి ఓ నీలం రంగు డ్రస్‌ నా కోపానికో ఏమో ఎప్పటికంటే వేగంగా వచ్చి నా చేతుల్లో వాలింది.
మామాలుగా అయితే లేచి వెళ్లి అల్మారాని చేతుల్తో తెరవడం ఇష్టం.
ఆ డ్రైవిన్‌ డ్రస్‌ తొడుక్కుని బయటికి అడుగులేసా, నా వెనకే ఆటోమాటిగ్గా మూసుకుంటున్న తలుపుల్లోంచీ, కలల ప్రపంచంలోంచీ.
***
రోడ్డు మీద జారుతున్నాను ఓ అయిదంగుళాల ఎత్తులో. రోడ్డు మీది ఎగుడు దిగుడుల్నీ, ఎదురుగా వచ్చే వాటినీ, వేగాన్నీ, టెంపరేచర్నీ, బేలన్సునీ అన్నిటినీ నేను వేసుకున్న దుస్తులు సరి చూసుకుంటాయి.
రోడ్లన్నీ నా చిన్నప్పటి సూర్యగ్రహణం నాటి వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అంతా ఖాళీ. ఓ రెండు తేలే అంబులెన్స్‌లు తప్ప మనుషుల అలికిడి లేదు. బహుశా నేనొక్కణ్ణే దెయ్యంలా తిరుగుతూ ఈ నగరంలో!
అవును. నేనొక్కణ్ణే!
మానవమేధ విధించిన కర్ఫ్యూ ఎల్లెడలా!!
మనుషులందరూ ఇళ్లకే… రెక్లయినర్లకే… గిల్మెట్స్‌కే పరిమితమైన కాలం!
కార్లు, బైకులు, ట్రాఫిక్‌జామ్‌లు, మెట్రో రైళ్లు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్లమ్స్‌ ఈ భూమ్మీద వుండేవన్నది కేవలం నమ్మకానికే పరిమితమైన విషయం డైనోసార్ల లాగా.
కాలం మారుతోంది…! మారుతున్న కాలం…!!
ఎన్నిసార్లు తిప్పి తిప్పి అనుకున్నా తృప్తి కలగదు!
గదులు గదులుగా విస్తరిస్తున్న కాలంలో నేను దేనికి చెందుతానో మాత్రం ఇప్పటికైతే రహస్యమే.
అయితే ఒకందుకు మాత్రం సంతోషమే నాకు!
కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ రైతుగా బతికినందుకు నేనేనాడూ పశ్చాత్తాప పడలేదు. అందులోని నా వుద్రేకాల్ని చల్లబరిచే తృప్తి అలాంటిది. పెయింటింగ్స్‌ పట్ల ప్రేమ కూడా నన్ను సంతోషపెట్టే విషయమే!
ప్రత్తి, ద్రాక్ష, ఉమ్మెత్త, పాము విషం లాంటివి ముత్తాతల నాటి మాట! ఇప్పుడు వాణిజ్యపంటలంటే మనుషుల అవయవాలే!!
ఇప్పుడంతా ఆరోగ్యసమస్య వస్తే వెంటనే ఆ భాగాన్ని మార్చుకుంటారు తప్ప వైద్యమన్నది గతించిపోయిన విషయం. ఇప్పుడున్నది కేవలం మానసిక వైద్యులు, సర్జన్లే!
స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత పుట్టిన పసిపిల్లల తరం తరం పాతికేళ్లు వచ్చేసరికి అనూహ్యమైన కళ్ల జబ్బుల్లో చిక్కుకున్నారు. నెలల వయసునించే స్మార్ట్‌ ఫోన్లు చూడ్డం వల్ల వచ్చిన సమస్యలు! ఛీ.ఛీ. భవిష్యత్తు గురించి ఏమాత్రం బాధ్యత లేని మనుషులు. ఈ నిమిషం సుఖిస్తే చాలనుకునే మూర్ఖులు. చికిత్స సాధ్యం కాకపోవడంతో చివరికి కళ్లను ల్యాబ్స్‌లో అభివృద్ధి చెయ్యడం మొదలయింది.
