కోదండ రామ్  ఏమనుకుంటున్నారు?!

 

తెలంగాణాలో, బహుశా తెలుగు నాట ఒక ముఖ్య పరిణామం కోదండ రామ్ నేతృత్వంలో కొత్త పార్టీ, ‘తెలంగాణా జన  సమితి’ పుట్టుక. దీని గురించి ఎవరి వూహలు, అంచనాలు వారికి వుంటాయి. అసలు బరువు మోయాల్సిన వారిలో అతి ముఖ్యుడు కోదండ్ రామ్ ఏమనుకుంటున్నారు? మనలో తిరిగే పలు ప్రశ్నలు తనకూ, తనతో నడిచే వారికీ వుంటాయి. మరి వాళ్ళేమనుకుంటున్నారు? ‘రస్తా’కు ఆప్త మితృడు, స్వయంగా ప్రజా ప్రేమి, వుద్యమ జీవి రాఘవేంద్ర ప్రసాద్ మనందరి తరుఫున కోదండ్ రామ్ తో మాట్లాడారు. మీరూ వినండి, అక్షరాలా…

 

 1. . తెలంగాణ జన సమితి పార్టీ నిర్మాణమూ, అభివృద్ధి ఎలా నడుస్తున్నాయి?

ఇప్పటి వరకు ఐతే మేమనుకున్న ప్రణాళిక ప్రకారమే జరగుతోంది. పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాక, కలసి వచ్చే అందరి తోను మాట్లాడి, వాళ్ళతో కలసి కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టాం. అదే విధంగా JAC లో కూడా ఆసక్తి వున్న మితృలందరితో మాట్లాడుతూ వచ్చాం.  క్రమ క్రమంగా బయటి నుంచి వచ్చిన వాళ్ళనూ, JAC నుంచి చేరిన వాళ్ళనూ కలిపి ఒక టీమ్ గా వేసీ, మెల్ల మెల్లగా కార్యక్రమాలు ప్రారంభించాం. ఆ రకంగా సన్నాహక కమిటీ మొదట ఏర్పడింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ‘తెలంగాణ జన సమితి’ అవిర్భావ సభ కూడా జరిగింది. ఇప్పడు సన్నాహక కమిటీ నుండి సమన్వయ కమిటీ లనే తాత్కాలిక కమిటీలు వేశాం. వీరు మండల స్థాయికి పోయి, సభ్యత్వ నమోదు కార్యక్రమం  తీసుకుంటున్నారు. కలసి వచ్చే శక్తులన్నిటినీ క్రియాశీలక సభ్యులుగా చేర్చుకున్నాక, అప్పడు గ్రామ స్థాయి, మండల స్థాయీ కమిటీలు వెసుకుంటూ వస్తాం. అప్పుడు రాష్ట్ర స్థాయిలో, క్రింది నుంచి పైదాకా కమిటీలు పెంపొందించుకుంటూ రావాలని ఆలోచన. ఆ నిర్ణయం ప్రకారం కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. నిర్మాణం కూడా పెంపొందుతుంది.

 1. సెక్యూరిటీ రీత్యా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా సీదా సాదాగ ఉంటున్నారు, మీకు ఎలాంటి బెదిరింపులు గానీ, ప్రమాదాలు గానీ లేవా?

ఏమున్నా గానీ చేసేదేమీ లేదు కదా!  వాటి గురించి ఆలోచించటం కంటే, మనం చేయగలిగిన పనులపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా నాకైతే ఎవరూ ఫోన్ చేసి బెదిరించింది లేదు కాని, కనపడుతున్న వాస్తవమేమిటంటే ఫోన్ 24 గంటలూ ట్యాప్ చేయబడుతుంది. సంవత్సరంలో అన్ని రోజులూ ట్యాప్ చేయబడుతుంది. ఇంటలిజన్స్ అధికారులు ఎప్పుడూ వెన్నంటి ఉంటారు. ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా క్షణాల మీద వెంటనే నివేదిక పైస్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇలా నిఘా మధ్య పనిచేయటం అలవాటై పోయింది. గతంలో ఇది లేదని కాదు. ఈ ఇంటర్నెట్ యుగంలో నిఘా స్వభావం పూర్తిగా మారిపోయింది.  24 గంటలూ అనుసరించటం తేలిక. ఫోన్ నంబర్ తెలిసే వుంటుంది. నీ ఫోన్ నంబర్ తెలిసిన తరువాత, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఎవరితో మాట్లాడు తున్నావు, నీ పక్కన ఎవరు ఉన్నారు – అన్నీ తెలిసి పోతాయి. అట్లా వాళ్ళు ఒక పద్దతి ప్రకారంగా ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటుంటారు. దాని ఆధారంగా నియంత్రించే ప్రయత్నాలు చేస్తారు. మీటింగులకు ప్రజలను రాకుండా ఆపుతారు. పర్మిషన్లు ఇవ్వకూడదని హెచ్చరిస్తారు. జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 పుస్తకంలో ‘పెద్దన్న’ చూస్తున్నాడని రాశాడు. నిజంగా అలా వీలవుతుందా అని అప్పుడు అనుకున్నాము గానీ, అది సాధ్యమేనని ఇప్పుడు అర్థమౌతుంది. సీసీ కెమేరాలతో మనం ఏమి చేస్తున్నామో తెలిసి పోతుంది. అనేక వ్యవస్థల ద్వారా వాళ్ళ నిఘా నడుస్తుంటుంది. దానితో మనం బెదిరి ఆగిపోవటం ఉండదు గానీ, ఒత్తిడి ఎలా ఉంటదో చెప్పటానికి, అర్థం చేసుకోటానికి చెబుతున్నా.

