శోకాండాలు తర్వాత…

పాతికేళ్ళు ఇలా గడిచాయోలేదో… అప్పుడే చచ్చే చావొచ్చిపడింది.

మొదటి నుంచి ఏదో ఒక పద్దతిలో వ్యాపారాలు చేసుకునే వారికి ఇప్పుడు కొత్తగా వచ్చి పడిన చెబ్బర అయితే ఏమీలేదుగాని, ఇప్పుడు కొత్తగా వాటిని మొదలెట్టడం తెలియనివారి పరిస్థితి మాత్రం – ముంత పొగ పెట్టించుకుంటున్నట్టు వుంది.

జరిగింది ఏమిటీ –

చదివీ…చదివీ… చదవడం అయ్యాక, రాయడం మొదలెట్టారా?

చేసింది ఏమిటీ –

మనకంటే ముందు ఇక్కడ నడిచి వెళ్ళిన పెద్దల పాదముద్రల్లో మనమూ ఫిక్స్ అయ్యాము.

మన కొలతలు కనుక వాటిలో అట్టే సరిపోకపోతే, మనల్ని మనమే కొంచెం వొదులో – బిగుతో చేసుకుని, మనల్ని మనమే మధ్య తరగతి మేధావులం అనుకోవడంతో…

అప్పట్లో ఓం ప్రధమంగా ఒక పని అయితే అయినట్లయింది.

ఎప్పుడూ ఇదంతా-

ప్రపంచీకరణ

కొత్త బూతుగా మంచి మార్కెట్ రైజ్ లో వున్నప్పుడు సంగతిది.

అంతకు ముందు- మరీ పాత జమానాలో అయితే,

ఏ.సి. గదులు వంటివి కూడా మన దగ్గర బూతులు గానే చలామణిలో ఉండేవి.

ఎక్కడో ఏ.సి. గదుల్లో కూర్చుని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే సరిపోద్దా?

అని, లేదా టాటాలు…బిర్లాలు… ఇవి కూడా అప్పట్లో తిట్లుగా వాడకంలో ఉండేవి.  

ఆ తర్వాత ఇవన్నీ విడివిడిగా ఎందుకని వాటిని –

ప్రపంచీకరణ అని సింగిల్ పాయింట్ చేసారు.

ఇవి కాక, అప్పట్లోనే వరల్డ్ బ్యాంక్ అని ఒక సైతాన్ కూడా వుండేది!

అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో-

మన వాళ్లు కరవాలం చేతపట్టి అస్సలు పని మొదలెట్టారు…

ముందుగా స్వగృహము నుంచి సంస్కరణలు అనుకున్నారు (అదీ కరెక్టే గా)

కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు, పని ముందుకు సాగలా…

అప్పుట్లో వీరి ఇళ్ళల్లో టీన్స్ గా ఎదుగుతున్న వాళ్ళ వద్ద,

నేనూ… అంటూ, వీరు ఇళ్ళల్లో తమ ఫ్లాష్ బ్యాక్ లు మొదలెడితే –

శ్రోతలు వుండేవారు కాదు.

ఆ విషయం బోధపడ్డానికి వీరికీ అట్టే సమయం పట్టలేదు.

కారణం – అప్పటికే ఇంటిల్లిపాదీ మార్కెట్ లో కలిసిపోయింది.

దాంతో కొంచెం అటు – కొంచెం ఇటు అనే లైన్ తీసుకునేవారు,

ఉభయతారకంగా అప్పటికి అక్కడ సెటిల్ కావల్సివచ్సింది.

అప్పట్లో వీరి ఇళ్ళల్లో కూడా ఈ తరహా సర్దుబాటుకు, పెద్దగా అభ్యంతరాలు చెప్పేవారు కాదు.

ఏదో ఒక రోజు వాళ్ళే తెలుసుకుంటారు అని,

మన మేధావులే పెద్ద మనసు చేసుకుని సరిపెట్టుకునే వారు.

(అయితే, వారి ఇళ్ళల్లో వీరి గురించి కూడా అలాగే అనుకునేవాళ్ళేమో తెలియదు)

అలా ముందు ఇంట గెలిచాక

అప్పుడు వీరు రచ్చ వైపు చూసారు.