అయితే మట్టికీ, సూర్యుడికీ, ప్రాణులకీ వున్న బంధాన్ని తెలిపే ఓ నిర్వచనం ఆధునిక జీవశాస్త్రంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చింది. ముఖ్య మైంది మాత్రం గాలిలో వున్న ‘వివిడిన్‌’ యే! ఇంకా తెలీని ఏయే శక్తుల సందోహమో గాలి!!
గత ఎనిమిది సంవత్సరాల్నించి నేను కళ్లని పండిస్తున్నాను.
మనిషిని ఎంతదూరం సాగదీస్తుందో చూపు!
ఆందోళనని మాయం చేసే మెడిసిన్స్‌ వచ్చాక లివరూ, గుండె, పాంక్రియాస్‌, కిడ్నీలు లాంటి ఓ వెలుగు వెలిగిన అవయవాలకు గిరాకీ బాగా  పడిపోయింది. ఇప్పుడంతా కాళ్లూ, చేతులూ, చర్మమూ, చెవులూ, కళ్లదే హవా! అన్నిట్లోకి చివరి ఆప్షన్‌ని ఎంచుకోడానికి కారణం మాత్రం నాలోని వచన ప్రేమే!
నాకెపుడూ చెవులు కవిత్వంలా ధ్వనిస్తే, కళ్లు వచనంలా తోచేవి. నా ప్రపంచమంతా వచనానికి చెందిందే. అంటే తాకగలిగిందే!
చిన్నప్పుడు మా మేనమామ వొకతను చర్మాన్ని పండించేవాడు, అప్పట్లో పెద్ద గిరాకీ లేకపోయినా. కొత్తగా వచ్చిందని వుత్సాహం! అబ్బ ఎంత చప్పగా వుండేదో ఎగుడూ దిగుడూ లేకుండా. ఎండిపోయిన చెరువులాగా.
చల్లగాలి వీచినప్పుడు ఇంతెత్తున ఎగిరెగిరి పులకరించేది. మరీ ఘోరం!  పైగా చర్మం అడుగున నల్లగా నేలమీద పాకే జుత్తు, స్పయిరల్లా చుట్టుకుని పెరిగే గోళ్ల అంతరపంటలు. దేవుడా! అయితే నా తోటి పిల్లలు ఒకటే ఎగబడేవాళ్లు. దాని మీద ఎక్కి ఎగిరేవాళ్లు. జారేవాళ్లు. ఆడేే వాళ్లు. నాకు మాత్రం ఏదో హారర్‌ మూవీ గుర్తొచ్చేది.
చిరాకుతో నా వొళ్లు గగుర్పొడిచేది. శెలవల్లోని ఆనందమంతా ఆవిరై పోయేది. నేనైతే ఆ పొలం కేసి కన్నెత్తి కూడా చూసేవాణ్ణి కాదు.
దగ్గర్లోని ఓ చిక్కటి అడవిలో గడిపేవాణ్ణి వొంటరిగా.
కళ్లూ, చెవులూ లేని చర్మమంటే వొళ్లు మంట!
కళ్ల గురించి కలలు అప్పుడే నాలో మొదలయ్యాయి. ఎన్ని కళ్లూ చాలని రంగుల ప్రపంచం నన్ను ముగ్ధుణ్ణి చేసేది.
గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, అవిటివాళ్లు జీవించిన పాత కాలం ఇప్పుడొక విషాద చరిత్ర! భూగర్భాన్ని ఖాళీ చేసిన ఇంధనాలు…చక్రాల వాహనాల్లో ప్రయాణాలు… రాపిడితో నేలకు చేసిన గాయాలూ… ప్రమాదాలూ… స్మార్ట్‌ ఫోన్లట. ఫేస్‌బుక్కట. వెబ్‌ మాగజైన్లట. ఎలక్ట్రిసిటీట. ఛార్జింగులట. ఇప్పుడు తల్చుకుంటే నవ్వు తెప్పించే మొరటు కాలం!
ఒక్కమాటలో చెప్పాలంటే అవన్నీ చీకటి రోజులు!
వేల ఏళ్లు ఏకఛత్రంగా మనిషిని పాలించిన చక్రాన్ని దాటడమే ఆధునిక రసాయన శాస్త్రంలో తొలి అడుగు!