 1. తెరాస ప్రభుత్వంలో పదవులేమీ  తీసుకోనన్నారు. అప్పుడు స్వంత పార్టీ కూడా పెట్టనన్నారు.  ఇప్పుడు మనసు మార్చుకొని స్వంత పార్టీ తో ముందుకు రావటానికి కారణాలేమిటి?

మేము పౌర వేదికగా తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాం.  తెలంగాణ అభివృద్ధి అనే దానికి స్థూలంగా ఒక నిర్వచనం లేదు. దానికోసం రకరకాల అధ్యయనాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికై రూపొందించు కోవలసిన విధానాలేమిటి?  ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అ విధానాల రూపకల్పనకు లక్ష్యాలేమిటి? — చివరికి మాకు అర్థమైన దేమిటంటే అభివృద్ధి అనేది స్థూలంగా ఒక అర్థం లేని పదం. దాని స్పష్టత కోసం ప్రయత్నించాం. ప్రజలు కేంద్రంగా, ప్రజాస్వామ్య విలువలు పునాదిగా అభివృద్ధి పెంపొందాలి. దానికి సామాజిక న్యాయం ధ్యేయంగా ఉండాలి. అంటే ఏమి చేసినా ప్రజలకు ఎట్లా లాభమౌతదని చూడాలి. ఏది చేసినా అట్టడుగు వర్గాలకు ఎలా చేరుతుందనేది చూడాలి. ఒక ప్రజాస్వామ్య పద్దతిలో అందరినీ భాగస్వాముల్ని చేసి నిర్ణయాలు చేయాలి. ఇది నా దృష్టిలో చాలా కీలకమైనది. అటువంటి అభివృద్ధి కోసం ప్రయత్నించాలనుకున్నాక, కార్యరంగం పెరిగింది. దాంతో ప్రభుత్వ విధానాలలోని లోటుపాట్లను ఎత్తి చూపటం, వారి ఆర్థిక అభివృద్ధి విధానాలను ఎలా మార్చుకోవాలో సూచించటం చేశాం. వారు తమ అసహనాన్ని ప్రదర్శించారు. మాతో పని చేసేవారిని ఒక్కొక్కరిని బయటికి లాగటం చేశారు. మొత్తం గానే మా కార్యకలాపాలకు అడ్డు కట్ట వేయాలని, మాపై దాడికి దిగారు. ఐనా మేము మా కార్యాచరణను కొనసాగించాం. ఆ దశలో అసలు మూలాలు రాజకీయాలని మేము గ్రహించాం. పాలక పార్టీ రాజకీయాలు మారాలని గ్రహించాం. స్వంత, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, సమిష్ఠి ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించాలని డిమాండ్ చేయటం ప్రారంభించాం. ఈ అవసరాలను వ్యక్తీకరించటానికి ఇప్పుడున్న రాజకీయ వేదికలు చాలవనిపించింది. మేమే ఒక రాజకీయ పార్టీ నిర్మించాలనుకున్నాం. చాలా చర్చలు జరిగాయి. యూ.పి. లో కేవలం సైకిల్ మీద తిరిగి ప్రచారం చేసిన కాన్షీరాం గెలవలేదా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు జాతీయ పార్టీలను తట్టుకొని నిలవలేదా. మనం మాత్రం చేయలేమా అని, ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఫిబ్రవరి 4 న జె ఎ సి సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించాం. అ వత్తిడి ప్రజలనుంచి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం కొంతమంది కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చటానికి పనిచేస్తుంది. వనరులను ఉపయోగిస్తుంది. ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి, ప్రజలకు సంబంధించిన కార్యాచరణగా మార్చకపోతే జరిగే నష్టాన్ని నివారించటానికే ముందుకు వచ్చాం. నాలుగు సంవత్సరాల ఉద్యమ అనుభవంతో ఇది వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కావటం, ప్రజా సంఘాల విమర్శలను స్వీకరించక పోవటంతో ఇది వచ్చింది. మేమేమైనా పదవులు ఆశించినా, మౌనంగా వున్నా ఈ పార్టీ వచ్చేది కాదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల సంక్షేమం, ఉద్యమ ఆకాంక్షల అమలు ప్రాధాన్యతతో, ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, ఈ ప్రశ్నించే క్రమంలో పార్టీ పుట్టింది.