*         * *

చేతిలో కరవాలం.

రాస్తారు సరే,

మరి ఇప్పుడు వీరి కలం సాగుబడికి పొలం కావాలి కదా –

అదెక్కడ…?

అస్సలు సమస్య అప్పుడు మొదలయింది.

అవునూ, అయినా పాథోస్ గని కదా…?

అది తవ్విన కొద్దీ ఊట వస్తూనే వుంటుంది.

పని ఈజీ అయింది.

అందరికీ అక్కడ చేతినిండా పని దొరికింది.

అంతే, ఇక  పుంఖాను పుంఖాలు.

కన్నీరు తోడడం – ఎత్తి బయట పొయ్యడం.

వండడం – వడ్డించడం.

ఇలా సాగింది వీరి సాగుబడి…

ఇంతలో మా తెలుగుమీ తెలుగు వివాదం వచ్చి పడింది.

ఈ ఏడాది వాళ్ళ కధలు ఎన్ని, వీళ్ళ కధలు ఎన్ని?

కొత్తగా లెక్కల పంచాయతీ  మొదలయింది.

సరే, దానికీ ఏదో ఒక లైన్ తీసుకున్నారు.

అలా అనుకునే లోపు,

తెలుగు వాళ్ళు అని ఇద్దరి మధ్య మీరు ఒకే ఒక్క అడ్డ గీత గీస్తే సరిపోద్దా…

మా మూడు జిల్లాల మాటేంటి అని ఒకరంటే,

మా నాలుగు జిల్లాల మాటేంటి అని మరొకరన్నారు.

ఇంతలో –

వాళ్ళిద్దరూ అలా అన్నారు సరే,

అలాగని, ఏమీ అనకుండా గమ్మున ఉన్నోళ్ళు ఏమైనా పెద్ద మనుషులా?

అస్సలు తంపు అంతా వాళ్ళ తోటే కదా అన్నారు వెనక నుంచి ఎవరో…

ఇదంతా కాదు కానీ,

అస్సలు పత్రికల డెస్క్ లో పనిచేస్తున్నది ఎవరు? అరా మొదలయింది.

వాళ్ళ వేలిముద్రలు – పుట్టు మచ్చల తనిఖీ వరకు ఈ పంచాయతీ సాగింది…

ఇంతలో –

ఎందుకొచ్చింది ఇదంతా, కలిసి వుంటానికి మీది ఎటూ యాపారం కాదయ్యే –

ఎవరి తెలుగు వాళ్ళు మాట్లాడుకోండి.

ఎవరి తెలుగు వాళ్ళు రాసుకోండి

అంది చట్టం.

*            * *

తగువు తెగింది.

ఇక కానిద్దాం కలాలు నూరండి అనుకునే లోపు-

ఎవరో అన్నారు-

ఏంటీ నూరేది – అటు చూడండి ఒకసారి అని.

అటు చూద్దుం కదా,

రేసు పూర్తి చేసిన తాబేలు మెళ్ళో అప్పటికే ఎవరో పూలదండ వేస్తున్నారు.

ఇదేంటి…

మన అందరికీ ఇన్నాళ్ళు భవిషత్తు చెప్పిన మన రచయిత కుందేలు ఎక్కడా అని చూస్తే,

అది ఇంకా బయలుదేరిన చోటే గుర్రు పెట్టి నిద్దరోతున్నది.

ఎవరో లేపితే,

ఆవులిస్తూ లేచి ఎక్కడున్నాం అంది,

పైగా..

ఏంటీ అప్పుడే పాతికేళ్ళు గడిచాయా, 2017 కూడా అయిపోయిందా అని విస్తుపోయింది…

ఛీ, దీని… అని తిట్టుకుని,

ఈ కుందేలును వదిలిపెట్టి, అవతల అప్పటికే గమ్యం చేరుతున్న సామాన్యుడు తాబేళ్ళ దగ్గరకు పరుగెడితే…

అప్పటికే అవి విసవిసా నడుచుకుంటూ, ఓ గేటు లోపల బయోమెట్రిక్ వేసి డ్యూటీ లోకి వెళ్ళి పోతున్నాయి

ఆలస్యంగా వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నారు

గేటు బయట ఆగి చూస్తే, దాని పేరు స్పష్టంగా తెలియలేదుగాని –

అదొక సెజ్ అని మాత్రం అర్ధమయింది.