అడుగుల అవసరం లేకుండా చేసిన అడుగు కూడా అదే! గాల్లో తేలుతున్న నా పాదాలవేపు చూసుకున్నాను.
గాలి రివ్వున వీచింది.
అన్నిట్నీ వూడ్చేసే అంత గాలీ నా మనసులోని బరువును మాత్రం తాకలేక పోయింది.
***
అంచులు ధగధగా మెరుస్తున్న నా పొలాన్ని చేరేసరికి సూర్యుడు ఎర్రగా సగం బయటికొచ్చేశాడు.
పక్షుల ప్లానెట్‌లో వున్నట్టే వుంటుంది ఇక్కడ.
పైగా నిజమైన పక్షులు. వాసన వేసే పక్షులు!
చెట్టు కింది రాయి మీద కూచున్నాను. రాయి స్పర్శ నన్ను ప్రేమగా హత్తుకుంది. అయితే రోజూలా ఆ ప్రేమని స్వీకరించే స్థితిలో లేదు నా మనసు.
నా మనవరాలు పదేపదే గుర్తొస్తోంది.
ఏం జరుగుతోంది మనుషులకు?
ఎటు ప్రయాణిస్తున్నారు?
ఏది పోగొట్టుకుని ఏది పొందుతున్నారు? ప్చ్‌…!
అన్యమనస్కంగా మనసుతోనే సిఫ్రిన్‌ని ఆన్‌ చేశాను. సిఫ్రిన్‌ మెల్లిగా స్ప్రింక్లర్స్‌ ద్వారా పొగమంచులా పంటమీద పరచుకుంటోంది.
పత్తికాయల్లా గుత్తులుగుత్లులుగా కాసిన కళ్లు ఆకుపచ్చగా వూగుతూ.
చుట్టూ కనుచూపు మేర దాకా విస్తరించిన అనేక అవయవాల పంటలు.
ఏ మతమూ, కులమూ అంటని మానవ అవయవాల పంటలు!
వాటి మీంచి అవిరామంగా వీస్తున్న ఆదిమగాలి.
ఆ గాలి మోసుకొస్తున్న ఏవో గుసగుసలు!
సూర్యుడు నారింజ మేఘాల్లోంచి పూర్తిగా బయటకొచ్చాడు, గులాబీల గంపలా.
పక్షుల సందడి నేలను ఆకాశాన్నీ ముడేస్తూ.
చెట్టు చేస్తున్న శబ్దం నిండా సంతోషం.
తలెత్తి వూగుతున్న కొమ్మలకేసి, ఆకులకేసి చూశాను.
లోకం నిండా విరగగాస్తున్న సంతోషం ఏదో అకస్మాత్తుగా నన్నూ చుట్టుముట్టింది.
ఆశ్చర్యమేసింది!
జరగబోయేదేదో నన్ను ముందే తాకినట్టుగా అనిపించింది!!
కోపం కరిగిపోతున్న నన్నూ చెట్టులోని భాగమనుకున్నాయో ఏమో కొన్ని పక్షులు నా మీదా వాలేయి.
పట్టుకుందామని చూస్తే-
పక్షులు కాదు. నా మనవరాలి చేతులు వెనకనించి!
”సారీ తాతా”
తిరిగి చూస్తే-
నవ్వుతున్న మనవరాలి కళ్లు! ఈ లోకంలో దేనికో గ్యారంటీ ఇస్తూ!!
లక్షల కళ్లని పండించిన నా కళ్లు మొదటిసారి వర్షించాయి.
ఎందుకంటే డ్రీమ్‌బుక్‌లో ఇది పీక్‌అవర్‌. దేశదేశాల్నించి అందరూ అందర్నీ కౌగలించుకునే వుత్సాహభరిత సమయం. ఈ సమయంలో నా మనవరాలు ఇక్కడికి రావడం అద్భుతమే!
ఈ కథని ఇలా ముగించటం ఈకాలపు ఒక గౌరవార్థాన్ని ఈ కథకి అద్దడం తప్ప, ప్రతి కాలానికీ దానిదైన గౌరవార్థం దానికుంటుందని ఎవరైనా అనుకుంటే?
***
(ఒకప్పుడు మానవ అవయవాల తయారీ మీద కథ రాయమని సూచించిన మిత్రుడు, కవి సీతారాంకీ… ఇప్పుడు కథ రాయాల్సిందేనని అస్త్ర సన్యాసం చేసిన నా గొంతు మీద కత్తి పెట్టిన కవి హెచ్చార్కేకి…)
– రమణ జీవి