 1. వామపక్ష నేపథ్యం వున్న మీలో, రాష్ట్ర విభజన అనే నినాదాన్ని తీసుకొని  అగ్రభాగాన నిలచి నడిపించే మార్పు ఏ విధంగా వచ్చింది?

ఒక ప్రజాస్వామిక మార్పు జరగకుండా, మిగతా ఏ మార్పులు సాధ్యం కావని మొదటి నుంచి వున్న ఆలోచన. ఆ ప్రజాస్వామిక మార్పు అనేది ఏ విధంగా ఉంటుందో పౌరహక్కుల ఉద్యమంలో పని చేసేటప్పుడు తెలిసింది. నిజంగా సమాజం ప్రజాస్వామిక సూత్రాల మీద నిలబడాలి, నిర్మాణం కావాలి.  అలా ఐతే బాగుంటుందనేది స్థూలంగా ఎమర్జెన్సీ కాలంలో మాకు కలిగిన అభిప్రాయం. అప్పుడే భారత రాజ్యాంగానికి గౌరవముంటుంది. ఆ ప్రజాస్వామ్యం నిలబడలేక పోటానికి కారణాలు విశ్లేషించుకోటానికి అనేక వామపక్ష ఉద్యమాలు దోహద పడినా, పౌరహక్కుల సంఘంలో పనిచేసే క్రమంలోనే ఈ ప్రజాస్వామిక నిర్మాణం ఎట్ల వుంటది,  దాన్ని సాధించటంలో వుండే ఇబ్బందులేంటి, ఆ కార్యాచరణ స్వరూప స్వభావాలెట్లా వుంటాయనేది గ్రహించాం. అది గ్రహించి తరువాత, మిగతాదేది సాధ్యమైనా కాక పోయినా, ఈ ప్రజాస్వామిక మార్పును సాధించగలమనే విశ్వాసం. ఆ విశ్వాసం నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగమైనాం. అది ఒక మొదటి మెట్టు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక గుప్పెడు మంది పాలకులు ఇష్టానుసారంగా రాష్ట్ర వనరులను వాడుకుంటున్న పరిస్థితుల్లో, ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నించటం మొదటి మెట్టుగా భావించాం. అలా ప్రశ్నించకుండా తెలంగాణ ప్రజలకు ఒక వ్యక్తీకరణ ఈ సమాజంలో దొరకదు. ఒక వేదిక దొరకదు. ఆ వేదిక దొరికిన తరువాత రెండో మెట్టుగా ఇక్కడ ఒక భిన్నమైన సామాజిక, ఆర్థిక నిర్మాణం చేసుకోవాలని చెప్పి అట్లా ఒక మార్పు ప్రయాణం మొదలైంది. మార్పు కోసం పౌరవేదికలు పెట్టి మనం కొంత సాధించ వచ్చనుకున్నాం. కానీ రాజకీయాలు కలుషితమై, స్వంతం కోసం అధికారాన్ని వాడుకోవటం, మొత్తంగా సమిష్ఠి ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన  ప్రభుత్వం ఒక కుటుంబం యొక్క ప్రయోజనాల కోసం పనిచేయటంతో ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని ఒక వ్యాపారంగా చూసినపుడు, వనరులను కొల్లగొట్టటానికి తోడ్పడే వేదికగా భావించినపుడు ప్రభుత్వ వేదిక నుంచే మన సమాజంలో వనరులన్నింటినీ వ్యష్టి పరం చేసే ప్రయత్నం చేసినపుడు తప్పని సరిగా ప్రజాస్వామీకరణ రాజకీయ రంగంలో సీరియస్ గా ముందుకు సాగవలసిన అవసరం వుంది. అది జరగకుండా మనం చేసే ప్రజాస్వామిక ప్రయత్నం, ప్రయాణం, పోరాటం సాగదని గ్రహించి ఇవాళ చివరికి ఈ నిర్ణయం తీసుకున్నాం.

 1. భారతీయ జనతా పార్టీ  ఆఫీసుకు పోయి, ఆ లీడర్లను కలసి, చర్చించి, వారికి ఒక మర్యాదస్తుల పాత్ర మీరు కల్పించారని, ఆ విధంగా మోడీ, అమిత్ షాలు తెలంగాణా గడ్డపై ధైర్యంగా అడుగు పెట్టే  వెసులుబాటు కల్పించారని మీ మీద ఒక విమర్శ వుంది. దానికి మీ సమాధానం?