ఆ పరిసరాల్లో విధుల్లో వున్న వారి మెడల్లో వేలాడుతున్న ఐ.డి. కార్డుల మీద –

రంగు రంగుల తాబేలు బొమ్మలున్నాయి.

నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెనక్కి వస్తుంటే…

సెజ్ పరిసరాల్లో కనిపిస్తున్న భవనాల బయట –

బోర్డుల మీద ఏవో స్టార్ట్ అప్ కంపెనీలు కన్సల్టేన్సీలు అని,

ఏవేవో పేర్లు కనబడుతున్నాయి.

వాటిలో కొన్ని… మునుపు ఎప్పుడో.. ఎక్కడో… విన్నట్టున్న ఇళ్ళ పేర్లులా వున్నాయి.

ఏవి తల్లీ … నిరుడు కురిసిన హిమ సమూహములు

అని చూద్దుముకదా…

ఒకప్పడు అవి పాథోస్ కధల పుస్తకాలు రాసిన

రచయితల పిల్లలవి...

 

–  జాన్సన్ చోరగుడి

జాన్సన్ చోరగుడి... ఆయన మాటల్లోనే చెప్పాలంటే గత మూడు దశాబ్దాలుగా తెలుగునాట ఏ గుంపు రంగు ఐడెంటి అంటించుకోకుండా,  తన స్వంత స్వరంతో మాట్లాడుతూ కూడా… పాఠకుల గౌరవం పొందిన రచయిత.. అప్పటికే నలిగిన దారుల్లో సాగుతున్న ర్యాలీల నుండి విడవడి, కూడలిలో ఒంటరిగా మిగిలిన వారికి అయన వ్యాసాలు, కధలు నిజాయితీతో కూడిన స్వాంతన ఇచ్చే – చలివేంద్రాలు అవుతాయి. వాటిని చదివాక మనకు కొత్త ఆశ మొదలవుతుంది. అలా అని అయన మనకేమీ కొత్త దారులు చెప్పడు, కానీ ఉన్నాయన్న నమ్మకాన్ని కలిగిస్తాడు. అలా – మన దృష్టికి అనని కొత్త భవిష్యత్తు వైపుకు, మనల్ని క్రమ క్రమంగా నడిపిస్తాడు. స్థల – కాలాల ప్రమాణం, తన రచనలకు దిక్సూచి.  జాన్సన్ చోరగుడి కృష్ణాజిల్లా, కోలవెన్నులో 1956 లో జన్మించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్ గా రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడలో నివాసం. ‘సిటీ ప్రొఫైల్’, ‘మన విజయవాడ’, ‘స్వంత సంతకం’, ‘ఇండియన్ ఇంక్’, ‘చివరి చర్మ కారుడూ లేడు’-పుస్తకాలు ప్రచురించాడు.                                                                     ***        

జాన్సన్ చోరగుడి

జాన్సన్ చోరగుడి... ఆయన మాటల్లోనే చెప్పాలంటే గత మూడు దశాబ్దాలుగా తెలుగునాట ఏ గుంపు రంగు ‘ఐడెంటి’ అంటించుకోకుండా,  తన స్వంత స్వరంతో మాట్లాడుతూ కూడా... పాఠకుల గౌరవం పొందిన రచయిత. కృష్ణాజిల్లా, కోలవెన్నులో 1956 లో జన్మించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్ గా రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడలో నివాసం. 'సిటీ ప్రొఫైల్', 'మన విజయవాడ', 'స్వంత సంతకం', 'ఇండియన్ ఇంక్', 'చివరి చర్మ కారుడూ లేడు'-పుస్తకాలు ప్రచురించారు.                                 

1 comment

  • పరిణామం అలా అలా………..
    గల్పికంటే చిన్నదే అనుకున్నా.
    అబ్బో ! మన చరిత్ర పెద్దదే.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.