రమణజీవి

రమణ జీవి: గుజ్జుల వెంకటసుబ్బయ్య, చిన్నమ్మ దంపతులకు ఎనిమిదిమందిలో మూడోవాడిగా, కవలల్లో ఒకడిగా 1956 జనవరి 9న జన్మించారు. బాల్యంనించే అసంబద్ధమైన మానవ ప్రవృత్తిని భరించలేక నిర్విరామంగా బొమ్మలు గీయడంలో మునిగి పోయిన రమణజీవి ఎనిమిదో తరగతి దాకా రాజంపేటలో (కడప), గ్రాడ్యుయేషన్‌ దాకా అనంతపురంలో చదివారు. చదువుపట్ల వైముఖ్యంతో గ్రాడ్యుయేషన్‌ మధ్యలోనే మానేసి జిడ్డుకృష్ణమూర్తి ప్రభావంతో రిషివ్యాలీ స్కూల్లో (మదనపల్లి) విద్యార్థులకు రెండేళ్లపాటు చిత్రలేఖనాన్ని బోధించారు. తర్వాత ఢిల్లీలో బాతిక్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. మద్రాసులో కొంతకాలం సినిమా డైరెక్టర్‌ కలలు కన్నారు. 1979లో హైదరాబాద్‌లో సినిమా బ్యానర్‌ సెక్షన్‌లో, పోస్టర్స్‌ ఎన్‌ పోస్టర్స్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో లిథో ఆర్టిస్ట్‌గా చేశారు. ఈనాడులో 1980నుంచి1984 వరకు, కొంతకాలం తార అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ, పల్లకి వారపత్రికల్లో పనిచేశారు. ఉదయం వార పత్రికలో ఇల్లస్ట్రేషన్‌ ఆర్టిస్ట్‌గా అయిదేళ్లు చేసి మానేశాక కొన్ని సినిమాలకు పబ్లిసిటీ ఆర్టిస్ట్‌గా చేసి 1991 నుండి నేటి దాకా ఫ్రీలాన్స్‌ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు.వృత్తిరీత్యా చిత్రకారుడైనా కథలు, కవిత్వాలు రాయడమంటే అమిత ఇష్టం. ఇంతవరకు వెలువడిన రచనలు- వొత్తు థ (కథా సంకలనం 1999), నలుగురు పాండవులు (కవితా సంకలనం 2001). సింహాలపేట (కథా సంకలనం 2013) భార్య విజయ. పిల్లలు రమ్య, ప్రియాంక. అల్లుళ్లు మనమరాలు ఎకి. 1988 నుండి నాటి తెలుగు కమర్షియల్‌ రచయితలు మొదలుకొని నేటి సీరియస్‌ రచయితలు, కవులదాకా వేలాది పుస్తకాలకు ముఖచిత్రాలనందించారు.

18 comments

 • Wow! ఆపకుండా చదివేశా! మీ శైలి అర్ధం కావాలంటే మీ అంత చదువుకోవాల్సిందే ‘వచన ప్రేమికుల’కైనా! ఆర్గాన్ కథలో జార్గాన్ మోతాదు కొంచెం ఎక్కువనిపించిందంతే! ముగింపు ముచ్చటేసింది!

 • కథ ఇతి వృత్తం బాగుంది. కథనం ఆకట్టుకుంది. కథ ఇంకా వుందని పిస్తుంది.అవయావాలు అన్నీ పండించేసుకున్నాక మనసు అనే జీడిపాకం తోటి పనేమిటి . మనమరాలు స్పర్శ ఒక పాత జ్ఞాపకమేమో !? ఏమైనా కథ ఇంకారాయవల్సి వుందనిపిస్తుంది. -హనీఫ్

 • భవిష్యత్తు పై వూహ బాగుంది. శాస్త్ర కాల్పనిక సాహిత్యంలో తెలుగువారు కొంత వెనుకబడే వున్నారు. ఆ జానర్ ను అర్థం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే చదువరులు ప్రయత్నిస్తున్నారు.

 • వచనం చదువుతుంటే ఆపాలనిపించలేదు. ఒక్కోసారి ఆల్విన్ టోఫ్లర్ ఒక్కోసారి త్రిపుర గుర్తుకి వచ్చారు. ఇంత చక్కని చిక్కని ఫిలాసాఫికల్ కథ చదువటం చాలా బాగుంది. కళ్ళను పండించింది. రమణజీవిగారికి కృతజ్ఞతలు.

 • నాకెపుడూ చెవులు కవిత్వంలా ధ్వనిస్తే, కళ్లు వచనంలా తోచేవి. నా ప్రపంచమంతా వచనానికి చెందిందే. అంటే తాకగలిగిందే!adbhutamaina vakyam katha chaa bagundi anadam pelavangaa untundi ramana jeevi mark extraordinary …love j

 • The one and only story teller writing in telugu on themes edging on future. Not empty praise. Been saying this about RG for long. If only some one could take him into English ! Hug you RamanaKavee ! ~ dp

 • చాలా బావుంది, వందేళ్ళ ముందుకు ప్రయాణం.

 • ప్రతి కాలానికి దానిదైన గౌరవార్థం దానికి ఉంటుందనే అనుకుంటున్నాను. లేకపోతే ఈ peak hour లో మనవరాలి కళ్ళు మిమ్మల్ని ఎలా తాకాయి… భవిష్యత్తులో కి ప్రయాణం.
  బావుంది Sir.

 • చాలా కొత్తగా వెరైటీగా ఉండండి కథ..HRK గారు ఇంకా చాలా కత్తులు మీ గొంతు మీద పెట్టాలని కోరుకుంటా

 • మిత్రులారా, రస్తా కు లేట్ అవుతుందని పూర్తిగా ఉడకక ముందే కథని పంపడం జరిగింది. ఇప్పుడున్న కథ వుడికిన కథ.

 • వేల ఏళ్లు ఏకఛత్రంగా మనిషిని పాలించిన చక్రాన్ని దాటడమే ఆధునిక రసాయన శాస్త్రంలో తొలి అడుగు!
  అడుగుల అవసరం లేకుండా చేసిన అడుగు కూడా అదే!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.