మనం ఇచ్చినా ఇవ్వక పోయినా అవకాశం కలిగేది. దాంట్లో రెండో అభిప్రాయం ఏమీ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్న అన్ని పక్షాలకూ ఆ అవకాశం దొరికింది. ఒకరు వాడుకోవచ్చు, ఒకరు వాడుకోలేక పోయుండచ్చు. ఆ రోజు జరిగిన ఉద్యమాన్ని  చాలా రాజకీయ పక్షాలు, వామ పక్షాలతో సహా, ఎంత బలంగా ఉపయోగించు కోవచ్చునో, దాని ఆధారంగా ఒక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయవచ్చునో గ్రహించ లేక పోయినవనే అనుకుంటున్నా. అంత బలంగా వాళ్ళొచ్చి ఏదో వేదిక దొరికింది అని నేను మాత్రం అనుకోవటం లేదు. దాన్ని ఉపయోగించుకోటానికి ఆ ఉద్యమం అర్ధమై వుండాలి. చాలా మంది దాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకోలేక పోయారు. ఆ పరిణామాన్ని సంపూర్ణంగా చూడ లేక పోయారు. అందువల్ల, ఎంత మేరకు రాజకీయ పరపతిని పెంచుకోటానికి ఉపయోగించు కోగలగాలో అంత మేరకు ఉపయోగించు కోలేకపోయరు . అదే నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. ఐతే అప్పుడున్న పరిస్ధితుల్లో ఒక విస్తృతమైన ఏకాభిప్రాయాన్ని పెంపొందించకుండా తెలంగాణ సమాజంలో అన్ని శక్తులనూ ఒక త్రాటిపై తేకుండా అప్పటికి తెలంగాణపై వున్న ఆంధ్రా పాలకుల పెత్తనాన్ని కూలద్రోయటం సాధ్యం కాదు. అది అనివార్యం. ఆ పరిస్థితులలో ఆనాడు అందరూ కూడా ఐక్యంగా పని చేయటానికి ఒప్పు కున్నారు. కలసి అందరూ నడిచిండ్రు. కచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్ర పోషించారు. కానీ ఆ ఉద్యమం తదనంతరం ఆ ఉద్యమం కల్పించిన వాతావరణాన్ని ముందుకు తీసుకు పోయే క్రమంలో అందరు ఒకే వేగంతో నడవలేక పోయారు. నడవలేక పోవటం అనేది ఇవాళ చాలా మందికి వాళ్ళు ఎదుర్కుంటున్న ఒక ప్రధాన పరిమితిగా కూడా మనం చూడాలి.

 1. 1956 నుంచి రాష్ట్ర విభజన వరకు సాగిన పాలనను ఆంధ్ర వలస పాలనగానే మీరు పేర్కొంటారా?

అవును. నిజానికి 1969 నాటికి వలస పాలన అనే భావన బలంగా రాలేదు. అది ఉపయోగించలేదా అంటే చాలా రాష్ట్రాలు ఉపయోగించాయి. బయటి వాళ్ళ పెత్తనం,  వనర్ల దోపిడీ — ఇలాంటి మాటలను ఉపయోగించాయి. కానీ వలసాధిపత్యమనేది ఇంకొక సమగ్ర మైన భావన. వలసాధిపత్యమంటే ఒక వర్గం తన ప్రయోజనాల కోసం అనేక సమూహాలను వాడుకుంటుంది. ఆ వాడుకునే క్రమంలో కొన్ని కొన్ని సందర్భాలలో ఒక ప్రాంతం కూడా తన ఆధిపత్యాన్ని నిలబెట్టు కోటానికి, తన ఆర్థిక ప్రాబల్యాన్ని విస్తరించు కోటానికి మరో ప్రాంతాన్ని ఉపయోగించు కుంటుంది. అట్లా తెలంగాణ అనేది ఒక వర్గానికి, ఒక ఆధిపత్యానికి ఉపయోగ పడింది.  అందువల్ల దీన్ని అంతర్గత వలస అని అన్నాం. తెలంగాణ ఏర్పాటు చేయటం అంటే తక్షణం ఆ రాజకీయ ఆధిపత్యం నుండి బయట పడటం. క్రమంగా తెలంగాణ ప్రజలు కేంద్రంగా గల ఒక అభివృద్ధిని సాధించు కోవటం రెండవ లక్ష్యం. మొదటి లక్ష్యంతో ఆగిపోవద్దని హెచ్చరించిన వాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. రెండో లక్ష్యాన్ని మర్చిపోతే ఈ ఉద్యమం వల్ల ప్రయోజనం ఉండబోదని కూడా కచ్చితంగా హెచ్చరించాం.  ఎందుకంటే ఈ అంతర్గత వలస అనే సూత్రం గ్రహించిన వాళ్ళే ఉద్యమానికి ఉండే ఈ లాజిక్ ను చూడగలుగుతారు. అట్లా చాలా మంది ఆ సూత్రీకరణను స్వీకరించలేక పోవటంతో ఈ ఉద్యమానికి వుండే స్వభావాన్ని కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. దానికుండే ప్రజాస్వామిక స్వభావాన్ని చూడలేక పోయారు. నేనింతకు ముందు అన్నాను కదా, ఉద్యమ తదనంతరం ఆ ఉద్యమ కార్యాచరణని ముందుకు తీసుకు పోవటంలో ఆశించినటువంటి పాత్ర, చాలా  రాజకీయ పార్టీల నుంచి కనిపించలేదనేది ఒక వాస్తవం.

 1. ఇప్పుడు విభజన జరిగి నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత కూడా కేసీఆర్ ను విమర్శిస్తూ, ఆంధ్రా వలస పాలకులతో కుమ్మక్కయ్యారని సెంటిమెంట్లను రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందంటారా?

సెంటిమెంటేమీ కాదు, ఇదొక వాస్తవం. సెంటిమెంట్ అంటే అభూత కల్పన మీద భావోద్వేగాలను కల్పించటం. తెలంగాణ ఉద్యమం కూడా సెంటిమెంట్ ఆధారంగా నడవలేదు. జయశంకర్ గారు అనేది, తెలంగాణ ఉద్యమం వెనుక అనేక సరైన కారణాలున్నాయి. కాబట్టి  దాన్ని అలా చూడటానికి వీలులేదని మనం గ్రహించాలి. అదే విధంగా ఇప్పుడు కూడా దీన్ని కేవలం ఒక సెంటిమెంట్ గా చూడటానికి వీల్లేదు. ఇవాళ మేమనేదేమిటంటే ఇక్కడ వున్న ప్రజలు — అది ఆంధ్రా కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు — వాళ్ళు ఎవరైనా కావచ్చు. తెలంగాణలో నివసిస్తున్నపుడు వాళ్ళు తెలంగాణ వాసులవుతారు.  ఇక్కడి అభివృద్ధి ఇక్కడి ప్రజలకు దక్కాలని కోరుకుంటాం. మళ్ళా మీరు ఒక గుప్పెడు మంది కాంట్రాక్టర్లకు మేలు చేసే ప్రయత్నం చేస్తే, రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు నెరవేరవనేది, ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవనేది మేము ప్రధానంగా నమ్ముతున్నాం. ఆ విషయమే మాట్లాడుతున్నాం. అప్పుడూ చెప్పాం, ఇప్పుడూ మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాం. వైరుధ్యం ఆంధ్రా ప్రజలతో కాదు, రాయలసీమ ప్రజలతో కాదు. ఇవాళ ఈ విభజన అనేది నేనింతకు ముందు చెప్పినట్లు ఒక వికృతమైన అభివృద్ధి పథానికి అది కొంత బ్రేక్ వేయనుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఆంధ్రా ప్రాంతంలో కూడా తమ ప్రాంత వికాసం గురించి ప్రజలు ఆలోచించుకోటానికి ఒక అవకాశం చిక్కింది. ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన చర్చలో నుంచే, ఆలోచన్ల నుంచి పుట్టిందే ప్రత్యేక హోదా ఉద్యమం. సరే దానికున్న పరిమితులు ఏమైనా ఆ ప్రయోజనమనేది, ఆ ఆలోచన అనేది తెలంగాణ ఏర్పాటు వల్ల మాత్రమే సాధ్యం. రాయలసీమ ప్రాంతంలో కూడా అక్కడి ప్రజలు నిజంగా మా భవిష్యత్తు ఏమిటి, అది ఎట్లా అయితే మాకు లాభం చేకూరుతుందని చర్చిస్తున్నారు. తెలంగాణ విడిపోక పోయి వుంటే ఈ చర్చకు అంకురార్పణం జరిగేదే కాదు. అందువల్ల, కలిగిన ప్రయోజనాలను మనం గుర్తించాల్సిందే. కాకపోతే, మనం ఇవాళ జరుగుతున్న ఉద్యమాలు తెలంగాణ అభివృద్ధి కోసం గానీ, ఆయా ప్రాంతాల ప్రత్యేక ప్రతిపత్తి కోసం గానీ జరిగే పోరాటాలు గనుక, వీటిని ఒక ప్రజాస్వామికమైన కోణం నుంచి చూసి, నడిపించలేక పోతే ఆ ఉద్యమాలను కూడా సంపూర్ణంగా లక్ష్య సాధన వైపు ముందుకు తీసుకుపోలేమని నేను అనుకుంటున్నాను.

 1. తెలంగాణలో సామ్రాజ్య వాదుల పాత్ర గురించి మీరేమంటారు?

ఇవి దేశమంతటా ఉండే కొన్ని అంశాలు. వాటిని ఎవరూ కాదని అనలేరు. కానీ ఇవాళ సరళీకరణ వెనుక చాలా లోతుల్లోకి, చాలా వివరంగా చూడవలసిన అవసరం వుంది. అంతటి సూక్ష్మమైన ఆలోచన చేసినప్పుడు మనకు రెండు సంగతులు అర్థమౌతాయి. స్థానికంగా ఎవరో ఒకరు అండదండగా ఉండకుండా, ఎవరో బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తారనుకునేది పూర్తిగా అసత్యం. ఇక్కడ ఎవరో ఒకరు దాన్ని మోస్తుండాలి. దాని వల్ల ప్రయోజనం పొందుతుండాలి.  ఎక్కడో ప్రజలకు కూడా ఏదో ఒక లాభం చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ జాగ్రత్త పడకపోతే మనకు ఇవన్నీ సంపూర్ణంగా అర్థం కావు. అట్లా తెలంగాణ అంతర్గత వలసగా మారిందీ అంటే, దాన్ని అర్థం చేసుకోడానికి ఈ స్థూల చారిత్రక దృక్పథం వుండాలి.

 1. విభజన తరువాత కొత్త వ్యక్తుల పాలన కాకుండా, ఇదివరకు ఆంధ్రా నాయకులకు ఊడిగం చేసిన వారే అధికారంలోకి వస్తే, మార్పు సాధ్యమని మీరు నమ్మారా?

అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాం. మార్పు అంటే కేవలం పాలకుల మార్పు కాదు. పాలనలోనే మార్పు రావాలి. అభివృద్ధి అంటే కేవలం స్థూలంగా జాతీయ ఉత్పత్తి పెరగటము కాదు. అభివృద్ధి అనేది ప్రజలందరికీ బతుకు తెరువు చూపించగలగాలి. అందుకే ప్రజలు కేంద్రంగా గల ఒక అభివృద్ధి తీసుకొచ్చినపుడే  మార్పు సాధ్యమని నమ్ముతున్నాం.

 1. 2019 ఎన్నికల్లో గెలుపుకై ఎటువంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు?

ఇప్పటి వరకు రాజకీయల్లో ఎన్నికలు చాలా కేంద్రంగా మారిపోయినయ్. అన్ని పార్టీలు కూడా ఎన్నికలను మ్యానేజ్ చేయటమెట్లా అనే దాని మీద ఆధార పడీ, దాని చుట్టూ అల్లుకొని వ్యూహరచనలు చేస్తాయి. ఆ వ్యూహరచనల్లో  కోర్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగింది. కోర్ టెక్నాలజీ అనే దాన్ని చాలా పరిమిత అర్థంలో వాడుతున్నాం. సర్వేలను ఎట్లా ఉపయోగించు కోవాలి? ఇంటర్నెట్ లాంటి వాటిని ఎలా వాడుకోవాలి? సోషల్ మీడియా నెట్లా ఉపయోగించాలి? ఇట్టాంటి వాటికి బాగా ప్రాధాన్యత పెరిగింది. వాటి మీద ఆధారపడి డబ్బులను ఉపయోగించి,  మొత్తం మీద మీడియాను మ్యానేజ్ చేసి, ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయం. ఇందులో మనకెక్కడా కూడా ప్రజలు కనపడరు. ప్రజల ప్రాధాన్యతను కూడా ఎక్కడా గుర్తించం. ప్రజలే కాదు పార్టీ కార్యకర్తలకు కూడా దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. అంతా ఒక నాయకుడు మ్యానేజ్ చేసుకుంటుంటాడు. ఇది జరుగుతున్న వాస్తవం. కానీ ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం కదిలించి, వాళ్ళని ఎన్నికల్లో శక్తివంతులుగా చేయటమనేది, క్రియాశీలక పాత్రధారులుగా మార్చటమనేది మేమనుకుంటున్న వ్యూహం. ఆ వ్యూహం ప్రకారమే నడవాలను కుంటున్నాం. మెల్లమెల్లగా ఆ వ్యూహం స్వరూపమనేది దాని కదే వ్యక్తమౌతుంది. అది అంత ఈజీ విషయమేమీ కాదు గాని, చాలా జాగ్రత్తగా ఆ దృక్పథంతో మేము కదలాల్సివుంటుంది.

 1. ఎస్సీ ఎస్టీ లకు ముఖ్యమంత్రి గానీ, ఉపముఖ్యమంత్రి గానీ పదవులు ఇచ్చే ఉద్దేశ్యం ఏమైనా ఉన్నదా?

అవన్నీ పార్టీ కమిటీలు చర్చించి తీసుకోవలసిన నిర్ణయాలు. నా ఇష్టమైన వాళ్ళకు ఇస్తా, నేనే ఉంచుకుంటా అని ఆలోచించటమే ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. పార్టీ ఉంటది, కమిటీలుంటాయి. వాటిల్లో చర్చ జరుగుతది. నిర్ణయాలు అవుతాయి.

   12. ఎన్నికల్లో గెలవాలంటే వెయ్యికోట్లు వసూళ్లు చేయగలగాలంటారు. మీరట్లా చేయగలుగుతారా?

డబ్బులు అవసరం లేదనే మాట నేననను గానీ, మళ్ళీ డబ్బులే ప్రధానం కాదు. ఎందుకంటే ఎన్నికలను కేంద్రం చేసినపుడు,  ఎన్నికలను గెలవాలనే తాపత్రయానికే పరిమిత మైనప్పుడు మనకు అవి మాత్రమే కనపడతాయి. వాటిని దాటాలి. దాటగలిగినపుడు డబ్బుల పాత్ర వుంటది గానీ, ప్రాధాన్యత తగ్గుతది.

 1. కాంగ్రెస్, భాజపా, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ లు, “మావోయిస్టు” పార్టీలతో మీ సంబంధాలు ఎలా ఉంటాయి?

ఏ పార్టీతోనైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసమైతే కలసి పనిచేస్తాం. కానీ ఎన్నికల విషయంలో మాత్రం స్వంతంగా నిలబడాలి, స్వంతంగానే పోటీ చేయాలనే ఆలోచనతో వున్నాం.

 1. గెలిస్తే తెరాస పాలనకు, మీ పాలనకు ఎటువంటి తేడా లుంటాయి?

ప్రధానంగా మార్పు ఒకటి తీసుకురావాలి. గతంలో రాజకీయాల్లో  అందరూ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించేది. ఏ సమస్యలనైనా పరిష్కరిద్దాం, ఆ పరిష్కారం ద్వారా మనం రాజకీయంగా పలుకుబడి సంపాదించు కుందాం అనే ఆలోచన వుండేది. కానీ ఇప్పుడది పోయింది. మళ్ళీ ఒకసారి ప్రజలను  ప్రధానంగా తేగలిగితే ఒక మార్పు వస్తుంది. ఆర్థిక విధానాల విషయానికి వచ్చినపుడు వ్యవసాయం, చిన్న పరిశ్రమలు వృత్తులకూ ప్రాధాన్యత ఇచ్చి, ఉపాధి కల్పనను పెంపొందించాలని మొదటి ప్రయత్నం. రెండవ దేంటంటే విద్యా, వైద్యం అందరికి ఉచితంగా ప్రభుత్వ సంస్థల ద్వారానే అందించాలని రెండో ప్రయత్నం. ఈ రెండింటినీ కొంత సీరీయస్ గా చేయాలనేది ఆర్థిక రంగంలో ప్రయత్నం. మూడోదేంటంటే ప్రజలకు అందుబాట్లో వుండాలి. ఒక ప్రజాస్వామ్య పద్దతిలో పార్టీని నడుపుతూ నిర్ణయాలు తీసుకోవాలి.  ఇవి నా దృష్టిలో కొన్ని కీలకమైన మార్పులు. వీటి కోసం మేము ప్రయత్నం చేస్తాం.

 1. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక నిర్మాణాల) అభివృద్ధి, ప్రజా రంజక నినాదాలు – ఈ రెంటికీ మధ్య బాలెన్స్ ఎలా చేస్తారు?

ప్రజారంజకంగా ఇచ్చి తర్వాత బోల్తా గొట్టటం కూడా చూశాం. చెప్పే విషయాలు వాస్తవికంగా వుండాలి, అమలు సాధ్యంగా కూడా వుండాలి. ఆ రెండూ లేనప్పుడు  మనమేదన్నా పిలుపు నిస్తే దాంతో ప్రయోజనం కూడా వుండదు. నేను ఆ విషయంలో మాత్రం కొంత వాస్తవిక దృక్పథంతో నడవాలని అనుకుంటున్నా.

 1. మానవ హక్కులూ, ఎన్ కౌంటర్లు మొదలైన సమస్యలపై మీ వైఖరి ఏమిటి? ప్రజలకు ఎలాంటి హామీలనిస్తారు?

ప్రభుత్వ అధికారం అనేది ప్రజాస్వామిక పద్దతుల్లో నిర్వహించటం చాలా  అవసరం. ఆ ప్రజాస్వామిక పద్దతుల్లో పరిష్కారం చేసి, ప్రజలు కేంద్రంగా ఒక ఆర్థికాభివృద్ధి తీసుకొచ్చి  ఇలాంటి సమస్యలను రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని మేము అనుకొంటున్నాము.

 1. గెలిచిన తర్వాత రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య అపోహలు తొలగించి, ఐక్యత కోసం ఏమైనా కృషి చేస్తారా?

ముందు నుంచి, ఉద్యమ కాలం నుంచి జరుగుతున్న ప్రయత్నమే. అది నిరంతరంగా జరగవలసిన ప్రయత్నమే. ఇది కేవలం కొంత మంది ఆంధ్రా పాలకులు వెదజల్లిన విషం వల్ల వచ్చిన సమస్య గానీ, వేరొకటి కాదు. ఇవాళ మెల్లమెల్లగా ఆంధ్రా ప్రాంతంలో కూడా చర్చ జరుగుతోంది. ఆ ప్రజలు దాని నుంచి బయట పడి ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవాళ కొంత భిన్నంగా  మనం చర్చించు కోటానికి, అలోచించు కోటానికీ అక్కడ కూడా వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సఖ్యతను పెంపొందించ టానికీ మా ప్రయత్నం ఇంకా వేగంగా ముందుకు నడుస్తదని కూడా నమ్ముతున్నాం.

 1. అలాగే కుల, మత దురహంకారాలకు వ్యతిరేకంగా, ప్రజలలో సామరస్య వాతావరణం కోసం ఏవిధంగా కృషి చేస్తారు?

అది నిజానికి రాజ్యాంగ బద్ధంగా ప్రతి పార్టీ చేయవలసిన పని.  కానీ ఏ పార్టీ కూడా దాన్ని సీరియస్ గా చేయదు. ఎన్నికల్లో ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టి వాడుకోవాలని ప్రయత్నం చేసినపుడల్లా ఈ ఘటనలు తీవ్రతరమౌతున్నాయి . రెండవ దేమిటంటే ప్రజల అవసరాలు, సమస్యలు పక్కన బెట్టి, కేవలం వారి భావోద్వేగాల మీద ఆధారపడి  గెలవాలను కున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. మేము జన సమితిగా అలాంటి రాజకీయ పద్దతులే విడనాడాలనే ఆలోచనతో వున్నాం.

ఈ ఇంటర్వ్యూ లోని ఫోటోలన్నీ ప్రసాద్ జీవన సహచరి సయ్యద్ యూసుఫ్ బీ వి. కోదండ్ రామ్ కు అటు ఇటు రాఘవేంద్ర ప్రసాద్, సయ్యద్ యూసుఫ్ బీ.
 1. స్త్రీలకు ఎలాంటి హామీలిస్తారు?

ఇప్పుడే జన సమితికి ఒక స్త్రీ విభాగం కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాని ఆధ్వర్యంలో మహిళా జనుల యొక్క అభ్యున్నతి కోసం జరగవలసిన కార్యాచరణ గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే కార్యాచరణలో ముందు కెళుతున్నారు. మహిళా రంగంపై ఒక స్పష్టతతో తీసుకోవలసిన కార్యక్రమాల విషయంలో వాళ్ళతో సంప్రదించి కార్యక్రమాల రూపకల్పన చేస్తాం.

 1. పీడిత, తాడితులకు ఎలాంటి న్యాయం చేస్తారు?

మొత్తం గానే ఆర్థిక విధానాలకు గానీ, సామాజిక విధానాలకు గానీ వాళ్ళు కేంద్రంగా వుండాలని కదా మేము చెప్పేది.  ప్రజలు కేంద్రంగా అంటే అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా, హోదా ప్రతిపత్తులకు అతీతంగా మనుషులందరినీ సమానంగా చూసి, సమానంగా న్యాయం చేసే ప్రయత్నంలో తప్పని సరిగా అన్ని వర్గాలు కూడా నిలదొక్కుకోటానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి, సామాజికంగా, ఆర్థికంగా ఎదగటానికి కావలసిన చేయుత నివ్వటం  ఒక లక్ష్యం.

 

రాఘవేంద్ర ప్రసాదు రచయిత, సామాజిక విశ్లేషకుడు, కొన్ని పత్రికలకు సంపాదకునిగా పని చేశాడు. కార్మికోద్యమ, పౌర హక్కుల ఉద్యమ కార్యకర్త.

రాఘవేంద్ర ప్రసాద్

రాఘవేంద్ర ప్రసాదు రచయిత, సామాజిక విశ్లేషకుడు, కొన్ని పత్రికలకు సంపాదకునిగా పని చేశారు. కార్మికోద్యమ, పౌర హక్కుల ఉద్యమ కార్యకర్త.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.